మొహం చాటేస్తున్న చినుకు: తెలంగాణపై కరవు మేఘం

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కోటి ఎకరాలకు సాగునీరందించడమే లక్షంగా ముందుకు సాగుతున్నామని సగర్వంగా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కానీ వరుసగా మూడో ఏడాది కూడా సకాలంలో వరుణుడు మొహం చాటేయడంతో రాష్ట్రంలోని 275 మండలాల్లో వర్షపాతం తగ్గిపోయింది. ప్రారంభంలో కురిసిన వర్షాలతో మురిసిపోయి రైతాంగం సాగు చేసిన పంటలు.. వర్షాలు లేక మలమలా మాడిపోతున్నాయి. ఫలితంగా 218 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా, వ్యవసాయశాఖ మాత్రం కరువు సమస్యను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కాకపోవడం నిజంగా విచారకరమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సగానికి పైగా మండలాల్లో వర్షపాతం సాధారణంకన్నా తగ్గడంతో పైర్లు వాడిపోతున్నాయి. ఇప్పటివరకూ 275 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయి. వాటిలో 218 మండలాల్లో పూర్తిగా కరవు ఛాయలున్నాయి.

సాధారణ వర్షపాతంకన్నా 20 శాతంకన్నా అధికంగా లోటు ఏర్పడితే సాగునీరు దొరక్క పంటల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. కొన్ని మండలాల్లో 40 నుంచి 70 శాతం వరకూ లోటు ఏర్పడటంతో అన్నదాతలకు దిక్కుతోచడం లేదు. వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం సాధారణంకన్నా 19 శాతం వరకూ లోటు ఏర్పడినా సాధారణ వర్షపాతం ఉన్న ప్రాంతాలుగానే గుర్తిస్తారు. ఈ జాబితాలో 270 మండలాలున్నట్లు ప్రభుత్వానికి నివేదించారు. 57 మండలాల్లో సాధారణంకన్నా 19 శాతందాకా లోటు ఉంది. పైగా ఈ ప్రాంతాల్లో సరిగ్గా వర్షం కురవలేదు. ఒకేరోజు భారీగా 30 నుంచి 50 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే మరో 10, 15 రోజుల దాకా చుక్క వాన పడని ప్రాంతాలు అనేకం ఉన్నాయి. దీనివల్ల మొత్తంమీద చూస్తే సాధారణ వర్షపాతం కురిసినట్టుగా తెలిపిన 270 మండలాల్లోనూ పంటలు ఎండుతూనే ఉన్నాయి. ఇక సాధారణంకన్నా 20 శాతానికి పైగా లోటు ఉన్న 218 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులేర్పడ్డాయి. ఈ ప్రాంతాల్లో ఎండలు కూడా పెరగడం వల్ల బోర్లు, బావుల్లో నీరు అడుగంటి వాటి కింద సాగుచేసిన పైర్లకు నీరందించలేక రైతులు సతమతమవుతున్నారు.

తగిన ప్రణాళికలేవి?

తగిన ప్రణాళికలేవి?

