• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కెసిఆర్ పై మరో తిరుగుబాటు?

By Staff
|

K Chandrasekhar Rao
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు వ్యతిరేకంగా పార్టీలో మరో తిరుగుబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యం నేపథ్యంలో తిరుగుబాటుకు పునాదులు పడినట్లు చెబుతున్నారు. తెరాస ఎన్నికల ఎత్తుగడలు, కెసిఆర్ వ్యవహార శైలి నచ్చని నేతలు తిరుగుబాటుకు సన్నాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొంత మంది నాయకులు ఈ మేరకు రహస్య సమావేశం జరిపినట్లు చెబుతున్నారు. ఈ తిరుగుబాటుకు ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ సారథ్యం వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రవీంద్రనాయక్, ప్రకాష్, ఎ. చంద్రశేఖర్ తదితరులు రహస్య సమావేశం ఏర్పాటు చేసి కొత్త సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన విజయరామారావు కూడా ఈ సమావేశానికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే తనకు ఈ సమావేశం గురించి తెలియదని, తనకు పార్టీ నుంచి వెళ్లే ఉద్దేశం లేదని విజయరామారావు అంటున్నారు.

ఎన్నికల్లో తెలుగుదేశం, సిపిఎం, సిపిఐలతో కలిసి మహా కూటమిని ఏర్పాటు చేసి పోటీ చేసిన తెరాస కేవలం 10 శాసనసభా స్థానాలను, 2 లోకసభ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. పైగా, హంగ్ పార్లమెంటు వస్తుందని అంచనా వేసిన కెసిఆర్ ఎన్డీయె ప్రభుత్వ ఏర్పాటుకు ఎక్కువ అవకాశాలున్నాయని అంచనా వేశారు. దీంతో ఫలితాల వెల్లడికి ముందే ఎన్డీయెతో జత కట్టారు. అయితే కెసిఆర్ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. యుపిఎకు పూర్తి మెజారిటీ వచ్చింది. రాష్ట్రంలో తిరిగి కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది. ప్రస్తుత తరుణంలో ఎన్నికల ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక కలగానే మిగిలే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో కెసిఆర్ పై తిరుగుబాటుకు పార్టీలో బీజాలు పడ్డాయి.

కెసిఆర్ కు వ్యతిరేకంగా దిలీప్ కుమార్ తదితర నేతలు శుక్రవారం కళింగ భవన్ లో సమావేశమవుతున్నట్లు సమాచారం. తెలంగాణ విమోచన ఉద్యమ కమిటీని ఈ సమావేశంలో ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. అయితే తాను నమ్మి దగ్గరకు తీసుకున్నవాళ్లే తనకు వ్యతిరేకంగా తయారు కావడం కెసిఆర్ కు అలవాటుగా మారింది. ఆయన కొంత మంది నాయకులను, మేధావులను మాత్రమే నమ్మి ఉద్యమాన్ని నడిపిస్తున్నారనేది నిజం. తొలుత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఉప ఎన్నికల వరకు కెసిఆర్ తోనూ, తెరాసతోనూ సంబంధం లేకుండా తటస్థంగా ఉన్న మేధావులు తెరాస విజయం కోసం పని చేస్తూ వచ్చారు. ఆ లెక్కన స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఉప ఎన్నికల వరకు గల పరిణామాన్ని చూస్తే ఆ తటస్థ మేధావుల కార్యాచరణ తగ్గుతూ వచ్చింది. ఈ ఎన్నికల్లో వారి పాత్ర ఏ మాత్రం లేదు.

వరుస అపజయాలను చవి చూస్తున్నప్పటికీ, తాను నమ్మినవారే తనపై తిరుగుబాటు చేస్తున్నప్పటికీ కెసిఆర్ ఈ తటస్థ మేధావుల గొంతును వినడానికి ఏ మాత్రం సిద్ధపడడంలేదు. పిడికెడు మంది రచయితలను, మేధావులను పక్కన పెట్టుకుని వారినే తెలంగాణ రచయితలుగా, తెలంగాణ మేధావులుగా చెబుతూ వస్తున్నారు. ఉప ఎన్నికల్లో వైఫల్యం తర్వాతనైనా తటస్థ మేధావుల గొంతు వినడానికి ప్రయత్నిస్తారని భావించారు. కానీ అది జరగలేదు. కెసిఆర్ నుంచి గానీ ఉద్యమం నుంచి గానీ స్వప్రయోజనం ఆశించని రచయితలు, మేధావులకు ప్రాపకం కోసం తెలంగాణ భవన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, కెసిఆర్ ప్రాపకం సంపాధించినవారి యుక్తులతో పోటీ పడి అక్కడికి చేరడానికి సిద్ధంగా లేరని కెసిఆర్ గుర్తించడం లేదు. ఇటు కెసిఆర్ పై తిరుగుబాటు చేసేవారు కూడా బలమైన ఉద్యమాన్ని నిర్మించలేకపోవడానికి ఈ తటస్థ మేధావులను, రచయితలను నిష్క్రియా పరులను చేయడమే కారమని గుర్తించడం లేదు. దాన్ని గుర్తించనంత వరకు తెలంగాణ ఉద్యమం కొద్ది మంది చేతిలో ఒక ఆట వస్తువు మాత్రమే అవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X