వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ - ఇంటిదొంగలు

By దుర్గం రవీందర్
|
Google Oneindia TeluguNews

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు నుండే ఉంది. 1956కు ముందు ఎప్పుడో పుట్టిన ఉద్యమం అలసట లేకుండా ఇంకా ఇంకా 2007నాటికి కూడా కొనసాగుతున్నది. దీన్ని 2009 వరకు పొడిగించి పబ్బం గడుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి అనుకుంటున్నది. కాంగ్రెస్ దీన్ని సతతం హరితంగా ఉంచుదామనుకుంటున్నది. తెలుగుదేశం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ససేమిరా అంటున్నది. సిపిఎం దానికి వంత పాడుతున్నది. సిపిఐ గోడ మీద పిల్లిలా కూర్చున్నది. బిజెపి తొడ చరిచి మేమే తెలంగాణ తెస్తాం అని అంటున్నది. మావోయిస్టులు ఉద్యమం ద్వారానే తెలంగాణ వస్తుందని అంటున్నది. ఇందులో ఎవరి లెక్కలు వారికున్నాయి. నాటి నుండి వారికి ఉన్నాయి. నాటి నుండి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడినప్పుడల్లా కొందరు ఆ ఉద్యమ ఉధృతిలో పడికొట్టుకుపోగా, మరికొందరు శవాల మీద ఆభరణాలు ఒలుచుకునే దుష్ట ద్రోహులు అందలాలు ఎక్కుతున్నారు.

ఆ ఉద్యమం నడుస్తున్నప్పుడు చందాలు వసూలు చేసి తినేసి జనం అప్పుడు ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. అలాంటి అల్పస్థాయి మనుషుల గురించి చర్చ అనవసరం. వీరిది నక్కల మనస్తత్వం. అదిలిస్తే బెదురుతారు. అదును దొరికితే అందినంత తినేస్తారు. వీరి వల్ల ఉద్యమానికి పెద్దగా నష్టం ఏమీ ఉండదు. కానీ నాయకులుగా గుర్తింపు పొంది, అసలైన సమయంలో అధికారం కోసం ఊసరవెల్లుల కన్నా త్వరగా రంగులు మార్చే వారితోనే తెలంగాణ తల్లి శోకం ఆగని పరిస్థితి ఏర్పడింది. ఈ ఉద్యమ ద్రోహులు ఎప్పుడూ కూడా శిక్షింపబడటం లేదు. ఇలా శిక్షింపబడకుండా అందలాలు ఎక్కినవారిని తెలంగాణవారిని కొందరిని గుర్తించి ఎండగట్టడంలో వర్తమాన ఉద్యమకారులు ఎందుకో ఉదాసీనంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో కొత్తవారు ద్రోహచింతన చేయడానికి వెరపు చెందడం లేదు. లగడపాటి రాజగోపాల్ పట్ల చూపిన ఆగ్రహం లాంటి దాన్నే ఇంటి దొంగల పట్ల ఎందుకని చూపరు. ఉద్యమాల అండతో అందలాలు ఎక్కి అధికారాన్ని అనుభవించిన వారిని ఎందుకని ఉతికి ఆరేయరు.

ఉద్యమం ఎగిసిపడి ఆగిన ప్రతిసారీ ఆంధ్రులు, సీమవారు లక్షలాదిగా తెలంగాణకు తరలివచ్చారు, వస్తున్నారు. ఇక మమ్మల్ని అడిగేవారెవరూ అన్నట్లు ప్రవర్తించారు. ఉన్న బెరుకును, భయాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ మరింత కుదురుకుంటున్నారు. తెలంగాణను అన్ని వైపుల నుండి కుమ్ముతున్నారు. అందరూ కలిసి ఇక్కడి సంస్కృతిని, చరిత్రను నీచపరుస్తున్నారు. ఇక్కడి వారి అవకాశాలను కొల్లగొడుతున్నారు. తిమ్మిని బమ్మిని చేసి, జి.వోల మాయతో మాటల గారడీ చేసి తెలంగాణవారిని అవులగాళ్లను చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పాటకు తెలంగాణ గాడిదలు వంత పాడుతున్నాయి. ఇవే గాడిదలు ఇవతలికి వచ్చి వేరే రాగంలో సకిలిస్తుంటాయి, ఊలపెడుతుంటాయి. ఇలాంటివారిని గుర్తించడానికి నిజమైన ఉద్యమకారులు ఎప్పుడు అప్రమత్తులై ఉండాల్సిందే.

