• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భూతాపం ఎఫెక్ట్: భారత కోస్తాకు పొంచి ఉన్న ముప్పు

By swetha basvababu
|

న్యూఢిల్లీ: అలలు అలలుగా ఎగసిపడుతున్న సముద్ర కెరటాలు నెమ్మదినెమ్మదిగా భూగోళాన్ని కబళిస్తున్నాయి. భూ వాతావణం వేడెక్కేకొద్దీ ఏటికేడు సముద్ర మట్టం పెరిగిపోతూ తీర ప్రాంతాలకు ముప్పు ముంచుకొస్తున్నది. 1901 నుండి ఇప్పటివరకూ దాదాపు 20 సెంటీమీటర్ల మేర సముద్ర నీటిమట్టం పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతే కాదు నీటిమట్టం పెరుగుదల ఇటీవల బాగా పెరిగిందని కూడా హెచ్చరిస్తున్నారు. 2100 నాటికి సముద్రాల నీటి మట్టం ఒక అడుగు నుంచి ఒక మీటరుతోపాటు ధ్రువప్రాంతాల్లోని మంచుదుప్పటి కరిగితే ఏడు మీటర్ల వాటి నీటి మట్టం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే జరిగితే చాలా దేశాల్లో తీర ప్రాంతాలన్నీ సాగర జలాల్లో మునిగిపోతాయని చెప్తున్నారు. సుదీర్ఘ తీరం ఉన్న భారత్‌కు, ఇందులోనూ లోతట్టున గల తూర్పు తీర ప్రాంతానికి ఎక్కువ ముప్పు పొంచి ఉందని స్పష్టం చేస్తున్నారు. వాతావరణ మార్పుతో సంభవిస్తున్న మార్పులతో 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాల స్థాయి, వాటి పెరుగుదల, పర్యవసనాలు ఎలా మారతాయన్న విషయమై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగుతున్నాయి.

భూతాపం వల్లే పెరుగుతున్న సముద్ర జలాలు

భూతాపం వల్లే పెరుగుతున్న సముద్ర జలాలు

సముద్ర మట్టాలు సాధారణంగా స్థిరంగా ఉంటాయని, కానీ భూమి చరిత్రను చూస్తే సముద్ర మట్టాల్లో పెనుమార్పులు సంభవించిన విషయం స్పష్టమవుతోంది. భూగోళం దాదాపు లక్ష సంవత్సరాల విరామంతో మంచు యుగం నుంచి మంచు యుగానికి పయనిస్తుండగా, మధ్యలో ఉష్ణకాలం వస్తూ ఉంటుంది. చివరి మంచు యుగం పతాకస్థాయిలో ఉన్నపుడు ఉత్తర అమెరికా ఖండంలో అత్యధిక భాగం మంచుతోనే నిండి ఉండేది. అప్పుడు సముద్ర మట్టం కన్నా 400 అడుగులు తక్కువగా ఉండేది. ప్రస్తుతం మనం మంచు యుగాల మధ్య ఉష్ణకాలంలో ఉన్నామంటే.. ఇప్పుడు సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. ఆ తర్వాత మళ్లీ తగ్గడం మొదలవుతాయి. కానీ మానవ కల్పిత వాతావరణ మార్పులు ఈ చక్రాన్ని మార్చేస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. గతంలో చాలా నెమ్మదిగా సముద్ర మట్టాల్లో మార్పులు సంభవించేవని, కానీ ఇప్పుడు పెరుగుతున్న భూతాపం వల్ల సముద్ర మట్టాలు వేగంగా పెరగడానికి కారణమంటున్నారు.

