హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'మామిడి' మాయలో రైతులు: ఏలిన వారికి పట్టని చోద్యం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫలాల్లో కెల్లా రారాజు మామిడిని పండించే రైతు అనునిత్యం మార్కెట్‌లో మార్కెట్‌ మాయాజాలంతో ఎప్పటి మాదిరిగానే కుదేలవుతున్నాడు. గత 15 రోజుల్లోనే ఒక్కసారిగా ధరలు పతనమై పరిస్థితులు తారుమారయ్యాయి. మార్కెట్ కు భారీగా పంట తరలి రావడానికి తమకు అనుకూలంగా మార్చుకున్న వ్యాపారులు ధరలు అమాంతం తగ్గించేశారన్న విమర్శలు ఉన్నాయి.

మామిడిలోనే శ్రేష్ఠమైన బంగినపల్లి రకం ఫండ్ల ధర క్వింటాల్‌పై రూ.1000, తోతాపురికి రూ.600 మాత్రమే పెట్టి కొనుగోలు చేసేందుకు వ్యాపారులు సిద్దమవుతున్నారు. ఇదే బంగినపల్లి, తోతాపురి రకం ఫండ్లకు గత నెలలో క్వింటాల్‌ ధర రూ. 2500 నుంచి 3500 వరకు పలికింది.

దీంతో ఆశలు పెంచుకుని వచ్చిన రైతుల నుంచి ధర తగ్గించడానికి తోడు 11 శాతం కమిషన్ వసూలుచేస్తూ అన్నదాతను నిలువునా దళారులు ముంచేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ధర తగ్గించినా వెనక్కు తీసుకెళ్లలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో తెగనమ్ముకుని రైతులు వెళ్లిపోతుంటే.. తక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యాపారులు నాలుగు రెట్లు అధిక ధరకు విక్రయిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

Mango rates fall, farmer hits in market confusion

తత్ఫలితంగా మంచి దిగుబడి వచ్చినా ధర లేక, మార్కెట్‌ మాయాజాలపు చదరంగంలో చిక్కుకుని ఓడిపోయిన రైతు పేదవాడిగా మిగిలిపోతున్నాడు! తియ్యని పండ్లను మార్కెట్లకు తెచ్చి 'చేదు'నష్టాలను మూటగట్టుకొని ఇంటిబాట పడుతున్నాడు. గతేడాది వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో ప్రస్తుతం మామిడి దిగుబడి మునుపటి కంటే భారీగా పెరిగింది.

దీంతో ఆదాయం రెట్టింపు అవుతుందని భావించిన మామిడి రైతులకు దళారీ మార్కెట్‌ షాకిచ్చింది. సీజన్‌ ప్రారంభంలో ఎక్కువ మొత్తంలో ధరలు నిర్ణయించి కొనుగోలు చేసిన వ్యాపారులు.. దిగుబడులు పెరిగిన కీలక తరుణంలో ఒక్కసారిగా తగ్గించేశారు. కానీ మార్కెటింగ్ శాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రైతుకు భారీ స్థాయిలో అన్యాయం జరుగుతున్నా ఏలిన వారి ద్రుష్టికి వెళ్లకపోవడం మరీ దారుణమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

రూ.3200 నుంచి రూ.1500లకు

రాష్ట్రంలో మామిడి ఫండ్లకు ప్రధాన మార్కెట్ హైదరాబాద్‌లోని కొత్తపేట ఫ్రూట్‌ మార్కెట్‌ ప్రధాన కేంద్రం. ఈ మార్కెట్‌లో మార్చి నెల రెండో వారంలో క్వింటాల్ బంగినపల్లి రకం మామిడి రూ.2,500 నుంచి రూ.3,500 వరకు కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు రూ.1,500 మించి చెల్లించడం లేదు. గతనెలలో తోతాపురి రకం మామిడి రూ.2 వేల వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం రూ.600 నుంచి నుంచి రూ.900 మధ్య చెల్లిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మామిడి పంట 4.71 లక్షల ఎకరాల్లో పండించినట్లు ఉద్యాన శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఈ లెక్కన సగటున 21.19 లక్షల టన్నుల దిగుబడులు రావాల్సి ఉన్నా.. వడగళ్ల దెబ్బతో 14.13 లక్షల టన్నుల మామిడి దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఈ దిగుబడులు 10 లక్షల టన్నుల లోపే ఉన్నాయి.

ఇలా మార్కెట్‌ మాయాజాలం

మెజారిటీ రైతులు కొత్తపేటలోని పళ్ల మార్కెట్‌లోనే దిగుబడులు విక్రయిస్తారు. వరంగల్, జగిత్యాలలోని చిన్న మార్కెట్లలో కొనుగోలు చేసిన దిగుబడులు సైతం కొత్తపేట్‌ మార్కెట్‌కు గానీ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. సమయం గడిస్తే పండ్లు పాడయ్యే ప్రమాదం ఉన్నందున పంటను ప్రత్యామ్నాయంగా విక్రయించే అవకాశాలు లేకపోవడంతో కొత్తపేట మార్కెట్‌కు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి వస్తోంది.