2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితితో జత కట్టి తెలంగాణలో విజయం సాధించింది. సాక్షాత్తు సోనియా గాంధీతో సహా వైయస్ తదితరులందరూ తెలంగాణా కండువాను వేసుకుని తెలంగాణలో ప్రచారం చేశారు. జనాలను నమ్మించారు. నమ్మించి మోసం చేసినవారిని ప్రజాస్వామ్య పరిభాషలో ఏమనాలి. వారిని ఎలా దండించాలి. ఎవరు దండించాలి. ఎన్నికలకు ముందు లేని రెండో ఎస్సార్సి మాటను ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు. వైయస్ రాయలసీమ వ్యక్తి. కడప జిల్లా పులివెందుల నుండి గెలిచారు కాబట్టి ఆయన సమైక్యరాగం ఆలపించడాన్ని పెద్ద తప్పు అనలేం. ఇక్కడే పుట్టి పెరిగి రేపు ఇదే మట్టిలో కలవాల్సిన గౌరవ శాసనసభ్యులు, మంత్రులు చిన్నారెడ్డి, డి. శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, జీవన్ రెడ్డి, జానారెడ్డి, సురేష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, జైపాల్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులను ఏమనాలి. వీరు చరిత్ర చెత్తబుట్టలో ఏ మూల ఇరుక్కుంటారు. భవిష్యత్ తరాలకు ఏమని సమాధానం చెప్తారు. వీరితో పాటు అధికారాన్ని పంచుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఏమని వివరణ ఇస్తుంది. మళ్లీ అధికారం వస్తుందో రాదోనని అధికారాన్ని అందినకాడికి అనుభవిద్దామని నీచ మనస్తత్వంతో తెలంగాణ కాంగ్రెస్ లోని రెడ్డి, బిసీ నాయకులు కక్కుర్తి పడుతున్నారు. తెలంగాణ అంటే శివమెత్తి ఊగిపోయే కెసిఆర్, నరేంద్రలు తెలంగాణ పేరుతో కేంద్రమంత్రులయ్యారు. రాష్ట్రంలోనూ అధికారాన్ని పంచుకున్నారు. వారి వల్ల ఉద్యమం ఎంత ముందుకు వెళ్లింది. అందరు కలిసి దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు చేస్తున్నారు. ఆ తల్లి శోకాన్ని మరింత పెంచుతున్నారు, పొడిగిస్తున్నారు.

ఒక ఉద్యమం యాభై ఏళ్లుగా కొనసాగుతున్నదంటే దాన్ని ఏమనాలి. ఉద్యమ సిద్ధాంతం, ఉద్దేశం, నిర్మాణం, నినాదాల్లో బలం తక్కువైనా ఉండాలి. లేదా ఉద్యమ నాయకులు వ్యూహం లేనివారైనా అయి ఉండాలి. ఉద్యమ తాత్విక భూమికైనా బలహీనంగా ఉండి ఉండాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండులో పసనైనా లేకండా ఉండాలి. ఇవన్ని ఉన్నా కూడా ఉద్యమం విఫలమవుతున్నదంటే ఇంటి దొంగలు కొందరు అమ్ముడు పోతూ పాలు తాగిన రొమ్మునే గుద్దుతున్నారని అనుకోవాలి. అలాంటి ఉద్యమ ద్రోహుల వల్ల నాయకుల అమ్ముడు పోయే ధోరణి వల్ల ఉద్యమకారులు ప్రతిసారీ ఓటమి చెందుతున్నారు. నాయకులే ద్రోహులుగా మారి ఉద్యమాగ్నిపై నీళ్లు చల్లి వేడిని తగ్గిస్తున్నారు. దీన్ని గుర్తించే ఒడుపు, వారిని ఎండగట్టే సామర్థ్యం వర్తమాన ఉద్యమకారులకు ఉండడం లేదు. వీరిది బొలెడంత ఆవేశం, కొంత ఆచరణ, పిసరంత ఆలోచన. నాయకుడు ఏది చెబితే అది విని అంతెత్తు ఎగిసిపడటం, నాయకత్వం ప్రలోభానికి గురికావడం ప్రతిసారీ తెలంగాణ ఉద్యమానికి ప్రతిబంధకాలు అవుతున్నాయి. దీంతో తెలంగాణ తల్లి శోకం ఆనాటి నుండి తీరడం లేదు.