గ్రేసియర్ల కరుగుదలతో మరింత ముప్పు

గ్రేసియర్ల కరుగుదలతో మరింత ముప్పు

భూతాపం పెరిగి ధ్రువాల్లో మంచు దుప్పటి కరిగిపోతుండడం, వాతావరణం వేడెక్కడం వల్ల సముద్ర జలాలు కూడా వేడెక్కి వ్యాకోచించడం, ప్రపంచవ్యాప్తంగా గల గ్లేసియర్లు కరుగుతుండటంతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. 1901-2010 మధ్య ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం సగటున 19 సెంటీమీటర్ల మేర పెరిగినట్లు వాతావరణ మార్పులపై ప్రపంచ సంఘం (ఐపీసీసీ) ఐదో అంచనా నివేదిక ఇటీవల తెలిపింది. ఆ నివేదిక ప్రకారం 1901-2010 మధ్య ఏటా సగటున 1.7 మిల్లీమీటర్ల చొప్పున సముద్ర మట్టం పెరిగినట్లు అంచనా. 1971-1993 మధ్య ఈ పెరుగుదల సగటున ఏడాదికి 2.0 మిల్లీమీటర్లయితే 1993-2010 మధ్య ఏడాదికి 3.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. గత రెండు దశాబ్దాల్లోనే సముద్ర మట్టం వేగంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అలల కొలతల నివేదికలు, ఉపగ్రహాల ద్వారా పరిశీలనతో ఈ విషయాన్ని నిర్ధారించారు.

బంగ్లాదేశ్‌లో నాలుగోవంతు నీట మునకే

బంగ్లాదేశ్‌లో నాలుగోవంతు నీట మునకే

ఇతర సముద్రాలతో పోలిస్తే 2003 నుంచి ఉత్తర హిందూ మహాసముద్ర మట్టం రెండు రెట్లు ఎక్కువగా పెరిగిందని జర్నల్‌ ఆఫ్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ మేగజైన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం తెలిపింది. అంతకుముందు దశాబ్దకాలంలో ఇక్కడి సముద్ర మట్టం పెరుగుదల చాలా తక్కువ. ఉపగ్రహాల ద్వారా రెండున్నర దశాబ్దాల పాటు సేకరించిన సముద్ర ఉపరితల కొలతల సమాచారాన్ని విశ్లేషించి యూనివర్సిటీ ఆఫ్‌ హవాయి సీలెవల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. సముద్ర మట్టాల పెరుగుదలతో ఇప్పటికే బంగ్లాదేశ్‌లో నాలుగో వంతు భూభాగం నీట మునిగింది. చైనా, ఫిలిప్పీన్స్‌ దేశాల్లో పలు తీరప్రాంతాలూ మునిగాయి. ఇక మన దేశంలోని పశ్చిమ బెంగాల్‌లో కోల్‌కతా వద్ద రివర్‌ డెల్టా సుందర్బన్‌ మడ అడవులు నీటి మునిగిపోయాయి. భూతాపం 2 డిగ్రీలు పెరిగితే సముద్ర మట్టం 4.7 మీటర్లకు.. 4 డిగ్రీలు పెరిగితే 9 మీటర్ల వరకు పెరిగే అవకాశముంది.

భారత్ లో 13వేల కోస్తా ఔట్

భారత్ లో 13వేల కోస్తా ఔట్

ఈ శతాబ్దం చివరి నాటికి.. అంటే 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం కనిష్టంగా 28 సెంటీమీటర్ల నుంచి గరిష్టంగా 98 సెంటీమీటర్ల వరకూ పెరుగుతుందని ఐపీసీసీ అంచనా. గ్రీన్‌ల్యాండ్‌ మంచు దుప్పటి పూర్తిగా కరిగితే సముద్ర మట్టం ఏకంగా 7 మీటర్లు పెరుగుతుంది. అదే జరిగితే బ్రిటన్ రాజధాని లండన్‌ నగరం సముద్రంలో మునిగిపోతుంది. సముద్ర మట్టం ఒక మీటరు పెరిగితే భారత తీరంలో 13,973 చదరపు కిలోమీటర్ల భూభాగం సముద్రంలో మునిగిపోతుందని అంచనా.. అదే నీటిమట్టం ఆరు మీటర్లు పెరిగితే 60,497 చదరపు కిలోమీటర్ల భూమి సముద్రం పాలవుతుందని ఇటీవల జర్నల్‌ ఆఫ్‌ త్రెటెన్డ్‌ టాక్సా మేగజైన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఆ అధ్యయనం ప్రకారం.. సముద్ర మట్టం ఒక మీటరు మేర పెరిగితే అంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణా మడ అడవుల ప్రాంతం ముప్పావు భాగానికి పైగా మునిగిపోతుంది.

