• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భూమ్మీద ఉంటే అంతం ఖాయమా?:జాబిల్లి, మార్స్ మాత్రమే గత్యంతరమా?

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: అంతకంతకూ భూ వాతావరణం మారిపోతుండటంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న జనాభా నేపథ్యం.. కమ్ముకొస్తున్న అణు యుద్ధ భయం మధ్య.. కొత్త కొత్త వ్యాధులు విజృంభిస్తున్న వేళ వీటిలో ఏదో ఒకటి కబళించకముందే.. ఇక ఏదో ఒక గ్రహానికి చేరకపోతే.. మానవజాతి కాలగర్భంలో కలిసిపోకతప్పదని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. ఒకవేళ ఐన్ స్టీన్ తర్వాత ఆ స్థాయి గల శాస్త్రవేత్త హెచ్చరిక.. అంచనాలు నిజమైతే అందుకు మానవుడు సిద్ధంగా ఉన్నాడా? ఉంటే.. ప్రత్యామ్నాయాలేమిటి? మనిషి వెళ్లగల గ్రహాలేమిటి? వాటి పరిస్థితులు ఏమిటి పరిశీలించాల్సిందే మరి.

రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు.. రానురాను విజృంభిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు.. గ్రహ శకలాలు, తోక చుక్కల వంటివి భూమిని ఢీకొనే అవకాశం.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అస్థిరత.. అణు యుద్ధ భయం.. ఇలా అటు మానవ తప్పిదాలు.. ఇటు ప్రకృతి బీభత్సాలు మానవ జాతి వినాశనానికి హేతువు కానున్నాయి. భూమిపై జీవజాలం మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్న ఆందోళన ఉంది. ఐన్‌స్టీన్‌ తర్వాత అంతటి ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన స్టీఫెన్‌ హాకింగ్‌ ఇదే హెచ్చరిక చేస్తున్నారు. కొన్ని వందల ఏళ్లలోనే మనం భూమిని వదిలి మరో గ్రహాన్ని వెతుక్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

మరి మనం మరో గ్రహానికి వెళ్లి నివసించడం సాధ్యమా?, చందమామపైకి వెళ్లాలా, అరుణగ్రహం మీదకెళ్లి బతకొచ్చా.. అనే ఎన్నో అంచనాలు, సందేహాలు, అభిప్రాయాలు వస్తున్నాయి. స్టీఫెన్ హకింగ్ మరో మాట కూడా చెప్పారు. మానవజాతి మనుగడ కోసం ఇతర గ్రహాలకు చేరుకోవాల్సిందేనని, వందేళ్లలోపే భూగోళాన్ని వదిలేయాల్సిందేనని తేల్చేశారు. రోజురోజుకీ సున్నితంగా మారిపోతున్న భూమిపై మనిషి ఇంకో వెయ్యేళ్లు బతికితే గొప్పేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే స్పేస్‌ఎక్స్‌ సంస్థ అధ్యక్షుడు ఎలన్‌ మస్క్ స్పందిస్తూ ఐదు కోట్ల రూపాయలతో అంగారకుడికి వెళ్లి రావచ్చునని, అసాధ్యమేమీ కాదని, పదేళ్లలోపు చేసి చూపిస్తానని పేర్కొంటున్నారు.

Please, Stephen Hawking, find us a planet like 'Westeros' or 'Talos IV'