ఉద్యమకారుల మధ్య ఐక్యత లోపిస్తున్నది. దీనికి తోడు ప్రధాన రాజకీయ పార్టీల ఉద్దేశాలు సందర్భాన్ని బట్టి మారుతున్నాయి. ఉద్యమకారుల్లో ఓ స్థాయి నాయకులు ఐడెంటిటీ క్రైసిస్ లో పడి రకరకాల వేదికలకు, కమిటీలకు కారకులై ఉద్యమాన్ని చీలికలు పేలికలు చేస్తున్నారు. 2007నాటికి దాదాపు వంద దాకా తెలంగాణ ఉద్యమ సంస్థలు ఏర్పడ్డాయి. కొంచెం ఆలోచన, మరికొంత సామర్థ్యం ఉన్న ప్రతి ఉద్యమకారుడు ఒక వేదికను ఏర్పాడు చేస్తున్నాడు. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేని కొందరు ఉదారులు వీరికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఒకటి రెండు కార్యక్రమాలు చేయడం, తమ ద్వారానే తెలంగాణ వస్తుందని కలలు కనడం, ఆవిష్కృతమయ్యే నూతన తెలంగాణకు తనే కర్తను అయినట్లు, ఆ కలలకు రంగులు అద్దుకోవడంతోనే వారి పని సరిపోతున్నది. ఈ క్రమంలోనే ప్రధాన రాజకీయ పార్టీలలోని అసంతృప్త, అవకాశవాద నాయకులు కొందరు తెలంగాణవాదులను ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడే నక్సలైట్ పార్టీలు వచ్చి అసలు ఉద్యమం నడపాల్సి మేము కదా అని అనుకుంటూ ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో మేధావులుగా మాస్కులు తగిలించుకున్న కొందరు ఉద్యమ సంస్థల్లో చెరి పబ్బం గడుపుకోవడం పరిపాటి అవుతున్నది. రకరకాల అస్పష్టలతో జానెడు లోతున్న నీటి మడుగులను పోలీన సిద్ధాంతకర్తలు తాము సముద్రమంత లోతైనవారమని భ్రమిస్తూ బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో కవులు, అసలు మేము కదా ఉద్యమానికి ఊపిరులూదాల్సినవారమని వీరంగం వేస్తున్నారు. కవులది ఏముంది పాటలు, కవితలు రాసి పారేస్తారు. అసలు మేం లేనిది ఉద్యమమే లేదని పాటలు పాడే గాయకులు రకరకాల గళాలు ఎత్తుతున్నారు. పై వారంతా వేస్ట్, అసలు మేం ఉద్యమానికి మూలం, సంధానకర్తలం అని పాత్రికేయులు ఉద్యమిస్తూ కలాలు మడిచి గళాలకు పని కల్పిస్తున్నారు. పైన వివరించిన ప్రతి సెక్షనులోను రకరకాల రాజకీయ పార్టీల ఐడియాలజీలు ఉన్నవారు ఉంటారు. అందరిలోకి మేమే బెస్ట్ అంటూ నక్సలైట్లు తమకు తామే పెద్ద పీట వేసుకుంటారు. అన్ని రకాల ఉద్యమ పాయలను తమలో విలీనం చేసుకుని తామే అసలు సిసలైన ఉద్యమ నాయకులం అనే యత్నాలు నిరంతరం చేస్తుంటారు. మళ్లీ ఇక్కడ వర్గాలు, కులాల గొడవలు. బ్రాహ్మణ, దళిత, బీసీ వాదాలు తలెత్తుతాయి.

నిజానికి రాజ్యం, రాజ్యాధికారం రుచి మరిగిన అసలైన కులాలు వేరే ఉన్నాయి. ఉద్యమాన్ని వీరంతా కలిసి పెళ్లి కూతురిలా సింగారిస్తే అసలు ముహూర్తానికి వారు బయలుదేరి ఎగిరేసుకుపోతరు. గతంలో అనేక స్థల, కాలాల్లో ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో జరిగాయి. గతంలోంచి గుణపాఠాలు నేర్చుకున్నట్లే బుద్ధిమంతుల్లా తెలివితో ఉంటూనే అసలు సమయంలో వెర్రితనంతో గుడ్డిగా నమ్మడం సాధారణ ఉద్యమకారుల వంతు అవుతుంది. పైగా గొర్రె కసాయివాడిని నమ్మినట్లు ఉద్యమకారులు బయటి నాయకుడి కోసం ఎదురుచూసి చూసి అతడిని ఆహ్వానించి అతడినే నమ్ముతారు. అతను చెన్నారెడ్డి కావచ్చు, అంతకుముందు బూర్గుల రామకృష్ణారావు కావచ్చు, ఇప్పుడు కెసిఆర్ కావచ్చు, నిన్న చిన్నారెడ్డి కావచ్చు, మొన్న మల్లికార్జున్ కావచ్చు, ఆమోస్ లు కావచ్చు.

