వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రచారంలో భార్యలు..: ఫ్యామిలీ మధ్యే పోటా పోటీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dharmana Krishna Das - Ram Das
త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నుండి బంధువర్గమే బరిలో నిలిచింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి ధర్మాన కృష్ణదాస్, కాంగ్రెసు పార్టీ నుండి ధర్మాన రాందాస్ రంగంలో ఉన్నారు. వారిద్దరు సొంత సోదరులు కాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్వామి బాబు కూడా వారికి సమీప బంధువే అని తెలుస్తోంది. కాగా నరసన్నపేటలో గెలుపు కోసం వీరంతా తీవ్రంగా కృషి చేస్తున్నారు.

ఇక్కడ ఆరుగురు అభ్యర్థులు తలపడుతున్నా ప్రధానమైన పోటీ మాత్రం కాంగ్రెసు, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు మధ్యే ఉంది. వారు ముగ్గురు బంధువులు కావడం విశేషం. నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే. జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి ధర్మాన ప్రసాద రావు తన సోదరుడు, కాంగ్రెస్ అభ్యర్థి రాందాసును ఎలాగైనా గెలిపించాలని అహర్నిశలూ శ్రమిస్తున్నారు.

ఇందులో భాగంగా రాందాసు, ధర్మాన ప్రసాదరావుల భార్యలు, కుమారులు, ఇతర బంధుగణంతో పాటు బలగమంతా కాంగ్రెస్ ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండుసార్లు నరసన్నపేటలో పర్యటించి వెళ్లారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ వంటి నాయకులంతా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి రాందాసు మంత్రి ధర్మానకు సోదరుడు కావడం, మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడం, అగ్రనేతల ప్రచార పర్యటనలు సానుకూలంశాలుగా ఉన్నాయి.

వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్ధి ధర్మాన కృష్ణదాస్ నియోజకవర్గంలో తనకున్న పరిచయాలు, వ్యక్తిత్వం, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై ఉన్న సానుభూతి పైనే ఆధారపడ్డారు. స్వామి బాబు విజయం కోసం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతలంతా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు నేతృత్వంలో ఆ పార్టీ నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీంతో నిన్న మొన్నటికన్నా ఆ పార్టీ పరిస్థితి మెరుగవ్వడమే కాక.. బాగా బలాన్ని పుంజుకొంటోంది.

పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రచారానికి వచ్చారు. ఆ సమయంలో జిల్లాలో పార్టీ నేతలందరినీ ఏకతాటి మీదకు తీసుకొచ్చి పూర్తిస్థాయిలో ప్రచారంలోకి దించారు. స్వామిబాబుకు బలమైన రాజకీయ నేపథ్యం ఉండటం, మిగిలిన ఇద్దరికన్నా విద్యాధికుడు కావడం, కాంగ్రెస్ పాలనలో బాగా పెరిగిన ధరలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత, అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్టు కావడం టిడిపికి సానుకూల అంశాలు. ఎన్నో ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉండటం కొంత ఇబ్బంది పెడుతోంది.

వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ అంతకుముందు కాంగ్రెస్ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవాన్ని, పరిచయాలను ఉపయోగించుకొని ప్రచారంలో మిగిలిన వారితో పోటీపడుతున్నారు. ఈయన భార్య, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, కుమారుడు రామలింగం నాయుడు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా జగన్ జైలుపాలు కావడంతో ఆ పార్టీ నాయకులు డీలాపడినట్లుగా కనిపిస్తోంది.. పార్టీ ప్రచార బాధ్యతలు తీసుకున్న విజయలక్ష్మి.. ఇక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

ఈ సభ కొంతవరకు విజయవంతం కావడం, వైయస్‌ను గ్రామీణ ప్రాంతాల ప్రజలు కొంతమంది ఇప్పటికీ అభిమానించడం ఈ పార్టీకి అనుకూలాంశాలు. అక్రమార్జన కేసులో జగన్ అరెస్టు, ఆయనపై కాంగ్రెస్, టిడిపి నాయకులు ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించేలా చేస్తున్న ప్రసంగాలు వైయస్సార్ కాంగ్రెసుకు ప్రతికూలాంశాలుగా మారాయని అంటున్నారు. కాగా కీలక అభ్యర్థులు ముగ్గురూ వెలమ సామాజికవర్గానికి చెందినవారే కావడం వల్ల ఓట్లు చీలిపోతాయని ఆన్ని పార్టీల నాయకులూ అంగీకరిస్తున్నారు. అందుకే ఇతర సామాజికవర్గాల ఓట్లపైనే అంతా కన్నేశారు.

English summary

 YSR Congress party candidate Dharmana Krishna Das, Congress candidate Dharamana Ramadas and Telugudesam Party candiate Swamy Babu are relatives, who were contesting from Narasannapet of Srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X