• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైయస్ ఆడింది ఆట

By Staff
|

YS Rajasekhar Reddy
రాష్ట్ర కాంగ్రెసులో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. లోకసభకు, రాష్ట్ర శాసనసభకు ఒకేసారి జరిగిన ఎన్నికల్లో ఒంటి చేత విజయం సాధించి పెట్టిన నేతగా ఆయనకు గుర్తింపు వచ్చింది. ఎన్నికల్లో ఆయన పార్టీని విజయపథంలో నడిపించే బాధ్యతను తన భుజానికెత్తుకున్నారు. పార్టీ అధిష్ఠానానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కేంద్రంలో కాంగ్రెసు అధికారాన్ని చేపట్టడానికి రాష్ట్రం నుంచి గెలుచుకునే లోకసభ స్థానాలు కీలకమైన పరిస్థితుల్లో అత్యధిక స్థానాలను గెలిపించి అధిష్ఠానం మన్ననలు పొందారు. గత ఎన్నికల్లో కన్నా ఎక్కువ పార్లమెంటు స్థానాలను గెలిపించారు. రాష్ట్రంలోని 42 లోకసభ స్థానాల్లో 33 స్థానాలను ఆయన గెలిపించి పెట్టారు. దానికి తోడు రెండోసారి రాష్ట్రంలో కాంగ్రెసును అధికారంలోకి తెచ్చారు. దాంతో ఆయనకు పార్టీ అధిష్ఠానం వద్ద తిరుగులేకుండా పోయింది. దానివల్లనే రాష్ట్ర మంత్రి వర్గ ఏర్పాటులో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వేలు పెట్టలేదు. ఆయన రూపొందించుకున్న జాబితాకు తలూపారు.

పార్టీ అధిష్ఠానవర్గం వద్ద తన ప్రాబల్యం పెంచుకోవడం ద్వారా రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో ఆయన ఆడిందే ఆటగా, పాడిందే పాటగా కొనసాగే అవకాశం ఏర్పడింది. దానివల్లనే ఆయన తన వీర విధేయులకే మంత్రి పదవులను కట్టబెట్టారు. సీనియర్లు కె.జానారెడ్డి, జెసి దివాకర్ రెడ్డిలను కూడా దూరం పెట్టగలిగారు. జానారెడ్డి ఏదో మేరకు స్వతంత్రంగా వ్యవహరిస్తారు. ఆయనను ఒక్కోసారి ఒప్పించడం తలనొప్పిగా కూడా ఉంటుంది. జెసి దివాకర్ రెడ్డి ద్వారా వచ్చిన తలనొప్పులు ఆయనకు గత ప్రభుత్వంలో చాలానే ఉన్నాయి. పైగా జెసి దివాకర్ రెడ్డి ఆయనకు చిరకాల ప్రత్యర్థి. రాయలసీమ రాజకీయాల్లో జెసి దివాకర్ రెడ్డి, మైసురా రెడ్డి కలిసికట్టుగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నాయకత్వంలో వైయస్ రాజశేఖఱ రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టడానికి ప్రయత్నించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే రాష్ట్ర కాంగ్రెసులో రాజశేఖర రెడ్డి ప్రాబల్యం పెరుగుతున్న తరుణంలో ఆయన నాయకత్వాన్ని అంగీకరించలేక మైసురా రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వలస వెళ్లారు. జెసి దివాకర్ రెడ్డి మాత్రం రాజశేఖర రెడ్డి రాజీ పడ్డారు. అయితే అంత వరకే రాజశేఖర రెడ్డికి సరిపోదు. మంత్రివర్గంలో తనకు నచ్చనివారెవరూ ఉండకూడదనే పద్ధతిలో వైయస్ రాజశేఖర రెడ్డి ఈసారి వ్యవహరించారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన కొందరిని భరించక తప్పలేదు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. దాంతో ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా ఆయనను పక్కన పెట్టేశారు.

ఇకపోతే, కాస్తా స్వతంత్రంగా వ్యవహరించడానికి అవకాశం ఉన్న నేదురుమల్లి రాజ్యలక్ష్మి, డి. శ్రీనివాస్, కెఆర్ సురేష్ రెడ్డి వంటి పలువురు ప్రముఖులు ఎన్నికల్లో ఓడిపోయారు. ఇది కూడా రాజశేఖర రెడ్డికి కలిసి వచ్చింది. తన సొంత నియోజకవర్గంలోనే ఓటమి చవి చూసిని డి. శ్రీనివాస్ కు పిసిసి అధ్యక్షుడిగా పెద్దగా ప్రాబల్యం ఉండే అవకాశం లేదు. ఆయన నామమాత్రం పిసిసి అధ్యక్షుడిగా మారిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి తన మాట జవదాటనివారిని, తన అడుగు జాడల్లో నడిచే వారిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తద్వారా ఆయనకు ఏ విధమైన తలనొప్పులు లేకపోగా ఎవరినీ బుజ్జగించాల్సిన అవసరం ఉండదు. దాదాపుగా పార్టీలో ఆయన ప్రత్యర్థులంతా తుడిచి పెట్టుకుపోయినట్లే. అధిష్ఠానం వద్ద మరో నాయకుడు నొరెత్తే అవకాశం కూడా ఉండదు. అయితే, తెలంగాణ వాదం మాత్రం ఆయనను వెంటాడుతూనే ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణవాదాన్ని పూర్తిగా దెబ్బ తీయడంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X