వేడెక్కుతున్న భూమి.. మనిషికి నూకలు చెల్లు

మనిషికి భూమ్మీద నూకలు చెల్లిపోతాయన్న మాట వినడం భయం కలిగించేదే. కానీ పరిస్థితులు చూస్తోంటే మాత్రం స్టీఫెన్‌ హాకింగ్‌ అంచనా నిజమవుతుందనే అనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటం భూతాప ఉన్నతికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తున్నది. దాని ప్రభావం వాతావరణంపై తీవ్రస్థాయిలో కనిపించడం తథ్యమే. వాతావరణ మార్పుల ప్రభావం ఆహార ధాన్యాల దిగుబడుల తగ్గుదలతోనే ఆగిపోదు... అకాల వర్షాలు, వరదలు, సముద్ర మట్టాలు పెరిగిపోయి తీర ప్రాంతాల మహానగరాల మునక వంటివి జరుగుతాయని ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ తన తాజా నివేదికలో పేర్కొంది కూడా. ఇక పెరిగిన ఉష్ణోగ్రతలు దోమల వంటి వ్యాధికారక జీవ జాతుల సంతతి మరింత పెరిగేందుకు దోహదపడి.. వ్యాధులూ విజృంభిస్తాయి. తీవ్ర వర్షాభావం, కరువుకు కారణమైన ఎల్‌నినో వరుసగా పంజా విసరడం అందరికీ కనిపిస్తూనే ఉన్నది.

జాబిల్లి తర్వాత మార్స్ మాత్రమే దిక్కు!

కొన్ని సంవత్సరాల్లో జాబిల్లిపై మానవుడు స్థిర నివాసానికి అడుగు మోపగలిగితే తరువాతీ లక్ష్యం అరుణగ్రహమే (మార్స్‌) అవుతుంది. భూమితో పలు రకాల పోలికలు ఉండటమే దానికి కారణం. మానవ మనుగడకు అత్యంత కీలకమైన నీరు ఆ గ్రహంపై ఉందా, లేదా అన్న అనుమానాలూ తొలగిపోయిన నేపథ్యంలో అది మరో భూమి అయ్యేందుకు అవకాశాలు పెరిగాయి. అంతా ఊహించిన దానికంటే చాలా ముందుగానే అరుణగ్రహంపైకి మనిషిని పంపుతామని.. ఓ కాలనీనే కట్టేస్తామని స్పేస్‌ఎక్స్‌ అంతరిక్ష సంస్థ అధ్యక్షుడు, టెస్లా కార్ల కంపెనీ యజమాని ఎలన్‌ మస్క్‌ ఏడాది క్రితమే ప్రకటించిన విషయం గమనార్హం. రెండేళ్లకోసారి భూమికి దగ్గరగా వచ్చినప్పుడు కేవలం తొమ్మిది నెలల్లోనే అరుణ గ్రహాన్ని చేరుకోవచ్చని 2013లో భారత్‌ ప్రయోగించిన మంగళ్‌యాన్, నాసా ప్రయోగించిన మావెన్‌ ఉపగ్రహాలు ఇప్పటికే రుజువు చేశాయి. కాబట్టి సుదూర అంతరిక్ష ప్రయాణాల అవసరం ఉండదు. ఆ గ్రహపు మట్టిలో బంగాళా దుంపల్లాంటివి పండించుకోవచ్చని భూమిపై ప్రయోగపూర్వకంగా ఇప్పటికే నిరూపించారు. అమెరికాలోని మోజావే ఎడారి ప్రాంతంలో అంగారకుడిని పోలిన పరిస్థితులున్న చోట జరుగుతున్న పరిశోధనలు అరుణగ్రహంపై పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌ శాస్త్రవేత్తలు ఒకట్రెండేళ్ల క్రితం కొంతమంది ఔత్సాహికులతో ఒక ప్రయోగం నిర్వహించారు. అందులో భాగంగా అరుణగ్రహాన్ని పోలిన పరిస్థితుల్లో కొంత మంది 500 రోజులపాటు ఒంటరిగా గడిపారు. వ్యోమగాముల సుదూర అంతరిక్ష ప్రయాణాల సందర్భంగా వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని అంచనా.

సౌర కుటుంబానికి ఆవల కూడా..

