వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

200 ఏళ్ల క్రితం యుద్ధం.. కొరేగావ్‌లో నేటి అల్లర్లకు కారణం... ఎలా? అసలేం జరిగింది?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

పూణే: భీమా కొరేగావ్‌ ఘటనపై ఇప్పుడు మహారాష్ట్ర రగులుతోంది. 200 ఏళ్ల కిందట కొరేగావ్‌లో జరిగిన యుద్ధాన్ని స్మరించుకోవడానికి దళితులు చేసిన ప్రయత్నం చివరికి హింసకు దారితీసింది.

భీమా-కొరేగావ్ యుద్ధం జరిగి 200 ఏళ్లు అయిన సందర్భంగా సోమవారం రాష్ట్రంలో చేపట్టిన సంస్మరణ కార్యక్రమంలో హింస్మాత్మక సంఘటనలు చోటుచేసుకుని రాహుల్ ఫతంగలే(28) అనే వ్యక్తి మ‌ృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ హింసకు నిరసనగా మంగళవారం మహారాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. బుధవారం మహారాష్ట్ర బంద్‌కు కూడా పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో అసలు భీమా-కొరేగావ్‌లో అప్పట్లో యుద్ధం ఎందుకు జరిగింది? ఎవరి మధ్య జరిగింది? ఆనాటి ఘటనను సంస్మరించుకోవడానికి ప్రయత్నిస్తే.. ఇప్పుడెందుకు అల్లర్లు జరిగాయి? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు.

 అసలేంటీ ఈ యుద్ధం?

అసలేంటీ ఈ యుద్ధం?

కొరేగావ్ అనేది ఒక చిన్న గ్రామం. ఇది పూణే నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరాఠా పాలకుడు బాజీరావ్ పీష్వా-2కు, బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య 1818 జనవరి 1వ తేదీన ఇక్కడ యుద్ధం జరిగింది. బాజీరావ్ పీష్వా వద్ద 30 వేల మంది సైన్యం ఉండేవారు. అందులో 5 వేల మందిని తొలుత ఆయన పుణెపై దాడికి పంపారు. మార్గం మధ్యంలో వీరికి 800 మంది ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం అడ్డు తగిలింది. దీంతో కొరేగావ్‌లో ఉన్న కంపెనీ సైన్యాల్ని మట్టుబెట్టడానికి బాజీరావ్ పీష్వా మరో 2 వేల మంది పదాతి దళాల్నికూడా పంపారు. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులు పీష్వా సైన్యాన్ని సమర్థంగా నిలువరించారు.

 12 గంటలపాటు హోరాహోరీగా...

12 గంటలపాటు హోరాహోరీగా...

ఇరు పక్షాల నడుమ 12 గంటలపాటు హోరాహోరీ పోరు సాగింది. ఈ యుద్ధంలో 600 మంది మరణించారు. ఈలోగా పూణే నుంచి ఈస్టిండియా కంపెనీ అదనపు బలగాల్ని పంపుతోందని అనుమానించిన బాజీరావు తన సైన్యాల్ని ఉపసంహరించారు. పూణేపై దాడి యోచనకు బాజీరావు స్వస్తి చెప్పారు. ఈస్టిండియా కంపెనీ తరఫున యుద్ధం చేసిన బలగాల్లో దాదాపు 500 మంది మహర్‌ దళితులు ఉన్నారు. వీరంతా బాంబే నేటివ్‌ ఇన్‌ఫాంటరీకి చెందిన వారు. అగ్రవర్ణ బ్రాహ్మణులైన పీష్వాలు .. మహర్‌లను అంటరానివారిగా చూసేవారు.

 అసలు యుద్ధం ఎందుకొచ్చింది?

అసలు యుద్ధం ఎందుకొచ్చింది?

18వ శతాబ్దం చివరివరకూ దక్కన్ ప్రాంతంపై పీష్వాలు అధికారం చెలాయించేవారు. 1802 నాటికి బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ దక్కన్ ప్రాంతంలోని మరాఠా పాలకులు(పూణేలోని పీష్వాలు సహా), గ్వాలియర్‌లోని సింధియాలు, ఇండోర్‌‌కు చెందిన హోల్కర్లు, బరోడాకు చెందిన గైక్వాడ్‌లు, నాగపూర్‌కు చెందిన భోన్సేలతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రాబడుల్లో వాటాలపై ఇరుపక్షాలకు మధ్య అవగాహన కుదిరింది. దీని ప్రకారం.. పాలకులు చాలామంది తమ భూయాజమాన్య హక్కు, రెవెన్యూ హక్కు, ఇతరత్రా సౌకర్యాలు వదులుకున్నారు. అయితే బాజీరావు పీష్వా-2 మాత్రం మొండికేశారు. రాబడుల్లో భాగం ఇవ్వడానికి ససేమిరా అన్నారు.

 ఖడ్కీ యుద్ధంలో పరాజయం పాలై...

ఖడ్కీ యుద్ధంలో పరాజయం పాలై...