వర్షాధార భూములున్న ప్రాంతాల్లో సాగుచేసే పంటలకు వర్షాలే కీలకం. ఒక వర్షం పడిన తరవాత మరో వర్షం ఎన్నిరోజుల్లో కురిసిందనే లెక్కల ఆధారంగా ఈ ప్రాంతాల్లో పంటల దిగుబడులను అంచనా వేస్తారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది కరవును గుర్తించేందుకు కొత్త నిబంధనలు తెచ్చింది. వీటి ప్రకారం ఒక ప్రాంతంలో ఒక వర్షం కురిసిన రోజు నుంచి 20 నుంచి 28 రోజుల వరకూ సరైన వర్షం పడకపోతే ‘పొడి విరామం' (డ్రైస్పెల్‌) ఏర్పడి పంటలు ఎండిపోయి కరవు నెలకొన్నట్లు గుర్తిస్తారు. జూన్‌లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలో 14వ తేదీ నాటికి పూర్తిగా ప్రవేశించి వర్షాలు అధికమయ్యాయి. ఆ తేదీ నుంచి ప్రతీ వారం రోజులకు ఒకసారి వర్షపాతం ఎలా ఉందనే లెక్కలను పరిశీలించి పొడి విరామం గుర్తిస్తారు. ఒకవారంలో సాధారణంకన్నా 50 శాతం తక్కువ వర్షం కురిసినా అక్కడ వర్షాలే లేనట్లేనని లెక్కిస్తారు. సాధారణ స్థాయిలో వర్షం లేకపోతే పైరు సరిగా ఎదగదని, భూమిలో సరైన తేమ శాతం లేక దిగుబడులు పడిపోతాయని కేంద్రం తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం గత జూన్‌ 15 నుంచి ఈనెల 2 వరకూ మొత్తం 12 మండలాల్లో ఏకంగా 28 రోజుల పాటు పొడి విరామం ఏర్పడింది. దీనివల్ల ఈ ప్రాంతాల్లో పంటలపై ఆశలు సన్నగిల్లాయి. తొలకరి వర్షాల తరవాత కరవు, వర్షాభావం, వరదలు లేదా తుపాన్ల పంటి విపత్తులేర్పడి పంటలు దెబ్బతింటే రైతులకు తక్షణం ప్రత్యామ్నాయ పంటల సాగుకు వ్యవసాయశాఖ రాయితీలు ప్రకటిస్తుంది. కానీ గతేడాది ఖరీఫ్‌లో వర్షాలు పడి ఎలాంటి విపత్తు లేకపోవడం, ఈసారి కూడా జూన్‌లో వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో కరవు సన్నాహాక ప్రణాళికలేమీ సిద్ధం కాలేదు. గతేడాది జులై, ఆగస్టులో వర్షాలు లేక పొడి విరామం ఏర్పడినా ఆ తరవాత సెప్టెంబరులో భారీ వర్షాలు పడి సీజన్‌ మొత్తంమీద సాధారణ వర్షపాతం లెక్కలే నమోదయ్యాయి.

సోమవారం నుంచి వర్షాలపై వాతావరణశాఖ ఆశలు

సోమవారం నుంచి వర్షాలపై వాతావరణశాఖ ఆశలు

ఈసారి కూడా అలాగే ఈ నెలాఖరుకల్లా వర్షాలు పెరిగే సూచనలున్నాయని వ్యవసాయశాఖ ఆశిస్తోంది. కాలం కలిసి రాలేదని మంచిర్యాల జిల్లా మాదరి కిష్టయ్య అనే రైతు తెలిపాడు. తమవూరి పెద్దచెరువు కింద ఎంతో ఆశతో రెండున్నర ఎకరాల్లో వరి విత్తనాలను నేరుగా విత్తే పద్ధతిలో వేశానని,. పైరు ఎదిగే సమయంలో వర్షాలు లేక చెరువును, వానలను నమ్ముకుని పూర్తిగా నష్టపోయానన్నాడు. ఎండుతున్న పైరుకు నీరు ఎక్కడి నుంచి ఇవ్వాలో తెలియడం లేదని. ఈసారి వానలు పడక కాలం కలసి రాలేదని మాదరి కిష్టయ్య చెప్పాడు. వాతావరణశాఖ సంచాలకుడు వైకే రెడ్డి మాట్లాడుతూ సోమవారం నుంచి క్రమంగా వర్షాలు పెరిగే సూచనలున్నాయన్నారు. ఇప్పటికిప్పుడు భారీ వర్షాలు పడకున్నా కొద్దిరోజుల్లో పెరుగుతాయని, ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు సానుకూలంగా ఉన్నాయని ఇంతకాలం ఏర్పడిన పొడి విరామం తగ్గి క్రమంగా వానలు పెరుగుతాయని వివరించాడు.