జాబిల్లి, అంగారకుడు రెండూ సౌర కుటుంబంలోనే ఉన్న రెండు ఖగోళాలైతే... సౌర కుటుంబానికి ఆవల కూడా కోట్ల సంఖ్యలో గ్రహాలు ఉన్నాయి. వాటిలో మనిషి మనుగడకు అనువైనవి ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ లెక్క తెలియదు. నాసా ప్రయోగించిన కెప్లర్‌ టెలిస్కోప్ సాయంతో ఇప్పటివరకు సౌర కుటుంబానికి ఆవల గుర్తించిన గ్రహాల సంఖ్య మూడు వేల దాకా ఉండగా.. వాటిలో గోల్డీలాక్‌ జోన్‌ (నక్షత్రం నుంచి నిర్దిష్ట దూరం)లో ఉన్నవి యాభైకిపైగా ఉన్నాయి. ఆ గ్రహాలపై వాతావరణం ఏమిటి? మనిషి బతికేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా? వంటి విషయాలు తెలియాల్సి ఉంది. అయితే అవేవీ మనకు సమీపంలో ఉన్నవి కాదు. ఇప్పటివరకు గుర్తించిన గ్రహాల్లో చాలా దగ్గరగా ఉన్నదనుకునేది కూడా దాదాపు 39 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే ఓ రాకెట్‌లో కాంతివేగంతో ప్రయాణించినా ఆ గ్రహాన్ని చేరేందుకు 39 ఏళ్లు పడుతుందన్నమాట. కాంతివేగంతో ప్రయాణించగల రాకెట్‌ను తయారు చేయగలగడం ఇప్పుడున్న టెక్నాలజీ, పదార్థాలతో అసాధ్యమే.అందువల్ల మనిషి ఇప్పటికైతే జాబిల్లి.. లేదంటే అరుణగ్రహంపై మాత్రం ఆశలు పెట్టుకుంటే చాలు!

ఇప్పటికే ఐదుసార్లు మహా వినాశనం!

భూమి ఏర్పడి దాదాపు 450 కోట్ల సంవత్సరాలవుతోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ఐదుసార్లు మహా వినాశనాలు... అంటే జీవజాతుల్లో అధికశాతం కనుమరుగైపోయాయని అంచనా. గ్రహ శకలాలు ఢీకొనడంతో సుమారు 65 కోట్ల ఏళ్ల క్రితం రాక్షస బల్లులతోపాటు ఇతర జీవజాతులూ తుడిచిపెట్టుకుపోవడం వాటిల్లో ఒకటి. ఆ రకమైన ప్రమాదం ఇప్పటికీ పొంచి ఉంది. విశాల విశ్వం నుంచి భూమివైపునకు దూసుకొచ్చే గ్రహశకలాలు ఇప్పటికీ కొన్ని వందల సంఖ్యలో ఉండటం దీనికి కారణం. గత నెలలోనే దాదాపు రెండు వేల అడుగుల పొడవైన గ్రహశకలం (2014-జేఓ25) భూమికి అతిదగ్గరగా.. అంటే 18 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకుపోయింది. ఇది చిన్నదే కావచ్చుగానీ.. ఐదు నుంచి 15 కిలోమీటర్ల వెడల్పు ఉన్నవి ఢీకొంటే మాత్రం భూమి మీద జీవజాలం నిలిచే అవకాశాలు తక్కువ. 1908లో సైబీరియా ప్రాంతం వద్ద కొన్ని కిలోమీటర్ల సైజున్న గ్రహశకలం గాల్లో పేలిపోయినందుకే అక్కడ మనిషి బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయని సైన్స్‌ చెబుతోంది.

నీళ్లు.. ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయాలి..

