వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దశాబ్దాల ద్రోహ చరిత్ర

By దుర్గం రవీందర్
|
Google Oneindia TeluguNews


ముల్కీ పోరాటానికి వందేళ్ల చరిత్ర ఉందని ప్రతి తెలంగాణవాది ఒకింత గర్వంగా మాట్లాడడానికి ఏ మాత్రం సందేహించడు. పైగా ఈ పాయింట్ మీద సుదీర్ఘ వాదానికి ఉద్యుక్తుడవుతాడు. ఒక విషయం మీదనే వందేళ్ల పోరాటం అన్నది గొప్ప విషయం ఎంత మాత్రమూ కాదు. పైగా చేతగానితనానికి నిదర్శనం. వ్యూహరాహిత్యానికి నిదర్శనం. అది ఉత్తుత్తి పోరాటం అనే అర్థం అందులో ఉంది.

ముల్కీ పోరాటం అయినా, తెలంగాణ పోరాటం అయినా ఇన్ని సంవత్సరాలు ఎందుకు సాగాలి. అదేమన్న భారత స్వాతంత్ర్య పోరాటమా. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి లేదా స్థానికులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల భాషలు ఒక్కటే అయినా వారి సంస్కృతులు వేరు, విశ్వాసాలు వేరు, మైండ్ సెట్ వేరు, చారిత్రక నేపథ్యం వేరు. కాబట్టి రెండు ప్రత్యేక రాష్ట్రాలుండాలన్నది తెలంగాణవారి డిమాండ్. పైగా తెలంగాణలోని భూమిని, జలాలను, భూగర్భ ఖనిజాలను యధేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు కాబట్టి మా రాష్ట్రాన్ని మాకు ఇవ్వాలని తెలంగాణవారు అడుగుతున్నారు.

ఎన్ని సంవత్సరాలుగా అడుగుతున్నారంటే.. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు నుంచి, అంటే 1956కు ముందు నుంచి వీరు అడుగుతూనే ఉన్నారు. వారు మీకేంది ఇచ్చేది అన్నట్లు వ్యవహరిస్తూనే ఉన్నారు. దీనికి కారణాలను లోతుగా విశ్లేషించుకోవడంలో తెలంగాణ ఉద్యమకారులు విఫలమవుతూనే ఉన్నారు.

ఒక ఉద్యమం యాభై ఏళ్లు అంటే అర్ధ శతాబ్దం పైగా రగులుతున్నది అంటే ఏమని అర్థం చేసుకోవాలి. ఉద్యమం బలహీనతగా మొక్కుబడిగానైనా సాగుతూ ఉండాలి లేదా ఉద్యమాన్ని ప్రతిఘటించే వారు ఉద్యమకారులకన్నా బలవంతులు, వ్యూహపరులు అయినా అయి ఉండాలి. ఉద్యమ ద్రోహులను ఉపేక్షించడం అయినా జరిగి ఉండాలి. లేదా ఉద్యమ నాయకులై ద్రోహులై ఉండాలి.

నిజంగా తరచి చూస్తే ఇలాంటి అన్ని కారణాలు కనిపిస్తాయి. ఆంధ్ర మీడియా వారు అంటున్నట్లు తెలంగాణ ఉద్యమం రాజకీయ నిరుద్యోగుల ఉద్యమంగా మారిందా. తరచి చూస్తే కొన్ని సార్లు అవుననే సమాధానం వస్తున్నది. ఇంద్రారెడ్డి చేసిన పని అదే కదా. జానారెడ్డి చేసిన పని అదే కదా. పాల్వాయి, ఉప్పునూతల తదితరులు చేసింది, చేస్తున్నది ఇంతే కదా. చిన్నారెడ్డి చేసిన తప్పుడు పని ఇదే కదా. అమోస్ లాంటి వారు చేసింది ఏమిటి. వీరు నిరుద్యోగులుగా ఉన్నప్పుడు వీరికి ఉద్యమం కావాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ జెండా ఎత్తడం, జనాలను ఉచ్కాయించడం, పదవి రాగానే సల్లబడటం... ఏమిటీ అన్యాయం.