నాలుగు కోట్ల మంది జీవనానికి ముప్పు

నాలుగు కోట్ల మంది జీవనానికి ముప్పు

పశ్చిమబెంగాల్‌లోని సుందర్బన్‌ వనాలు సగానికిపైగా మునిగిపోతాయి. గుజరాత్‌లోని రాణ్‌ ఆఫ్‌ కచ్‌ చిత్తడి నేలలు సగానికి పైగా సముద్ర గర్భంలో చేరుతాయి. చిలుకా సరస్సు, పులికాట్‌ సరస్సు సహా ఏడు రక్షిత ప్రాంతాలు సగానికి పైగా నీట మునుగుతాయి. సముద్రమట్టం పెరుగుదలతో 2050 నాటికి భారత దేశంలో 4 కోట్ల మంది జనాభాకు ముప్పుగా పరిణమిస్తుందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక గతేడాది హెచ్చరించింది కూడా. ముఖ్యంగా ముంబై, కోల్‌కతా నగరాల ప్రజలకు ముంపు ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొన్నది. సముద్ర మట్టం పెరుగుదల ప్రభావం పశ్చిమ తీరం కన్నా.. లోతట్టు ప్రాంతంలో ఉన్న తూర్పు తీరం మీద ఎక్కువగా ఉంటుంది. తీర ప్రాంతాలు వరద ముంపునకు గురవడం పెరుగుతోంది. గత 25 ఏళ్ల అధ్యయనం ప్రకారం భారత తీర ప్రాంతం కోతకు గురయ్యే స్వభావం 38.5 శాతంగా ఉందని చనిపోయారు.

భారత్‌లో సముద్ర జల మట్టాలిలా

భారత్‌లో సముద్ర జల మట్టాలిలా

ఇక వచ్చే వందేళ్లలో మన దేశంలోని కోల్‌కతా, ముంబై, కొచ్చి, విశాఖపట్నం తదితర తీర ప్రాంత నగరాలు సముద్రంలో మునిగిపోయే అవకాశముందని వాతావరణ, సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భారత తీర ప్రాంతాల్లోని పెద్ద నగరాల్లో ఒకటైన కోల్‌కతా వద్ద సముద్ర మట్టం వేగంగా పెరుగుతోంది. అక్కడ ఏటా సగటు సముద్ర మట్టం పెరుగుదల 5.74 మిల్లీమీటర్లు, కొచిలో ఏటా 1.75 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతోంది. ఇక ముంబై వద్ద 1.25 మిల్లీమీటర్ల చొప్పున, ఆంధ్రప్రదేశ్‌లోని తీర నగరం విశాఖపట్నంలో 1.09 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతోంది. దేశంలో సముద్ర ముంపు ప్రమాదం ఉన్న నాలుగో నగరం విశాఖ పట్నమే కావడం గమనార్హం. మొత్తంగా భారతదేశపు సముద్ర మట్టాలు ఏటా సగటున 1.30 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతున్నాయి.

