వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసుకూ కెసిఆర్ కౌంటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యూహరచనలో దిట్ట. ఆయన ఎత్తుగడలు రాజకీయ వర్గాల్లో సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆయనది అందె వేసిన చేయి. ప్రజా గాయకుడు గద్దర్ ప్రజా ఫ్రంట్ ను ఏర్పాటు చేసినప్పుడు, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుడు కె. కేశవరావుతో సమావేశం జరిపి మీడియానుద్దేశించి మాట్లాడినప్పుడు ఆయన తీవ్ర ఆత్మరక్షణలో పడినట్లు కనిపించారు. కానీ అత్యంత తక్కువ వ్యవధిలోనే ఆయన వాటిని అధిగమించారు. తమ ఫ్రంట్ ఎన్నికల్లో పోటీ చేయదని గద్దర్ ప్రకటించడంతో కెసిఆర్ సమస్య నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత కేశవరావుతో భేటీ జరిపి కాంగ్రెసును బలోపేతం చేస్తామని చెప్పినట్లు వార్త రావడంతో కెసిఆర్ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురై ఆయన దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు. గద్దర్ మాత్రం కాస్తా సంయమనం పాటించి, రాజకీయ నాయకులు ఎవరైనా సరే ప్రజల వైపు ఉండాలని వ్యాఖ్యానించి, కెసిఆర్ తో మిత్ర వైరుధ్యం ఉంటుందని చెప్పారు. ఈ రకంగా ఆయన ఆ సమస్యలను గట్టెక్కారు. ఆ తర్వాత ఆయనకు ఎస్సై అభ్యర్థుల నియామకంపై ప్రభుత్వం తలపెట్టి రాత పరీక్ష సమస్య బాగా కలిసి వచ్చింది. ఫ్రీజోన్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చి దాన్ని పక్కన పెట్టించారు.

అదంతా కెసిఆర్ వ్యవహారాలపై బయటకు కనిపించే విషయాలు. లోలోన ఆయన వ్యూహరచన వేరుగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకున్న కెసిఆర్ భవిష్యత్తులో కాంగ్రెసును టార్గెట్ చేసుకోవడానికి అవసరమైన వ్యూహాన్ని ఇప్పటికే అమలు చేయడం ప్రారంభించినట్లు కనిపిస్తోంది. కేశవరావుతో భేటీ అయి కాంగ్రెసును బలపరుస్తామని చెప్పడం ద్వారా ఆయన ఆ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించారని చెప్పవచ్చు. తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు, యువత సమస్యలపై ఎప్పటికప్పుడు ఆందోళనలు చెలరేగుతూ కెసిఆర్ కు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయి. ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ వివాదం, ప్రస్తుతం ఎస్సై నియామకాల వివాదం వంటి సమస్యలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఇటువంటి వివాదాల సందర్భాల్లో కాంగ్రెసు తెలంగాణ నేతలు కెసిఆర్ అనుసరిస్తున్న వైఖరికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అనివార్యతలో పడ్డారు. సమైక్యాంధ్రలో అన్యాయం జరుగుతుందని, తెలంగాణ కోసం కాంగ్రెసు తెలంగాణ నేతలంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఆచరణలో వారు ముందుకు వచ్చేలా చేయడం ద్వారా డిసెంబర్ తర్వాతి పరిణామాలకు ఆయన పునాదులు వేస్తున్నారని అనుకోవాలి.

కాగా, తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెసును బలపరుస్తామని, ఆ పార్టీ బలపడేలా చూస్తామని చెప్పడం ద్వారా బంతిని కెసిఆర్ కాంగ్రెసు కోర్టులోకి విసిరారని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు చేపట్టడానికి జనవరి నెలాఖరు వరకు ఆయన గడువు ఇచ్చారు. డిసెంబర్ తర్వాత తనతో కలిసి రాకుంటే కాంగ్రెసును టార్గెట్ చేయడం కెసిఆర్ కు సులభమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెసు చర్యలు తీసుకుంటే ఆ కీర్తి పూర్తిగా కెసిఆర్ కు దక్కుతుంది. ఒకవేళ, కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గితే కాంగ్రెసును టార్గెట్ చేసి తన రాజకీయ ప్రాబల్యాన్ని మరింతగా పెంచుకోవడానికి కేశవ రావుతో భేటీ ఆయనకు ఉపయోగపడుతుంది. ఆలాంటి స్థితిలో ఎన్నికల్లో కూడా ఆ భేటీ కెసిఆర్ కు కలిసి వస్తుంది. ఎటు చూసినా తనది పైచేయి కావడానికి అవసరమైన వ్యూహాన్ని కెసిఆర్ అనుసరిస్తున్నారని అనుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X