ఇందులో చిన్నారెడ్డి సాబ్ తప్పు ఏమీ లేదు. నిరంతర ఉద్యమకారులుగా నిజాయితీపరులుగా పోజులు కొట్టే తెలంగాణ ఉద్యమకారులదే ఈ తప్పు అంతా. చిన్నారెడ్డికి చెక్ పెట్టడంలో, చిన్నారెడ్డిని ఎండగట్టడంలో ఉద్యమకారులు ఉదాసీన వైఖరి అవలంబించారు కాబట్టి, తెలంగాణ ఉద్యమానికి చిన్నారెడ్డి లాంటి వారు ద్రోహం చేయడానికి ఏ మాత్రం సందేహించలడం లేదు.

పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు చేస్తున్నదేమిటి. గతంలో తెలంగాణ పోరాట సమితి చేసింది ఏమిటి. భారతీయ జనతా పార్టీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని మోసం చేయలేదా. తెలంగాణ నినాదం మీద మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ పోరాట సమితికి నిండు మెజారిటీతో గెలిపించినా తెలంగాణ వారికి ఆయన చేసిన మోసం ఎంత నీచమైంది. ఆయనకు ఇందిరాగాంధీకి ఏం ఒప్పందం జరిగింది. ఆయనను బెదిరించిందో బులిపించిందో ఆశ పెట్టిందో... ఉద్యమానికి ఆయన బారి ద్రోహం చేశారు. అప్పుడు కూడా ఉద్యమకారులు, మేధావులు ఆయనను నిలదీయలేకపోయారు. జనుల ఆకాంక్షలను ఈ ఉద్యమ నాయకులు అడ్డంగా అయినకాడికి తాకట్టు పెడుతుంటే ఉద్యమకారులు తమాషా చూస్తూ కూర్చుంటున్నారు. అదేదో గొప్ప అన్నట్లు మేం ఆ రోజుల్లో (1969 - 70) ఉద్యమంలో పాల్గొన్నాం, 360 మందిని బలి ఇచ్చాం అని గర్వంగా చెబుతారేమి.

ఈ తతంగాన్ని, ద్రోహపూరిత చేతగానితనాన్ని చూసీ అమరుల ఆత్మలు ఏమని ఘోషిస్తూ ఉండి ఉంటాయి. చెన్నారెడ్డి చేసిన ద్రోహానికి అతన్ని ప్రతి మీటింగులో నిలదీయాల్సి ఉండింది. చెన్నారెడ్డి పట్ల ప్రదర్శించిన ఉదాసీన వైఖరి ఇప్పుడు చిన్నారెడ్డి పట్ల చూపుతున్నారు. ఉద్యమకాలంలో ఉర్దూ, తెలుగు భాషల్లో చెన్నారెడ్డి ఇచ్చిన ఉపన్యాసాలు ఏం చెప్పాయి. అందులో ఉన్న విషయమే పై పైరాలో ఉంది. 2004కు ముందు చిన్నారెడ్డి చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తున్నదేమిటి. చెప్పేదొకటి, చేసేదొకటి. అందుకే ఉద్యమం ఇలా నీల్గుతున్నది.

ఉద్యమకారులు చూపే ఉదాసీన వైఖరి చరిత్ర చూపదు. చెన్నారెడ్డిని, బూర్గులను తెలంగాణ ఉద్యమ ద్రోహులుగానే చరిత్ర నమోదు చేసింది. అది వేరే విషయం. మరి తెలంగాణ లోపలి వారి ద్రోహానికి, బయటి వారి దోపిడీకి ఇంకా ఎన్ని రోజులు బలి కావాలన్నది నేటి ఉద్యమకారుల ముందున్న ప్రశ్న.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X