వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ అఫైర్స్ పై సీరియస్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
జాప్యం చేస్తున్న కొద్దీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారం ముదిరిపోతోందని కాంగ్రెసు పార్టీ అధిష్టానం భావిస్తోంది. జగన్ ను కట్టడి చేయడానికి నలువైపుల నుంచి ఇప్పటికే ఒత్తిడి పెడుతున్నప్పటికీ అది సరిపోవడం లేదనే యోచనలో ఉంది. జగన్ పై తీసుకోవాల్సిన చర్యలపై ఓ నిర్ణయానికి రావడానికి రాష్టానికి చెందిన ఓ రాజ్యసభ సభ్యుడి సహకారాన్ని అధిష్టానం తీసుకుంటోంది. పార్టీ కోర్ కమిటీ సభ్యులకూ పార్టీ అధ్యక్షురాలు సోనియాకూ ఆయన జగన్ విషయంలో సహకరిస్తున్నట్లు సమాచారం. జగన్ కంపెనీలకు వస్తున్న ఆదాయ మార్గాలపై ఇప్పటికే పార్టీ అధిష్టానం దృష్టి సారించింది.

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్ కుమార్ కు సంబంధాలున్నాయని భావిస్తున్న బయ్యారం గనుల ఖనిజాన్వేషణపై అనుమతిని ప్రభుత్వం అందులో భాగంగానే రద్దు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని అంటున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ పై కూడా ఇదే విధమైన చర్యలకు ప్రభుత్వం దిగే అవకాశం ఉంది. ఒక్కొక్కటిగా జగన్ ఆదాయ మార్గాలపై గండి కొట్టాలనేది అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. ముందస్తుగా చెల్లించిన ఆదాయం పన్ను ప్రకారం ఏడాదికి జగన్ ఆదాయం 700 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. దాదాపు 17 కంపెనీలు జగన్ కు వివిధ మార్గాల్లో ఆదాయం సమకూరుస్తున్నట్లు చెబుతున్నారు. కేవలం ఐదేళ్ల కాలంలో ఆయన కోట్లకు పడగలెత్తిన వైనంలో జరిగిన లోపాలను అధిష్టానం తవ్వి తీస్తోంది.

పార్టీ అధిష్టానం ఆదాయ మార్గాలపై దృష్టి సారించినా జగన్ వెనక్కి తగ్గడం లేదు. దీంతో పార్టీపరంగా తీసుకునే చర్యలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణ పార్లమెంటు సభ్యులు గురువారం జగన్ కు వ్యతిరేకంగా పెద్ద యెత్తున గళమెత్తారని చెబుతున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాను ధిక్కరించేవారిని పార్టీ వ్యక్తులుగా గుర్తించబోమని, అధిష్టానాన్ని సవాల్ చేయదలుచుకుంటే బయటకు వెళ్లిపోవచ్చునని వారు జగన్ ను హెచ్చరించారు. దీన్ని బట్టి, జగన్ తనంత తానుగా బయటకు వెళ్లిపోయేలా చేసే వ్యూహాన్ని పార్టీ అధిష్టానం అనుసరిస్తోందని చెప్పవచ్చు. అందులో భాగంగానే, జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు, కొండా సురేఖలపై చర్యలకు దిగింది. అయితే, అవి అంతగా ఫలితాలు ఇవ్వడం లేదని భావిస్తున్న అధిష్టానం నేరుగా జగన్ పై చర్యలకు ఉపక్రమిస్తోందని అంటున్నారు. దీనిపైనే ఇప్పుడు పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

జగన్ పై చర్యలు తీసుకుంటే వాటిల్లే లాభనష్టాలపై కేంద్ర ప్రభుత్వం గవర్నర్ నరసింహన్ చేత నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. నరసింహన్ తో కేంద్ర మంత్రులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కె. రోశయ్యతో కూడా పార్టీ అధిష్టానం మాట్లాడాలని అనుకుంటోంది. ఇందుకు గాను రోశయ్య ఆదివారం ఢిల్లీ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో సుదీర్ఘం మంతనాలు జరిగాయి. చర్యలు తీసుకోవడం వల్ల జగన్ పై ప్రజల్లో సానుభూతి పెరుగుతుందా, లేదా అన్నదే ప్రస్తుతం సోనియా మనసులో ఉన్న సందేహమని చెబుతున్నారు. చర్యలు తీసుకోవాలనే నిర్ణయం ఖాయమైనప్పటికీ జగన్ కు ప్రజల సానుభూతి లభించకుండా ఉండాలనేది ఆలోచన. దీనిపై ప్రధానంగా కాంగ్రెసు అధిష్టానం మల్లగుల్లాలు పడుతోందని అంటున్నారు. ప్రస్తుత స్థితి చూస్తే, సెప్టెంబర్ 2వ తేదీ దాకానైనా అధిష్టానం ఆగుతుందా అనేది అనుమానమే. పార్టీ అనుమతి లేకుండా సెప్టెంబర్ 2వ తేదీన సంస్మరణ సభ పెట్టడాన్నే అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X