ఇప్పుడు పరిస్థితి ఏమిటి. సోషలిస్టులు, మావోయిస్టులు, మాజీ కమ్యూనిస్టులు, మేధావుల చేతుల్లో ఇరుక్కుని పలు పాయలుగా ఉద్యమాలు నడుస్తున్న ఈ రోజు వాటి తీవ్రత తగ్గింది. మళ్లీ దీంట్లోనూ వర్గాలున్నాయి. కులాలున్నాయి. వీరందరూ కలిసి రాజధానిలో దాదాపు ఐదు వందల మంది వరకు ఉంటారు. జిల్లాలో ఓ వెయ్యి మంది ఉండి ఉంటారు. వీరిలో వీరికి కూడా అనేక విమర్శలు, వైరుధ్యాలు ఉన్నాయి. చాలా సంస్థలు లెటర్ హెడ్స్ కు పరిమితమయ్యాయి. నిధలు లేమితో, వ్యూహ రాహిత్యంతో అన్ని సంస్థలూ ఇబ్బంది పడ్తున్నాయి. సిద్ధాంతపరమైన స్పష్టత లోపిస్తున్నది. గాఢత తగ్గుతున్నది. ఉన్న సిద్ధాంతకర్త ఆయనకు ఆ పేరు ఎవరు పెట్టారో గాని ఒక రాజకీయ పార్టీకి పరిమితమైపోయారు. మేధావులు కొందరు ఆ గొడుగు కిందికే చేరారు. రచయితల్లో శిబిరాలు ఎక్కువయ్యాయి. పాటగాళ్ల గుంపులు పెరిగాయి. జర్నలిస్టుల్లో ఐక్యత లేకుండా పోయింది. అన్ని రంగాల్లో నాయకులు ఎక్కువయ్యారు. నిజమైన సమర్థ నాయకత్వం తక్కువగా ఉంది. దేవేందర్ గౌడ్, మధుయాష్కీ గౌడ్, జనార్దన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి , బిజెపివారు, కాంగ్రెసులోని తెలంగాణవాదులకు చివరికి నక్సలైట్లకు కూడా తెలంగాణ కన్నా రానున్న 2009 ఎన్నికల ఈక్వేషన్స్ ప్రధానం అయ్యాయి.

కాని రాజ్యతంత్రమెరిగిన వారు అసలు విషయాన్ని అర్థం చేసుకుంటూ చిద్విలాసంగా పైన కూర్చుని సమయం కోసం, పాచిక వేయడం కోసం కాచుకుని ఉన్నారు. చిత్రంగా వారి పాచిక వారి మాటను వింటుంది. కావాలన్నట్లుగా పడుతుంది. శకుని పాచిక కన్నా విశ్వాసపాత్రమైంది అది. వారు పాచికలు వేయడం ఇంకా మొదలు పెట్టలేదు. పాచికలు వారి మాటలు వింటాయి కాని వారు పావులు కడపడంలో పొరపాటు చేస్తారు. అలాంటప్పుడు పరిస్థితులు వారి చేతుల్లో ఉండకపోవచ్చు. ఆ సందిగ్ధ, సంకట సమయంలో ఎవరు సరియైన నిర్ణయం తీసుకుంటారో వారే విజేతలు అవుతారు, లబ్ధి పొందుతారు.

