వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌తో కిరణ్ ఆందోళన

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు అనుసరించబోయే వ్యూహంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళనలో పడినట్లు తెలుస్తోంది. శాసనసభ్యుల కోటాలో పదో సీటు ఎవరికి దక్కుతుందనేది అయోమయంగా మారింది. శాసనసభ్యుల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా మహమూద్‌ అలీ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని జగన్ తన వర్గంవారికి పిలుపునిచ్చారు. ఇది తమకు లాభిస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) భావిస్తోంది. కాంగ్రెస్‌ శాసనసభ్యులుగా ఉన్న జగన్ వర్గం శాసనసభ్యులు వేరే పార్టీ అభ్యర్థి నామినేషన్‌ కోసం సంతకాలు చేస్తే అనర్హత వేటు పడుతుంది. ఒకవైపు తాము పోటీ పడుతుండటం, మరోవైపు జగన్‌ వర్గం ప్రభావం కారణంగా కాంగ్రెస్‌, మిత్రపక్షాలు ఏడో సీటుకు పోటీపడకపోవచ్చునని తెరాస అంచనా వేస్తోంది. అందువల్ల తమ అభ్యర్థి కూడా ఏకగ్రీవంగానే ఎన్నిక కావొచ్చని ఆశిస్తోంది. ఏదేమైనా మొత్తమ్మీద ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

శుక్రవారం సీఎల్పీ కార్యాలయం ఇన్‌ఛార్జి ఖాళీ నామినేషన్‌ పత్రాలపై కాంగ్రెస్‌, ప్రజారాజ్యం శాసనసభ్యుల సంతకాలు తీసుకున్నారు. వీటిపై జగన్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కొందరు సంతకాలు పెట్టినప్పటికీఅనంతపురం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డితో పాటు మరికొందరు తిరస్కరించారు. దీంతో ఆ వర్గం వైఖరి ఏంటనేది ఎవరికీ అంతుపట్టటం లేదు. తెరాస మాత్రం తాము ఎవరినీ మద్దతు అడగబోమని, ఎవరైనా ఇవ్వటానికి ముందుకొస్తే స్వీకరిస్తామని నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తోంది. ఆరుగురు సభ్యులున్న బిజెపి, సీపీఐ తమకు మద్దతిస్తాయని తెరాస గట్టిగా విశ్వసిస్తోంది.

ఎమ్మెల్యేల కోటా కింద పది మంది ఎమ్మెల్సీలను ఎన్నుకోవటానికి ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10 సీట్లలో కాంగ్రెస్‌ అయిదింటికి పోటీపడేందుకు సమాయత్తమైంది. ప్రజారాజ్యం పార్టీకి, మజ్లిస్‌లకు చెరో సీటు కేటాయించాలని నిర్ణయించింది. ఈ విషయమై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీలు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు రెండు సీట్లు కేటాయించాలని చిరంజీవి కోరగా ఒక సీటు తప్పకుండా ఇస్తామని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లను గెల్చుకునే బలం తెలుగుదేశం పార్టీకి ఉంది. పది మంది మాత్రమే బరిలో ఉంటే ఎన్నికలు ఏకగ్రీవమవుతాయి. అయితే ఇప్పుడు తెరాస కూడా రంగంలోకి దిగడంతో 11 మంది అభ్యర్థులతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ సైతం నాలుగో అభ్యర్థిని రంగంలోకి దింపాలని ఆలోచిస్తుండటంతో ఉత్కంఠ పెరిగింది. దీంతో పదో సీటు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేయాలంటే కనీసం పది మంది ఎమ్మెల్యేల సంతకాలు అవసరం. ప్రస్తుతం తెరాసకు 11 మంది శాసనసభ్యులు ఉండటం వల్ల ఆ పార్టీ నామినేషన్‌ వేయటానికి మార్గం సుగమమైంది. ఒక్కో ఎమ్మెల్సీ ఎన్నిక కావాలంటే 29 ఓట్లు కావాలి. దీని ప్రకారం తెదేపా మూడు సీట్లు, కాంగ్రెస్‌, మిత్రపక్షాలు ఆరు సీట్లను గెలుచుకోవటం తేలికే. అయితే కాంగ్రెస్‌ ఏడో స్థానాన్ని కైవసం చేసుకోవటం మాత్రం కష్టమే. ఎందుకంటే జగన్‌ వర్గం ఎమ్మెల్యేల వైఖరి ఎలా ఉంటుందోననేది తెలియటం లేదు. వాళ్లు కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓటేస్తారో లేదోననేది సర్వత్రా చర్చనీయాంశమయింది. మొదటి ప్రాధాన్యం, రెండో ప్రాధాన్యం ఓట్లు సరిగ్గా వేయకపోతే ఫలితం కూడా తారుమారయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరు ఎవరికి ఓటేశారనేది తెలుసుకోవడం కష్టం. ఒకవేళ రహస్య కోడ్‌ ద్వారా కనిపెట్టగలిగినా పార్టీ ధిక్కరణ కిందికి రాదు. పార్టీ పరంగా చర్యలు తీసుకోవచ్చు గానీ అనర్హతగా పరిగణించే వీలు లేదు. అందువల్ల జగన్‌ వర్గం కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు దీన్ని ఓ అవకాశంగా తీసుకుంటుందని అధికార పార్టీ వర్గాలే అనుమానిస్తున్నాయి.

English summary
CM Kiran Kumar Reddy in trouble with ex MP YS Jagan camp MLAs in MLC election. With the nomination of TRS candidate Mahmood's nomination, MLC election in MLA qouta is creating interesting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X