వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణతో సినీ పరిశ్రమ రాజీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తెలుగు సినీ పరిశ్రమ దాదాపుగా తెలంగాణ విషయంలో రాజీ పడినట్లే కనిపిస్తోంది. ఇది ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కుటుంబ సభ్యులకు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుటుంబ సభ్యులకు పెద్ద దెబ్బగానే పరిగణించాల్సి ఉంటుంది. ఈ ఇద్దరు పెద్ద హీరోలు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. తెలంగాణకు అనుకూలంగా వారు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న సినీ పెద్దల కుటుంబ సభ్యుల సినిమాలను తమ ప్రాంతంలో తెలంగాణవాదులు అడ్డుకుంటూ వచ్చారు. బాలకృష్ణ, అల్లు అర్జున్, మంచు విష్ణు వంటి హీరోల సినిమాల ప్రదర్శనలనే కాకుండా వారి సినిమా షూటింగులను కూడా అడ్డుకుంటూ వచ్చారు. ఇది తెలుగు సినీ పరిశ్రమకు సమస్యగానే పరిణమించింది. సీమాంధ్రకు చెందిన హీరోలందరి సినిమాలను కూడా అడ్డుకుంటామని తెలంగాణవాదులు ప్రకటించారు. తెలుగు సినీ పరిశ్రమ వ్యతిరేకోద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రధాన పాత్ర పోషించారు.

తెలుగు సినిమాల ప్రదర్శనపై ఓ దుమారం చెలరేగి ఇప్పుడు చల్లబడినట్లు కనిపిస్తోంది. ఈ వాతావరణం ఆషామాషీగా ఏమీ ఏర్పడలేదు. సినీ పరిశ్రమ పెద్దలు చాలా మంది తీవ్రంగా ఆలోచించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమకేమీ అభ్యంతరం లేదని మురళీ మోహన్ ప్రకటించారు. మురళీమోహన్ రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి చెందినవారు. తెలంగాణకు వ్యతిరేకంగా తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నా, సీమాంధ్ర నాయకులు కార్యక్రమాలు చేపడుతున్నా మురళీ మోహన్ ఆ విధమైన ప్రకటన చేయడం ఒక విధంగా ఆశ్చర్యకరమైన విషయమే. కానీ తప్ప లేదు.

తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు హైదరాబాదులో పెద్ద యెత్తున ఆస్తులు సమకూర్చుకున్నారు. ప్రభుత్వాల నుంచి రాయితీలు పొంది స్టూడియోలు నిర్మించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా వారు ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. ఆస్తులను వదిలేసి వారు వెళ్లిపోతారని, వెళ్లిపోవాలని అనుకోవడం కూడా సరి కాదు. ఈ స్థితిలో సినీ పెద్దలు చాలా మంది తెలంగాణ అంశంతోనో, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుతోనో రాజీకి వచ్చారు. నాగార్జున స్వయంగా కెసిఆర్ సలహాలు తీసుకోవడం కూడా అందరికీ తెలిసిందే. ఈ రాజీ నేపథ్యంలో కవిత తెలుగు సినిమా షూటింగుల ప్రారంభోత్సవాల్లో ప్రధాన ఆకర్షణ అయ్యారు. జగపతిబాబు నటించిన చట్టం సినిమా షూటింగ్ ప్రారంభ కార్యక్రమాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

శంకర్ దర్సకత్వంలో వస్తున్న జైబోలో తెలంగాణ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ పెద్దలు చాలా మంది హాజరయ్యారు. రాఘవేంద్ర రావు వంటి పెద్దలు వచ్చి తమ ఉదారతను ప్రదర్సించుకున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు ఓ ముఖ్య పాత్రను కూడా పోషిస్తున్నారు. మొత్తం మీద, తెలంగాణ విషయంలో మెజారిటీ సినీ పరిశ్రమ రాజీకి వచ్చినట్లే. ఈ స్థితిలో చిరంజీవికే ఇది పెద్ద దెబ్బనే. సమైక్యాంధ్ర నినాదం నుంచి ఆయన వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఏమైనా, ప్రస్తుత పరిస్థితిలో చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమాలకు కూడా పెద్దగా ఆటంకాలు ఏర్పడడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ బృందావనం సినిమా సజావుగా నడిచింది. కానీ అది ఎప్పుడైనా తిరగబడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X