అసలైన తెలంగాణ ఆట ఇంకా మొదలు కాలేదు. ఉద్యమం పేరుతో ఇప్పుడు ఉద్యమకారులు స్పేడ్ వర్క్ (పారపని) చేస్తున్నారు. వీరంతా నేలను పారతో చెక్కి చదును చేసి గీతలు గీసి గ్రౌండు సిద్ధం చేస్తే అసలు ఆటగాళ్లు వచ్చి ఆట ఆడుతారు. ఆ ఆటగాళ్లు సోనియా గాంధీ కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, వీరప్ప కావచ్చు, లోక్ సత్తా కావచ్చు. ఆటగాళ్లు వారే, రెఫరీ వారే కావచ్చు. వారు ఏ అవతారం ఎత్తినా ఎవరూ ఆశ్చర్యపోవద్దు. వీరిలో కొందరు రెండు వైపుల ఆటను తామే ఆడగల సామర్థ్యం ఉన్నవారు. వారు ఎలా కావాలంటే అలాగే ఫలితం ఉంటుంది. ఇప్పుడు రెఫరి, ప్లేయర్ రెండూ సోనియాగాంధీయే. ఎఐసిసియే. వ్యూహాత్మకంగా కాంగ్రెస్ వారికి లాభం కలుగుతుంది. కాంగ్రెస్ వారు ఇవ్వాలి అనుకుంటే ఒక్క కలం పోటుతో తెలంగాణను ఆవిష్కరిస్తారు, లేదంటే అప్పుడు 365 మందిని చంపినట్లు ఇప్పుడు అవసరమైతే 3600 మందిని చంపి అయినా సరే రాష్ట్రాన్ని, దేశాన్ని సమైక్యంగా ఉంచేస్తారు. అంతేకాని తెలంగాణ ఉద్యమకారుల తాలూకు చప్పుళ్లకు బెదిరి కాంగ్రెస్ వారు తెలంగాణను ఏర్పాటు చేయరు. తెలంగాణ ఇవ్వడం ద్వారా తమకే పూర్తి లాభం తమకే ఉంటుందని కాంగ్రెస్ వారు భావించాలి. రాష్ట్రంలోని 42 పార్లమెంటు సీట్లకు గాను కనీసం 40 సీట్లు తమకే వస్తాయని అనుకోవాలి. ముఖ్యంగా ఎఐసిసి, సోనియా గాంధీ దీన్ని గుర్తించాలి. జాతీయ స్థాయిలో ఒక నలబై పార్లమెంటు సీట్లు రావడం సాధారణ విషయం కాదు. తెలంగాణ ఇవ్వకపోతే పరిస్థితి పూర్తి వ్యతిరేకంగా మారవచ్చు. మారిన స్థితిలో కాంగ్రెస్ పరిస్థితి కేంద్రంలో అత్యంత దయనీయంగా ఉంటుండి. భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తే కాంగ్రెస్ వారు ఢిల్లీలో కేరాఫ్ ఫుట్ పాత్ అడ్రసులోకి మారిపోయే స్థితి ఏర్పడవచ్చు. ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ మూడవ పెద్ద పార్టీగా అవతరించింది. అది రెండో స్థానంలోకి వస్తే కాంగ్రెస్ అనివార్యంగా మూడవ స్థానంలోకి రావాల్సిందే.

ఏది ఏమైనా రాజశేఖర రెడ్డికి తెలంగాణ ఇవ్వడం అసలు ఇష్టం ఉండదు. అధికారాన్ని వజ్ర ఖచిత బంగారు పళ్లెంలో పెట్టి చంద్రబాబుకు అయినా ఒప్పుకోవచ్చు కానీ తెలంగాణ ఏర్పాటుకు ఆయన సరే అనకపోవచ్చు. తెలంగాణను ఇవ్వడం ద్వారా చంద్రబాబును ఇటు తెలంగాణలో జీరో చేయవచ్చు. అటు ఆంధ్రలో కాపులకు బీసీ హోదాను ఇచ్చి వారిని కలుపుకుంటే ఆంధ్రాలోను అత్యధిక స్థానాలు సాధించవచ్చు. రాయసీమలో సరేసరి, రాజశేఖర రెడ్డి బలంతో అధిక స్థానాలు సాధించవచ్చు. అలా ఇక్కడ అత్యధిక స్థానాలు సాధించడంతో పాటు ఏర్పడే రెండు కొత్త రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావచ్చు. అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తుకు సై అని తెలంగాణలో వారికి ఎక్కువ శాసనసభా స్థానాలు ఇచ్చి పార్లమెంట్ స్థానాలను కాంగ్రస్ ఎక్కువ తీసుకోవచ్చు. వీలైతే రెండు మూడో కేంద్ర మంత్రి పదవులు తెరాసవారికి ఆఫర్ చేయవచ్చు. ఈ ఆటలో సిపిఐ, మజ్లీస్ కాంగ్రెస్ తో కలవడానికి ఎలాగు సిద్ధంగా ఉన్నాయి.

అలా తెలంగాణలో ఆంధ్రలో ఒకటి రెండు మినహా మొత్తం పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవచ్చు. అలాగే చంద్రబాబును కూడా కోలుకోని రీతిలో దెబ్బ తీయవచ్చని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తే తెలంగాణ సాధ్యం అవుతుంది. లేకపోతే 2009కి గాని, ఆ తర్వాత గాని తెలంగాణ ఏర్పడే అవకాశమే లేదు. లేదు గాక లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X