నిజామాబాద్‌లో కర్షకుల కంటతడి

నిజామాబాద్‌లో కర్షకుల కంటతడి

సీజన్‌ ప్రారంభంలో వరుణుడు మురిపించాడు.. ఆశతో మట్టి మనిషి విత్తనాలు విత్తగా ఆశల మొలకలు ఆయువు పోసుకొన్నాయి.. తీరా పైరు ఎదిగే క్రమంలో వరుణుడు ముఖం చాటేశాడు .ఆశల మేఘాలు ఆవిరై.. కరవు మబ్బులు కమ్ముకున్నాయి. ఎటు చూసినా ఎడారి ఛాయలు.. ఎండిపోతున్న పంటలు.. వాటిని విచారంగా చూస్తూ.. దిగాలుగా కూర్చున్న రైతన్నల దృశ్యాలే కనిపిస్తున్నాయి. పంటల సాగుకు పెట్టిన పెట్టుబడులైనా తిరిగి వస్తాయా.. లేదో అనే సందిగ్ధంలో ఉన్నారు. భీమ్‌గల్‌ మండలంలో 3,500 ఎకరాల్లో వరి సాగు అయింది. వర్షాధారం, బోరుబావుల కింద ఆధారపడి పంటలు వేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి పొలాలు బీటలు వారి పంట ఎండిపోతోంది. సుమారు 1,500 ఎకరాల్లో వరి దెబ్బతింది. వారం రోజుల్లోపు వర్షం పడకుంటే మొత్తం ఎండిపోతుంది.

 40 శాతం దెబ్బతిన్న వరి

40 శాతం దెబ్బతిన్న వరి

జిల్లా వ్యాప్తంగా వరి, మొక్కజొన్న, సోయాబీన్‌ 3,79553 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా వర్షాలు కురవక పోవడంతో 2,64,979 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. సుమారు 1,14,574 ఎకరాల్లో ఇప్పటికీ పంటలు వేయలేదు. ఇప్పటి వరకు సాగైన పంటల్లో వరి 40 శాతం, మొక్కజొన్న 20 శాతం, సోయా 10 శాతం విస్తీర్ణంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోయా వర్షాభావానికి తట్టుకొనే శక్తి ఎక్కువగా ఉండటంతో నష్ట ప్రభావం కొంత తక్కువగా ఉంది. ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అనధికార లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు వరి, మొక్కజొన్న,సోయాపంటలు 72,,200 ఎకరాల్లో ఎండిపోయాయి. ఆగస్టు 15 లోపు భారీ వర్షాలు కురవకుంటే పంటలు పూర్తిగా దెబ్బతిని ఏమాత్రం పంట చేతికి వచ్చే పరిస్థితి ఉండదని అధికారులు అంతర్గతంగా చెబుతున్న మాట. ప్రధానంగా జిల్లాలో బోరుబావుల కింద సాగైన వరిపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటికే వీటిలో నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే వీటిలో పూర్తిగా నీరు అడుగంటే ప్రమాదం ఉంది.

బీటలు వారుతున్న పొలాలు

బీటలు వారుతున్న పొలాలు

ఇందూరు జిల్లాలో రెండేళ్ల కిందట నెలకొన్న దయనీయ స్థితి పునరావృతమయ్యే ఆస్కారం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సాగైన వరి విస్తీర్ణంలో 40 శాతం మేర దెబ్బతిన్నట్లు అంచనా. ఈ లెక్కన 49 వేల ఎకరాల వరి ఎండుముఖం పట్టింది. వారం రోజుల్లో వర్షం రాకుంటే పంట పూర్తిగా తుడిచిపెట్టుకు పోయే ముప్పు ఉంది. ఇప్పటి వరకు ఎకరం వరి సాగుకు రైతు రూ.8 వేలు చొప్పున వెచ్చించారు. ఈ లెక్కన రూ.39.20 కోట్ల మేర పెట్టుబడి నష్టం వాటిల్లే ఆస్కారం ఉంది. భీంగల్ మండలం వాసి బెజ్జోర వాసి బోజ లింగమయ్య మాట్లాడుతూ ఐదెకరాల్లో నాలుగు ఎకరాల్లో వరి నాటు వేశానని, మరో ఎకరంలో సోయా సాగు చేశానని తెలిపాడు. రెండు బోర్లలో సమృద్ధిగా వచ్చే నీరు 10 రోజుల నుంచి ఒక్కసారిగా నీటి లభ్యత తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో మూడు ఎకరాల్లో వరికి తగిన తడులు లేక బీటలు వారుతోందని పంట కాపాడుకునేందుకు రెండు బోరు బావులు తవ్వించినా నీరు రాలేదన్నాడు. రూ.70 వేలు వృథా అయ్యాయని, పంట సాగుకు పెట్టుబడులు రూపేణా రూ.40 వేలు ఖర్చు చేశానని, పంట కాపాడుకునేందుకు ఏం చేయాలన్నది తోచడం లేదన్నాడు.

