వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నడిపించెడి వాడు కెవిపి

By Staff
|
Google Oneindia TeluguNews

KVP Ramachandar Rao
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి లాబీ ఇప్పుడు ఆయన ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచంద్ర రావుపైనే ఆశలు పెట్టుకుంది. చక్రం తిప్పేది ప్రస్తుతం కెవిపియే. ఆత్మీయ మిత్రుడిని కోల్పోయిన బాధను దిగమింగుతూ ఆయన మిత్రుడి లాబీ ప్రయోజనాలను కాపాడాల్సిన పరిస్థితిలో పడ్డారు. ఆ లాబీ ప్రయోజనాలు దెబ్బ తినకూడదంటే వైయస్ కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అనేది అత్యంత కీలకమైన విషయం. అందుకే వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఒక వర్గం మొత్తం ఇప్పుడు ఒకే గొంతును వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా బేషరతుగా వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డితో నేదురమల్లి జనార్దన్ రెడ్డికి పడకపోవడమనేది బహిరంగ రహస్యం. నేదురమల్లి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసమ్మతి రాజకీయాలకు వైయస్ రాజశేఖర రెడ్డి కేంద్రంగా ఉండేవారు. ఈ విషయం ఆయనకు తెలియంది కాదు. కానీ, వైయస్, నేదురుమల్లి వర్గాల ప్రయోజనాలు ఒక్కటే కాబట్టి ఇప్పుడు ఒకే మాట నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే, తెలంగాణ విషయంలో వైయస్ ను తీవ్రంగా వ్యతిరేకించి, టికెట్ కూడా దక్కించుకోలేని సీనియర్ కాంగ్రెసు నాయకుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి కూడా జగన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇది కెవిపి రామచందర్ రావు వ్యూహ రచనపై వారికున్న నమ్మకమనే చెప్పాలి.

ఇప్పటికే కాంగ్రెసు సీనియర్ నాయకులు ఆ లాబీకి వ్యతిరేకంగా ఒక్కటి కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాన్ని జాగ్రత్తగా గమనిస్తున్న కెవిపి తనదైన రీతిలో చక్రం తిప్పుతున్నారు. ఇప్పుడు కాంగ్రెసుకు శాసనసభలో స్వల్ప మెజారిటీ మాత్రమే ఉంది. అయితే వైయస్ జగన్ కు వందకు పైగా కాంగ్రెసు శాసనసభ్యులు మద్దతిస్తారు. వైయస్ అనుయాయులకు మాత్రమే టికెట్లు లభించి వారే ఎక్కువ విజయం సాధించడం ఇప్పుడు జగన్ కు కలిసి వస్తోంది. రోశయ్యను ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం ముఖ్యమత్రిగా కొనసాగించి, జగన్ ను పార్టీ అధిష్ఠానవర్గం పక్కన పెడుతుందనే భయం కూడా వైయస్ వర్గాల్లో ఉంది. దీంతో ఒత్తిడి తీవ్రం చేస్తున్నారు. మరోసారి మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయడానికి రఘువీరారెడ్డి, రామచంద్రారెడ్డి, కొండా సురేఖ, అహ్మదుల్లా వంటివారు నిరాకరించారు. ప్రమాణ స్వీకారానికి ముందు కెవిపి నివాసంలో మంత్రులు సమావేశమయ్యారు. కెవిపి నచ్చజెప్పిన తర్వాతనే వారు మంత్రులుగా ప్రమాణం చేయడానికి సిద్ధపడ్డారు.

తెలంగాణలో మొదటిసారి మంత్రులైనవారు, శాసనసభ్యులుగా ఎన్నికైన వారు పూర్తిగా జగన్ నాయకత్వానికి మద్దతు కూడగడుతున్నారు. అయితే, కొద్ది మంది సీనియర్లు, వైయస్ వ్యతిరేకులు జగన్ కు మద్దతు ఇవ్వకపోతే ప్రమాదం ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో కెవిపి ఇప్పటికే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని కదిపినట్లు సమాచారం. స్థిరమైన ప్రభుత్వం ఉండాలనే నెపంతో, మళ్లీ ఎన్నికలు ప్రజలకు భారమనే మాటతో చిరంజీవి జగన్ కు మద్దతు ప్రకటించినా ఆశ్చర్యం లేదు. మొత్తం మీద కెవిపి రామచందరావు జగన్ నాయకత్వంలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి శాయశక్తులా పాటు పడుతున్నారు. జగన్ నాయకత్వం వల్ల వైయస్ లాబీ ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఉంటాయి. యథాతథ స్థితి కొనసాగుతుంది. జగన్ ముందు కనిపించినా వెనక నడిపించేదంతా కెవిపియే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X