కరుగుతున్న మంచు ఖండాలు

కరుగుతున్న మంచు ఖండాలు

భూగోళంపై ఉష్ణోగ్రత పెరగడాన్ని భూతాపం (గ్లోబల్‌ వార్మింగ్‌)గా అభివర్ణిస్తున్నారు. భూగోళం ఉష్ణోగ్రత పారిశ్రామీకరణ ముందు నాటికన్నా ఇప్పడు ఒక డిగ్రీ సెల్సియస్‌ పెరిగింది. దీనివల్ల ధ్రువ ప్రాంతాల్లోని మంచు ఖండాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న గ్లేసియర్లు కరుగుతూ ఆ నీరు సముద్రాల్లోకి వచ్చి చేరుతోంది. వాతావరణంలో కర్బన ఉద్గారాల శాతం ఇదే రీతిలో పెరిగితే ప్రస్తుతం 14.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్న సగటు ఉష్ణోగ్రత కొన్నేళ్లలో 27 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశం ఉంది. దానివల్ల భూమి మీద ఉన్న మంచు మొత్తం కరిగిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూమి మీదున్న మంచు అంతా కరిగిపోవడానికి మరో 5000 ఏళ్ల సమయం పడుతుందని మరికొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు.

90 శాతం ఉష్ణోగ్రతలు స్వీకరిస్తున్న సముద్రాలు

90 శాతం ఉష్ణోగ్రతలు స్వీకరిస్తున్న సముద్రాలు

ఇంట్లో పొయ్యి మీద కాచే నీళ్లు మరుగుతున్నప్పుడు పైకి ఉబికిరావడం మనకు తెలుసు. అలాగే భూ వాతావరణం వేడెక్కడంతో సముద్ర జలాలు కూడా వేడెక్కుతున్నాయి. వాతావరణ మార్పుతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలో 90 శాతాన్ని సముద్ర జలాలే స్వీకరిస్తున్నాయి. ఫలితంగా సముద్ర జలాలు వ్యాకోచించి.. నీటిమట్టం పెరుగుతోంది. సముద్ర మట్టాల పెరుగుదలలో మూడో వంతు కారణం ఇదేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనినే ‘థర్మల్‌ ఎక్స్‌పాన్షన్‌'అని వ్యవహరిస్తున్నారు.

ద్వీపకల్పంగా గుజరాత్

ద్వీపకల్పంగా గుజరాత్

భూమిపై ఉన్న మంచు మొత్తం కరిగితే చాలా దేశాల రూపురేఖలు మారిపోతాయి. కొన్ని దేశాలకు దేశాలే మునిగిపోతాయి. ఇక సముద్రాల మధ్య ఉండే ద్వీప దేశాలైతే పూర్తిగా నీటిపాలవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చైనాలో అరవై కోట్ల మంది నివసించే ప్రాంతం నీట మునుగుతుంది. 16 కోట్ల మంది జనాభా గల బంగ్లాదేశ్‌ మొత్తం సముద్ర గర్భంగా మారుతుంది. భారత తీర ప్రాంతాన్ని చాలా వరకూ సముద్రం కబళిస్తుంది. గుజరాత్‌ సగమే మిగులుతుంది. అది కూడా ఒక దీవిగా మారిపోతుంది. పశ్చిమ తీరం కన్నా తూర్పు తీరం ఎక్కువగా మునిగిపోతుంది. కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకూ చాలా తీర ప్రాంతం అదృశ్యమవుతుంది. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాలు చాలా వరకూ నీటిపాలవుతాయి.

ఉప్పునీటితో నిరుపయోగంగా భూములు

ఉప్పునీటితో నిరుపయోగంగా భూములు

చివరి మంచు యుగం పది వేల ఏళ్ల కింద ముగిసింది. అప్పట్లో సముద్ర మట్టాలు పెరగడం ప్రారంభమైనపుడు భూమి మీద కేవలం 50 లక్షల మంది మనుషులు మాత్రమే ఉన్నారు. వాళ్లు సముద్ర తీరాల వెంట భారీ నగరాల్లో నివసించలేదు. కాబట్టి సముద్ర మట్టాల పెరుగుదల ఇంతవరకు మానవాళి మీద తీవ్ర ప్రతికూల ప్రభావమేమీ చూపలేదు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాల్లో భారీ నగరాలు నిర్మితమయ్యాయి. కోట్ల మంది తీర ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. సముద్ర మట్టం నాలుగు అడుగులు పెరిగితే ఒక్క భారతదేశంలోనే 50 వేల మందికిపైగా జీవితాలు ముంపు బారీన పడతాయి. సముద్ర మట్టాల పెరుగుదలతో తీర ప్రాంతాలు మునగడమే కాదు.. తుఫాన్లతో భూభాగంలోకి మరింత దూరం చొచ్చుకురావడం, తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న సారవంతమైన పంట భూముల కిందకు ఉప్పు నీరు చేరి అవి నిరుపయోగంగా మారడం వంటి పరిణామాలూ సంభవిస్తాయి.