ఒప్పందం ప్రకారం తమకు రావలసిన రాబడులను ఇచ్చేందుకు బాజీరావు పీష్వా-2 ససేమిరా అనడంతో ఈస్టిండియా కంపెనీ అధికారులు అతడిపై యుద్ధం ప్రకటించారు. 1817 నవంబరులో ఖడ్కీ వద్ద జరిగిన యుద్ధంలో బాజీరావు పీష్వా-2ను ఈస్టిండియా కంపెనీ ఓడించింది. దీంతో బాజీరావు పీష్వా-2 సతారాకు పారిపోయారు. అయినా ఈస్టిండియా కంపెనీ సైన్యం వదల్లేదు. జనరల్ స్మిత్ నేతృత్వంలో కంపెనీ సైన్యం చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా, బాజీరావ్ రకరకాల దారులు మారుస్తూ.. పూణే వైపు దారి మళ్లారు. దీంతో బాజీరావు పూణేపై దాడికి దిగొచ్చని ఈస్టిండియా కంపెనీ సైన్యం అనుమానించి, అతడొస్తున్న మార్గంవైపు తన సైన్యాల్ని పంపించింది. ఇరుపక్షాల సైన్యాలు కొరేగావ్ వద్ద ఎదురుపడడంతో యుద్ధం జరిగింది.

 పీష్వాలు, మహర్‌ల మధ్య గొడవలెందుకు?

పీష్వాలు, మహర్‌ల మధ్య గొడవలెందుకు?

ఆ రోజుల్లో దళితులైన మహర్‌లను అంటరానివారిగా చూసేవారు. మహర్‌లను సైన్యంలో నియమించుకునేవారు. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ కూడా అనేకమంది మహర్‌లను తన మరాఠా సైన్యంలో నియమించారు. ఆ తరువాత పానిపట్టు యుద్ధం సహా అనేక యుద్ధాల్లో పీష్వాల తరుపున కూడా మహర్‌లు పోరాడారు. అయితే బాజీరావ్ పీష్వా-2 హయాం వచ్చేసరికి.. మహర్‌లకు, పీష్వాలకు మధ్య వైరం మొదలైంది. తమను మరాఠా సైన్యంలో చేర్చుకోవాలని మహర్‌లు విజ్ఞప్తి చేసినా.. బాజీరావ్ పీష్వా ఒప్పుకోలేదు. అంతేకాకుండా, బాజీరావ్ పీష్వా హయాంలో మహర్‌లకు చాలా అన్యాయాలు జరిగాయి. ఇదే అదనుగా బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ పాలకులు మహర్‌లను తమ సైన్యంలో చేర్చుకున్నారు.

కొరేగావ్ యుద్ధంలో పగతీర్చుకున్నారా?

కొరేగావ్ యుద్ధంలో పగతీర్చుకున్నారా?

మహర్‌ల విషయంలో బాజీరావ్ పీష్వా-2 అత్యంత దారుణంగా వ్యవహరించేవారని చరిత్రకారులు కూడా చెబుతారు. ఆయన హయాంలో మహర్‌ దళితులకు చాలా అన్యాయాలు జరిగాయి. బాజీరావ్‌ చేతిలో అణచివేతకు గురైన మహర్‌ దళితులు కొరేగావ్ వద్ద జరిగిన యుద్ధంలో ఆయనపై ప్రతీకారం తీర్చుకున్నారని, బీమా కొరేగావ్‌ యుద్ధానికి ప్రాధాన్యం అందుకేనని దళిత మేధావులు, రచయితలు, కార్యకర్తలు చెబుతారు. కొరేగావ్‌లో నేలకొరిగిన దళిత సైనికుల పేర్లతో 1851లో అక్కడో స్మృతి చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేశారు. 49 మంది మహర్‌ దళిత సైనికుల పేర్లను ఆ రాతి చిహ్నంపై రాశారు. భీమా కొరేగావ్‌ యుద్ధం జరిగి 109 ఏళ్లు అయిన సందర్భంగా 1927 జనవరి 1వ తేదీన డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్‌ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. కొరేగావ్‌ యుద్ధాన్ని కులతత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరుగా అంబేద్కర్ అభివర్ణించారని కూడా అంటారు. అప్పట్నుంచి ఈ కొరేగావ్‌ యుద్ధ ఘటన మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.

 ఇప్పుడెందుకు గొడవలంటే...

ఇప్పుడెందుకు గొడవలంటే...

భీమా కొరేగావ్‌లో నాడు జరిగిన యుద్ధాన్ని సంస్మరించుకునేందుకు దళితులైన మహర్‌లు చేసిన ప్రయత్నమే ప్రస్తుతం గొడవలకు దారితీసింది. భీమా కొరేగావ్‌లో సంస్మరణ కార్యక్రమాన్ని అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసభ, హిందూ అగాదీ, రాష్ట్రీయ ఏక్తామాతా రాష్ట్రీయ అభియాన్‌ వంటి గ్రూపులు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది కుల సంబంధ సంస్మరణ అని, జాతి వ్యతిరేకతతో కూడుకున్నదని ఈ గ్రూపుల వాదన. అయితే తమ సంస్మరణ కార్యక్రమం ఏ కులానికీ, ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని, కొరేగావ్ యుద్ధం జరిగి 200 సంవత్సరాల పూర్తైన సందర్భంగా చేపట్టినదని, ఆ యుద్ధంలో అసువులు బాసిన దళిత సైనికుల ఆత్మశాంతి కోసం మాత్రమే నిర్వహించతలపెట్టినదనేది కార్యక్రమం నిర్వాహకుల వాదన.

English summary
Protests and violence gripped Maharashtra on 1 January 2018, after activists, some carrying saffron flags, attacked people gathered at Bhima Koregaon. One person died in the violence, many others were injured and over 40 vehicles were damaged. Dalits from all walks of life were in Bhima Koregaon, about 40 kms from Pune city, to commemorate a 200-year-old battle in which the Dalit-dominated British army defeated Peshwas in Maharashtra. The violence was sparked by a disagreement over whether the bicentenary of the 1818 Battle of Bhima-Koregaon, between the British East India Company and the Peshwa rulers of the Maratha Confederacy, should be celebrated or not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X