గ్రీన్‌హౌస్‌ వాయువుల కారణంగా వాతావరణం కొంచెం దట్టంగా మారడంతోపాటు ఎక్కువ సమయం పాటు వేడి అక్కడే ఉండేందుకు అవకాశమేర్పడుతుంది. ఈ దశలో గ్రహంపై నీరు, ఆక్సిజన్‌ను భారీ ఎత్తున తయారు చేయాల్సి ఉంటుంది. ఒక్కో మనిషికి దాదాపు రోజుకు ఒక కిలోగ్రాము ఆక్సిజన్‌ కావాల్సి ఉంటుంది. దీంతోపాటు నైట్రోజన్‌ ఆక్సైడ్‌ వంటివి కూడా అవసరమవుతాయి. అయితే వేడి పెరిగితే గ్రహగర్భంలోని మంచు కరిగి ఉపరితలంపైకి చేరుతుంది. కొంత నీరు ఆవిరై మేఘాలుగా మారతాయి. అనుకూల పరిస్థితుల్లో వర్షం కురిసి నదులు ప్రవహిస్తాయి. జన్యుమార్పిడి టెక్నాలజీ ద్వారా అంగారక వాతావరణానికి అనువైన మొక్కలను అభివృద్ధిచేసి ఉపయో గిస్తారు. వాటిద్వారా ఆక్సిజన్‌ ఉత్పత్తి మరింత ఎక్కువ అవుతుంది. ప్రమాదకరమైన రేడియోధార్మిక కణాల నుంచి రక్షణ కల్పించే భారీసైజు పారదర్శక కట్టడాలు.. అటు మానవ నివాసాలుగా.. ఇటు పంటలు పండించేందుకు గ్రీన్‌హౌస్‌లుగా ఉపయోగపడతాయి.

ఇలా జాబిల్లికి నిచ్చెన వేసి..

హాకింగ్‌ అంచనాల ప్రకారం మరో వందేళ్లలో భూమ్మీద మనిషి బతికే పరిస్థితి ఉండకపోతే ఎక్కడకు వెళ్లాలనే ప్రశ్న తలెత్తుతుంది. ముందుగా మన సహజ ఉపగ్రహం చందమామను నిచ్చెనగా చేసుకుని తర్వాత అంగారకుడిపైకి చేరుకోవాలని నిపుణులు, శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ రెండుచోట్ల కూడా వాతావరణం మనిషికి అనుకూలం కాదు. అందువల్ల గ్రహ ఉపరితలంపై లేదంటే లోపల నివాస ప్రదేశాలు ఏర్పాటు చేసుకుని.. కృత్రిమ వాతావరణాన్ని సృష్టించుకుని కొద్దికాలం పాటు జీవించాలి. ఆలోపుగా టెరా ఫార్మింగ్‌ ప్రక్రియ ద్వారా వాతావరణాన్ని పూర్తిగా మార్చేయాల్సి ఉంటుంది. ఈ ఆలోచనను అమలు చేసేందుకు ఇప్పటికే చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) 2030 నాటికల్లా జాబిల్లిపై ఒక చిన్నపాటి మానవ కాలనీని కడతామన్న సంకల్పాన్ని బయట పెట్టింది. అంగారకుడితోపాటు ఇతర సుదూర గ్రహాలను చేరుకునేందుకు జాబిల్లిపై కాలనీని వేదికగా మార్చుకోవాలన్నది ఆలోచన. ఇతర గ్రహాలకు వెళ్లేందుకు అవసరమైన ఇంధనంగా.. జాబిల్లిపై విస్తృతంగా అందుబాటులో ఉన్న హీలియం-3 వాయువును వాడుకోవచ్చని భావిస్తున్నారు. నాసాతోపాటు చైనా, జపాన్‌లు కూడా జాబిల్లిపై మకాం పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. గ్రహం లోపలి భాగంలో ఉన్న నీటిని వాడుకునేందుకు, రోబోల సాయంతో నివాసాలు, గ్రీన్‌హౌస్‌ల వంటివి నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. జాబిల్లిపై మట్టితో ఇటుకల్లాంటివి తయారు చేయడం ఎలా? పంటలు పండించే గ్రీన్‌హౌస్‌లు ఎలా ఉండాలి?.. వంటి అనేక అంశాలపై వివిధ విశ్వవిద్యాలయాలు ఇప్పటికే పరిశోధనలు చేపట్టాయి కూడా.

