వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భాను బినామీల మెడకు ఉచ్చు

By Srinivas
|
Google Oneindia TeluguNews

C Kalyan and Singanamala
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి భానుకిరణ్ సూరి పేరుతో కోట్లాది రూపాయలు సంపాదించుకొని సూరిని, ఆయన అనుచరులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పటికీ వారిని ఆదుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. సూరి పేరిట కోట్లాది రూపాయల సెటిల్మెంట్లు చేసిన భాను అవన్నీ బినామీల పేర్లతో దాచినట్టుగా వార్తలు వస్తున్నాయి. చిత్ర నిర్మాతలు, శింగనమల రమేష్, సి కళ్యాణ్, శ్వేతారెడ్డి తదితరుల పేరిట దాచినట్టుగా ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి.

వారిని పోలీసులు కూడా విచారిస్తున్నారు. సూరిని హత్య చేసిన తర్వాత ఆయన మృతదేహాన్ని తీసుకు వెళ్లడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా సమాచారం. సూరి అనుచరులు కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు సమాచారం. వీరిని ఎవరినీ కూడా భాను ఆదుకోలేదని, సూరి పేరిట సంపాదించిన డబ్బును అంతా బినామీల పేరుతో దాచినట్లు తెలుస్తోంది. పోలీసులతో పాటు భానుకోసం సూరి ముఖ్య అనుచరులు కూడా వెతకవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

దీంతో భానుకిరణ్ ఆర్థిక వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు. దీంతో భాను బినామీలకు ఇప్పుడు చిక్కులు తప్పేలా లేవు. సూరి జీవించి ఉన్నప్పుడే డబ్బు కోసం భాను కిరణ్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఇది సూరికి నమ్మినబంట్లుగా ఉన్న వారిలో ఎప్పటి నుంచో అసంతృప్తికి కారణమైంది. పోలీసుల దర్యాఫ్తులో వందలకోట్లు బయటకు రావటంతో సూరి అనుచరులు మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భాను వల్ల సూరికి దూరమైన వారందరూ మరలా ఒకరికొకరు కలుసుకుని తాము పోగొట్టుకున్న డబ్బును పొందేందుకు ప్రయత్నించవచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు.

పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దుశీని జైలులో ఉన్నప్పుడు ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆదుకోలేక పోవటంతోనే మొద్దుశీను ఈ విషయాన్ని సూరి దృష్టికి తేవడమే కాకుండా పలు మార్లు భానుపై ఆగ్రహం వ్యక్తం చేశాడని సమాచారం. ఈ విషయంలో విభేదాలు రావటంతో పరిటాల హత్యలో భాను పాత్ర, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల విషయాన్ని బయటపెట్టేందుకు మొద్దు శీను ప్రయత్నించాడని, అదే అతని ప్రాణాలపైకి తెచ్చిందని సమాచారం.

ఇక, పోలీసు విచారణకు యాంకర్ శ్వేతారెడ్డి సహకరించడం లేదని సమాచారం. సి కళ్యాణ్, శింగనమల సైతం తమకు భానుతో ప్రత్యేకంగా ఎలాంటి లింకులు లేవని వాదిస్తూ వస్తున్నారు. అయితే వారిని పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. సూరి హత్యకు ప్రత్యక్షసాక్షి, ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న మధుసూధన్ గత కొద్ది రోజులుగా పోలీసులకు సహకరించడం లేదని తెలుస్తోంది.

సరిగా మాట్లాడక పోవడంతో మధుతో చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉన్న అనంతపురం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు గోపాలరెడ్డిని పోలీసులు శనివారం పిలిపించి మధుతో మాట్లాడించారు. ఆపై గోపాలరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను సొంత పని మీద సీసీఎస్‌కు వచ్చానంటూ హడావుడిగా వెళ్లిపోయారు.

కాగా సూరి హత్య కేసులో నిందితుడు భాను, మొద్దుశీను పద్ధతిలో నడిచేందుకు సిద్దమయినట్లుగా ఉంది. పరిటాల రవిని హత్య చేసిన తర్వాత చాలాకాలం మొద్దు శీను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత చాలాకాలానికి అందరూ మరిచి పోయిన తర్వాత హైదరాబాదులో బాంబులు తయారు చేసుకుంటూ పట్టు బడ్డాడు. అయితే మొదట మొద్దుశీనును ఎవరూ గుర్తు పట్టలేదు. ఇదే తరహాలో భాను కూడా చాలాకాలం ఎవరికీ దొరకకుండా అజ్ఞాతంలో ఉండి, ఆ తర్వాత అందరూ మరిచిపోయిన తర్వాత తెరచాటు కార్యకలాపాలకు తెరలేపవచ్చని పలువురు భావిస్తున్నారు.

సూరి హత్య అనంతరం భాను తన సన్నిహితులతో కూడా ఎవరితో మాట్లాడటం లేదని తెలుస్తోంది. సన్నిహితులకు, బంధువులకు ఎవరికి తెలియకుండా దాచుకున్నట్టుగా తెలుస్తోంది. ఆస్తులు బినామీ పేర్లతో ఉండటంతో ఎటిఎంనుండి డబ్బులు తీసుకుంటూ ఉండవచ్చని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా గాలిస్తున్నా భాను దొరక పోవటం గమనించదగ్గ విషయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X