• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పరకాల గెలుపు: 'తెలంగాణ'పై కెసిఆర్‌కు ఓ గుణపాఠం

By Srinivas
|

K Chandrasekhar Rao
పరకాల విజయం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి, ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఓ హెచ్చరిక అనే చెప్పవచ్చు. ఉప ఎన్నికలు జరిగిన పద్దెనిమిది నియోజకవర్గాలలో పరకాలది ప్రత్యేక స్థానం. తెలంగాణలో ఉప ఎన్నిక జరిగిన ఏకైక స్థానం ఇది. దీంతో సహజంగానే అందరి దృష్టి దీనిపై పడింది. అంతేకాకుండా తెలంగాణవాదంపై కాలు దువ్వుకుంటున్న బిజెపి, టిఆర్ఎస్ రెండు పార్టీలు బరిలో నిలవడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.

పరకాలలో గెలుపొంది.. తమ పాలమూరు గెలుపు గాలివాటం కాదని చెప్పేందుకు బిజెపి జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దింపింది. ఇక టిఆర్ఎస్ అయితే ఎమ్మెల్యేలతో సహా ముఖ్య నేతలంతా పరకాలలోనే తిష్ట వేశారు. పార్టీ అభ్యర్థి భిక్షపతి గెలుపు కోసం అహర్నిషలు కృషి చేశారు. అయితే తెలంగాణవాదం గట్టిగా వినిపించిన బిజెపి ఉప ఎన్నికలలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. తెరాస స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించింది.

చివరి వరకు పరకాల నియోజకవర్గం గెలుపు ఉత్కంఠ రేపింది. పద్నాలుగు రౌండ్ల వరకు తెరాస అభ్యర్థి భిక్షపతి దాదాపు ఆరువేల ఓట్ల మెజార్టీతో ఉన్నారు. అయితే ఆ తర్వాత పదిహేనో రౌండ్ నుండి తెరాస ఆధిక్యం క్రమంగా తగ్గింది. ఓ సమయంలో వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థి కొండా సురేఖ మెజార్టీ స్వల్పంగా పెరిగి గెలుపు దిశగా దూసుకు పోతున్నట్లు కనిపించింది. అయితే చివరి రెండు రౌండ్లలో తెరాస అభ్యర్థి క్రమంగా పుంజుకొని 1592 ఓట్లతో గట్టెక్కారు.

పరకాలలో విజయంతో తెరాస కార్యకర్తలు ఆనందంలో మునిగితేలారు. తెరాస భవన్‌లో పండుగ చేసుకున్నారు. అయితే ఈ గెలుపు తెరాసకు గట్టి హెచ్చరింపు అని అంటున్నారు. తెలంగాణవాదం తమ సొంతమే అన్నట్లు భావిస్తున్న తెరాసకు, ఓట్లు - సీట్లు లక్ష్యంగా పోతున్న కెసిఆర్‌కు ఈ ఉప ఎన్నిక చెంప పెట్టు అని అంటున్నారు. తెలంగాణ కోసం వివిధ పార్టీలతో కలిసి పోవాల్సిన తెరాస ఒంటెత్తు పోకడగా పోతుందని, ఆ కారణంగానే ఉప ఎన్నికలలో స్వల్ప మెజార్టీతో గట్టెక్కిందని అంటున్నారు.

తెలంగాణ సెంటిమెంట్ నేపథ్యంలో గతంలో జరిగిన పలు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఇటీవల ఉప ఎన్నికలలోనూ తెరాస అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు(పాలమూరులో మాత్రం తెలంగాణవాదం వినిపించిన బిజెపి రంగంలోకి దిగడంతో తెరాస స్వల్ప మెజార్టీతో ఓడింది). కానీ అందుకు విరుద్దంగా ఈ ఎన్నికలలో మాత్రం తెరాస అతిస్వల్ప మెజార్టీతో గెలుపొందింది.

తాము ఇరవై ఐదు వేలకు పైగా మెజార్టీతో గెలుస్తామని తెరాస ప్రకటించింది. కానీ వచ్చిన మెజార్టీ మాత్రం 1592 మాత్రమే. ఉప ఎన్నికలలో బిజెపి నాలుగో స్థానానికి పడిపోయినప్పటికీ కాంగ్రెసు కంటే మంచి ఓట్లు రాబట్టగలిగింది. ఆ పార్టీకి రాష్ట్రంలో అసలు సరైన క్యాడర్ లేదు. అలాంటి బిజెపి గెలవకపోయినప్పటికీ కాంగ్రెసు కంటే ముందంజలో నిలవడం విశేషం. ఇప్పటికే బిజెపి తెలంగాణవాదం ప్రజల్లోకి బాగానే చొచ్చుకు పోయింది. ఇప్పటికిప్పుడు తెలంగాణవాదం బిజెపికి లబ్ధి చేకూర్చక పోయినా భవిష్యత్తులో ఆ పార్టీ మెరుగుపడేందుకు బాగా అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కెసిఆర్ ఒంటెత్తు పోకడలకు వెళ్లకుండా తెలంగాణవాదం వినిపిస్తున్న పార్టీలను కలుపుకొని వెళితే బాగుంటుందని అంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణ కావాలంటే త్యాగం తప్పనిసరి అని, కెసిఆర్ వైఖరిని అవలంభించుకోవాలని అంటున్నారు. లేదంటే భవిష్యత్తులో తెరాసకు ఎదురు దెబ్బ తప్పక పోవచ్చుననే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

English summary
It is said that, Parkal of Warangal district win is big lesson to Telangana Rastra Samithi and party chief K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X