• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బొత్స వెనక హైకమాండ్?

By Pratap
|

Bosta Satyanarayana
రాష్ట్ర విభజన జరిగితే మంచిదేనన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరో ఇద్దరు మంత్రులు విశ్వరూప్, మోపిదేవి వెంకట రమణ బొత్స దారి పట్టడం మరింత సంచలనానికి కారణమైంది. బొత్స సత్యనారాయణ వెనక కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవినేని ఉమా మహేశ్వర రావు, ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కళా వెంకటరావు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా బొత్స సత్యనారాయణ అదే అభిప్రాయంతో ఉన్నప్పటికీ బహిరంగంగా తన ప్రకటనను వెల్లడించలేదు. సూచనప్రాయంగా మాత్రమే వెల్లడించారు. విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు ప్రకటన చేయడమే కాకుండా తన మాటపై నిలబడి సవాళ్లు కూడా చేస్తున్నారు. ఇంత గట్టిగా, కచ్చితంగా బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజనకు మద్దతుగా మాట్లాడడం వెనక పార్టీ అధిష్టానం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఈ నెల 4,5 తేదీల్లో హైదరాబాదు రానున్న నేపథ్యంలో బొత్స తన గొంత పెంచడం, మరింత మంది ఆయనకు మద్దతు తెలపడం వెనక కాంగ్రెసు అగ్రనాయకత్వం పాత్ర ఉందని అంటున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సభ్యుడు కిశోర్ చంద్రదేవ్ ద్వారా పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా తెలంగాణకు అనుకూలంగా రాష్ట్ర కాంగ్రెసులో వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందు పార్టీపరంగా ఒకే అభిప్రాయాన్ని వినిపించడానికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడే ప్రమాదం ఉంది. తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు అందుకే బొత్స సత్యనారాయణపై మండి పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఏదో ఒక అభిప్రాయం తీసుకోవాల్సిన అనివార్యతలో పడాల్సి వస్తుందని అంటున్నారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం వాటిల్లేలా చూడాలనేది కాంగ్రెసు ఎత్తుగడగా ఉందనే ప్రచారం జరుగుతోంది. సమైక్యాంధ్ర నినాదాన్ని తీసుకున్న ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి దీనివల్ల లాభపడినా ఆశ్చర్యం లేదనే మాట వినిపిస్తోంది. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయం ప్రకటిస్తే సీమాంధ్ర నాయకులు పెద్ద యెత్తున చిరంజీవి సరసన చేరే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. చంద్రబాబు సమైక్యనినాదం వినిపిస్తే తెలంగాణ నాయకులు దూరం కావాల్సిన పరిస్థితులే ఈ ప్రాంతంలో ఉన్నాయి.

బొత్స సత్యనారాయణ లాగానే రాష్ట్ర విభజనకు అనుకూలంగా మరో 8 మంది సీమాంధ్ర మంత్రులు ముందుకు వస్తారని తెలంగాణకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రకటనకు ఈ సందర్భంలో ప్రాధాన్యం చేకూరింది. కాగా, దాదాపు 50 మంది సీమాంధ్ర శాసనసభ్యులు రాష్ట్ర విభజనను సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజారాజ్యం మాజీ నేత కత్తి పద్మారావు అంటున్నారు. సీమాంధ్రలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు, ప్రజలు ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కాగా, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా మెత్తబడినట్లు చెబుతున్నారు. సమైక్యాంధ్ర అనేది భావన మాత్రమేనని ఆయన ఇటీవల అనడాన్ని బట్టి సమైక్యాంధ్ర రాష్ట్ర నినాదం వాస్తవికతకు సంబంధించింది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లగడపాటి రాజగోపాల్ వ్యవహారమంతా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కెసిఆర్ ను బలహీనపరచడానికి చేసింది మాత్రమేననే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీని నిట్టనిలువునా చీల్చడం, కెసిఆర్ ను బలహీనపరచడమే తప్ప కాంగ్రెసు నాయకులు రాష్ట్ర విభజనకు పూర్తిగా వ్యతిరేకంగా లేరనే మాట వినిపిస్తోంది. అధిష్టానం ఒత్తిడి వల్ల వారు రాష్ట విభజన తప్పదనే కచ్చితమైన అభిప్రాయంతోనే ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఇష్టం లేకపోయినా అందుకు అంగీకరించే స్థితికి వారు వచ్చినట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X