వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి ఎఫెక్ట్: కమ్యూనిస్టులు

By కె. రవికిరణ్
|
Google Oneindia TeluguNews


ఫ్రంట్ కట్టే విషయంలో గతంలో చేసిన తప్పును ఈసారి చేయకూడదని రాష్ట్రంలోని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అనుకుంటున్నట్లు ఉన్నాయి. అందుకే చిరంజీవి రాజకీయ ప్రవేశాన్ని సిపిఐ, సిపియం ఆహ్వానిస్తుండడమే కాదు, చిరంజీవి పెట్టేబోయే పార్టీతో కలిసి పనిచేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి. స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టి ఎన్నికల బరిలోకి దిగినప్పుడు వామపక్షాలు సీట్ల సర్దుబాటు చేసుకోకపోవడాన్ని పెద్ద పొరపాటుగానే భావిస్తున్నట్లున్నాయి. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నికలకు దిగబోయే సమయంలో అప్పటి కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఎన్టీ రామారావుతో చర్చలు కూడా జరిపారు. కానీ చర్చలు ఫలవంతం కాలేదు. ఈ విషయాన్ని చల్లపల్లి జమీందారీ వ్యతిరేక పోరాటంలో చురుకైన పాత్ర నిర్వహించిన కావూరి కుటుంబరావు చెప్పారు. ఈ విషయాన్ని కావూరి సాంబశివరావు జీవితచరిత్ర రాసిన తెలుగు విశ్వవిద్యాలయం పీఆర్వో జె. చెన్నయ్య రికార్డు చేశారు.

సీట్ల సర్దుబాటు కుదరక వామపక్షాలు ఆ సమయంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోలేకపోయాయి. వామపక్షాలు 60 సీట్ల వరకు అడగ్గా ఎన్టీఆర్ 50 సీట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. తాను పెట్టిన పార్టీ 1984 ఎన్నికల్లో తన పార్టీ అంతగా ప్రభంజనం వీస్తుందని ఎన్టీఆర్ కూడా ఊహించి ఉండరు. అందుకే అన్ని సీట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చారని అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ అనూహ్య విజయం సాధించిన తర్వాత ఆ తర్వాతి ఎన్నికల్లో వామపక్షాలు అంతకన్నా తక్కువ సీట్లకు అంగీకరించవలసి వచ్చింది. తెలుగుదేశంతో పార్టీ ఎన్ని బేరసారాలు సాగించినా 50 సీట్లను అవి సాధించలేకపోయాయి. దీనికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికీ చింతిస్తూ ఉండి ఉంటాయి. అందుకే చిరంజీవి పార్టీ విషయంలో వామపక్షాలు ముందు నుంచే జాగ్రత్త పడుతున్నట్లు తోస్తున్నది.

ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో సిపిఐ చిరంజీవి పెట్టబోయే కొత్త పార్టీ విషయంలో మహా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నది. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం అవసరమని భావిస్తున్న సిపిఐ, సిపియం చిరంజీవితో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్ ల గుత్తాధిపత్యం నడుస్తోందని, వాటి గుత్తాధిపత్యాన్ని దెబ్బ తీయడానికి మూడో ప్రత్యామ్నాయం అవసరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అంటున్నారు. చిరంజీవి పార్టీ పాట్టి తగు విధానాలతో ముందుకు వస్తే కలిసి పనిచేస్తామని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అంటున్నారు. నిజానికి ఇరువురు నాయకులు గతంలో చిరంజీవితో మంతనాలు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి.

కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకున్న తర్వాత ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ముఖ్యంగా సిపియం తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్నట్లు కనిపించాయి. భూపోరాటాలు, తదితర పోరాటాల్లో ఇతర పార్టీలను కలుపుకుని నాయకత్వం వహించడానికి ప్రయత్నించాయి. అయితే తెలుగుదేశం పార్టీ వాటి అఖిల పక్ష చర్చలకు వస్తున్నట్లు కనిపిస్తూనే తన బల నిరూపణకు పోరాటాలను హైజాక్ చేస్తూ వచ్చింది. లోక్ సత్తా వ్యవస్థాపక అధినేత జయప్రకాశ్ నారాయణ కూడా అందుకే తెలుగుదేశం పార్టీపై గుర్రుగా ఉన్నారు. నిజానికి తెలుగుదేశం, లోక్ సత్తా, వామపక్షాలు కలిసి వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. వాటి రాజకీయ నాయకత్వ సామాజిక శ్రేణి దృష్ట్యా సాధ్యమయ్యేది అదే. అయితే తెలుగుదేశం పార్టీకి పోటీగా లోక్ సత్తాను ఒక బలమైన పార్టీగా ముందుకు తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అంతగా ఫలితాలు ఇస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఒక సామాజిక శ్రేణిలోని వైరుధ్యాల నేపథ్యంలో లోక్ సత్తా రాజకీయ పార్టీగా రూపం వేసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను నిలువరించి ఆ సామాజిక శ్రేణి ప్రయోజనాలను కాపాడుకోవడానికి చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశాన్ని ఆ నాయకత్వాలు ఆహ్వానిస్తున్నాయని అనుకోవాలి.