దీంతో ఈ మార్కెట్‌కు డిమాండ్‌ విపరీతంగా ఉండడంతో దళారులు క్రయ విక్రయాలను శాసిస్తున్నారు. దళారులు నిర్ణయించిన ధరకు విక్రయించడం ఒకటైతే... 11 శాతం కమీషన్‌ రూపంలో వసూలు చేయడంతో రైతు టోకుగా మోసపోతున్నాడు. మార్కెటింగ్‌ శాఖ నిబంధనల మేరకు 4 శాతానికి మించి కమీషన్‌ వసూలు చేయకూడదు.

రైతును గుల్ల చేసే వేలం ఇలా

మార్కెట్‌కు వచ్చిన మామిడి దిగుబడులకు దళారులే ధర నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం గడ్డిఅన్నారం మార్కెట్‌లోని 97 స్టాళ్ల పరిధిలో 267 మంది కమీషన్‌ ఏజెంట్లు ఉన్నారు. వీరి వద్దకు వచ్చిన దిగుబడులకు వేలం ద్వారా ధర నిర్ణయిస్తారు. ఇందులో పాల్గొనేవారు సైతం కమీషన్‌ ఏజెంట్ల మనుషులే కావడంతో ధరల పెంపు, తగ్గింపు అంతా వారి ఇష్టాయిష్టాల మేరకే జరుగుతోంది.

ఇక్కడ దిగుబడి తెచ్చిన రైతు కేవలం ప్రేక్షకుడిగానే ఉండాలి. ఈ ప్రక్రియతో అత్యుత్తమ రకం మామిడి తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తుండటంతో దీంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. మార్కెట్‌ పూర్తిగా దళారులమయమైంది. గడ్డి అన్నారం మార్కెట్‌లో 60 టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు ఉన్నా.. ఒక్క రైతుకూ నిల్వ చేసుకునే అవకాశం దక్కడం లేదని విమర్శలు ఉన్నాయి.

రూ.15లకు కొనుగోలు.. రూ.60కి విక్రయం

రైతు నుంచి తక్కువ ధరలో మామిడి దిగుబడులు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు... బహిరంగ మార్కెట్లో నాలుగింతలు పెంచి మరీ విక్రయిస్తున్నారు. రైతుల నుంచి టోకుగా కోనుగోలు చేస్తున్న బంగినపల్లి మామిడికి కిలోకు రూ.10-15 చెల్లించి.. అవి మక్కిన తర్వాత రూ.60 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. తోతాపురి రకం మామిడిని కిలోకు రూ.6 నుంచి రూ.9కి కొంటున్న వ్యాపారులు.. బహిరంగ మార్కెట్‌లో రూ.25 నుంచి రూ.35 దాకా విక్రయిస్తున్నారు.

తీరని పెట్టుబడి.. కుటుంబ జీవనం ఎలా?

వనపర్తికి చెందిన అంజన్న అనే రైతు గతేడాది రూ.2.5 లక్షలు పెట్టి 8 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకుంటే దిగుబడి బాగానే వచ్చింది. పళ్లను హైదరాబాద్‌లోని కొత్తపేట మార్కెట్‌కు తెచ్చాడు. ఇప్పటిదాకా మూడు దఫాలుగా 8 టన్నుల మామిడి పళ్లను విక్రయించగా రూ. 1.5 లక్షలు మాత్రమే వచ్చాయి. మరో 2 టన్నుల మేర దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కానీ అంతా లెక్కేసుకుంటే పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని తల పట్టుకుని బోరుమనే పరిస్థితి నెలకొంది.

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మరో రూ.3.5 లక్షలు పెట్టి ఐదెకరాలు మామిడితోట కౌలుకు తీసుకుని.. తాజాగా మార్కెట్‌కు 16 క్వింటాళ్ల మామిడి తీసుకొచ్చానని, వాటిని కొన్న వ్యాపారులు రూ.5 వేలు చేతిలో పెట్టారు. మామిడి తోట నుంచి మార్కెట్‌కు రవాణాకు రూ.4,500, కాయ తెంపడానికి 10 మంది కూలీలకు రూ.3000 ఖర్చు చేస్తే, తనకు రూ.5000 ఆదాయం వచ్చిందని, ఇందులో తనకు వచ్చిన లాభమెంతో చెప్పమని తనకు ఎదురుబడిన వారిని ప్రశ్నిస్తూ ఇంటిదారి పట్టాడు.

ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం

మార్కెట్లో కమిషన్‌ 4% మించి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చర్మన్ పుట్టం పురుషోత్తం రావు చెప్పారు. సాధ్యమైనంత వరకు కట్టడి చేస్తున్నామని, లిఖిత పూర్వక ఫిర్యాదు వస్తే సదరు కమిషన్‌ ఏజెంటు లైసెన్సు రద్దు చేసే అధికారం తమకుకున్నదని, కానీ ఇప్పటివరకు ఫిర్యాదులేవీ రాలేదని తెలిపారు. ఏజెంట్లు అవకతవకలకు పాల్పడినట్లు తెలిస్తే నోటీసులు ఇస్తున్నామని, ఈ విషయమై త్వరలో మార్కెట్‌లో ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేస్తామని వివరించారు.

English summary
Gaddi Annaram Kothapet fruit market business people & commission agents are syndicated while down the Mango rates. With this effect Mango farmer fell in losses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X