హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రపాలిత ప్రాంతానికి ఎందుకు వ్యతిరేకత?

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ప్రతిపాదనను మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. హైదరాబాదును వారు తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగంగా చేయాలని కూడా అడగడం లేదు. అలా చేయాలని అడిగినప్పుడు హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించకూడదనే డిమాండ్ కు అర్థం ఉంటుంది. కానీ హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని, కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ప్రతిపాదనను మాత్రం వ్యతిరేకిస్తామని అంటున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన ఈ ఇద్దరు మంత్రులు కూడా మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ను వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ, తెలంగాణవాదుల నుంచి ఒత్తిడి రావడంతో ఆ వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. కానీ, అంతరాంతరాల్లో మాత్రం వారిద్దరు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగానే ఉన్నారని చెప్పవచ్చు.

హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయకూడదనే వారి వాదనను తమ రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతమైతే వీరిద్దరు తమ శాసనసభ సభ్యత్వాలను వదులుకోవాల్సి వస్తుంది. కేంద్ర పాలిత ప్రాంతం రాష్ట్రపతి కింద కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉంటుంది. శాసనసభ ఉండదు. దానివల్ల శాసనసభ్యులుగా ఉండడానికి వారికి అవకాశం పోతుంది. రాష్ట్రపతి కింద లెఫ్టినెంట్ జనరల్స్, వివిధ శాఖల కార్యదర్శుల ఏలుబడిలో కేంద్ర పాలిత ప్రాంతం నడుస్తుంది. దేశంలో ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి. వీటిలో దేశ రాజధాని ఢిల్లీకి, పాండిచ్చేరిలకు మాత్రమే పాక్షికంగా రాష్ట్ర ప్రతిపత్తి కల్పించారు. ఈ రెండింటికీ శాసనసభలు, శాసనసభ్యులు, ముఖ్యమంత్రులు ఉన్నారు. అందుకే హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే తమకు అభ్యంతరం లేదని దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ అంటున్నారు.

అదే సమయంలో మజ్లీస్ కూడా హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. శాసనసభ్యులుగా లేనప్పుడు రాజకీయాధిపత్యం ఉండదు. రాజకీయాధిపత్యం కోల్పోయిన రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. హైదరాబాదులోని ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల అంత సుముఖంగా లేరు. అయితే, వారు హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రంగా చేయాలనే కోరికను వెల్లడిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X