వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి వైపు సిపియం అడుగులు

By Staff
|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీతో స్నేహ పునరుద్ధరణకు సంబంధించి సిపియం కేంద్ర కమిటీ స్పష్టమైన సూచన ఇచ్చినట్లే కనిపిస్తోంది. సిపియం కేంద్ర కమిటీ సమావేశం గురువారం హైదరాబద్‌లోని జూబిలీహాల్‌లో ప్రారంభమైంది. కేంద్రంలో యుపిఎ ప్రభుత్వ విధానాలపై సమీక్షిస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును సిపియం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పెంపును వ్యతిరేకిస్తూ ఈ నెల 13వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని గురువారం సిపియం కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఈ ఆందోళనలో తెలుగుదేశం పార్టీని కలుపుకొని పోవాలని నిర్ణయించినట్లు సిపియం నేత నిలోత్పల్‌ బసు మీడియా ప్రతినిధులతో చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ, అస్సాం గణపరిషత్‌, తెలుగుదేశం పార్టీలతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు కూడా ఆయన వెల్లడించారు. ఇది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతో స్నేహాన్ని పునరుద్ధరించకోవడంలో సిపియం వేసి తొలి అడుగుగా భావించడానికి వీలుంది.

అదే సమయంలో సిపియంతో కలిసి పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా కలిసి ఉద్యమించాలని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దానికి తోడు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో స్థానిక స్థాయిలో వామపక్షాలతో సర్దుబాటు చేసుకుంటామని ఆయన కచ్చితంగా చెబుతున్నారు. దీన్ని బట్టి వామపక్షాల నాయకులతో, ముఖ్యంగా సిపియం నాయకులతో చంద్రబాబు ఇప్పటికే స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు అనుకోవడానికి వీలవుతోంది. ఇటీవల చిత్తూరు జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటూ హఠాత్తుగా చంద్రబాబునాయుడు కోల్‌కత్తాకు బయలుదేరి వెళ్లారు. స్నేహాన్ని పునరుద్ధరించుకునే విషయమై మాట్లాడేందుకే ఆయన వెళ్లినట్లు భావిస్తున్నారు.

జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఏర్పాటుకు చర్యలు ముమ్మరం కావచ్చు. ఇప్పటికిప్పుడు తృతీయ ఫ్రంట్‌ ఊహాజనితమేనని చంద్రబాబు అన్నారు. అయితే ఇందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నట్లు అర్థం చేసుకునే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా ఈ తృతీయని ఏర్పాటు చేయాలని తెలుగుదేశంతో పాటు సమాజ్‌వాదీ వంటి పార్టీలు ఆశిస్తున్నాయి.

యుపిఎ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వామపక్షాలకు మింగుడు పడడం లేదు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు విషయంలోనే కాకుండా విదేశాంగ విధానం విషయంలో వామపక్షాలు యుపిఎను వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా పెత్తనానికి కొమ్ము కాసే దిశలో యుపిఎ ప్రభుత్వం కదులుతోందని సిపియం నేత మధు విమర్శించారు. తమకు కాంగ్రెస్‌ మిత్రపక్షం కాదని, మతతత్వ పార్టీని అధికారంలోకి రానీయకుండా కాంగ్రెస్‌ కూటమికి మద్దతు ఇచ్చామని, అది ఎత్తుగడ మాత్రమేనని సిపియం నాయకుడు తమ్మినేని వీరభద్రం ఒక టీవీ చానల్‌ ప్రతినిధితో అన్నారు.

నిజానికి, ఒకే సామాజిక శ్రేణి నాయకత్వం దృష్ట్యా మొదటి నుంచీ సిపియం, తెలుగుదేశం పార్టీలు సన్నిహితంగా ఉంటూ వస్తున్నాయి. బిజెపితో చంద్రబాబు దోస్తీ కట్టడంతో వాటి స్నేహానికి గండి పడింది. ఈ స్నేహం ఎప్పుడు తెగిపోతే అప్పుడు తెలుగుదేశంతో చేతులు కలపడానికి సిపియం సిద్ధంగా ఉందనే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. తెలంగాణ అంశం కూడా ఈ రెండు పార్టీలు ఏకం కావడానికి ఒక కారణం కావచ్చు. ఈ రెండు పార్టీల నాయకత్వాలు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా పని చేయడం అసహజమేమీ కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్న తరుణంలో ఈ రెండు పార్టీల స్నేహానికి ప్రాధాన్యం చేకూరుతుంది. ఏమైనా పంచాయతీ ఎన్నికలు ఈ రెండు పార్టీల సాన్నిహిత్యాన్ని మరింత పెంచే విషయాన్నో, తెంచే విషయాన్నో స్పష్టంగా వెల్లడిస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X