వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేల విడిచి సాము

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు నేల విడిచి సాము చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నికల ద్వారా సాధిస్తానని చెబుతూ వస్తున్న ఆయన ఆ ఎన్నికల ప్రక్రియను కూడా సరిగా వాడుకోవడం లేదనేది అర్థమవుతోంది. తాజా ఎన్నికల్లో ఆయన అనుసరించిన పద్ధతి ఆయనపై అనుమానాలను తీవ్రం చేస్తున్నాయి. పార్టీ అంటే తాను, తానంటే పార్టీ అనే పద్ధతిలో వ్యవహరిస్తూ అందరినీ ఆయన విస్మరిస్తున్నారు. ఆయనకు తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ద్వితీయమైన, రాజకీయ మనుగడే ముఖ్యమని ఈ ఎన్నికల ద్వారా తేలిపోయిందని అంటున్నారు.

కెసిఆర్ వైఖరిపై పార్టీలో పెద్ద యెత్తున తిరుగుబాటు మొదలైంది. ఇటువంటి తిరుగుబాటు ఇంతకు ముందు లేదు. ఇంతకు ముందు జరిగిన తిరుగుబాట్లన్నీ వ్యక్తుల పేరు మీద వెళ్లిపోయాయి. కానీ ఈసారి వ్యవస్థీకతంగా ఆయనపై తిరుగుబాటు జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. క్రమక్రమంగా ఆయన మేధావుల మద్దతు కోల్పోయారనేది స్పష్టమవుతోంది. ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ మాత్రమే కాకుండా పలువురు నేతలు ఆయనపై తిరుగుబాటు ప్రకటించి సమాంతర ఉద్యమం నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రయత్నాలు జరిగి అవి నడుస్తున్నాయి.

తెలంగాణలో తటస్థ మేధావుల మద్దతు కోల్పోతున్న కొద్దీ తెరాస ఎన్నికల ఫలితాల్లో వెనకబడుతూ వస్తోంది. తన చుట్టూ చేరిన వారికే ఆయన తెలంగాణ మేధావులుగా, తెలంగాణ రచయితలుగా గుర్తింపు ఇచ్చి తన పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి, దాన్ని గుణాత్మకంగా నడిపిన మేధావులు గానీ రచయితలు గానీ వారు ఇప్పుడు కెసిఆర్ వెంట లేరు. చాలా మంది నిష్క్రియాపరులు కావడమో, ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలతో చేతులు కలపడమే జరిగిపోయింది.

తెరాస విజయం కోసం గత ఎన్నికల్లో కెసిఆర్ తో ముఖ పరిచయం లేని మేధావులు, రచయితలు స్వచ్ఛందంగా పని చేశారు. వారి సంఖ్య కాలం గడుస్తున్న కొద్దీ తగ్గిపోతూ వస్తోంది. కెసిఆర్ మీద అపనమ్మకం, ఆయన చుట్టూ చేరిన వారి పెత్తనం చాలా మందిని ఉద్యమానికి దూరం చేసింది. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే మధ్యతరగతి మేధావుల మద్దతు కోల్పోయిన విషయాన్ని కెసిఆర్ గమనించడం లేదు. గ్రామీణ పేదలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది అంత ముఖ్యం కాదని, మధ్యతరగతి మేధావులకే ఆ ఉద్యమం అవసరమని, మధ్యతరగతి మేధావులే తెలంగాణ ఉద్యమంలో ప్రజాభిప్రాయాన్ని సమీకరించే శక్తి అని ఆయన గుర్తించడం లేదు.

వాస్తవాలను విస్మరించి, పొత్తులతో సీట్లు సాధించి బేరసారాలకు దిగాలనే ఆయన ఎత్తుగడలు ఇక ఫలించే అవకాశం లేదు. ఆయన కుటుంబ సభ్యుల పెత్తనం, వందిమాగధుల వ్యవహారాలు తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చే పరిస్థితిని తెచ్చిపెట్టాయి. తెలంగాణ ఉద్యమ నేతగా కెసిఆర్ క్రమక్రమంగా తన ప్రాబల్యాన్ని కోల్పోతున్నారు. ఇప్పటికైనా ఆయన కళ్లు తెరవకపోతే కష్టమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X