రాజకీయ నాయకత్వం కోసం ఉబలాటపడుతున్న బిసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లోని, వివిధ సంఘాల్లోని నాయకులను కలుపుకుని కొత్త కూటమిని కడితే మూడో శక్తిగా బలం నిరూపించుకోవచ్చుననే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రాహ్మణ, బిసి, ఎస్సీలకు చెందిన సామాజిక సంఘాల నాయకులు రాజకీయ ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఆ ఆశలు మోజులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ తాజాగా విజిఆర్ నారగోని నాయకత్వంలోని రాజ్యాధికార పార్టీతో అవగాహనకు వచ్చారు. సిపిఐతో కూడా మంతనాలు జరుగుతున్నాయని జయప్రకాశ్ నారాయణ చెప్పారు.

తెలుగుదేశం గానీ, కాంగ్రెస్ గానీ తెలంగాణ రాష్ట్ర సమితిని, ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిలువరించలేని స్థితిలో ఉన్నాయనే విషయం అన్ని గ్రూపులకు, వామపక్షాలకు ఇప్పటికే అర్థమైనట్లు ఉంది. దాన్ని నిలువరించడానికి అంతకన్నా బలమైన గాలి కావాలి. అది అన్ని విషయాలను పక్కకు తోసేసి ఏకైక అంశం మీద దృష్టి నిలిపేంతగా ఉండాలి. అందుకే సినిమా గ్లామర్ వైపు దృష్టి సారిస్తున్నారని అనుకోవాలి. చిరంజీవికి రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల వరద ఉంది. తిరుగులేని ఇమేజ్ ను ఆయన సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత అంత మాస్ ఇమేజ్ ఉన్న నటుడు చిరంజీవే. అంతేకాకుండా కాపునాడు ఏళ్ల తరబడిగా ఒక పొలిటికల్ బ్రేక్ కోసం ప్రయత్నిస్తోంది. కానీ ఇవి ఫలించడం లేదు. చిరంజీవి నాయకత్వం కోసం కూడా కాపునాడు ప్రయత్నిస్తోంది. బిసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సామాజిక గ్రూపులు చిరంజీవి పార్టీ పెడితే మద్దుతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే మాయావతి నాయకత్వంలోని బియస్పీ కూడా చిరంజీవి కోసం ప్రయత్నాలు చేస్తోంది. వామపక్షాలు, ఈ సామాజిక గ్రూపులు, కాపునాడు, లోక్ సత్తా కలిసి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ధీటుగా ఎదుర్కోనేంత బలం చిరంజీవి నాయకత్వం ఉపయోగపడుతుందని ఒక అంచనా కావచ్చు. అదే సమయంలో చిరంజీవి ఇమేజ్, సామాజిక న్యాయ నినాదం తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిని నిలువరించగలవని అనుకుంటూ ఉండవచ్చు.

తెలంగాణ అంశాన్ని తేల్చకపోతే తెలంగాణలో కాంగ్రెస్ కు చుక్కెదరువుతుందనే అంచనా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతతో, తాను చేపట్టిన పోరాటాలతో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఆకాంక్షను అధిగమించగలుగుతుందని చెప్పలేం. ఈ స్థితిలో చిరంజీవి నాయకత్వంలోని కూటమి మాత్రమే అన్నింటికి విరుగుడుగా వామపక్షాలు భావిస్తు ఉండి ఉంటాయి. ఈ నూతన చారిత్రక సందర్భంలో పొరపాటు చేయకూడదనేది, అందుకే చిరంజీవిని ఆహ్వానించి కూటమి కట్టాలని అవి తహతహలాడుతూ ఉండి ఉంటాయి. మొత్తం మీద, చిరంజీవి నాయకత్వంలో అన్ని పిట్టలను ఒకేసారి కొట్టవచ్చునని అవి భావిస్తున్నాయని అనుకోవాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X