ఇతర పంటల పరిస్థితి అంతంతే

ఇతర పంటల పరిస్థితి అంతంతే

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షానికి ఇంకా లోటుగానే ఉంది. ప్రారంభంలో కురిసిన వర్షాలు ఆ తర్వాత మొహం చాటేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఆదిలాబాద్‌లో కొంత మేరకు ఫర్వాలేకపోయినా.. ఇతర జిల్లాల్లో పంటల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉమ్మడి జిల్లా మొత్తంలో 80 శాతం వర్షాధార పంటలే. చెరువులు, జలాశయాలు నిండితే కాని వరి సాగుకు అవకాశం ఉంటుంది. రైతులు నారు సిద్ధం చేసుకుని ఉన్నారు. బోర్లు, బావులు ఉన్నా రైతులు నాట్లు వేసుకున్నారు. జలాశయాలు, చెరువుల కింద సాగు చేసే రైతులు ఇంకా ఎదురుచూస్తున్నారు.

జిల్లాలో 6.25 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా వర్షాభావం వల్ల ఇప్పటి వరకు 4.50 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేశారు. ప్రాజెక్టులు సాధారణ నీటి మట్టానికి చేరువగా లేకపోవడంతో కాలువల కింద సాగు కావాల్సిన వరి రైతులు నాట్లు వేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ నెల దాటితే ఇక ఆగస్టు నెల కీలకంగా మారుతుంది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 300 మి.మీ.లు ఏటా ఆగస్టు నెలలో భారీ వర్షాలు కురుస్తాయి.

పరిస్థితులు సాగుకు అననుకూలం

పరిస్థితులు సాగుకు అననుకూలం

ఆగస్టులోనూ నెలలోనూ ఇదే పరిస్థితి ఉంటే కరవు బారీన పడే వీలుంది. జిల్లాలో పరిస్థితులు వరి సాగుకు అనుకూలంగా లేవు. ఆగస్టు నెలలో నాలుగైదు భారీ వర్షాలు కురిస్తే కానీ వరి సాగు గట్టెక్కే అవకాశం లేదు. వరి వర్షాధారంగా 21 వేల ఎకరాల్లో, నీటి ఆధారంగా 1.20 లక్షల ఎకరాల్లో సాగు అవుతుంది. అలాంటిది జూలై ఆఖరు వరకు 10 వేల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. ఎక్కువ మంది రైతులు జలాశయాల కాలువల కింద 71 వేల ఎకరాలు, బావుల కింద 28 వేలు, చెరువుల కింద 21 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. కానీ ఖరీఫ్‌ మొదలై రెండు నెలలు గడిచినా, ఆదిలాబాద్ జిల్లాకు వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయిలో నీరు రాలేదు.

51 శాతం వర్షపాతం లోటు ఇలా

51 శాతం వర్షపాతం లోటు ఇలా

కడెం, సదర్‌మాట్‌, స్వర్ణ, గడ్డెన్న వాగు, వట్టివాగు తదితర ప్రాజెక్టుల్లోనూ పూర్తి స్థాయిలో నీరు రాలేదు. ఆదిలాబాద్‌ జిల్లాలో భీంపూర్‌, ఇచ్చోడ, ఉట్నూర్‌, బేల, గాదిగూడ, నార్నూర్‌ తదితర మండలాలు 20 శాతం కంటే లోటు ఎక్కువగా ఉంది. కుమురంభీం జిల్లాలో రెబ్బెన, ఆసిఫాబాద్‌, కెరమెరి, వాంకిడి, కాగజ్‌నగర్‌, సిర్పూరు(టి), జైనూర్‌ తదితర మండలాల్లో 30 శాతానికి పైగా లోటు ఉంది. మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా కాసిపేట మండలంలో 63 శాతం లోటుగా ఉంది. ఈ మండలంలో సాధారణ వర్షపాతం 475మి.మీ.లు కాగా ఇప్పటివరకు కేవలం 176 మి.మీ.లు వర్షం మాత్రమే కురిసింది. దీంతో పాటు తాండూర్‌లో 51 శాతం లోటుగా ఉంది. మందమర్రి, మంచిర్యాల, నస్పూరు, భీమారం, చెన్నూర్‌ తదితర మండలాల్లో 35-50 శాతం లోటుగా ఉంది. నిర్మల్‌ జిల్లాలో ఖానాపూర్‌లో 52 శాతం, నిర్మల్‌లో 50 శాతం లోటుగా ఉండగా, లక్ష్మణచాంద, కుభీరు, తానూర్‌, పెంబి, దస్తూరాబాద్‌, కడెం, సారంగాపూర్‌, తదితర మండలాల్లో 30-50 శాతం మధ్యన లోటు ఉంది. ఆగస్టులో వర్షాలు కురిస్తేనే పంటలు గట్టేక్కే అవకాశముంది.