అంగారకుడిని భూమిలా మార్చే టెరా ఫార్మింగ్‌

అరుణ గ్రహంపై భూమిలాంటి వాతావరణాన్ని సృష్టించడం, ఆ గ్రహాన్ని వెచ్చబెట్టడంతో మొదలవుతుంది. ఇందుకు అనేక మార్గాలున్నాయి. ఉష్ణోగ్రతలు కొన్ని డిగ్రీలు పెరిగితే చాలు.. కాలక్రమంలో గ్రీన్‌హౌస్‌ ఎఫెక్ట్‌ కారణంగా వాతావరణ పీడనం మనం తట్టుకోగల విధంగా మారుతుంది. చలికాలంలో మార్స్‌ ధ్రువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -125 డిగ్రీలకు తగ్గిపోతాయి. వేసవిలో అంగారక మధ్య రేఖ ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల వరకూ ఉంటాయి. రాత్రివేళల్లో -73 డిగ్రీలకు తగ్గిపోతాయి. ఇంత భారీ స్థాయిలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల కారణంగా జీవజాలం మనుగడ కష్టం. అంగారక గ్రహాన్ని తోకచుక్కలతో ఢీకొట్టించడం ద్వారా అక్కడి ఉష్ణోగ్రతలు పెరిగేలా చేస్తారు. దీంతో గ్రహ అంతర్భాగంలోని నీరు, కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలవుతాయి. భూమిలాంటి వాతావరణం ఏర్పడేందుకు అది తొలిమెట్టు అవుతుంది.

అమ్మోనియా గ్రహశకలాలకు రాకెట్లు

టెరాఫార్మింగ్‌కు ఉన్న మరో మార్గం అమ్మోనియా ఎక్కువగా ఉన్న గ్రహ శకలాలకు అణుబాంబుల వంటివి జోడించి అంగారకుడిని ఢీకొట్టించడం. ఆ చర్య ద్వారా గ్రహ శకలాల్లోని అమ్మోనియా, నీరు అరుణగ్రహంపైకి విడుదలవుతుంది. అంగారకుడి ధ్రువ ప్రాంతాల్లోని మంచును నీటిగా కరిగించి ఆ గ్రహాన్ని మనకు అనుకూలంగా మార్చుకునేందుకు అణు బాంబులను ఉపయోగించాలన్న ఆలోచన ఉంది. అంగారకుడి కక్ష్యలో భారీసైజు అద్దాలాంటివి ఏర్పాటు చేసి.. ఎక్కువ సూర్యరశ్మి ఉపరితలంపైకి చేరేలా చేయడం, తద్వారా ఉష్ణోగ్రతలను 5 డిగ్రీల వరకూ పెంచడం మరో మార్గం. మార్స్‌పై గ్రీన్‌హౌస్‌ వాయువులను పెంచేందుకు ఫ్యాక్టరీల ఏర్పాటు యోచన ఉంది. సౌరశక్తితో పనిచేసే ఈ ఫ్యాక్టరీ లు అక్కడి మట్టి, గాలి నుంచి క్లోరోఫ్లూరో కార్బన్లను తీసి విడుదల చేస్తాయి. అరుణ గ్రహ వాతావరణానికి అలవాటు పడ్డ బ్యాక్టీరియా సాయంతో వాతావరణ ఏర్పాటుకు తగ్గట్టుగా గ్రీన్‌హౌస్‌ వాయువులను ఉత్పత్తి చేస్తారు. ఆ క్రమంలోనే ఈ బ్యాక్టీరియా నీటి లభ్యతను పెంచేందుకు, పంటలు పెంచేందుకు ఎరువుగానూ ఉపయోగపడుతుంది.టెరాఫార్మింగ్‌ కోసం రకరకాల యంత్రాలు అవసరం అవుతాయి. వాటన్నింటినీ నడిపేందుకు అవసరమైన ఇంధనా న్ని కూడా అక్కడే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అంగారకుడిపై మనిషి ఊపిరితీసుకోగల వాతావరణం రావాలంటే లక్ష ఏళ్లు పడుతుందని కొంతమంది శాస్త్రవేత్తలు అంటూంటే.. ఇంకొందరు వెయ్యేళ్లలోపే ఈ పని చేసేయవచ్చని అంటున్నారు.