భవిష్యత్‌లో కర్బన ఉద్గారాలు మరింతగా పెరిగే చాన్స్

భవిష్యత్‌లో కర్బన ఉద్గారాలు మరింతగా పెరిగే చాన్స్

ఇప్పటికే భారీ మొత్తంలో వాతావరణంలో చేరిపోయిన కర్బన ఉద్గారాలను తగ్గించడం దాదాపు అసాధ్యం. ప్రస్తుత పారిశ్రామిక రంగం పరిస్థితులను బట్టి ఆ వాయువులు ఇంకా పెరగడం ఖాయం. మున్ముందు మంచు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం అనివార్యం. ఈ పెరుగుదల వేగాన్ని తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముఖ్యంగా భూతాపం పెరగకుండా చర్యలు చేపట్టాలి. వాతావరణంలో కర్బన వాయువుల విడుదలను తగ్గించాలి. అడవులు, చెట్లు విరివిగా పెంచాలి. పారిశ్రామిక వ్యర్థాల వల్ల సముద్రంలో సైటో ప్లాంగ్టన్‌ మొక్కలు చనిపోకుండా చూడాలి.

మంచంతా అంటార్కిటికా, గ్రీన్‌లాండ్‌లోనే

మంచంతా అంటార్కిటికా, గ్రీన్‌లాండ్‌లోనే

భూమి మీద ప్రస్తుతం దాదాపు యాభై లక్షల ఘనపు మైళ్ల మంచు ఉంది. అందులో అత్యధికంగా అంటార్కిటికా, గ్రీన్‌లాండ్‌లలోనే ఉంది. అది మొత్తం కరిగిపోతే సముద్ర మట్టాలు 230 అడుగుల మేర పెరుగుతాయని అంచనా. భారతదేశం కన్నా రెట్టింపు ఉన్న అంటార్కిటికా ఖండం మొత్తాన్ని ఒక మైలు మందం ఉన్న మంచు దుప్పటి కప్పి ఉంది. అది కరిగితే సముద్ర మట్టం ఏకంగా 200 అడుగులు పెరుగుతుంది. అయితే అంటార్కిటికా ఖండంలోని చాలా మంచు ప్రస్తుతానికి స్థిరంగానే ఉన్నప్పటికీ.. పశ్చిమ అంటార్కిటికా మంచు దుప్పటి కూలిపోయే దశకు చేరుకుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కరిగి సముద్రంలో కలిస్తే సముద్ర మట్టం 11 అడుగులు పెరుగుతుందని అంచనా. ఇక గ్రీన్‌లాండ్‌లో విస్తరించి ఉన్న మంచు అంతా కరిగితే 23 అడుగుల మేర సముద్ర మట్టం పెరుగుతుంది. ఇది వేగంగా కరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. అంటార్కిటికా, గ్రీన్‌లాండ్‌లలో కాకుండా మిగతా మంచు అంతా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో గల గ్లేసియర్లు, మంచు కొండల్లో ఉంది. భూతాపం పెరుగుతున్న కొద్దీ ఆ మంచు కూడా వేగంగా కరుగుతోంది. దాంతో చాలా దేశాల సముద్ర తీర ప్రాంతాలు మునిగిపోతాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Climate change will effects on Indian coastal area while half of Gujarat will dissapear and half of the Bangladesh immersed with ocean waters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more