సగం కూడా రాని వర్షాలు

సగం కూడా రాని వర్షాలు

పాలమూర్‌ జిల్లాలో సాధారణంగా ఖరీఫ్‌లో 36,239 హెక్టార్లలో వరిని సాగు చేస్తారు. కాని ఈసారి ఇప్పటి వరకు కేవలం 3,350 హెక్టార్లలో మాత్రమే వరిని సాగు చేశారు. ప్రధానంగా మొలక చల్లే సమయంలోనే వర్షాలు లేకపోవడం వరి సాగుపై ప్రభావం చూపింది. గత ఏడాది 57,340 హెక్టార్లలో వరిని సాగు చేయగా, 2015-16లో 59,410 హెక్టార్లలో వరిని సాగు చేశారు. ఇప్పుడు ఇక భారీ వర్షాలు పడినా.. వరిని సాగు చేసే అవకాశాలు సన్నగిల్లాయి. నాలుగేళ్లుగా వర్షాలు లేక పాలమూరు జిల్లాలో అన్నదాతలపై ప్రభావం పడుతోంది. గత ఏడాది మొక్కజొన్న, ఆముదం పంటలు వర్షాలు లేక ఎండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చెరువులు, కుంటలు నిండాయి. అంతకుముందు ఏడాది కూడా వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. మళ్లీ ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను దెబ్బతీస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో జులైలో 148.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కాని 88.9 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది.

వాడిపోతున్న పునాస పంటలు

వాడిపోతున్న పునాస పంటలు

11 మండలాలు మినహా మిగతా వాటిలో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి. వ్యవసాయాధికారులు మాత్రం మున్ముందు వర్షాలు పడే అవకాశం ఉందని రైతులు స్థైర్యం కోల్పోవద్దని అంటున్నారు. జూన్‌ రెండో వారంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు పునాస పంటలైన మొక్కజొన్న, జొన్న, కంది, పెసర తదితర పంటలు సాగు చేసిన రైతులు తరవాత కొద్దిపాటి వర్షాలకే ఆనందంతో హుషారుగా సాగులో నిమగ్నమయ్యారు. రాన్రాను వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నిత్యం ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నా చినుకులు మాత్రం రాలడం లేదు. ఇతర ప్రాంతాల్లో మంచి వర్షపాతం నమోదవుతున్నా పాలమూర్ జిల్లాలో మాత్రం ముసురు వర్షాలే దిక్కయ్యాయి.. వర్షాల జాడ లేక.. చెరువులు కుంటలు నిండక సాగు ప్రశ్నార్థకమైంది.. పునాస పంటలు వాడిపోతున్నాయి. బోర్లలో నీటిమట్టాలు తగ్గిపోతున్నాయి. ఉన్న బోర్ల కింద చల్లుకున్న వరి తుకాలు ఎండిపోతున్నాయి. గ్రామాల్లో తాగునీటి సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఎక్కడా తగినంత నీరు లభించడం లేదు. సాగును నమ్ముకున్న కొన్ని గిరిజన కుటుంబాలు మల్లీ వలసలు వెళ్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది పంటల సాగు పెరుగుతుందని భావించినా 2,10,156 హెక్టార్లలో మాత్రమే పంటల్ని సాగు చేశారు.