పలు సవాళ్లను ఎదుర్కోవాలి సుమా...

భూమి, మార్స్‌ల మధ్య చాలా విషయాల్లో పోలికలున్నా.. అంతే స్థాయిలో ప్రతికూల అంశాలూ ఉన్నాయి. ఇవన్నీ మార్స్‌ను మరో భూమిగా మార్చే విషయంలో సవాలుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. భూమికి సహజ ఉపగ్రహంగా ఉన్న చంద మామ ద్వారా ఎన్నో ప్రయోజనాలు న్నాయి. అంగారకుడిపై అలాంటి పరిస్థితి ఉండదు. అందువల్లే కొన్ని లక్షల ఏళ్ల కాలంలో అంగారకుడిపై వాతావరణం దెబ్బతినడంతోపాటు ధ్రువ ప్రాంతాల్లోని మంచు కొంచెం గ్రహం మధ్యకు చేరుకుంది. భూమితో పోలిస్తే మార్స్‌ ఆస్టరాయిడ్‌ బెల్ట్‌ (గ్రహశకలాలు ఎక్కువగా ఉండే ప్రాంతం)కు దగ్గరగా ఉంది. అంటే వాటిలో కొన్ని ఆ గ్రహాన్ని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు పెంచే గ్రీన్‌హౌస్‌ వాయువులు మితిమీరితే.. అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా అననుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. మార్స్‌కు ఉన్న దీర్ఘ వృత్తాకార కక్ష్య కారణంగా ఆ గ్రహంపై వాతావరణ పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. ఉత్తర భాగంలో వేసవిలాంటి పరిస్థితులు ఉంటే దక్షిణంలో చల్లటి వాతావరణం ఉంటుంది. దీనివల్ల రెండేళ్లకు ఒకసారి ఇసుక తుపానుల్లాంటివి చెలరేగుతాయి. ఆ గ్రహ వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ అధిక శక్తిగల సూర్యకిరణాల కారణంగా సున్నపురాయి లేదా వేర్వేరు రకాల కాల్షైట్‌ల రూపంలోకి మారిపోతుంది. కార్బన్‌ డయాక్సైడ్‌ లేకపోతే మొక్కల పెంపకానికి ఇబ్బందులేర్పడతాయి.

మార్పులూ అధికమే

టెరా ఫార్మింగ్‌ పూర్తయిన తరువాత అక్కడి వాతావరణం ఎలా ఉంటుందన్న అంశంపై ఇంకా మోడలింగ్‌ జరగలేదు. రెండు భాగాల్లో ఉన్న విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా మార్పులు కూడా చాలా తీవ్రంగా, అనూహ్యంగా ఉండే అవకాశముంది. వాతావరణం మారిపోయే క్రమంలో అంగారక గ్రహంపై ఇతర జీవులకు అంటే మానవులకు హాని కలిగించగల కొత్త కొత్త జీవజాతులు పుట్టుకొచ్చే అవకాశమూ ఉంటుంది. కృత్రిమంగా సృష్టించిన వాతావరణం ఎప్పుడు ఏ రకంగా ఉంటుంది? ఎంత కాలం ఉంటుంది? అకస్మాత్తుగా వ్యవస్థ మొత్తం నాశనమైపోతుందా?... తెలియదు! చెప్పడం కష్టమే..

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The eminent British physicist Stephen Hawking has just killed everybody's buzz by announcing humans have only 100 years to leave the planet Earth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more