రుణ విముక్తిపై అన్నదాత ఆశలు అడియాసలే

రుణ విముక్తిపై అన్నదాత ఆశలు అడియాసలే

జిల్లాలో చినుకు జాడ కనిపించక పోవడంతో రైతులకు కంటి నిండా కునుకు కరవవుతోంది. వర్షాలు లేక ఎండుతున్న పంటలను చూసి రైతులు కుంగిపోతున్నారు. సరిపడా వర్షాలు లేక ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. మరో అయిదు రోజుల వరకు ఇలాంటి పరిస్థితులు కొనసాగితే గతేడాది నాటి కరవుఛాయలు ఈ సారీ పునరావృత్తమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌ ప్రారంభంలో సకాలంలో వర్షాలు వచ్చాయని అన్నదాతలు మొదట సంబరపడ్డారు. అనుకున్నట్లుగానే జూన్‌ మొదటి వారంలోనే విత్తనాలు విత్తుకున్నారు. అల్పపీడనం పుణ్యామా అని భారీగా కురిసిన వర్షాలకు మొలకెత్తిన విత్తనాలన్ని ఏపుగా పెరుగుతూ అన్నదాతల్లో కోటి ఆశలు నింపాయి. వరుసగా మూడేళ్లపాటు కరవు కారణంగా అప్పులపాలైన అన్నదాతలు ఈ ఏడాది ఖరీఫ్‌ పంటలు బాగా పండితే రుణం నుంచి విముక్తిపొందాలని భావించారు.

తర్వాత మొహం చాటేసిన వరుణుడు

తర్వాత మొహం చాటేసిన వరుణుడు

రైతులు అనుకొన్నట్టుగానే జూన్‌ నెలలో సాధారణ వర్షపాతం కంటే 40 శాతం అధికంగా కురిసింది. దీంతో పంటలన్నీ బాగున్నాయనికుంటున్న తరుణంలోనే వరుణుడు మోహం చాటేశాడు. వర్షాలు తగ్గిపోయి, ఉష్ణోగ్రతలు పెరగడంతో పంటలు ఎండు ముఖం పడుతున్నాయి. ప్రధానంగా జిల్లాలో మొక్కజొన్న పంటకు సరిపడా తేమ నేలలో లేకపోవడంతో ఎండిపోతోంది. జూన్‌ నెలలో సాధారణ వర్షపాతానికి మించి దాదాపు 40 శాతం వర్షం అధికంగా కురిస్తే, జులై నెలలో మొత్తంలో కురవాల్సిన వర్షానికంటే 52 శాతం తక్కువగా కురిసింది. దీంతో జిల్లాలోని వివిధ మండలాల్లో రైతులు సాగు చేసిన పంటలన్నీ ఎండు ముఖం పడుతున్నాయి. ప్రధానంగా పెంటవెల్లి, వూర్కొండ, పదర మండలాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోతుంది. పత్తి, కంది, జొన్న ఇతర పంటలు ఎండల తీవ్రతకు ఎండుముఖం పడుతున్నాయి.

వర్షాలు కురవక మెదక్ రైతుల్లో నిరాశ

వర్షాలు కురవక మెదక్ రైతుల్లో నిరాశ

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం.. 5,55,535 ఎకరాలు. జిల్లాలో ఇప్పటి వరకు 3,44,870 ఎకరాలు (69.9 శాతం) మాత్రమే సాగైయింది. ప్రస్తుతం వర్షాలు కురవక మిగిలిన రైతులు పంటల సాగుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో జిల్లాలో ఖరీఫ్‌లో 3,44,870 ఎకరాల విస్తీర్ణంలోనే పంటలు సాగుఅయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. వర్షాలు లేకపోవడం, ఎండల తీవ్రత కారణంగా పంటలు ఎండుముఖం పడుతున్నాయి. మొక్కజొన్న పంట ఎండిపోతుండగా.. పత్తి, కంది, జొన్న పంటలు వాడిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 87,707 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న, 2,01,847 ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశారు. అదేవిధంగా జొన్న 4,369 ఎకరాలు, కంది 6,809 ఎకరాల్లో సాగు చేశారు. ఈ పంటలు నీరు లేక ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వరి తరువాత ప్రధాన పంట మొక్కజొన్నే. జూన్‌లో వర్షాలు ఆశాజనకంగానే కురిశాయి. దీంతో దాదాపు అన్ని మండలాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 69,962 ఎకరాలు కాగా ఇప్పటి వరకు దాదాపు 50 వేలకు పైగా ఎకరాల్లో సాగైంది. పంట ఎదిగే దశలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సాగుచేసిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. చిలపచెడ్‌, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, చేగుంట, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, కౌడిపల్లి, నర్సాపూర్‌, పాపన్నపేట, అల్లాదుర్గం, టేక్మాలు, పెద్దశంకరంపేట మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

అడపాదడపా చిరు జల్లులే శరణ్యం

అడపాదడపా చిరు జల్లులే శరణ్యం

గత 15 రోజులుగా ఆయా మండలాల పరిధిలో అడపాదడపా చిన్నపాటి జల్లులు కురవడం తప్ప భారీ వానలు పడలేదు. వెల్దుర్తి మండలం కుకునూరు, పంతులు పల్లి, వెల్దుర్తి, చేగుంట మండలం అనంతసాగర్‌, బోనాల, ఇబ్రహీంపూర్‌, ఉల్లితిమ్మాయిపల్లి, పులిమామిడి, కర్నాల్‌పల్లి, శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల తదితర గ్రామాల పరిధిలో ఎక్కవగా మొక్కజొన్న పంట వాడిపోతోంది. ఇక చేగుంట మండలం గోవిందాపూర్‌, కిష్టాపూర్‌, బోనాల, ఇబ్రహీంపూర్‌ తదితర గ్రామాల పరిధిలో పత్తి ఎండుముఖం పడుతోంది. జిల్లాలో బోర్ల కింద సాగుచేసిన వరిపంటకు నీటి తడులందక పొలాలు ఎండిపోతున్నాయి. ఖరీఫ్‌లో వరి సాధారణ విస్తీర్ణం 75,170 ఎకరాలు కాగా ఇప్పటి వరకు దాదాపు 40 వేల ఎకరాల్లో సాగైంది. చెరువులు నిండకపోవడంతో.. బోర్ల ఆధారంగానే ఎక్కువ మంది రైతులు వరి వేశారు. కాగా 24 గంటల పాటు విద్యుత్తు సరఫరా అవుతుండటం.. బోర్లు నిరంతరాయంగా నడుస్తుండటంతో జలమట్టాలు తగ్గిపోతున్నాయని రైతులు అంటున్నారు. వెల్దుర్తి మండలం కుకునూర్‌, పంతులుపల్లి గ్రామాల పరిధిలో బోర్లకింద సాగుచేసిన వరి పొలాలు బీటలు వారాయి. చిన్నశంకరంపేట, చేగుంట మండలాల పరిధిలోని పలు గ్రామాల పరిధిలోనూ ఇదే పరిస్థితి. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే పంటలు చేతికి అందవని కర్షకులు ఆవేదన చెందుతున్నారు.

భగ్గుమంటున్న భానుడు

భగ్గుమంటున్న భానుడు

జూన్‌, జులై నెలల్లో కురిసిన వర్షపాతాన్ని పరిశీలిస్తే జిల్లాలోని 17 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మొత్తం 20 మండలాల్లో కలిపి రెండు నెలల్లో సరాసరి వర్షపాతం 390.8 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 293.8 మి.మీ నమోదైంది. సరాసరి -25 శాతం లోటు ఉంది. చిలిపిచెడ్‌, కౌడిపల్లి, కొల్చారం, హవేలిఘణపూర్‌, పాపన్నపేట, నర్సాపూర్‌, టేక్మాల్‌ మండలాల్లో వర్షలోటు ఎక్కువగా ఉంది. జిల్లా మొత్తం మీద రామాయంపేట, నిజాంపేట, రేగోడ్‌ మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదవడం గమనార్హం. ఈసారి వానాకాలంలోనూ భానుడు భగ్గుమంటున్నాడు. ఈ నెలలో పగటి ఉష్ణోగ్రత 30 సెల్సియస్‌ డిగ్రీలు ఉండాలి. పలు ప్రాంతాల్లో అంతకుమించి 3 నుంచి 5 డిగ్రీలు అదనంగా నమోదవుతుండగా.. మంగళవారం రేగోడ్‌లో 35.1 సెల్సియస్‌ డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. అల్లాదుర్గంలో 34.4, కౌడిపల్లి మండలం భుజరంపేటలో 33.2, రామాయంపేటలో 33.9, చేగుంట మండలం శివనూర్‌లో 33.0, వెల్దుర్తిలో 33.0, నర్సాపూర్‌లో 33.6, కొల్చారంలో 32.0, రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌లో 31.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వానాకాలంలో ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదుకావడం అసాధారణమేనని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Drought conditions to be faced in Telangana districts. 275 Mandals have deficite rains while mostly 218 Mandals condition had worst. Farmers hope on August only other wise drinking problem also arised. As per now farmer's community serious concerns about rains
Please Wait while comments are loading...