వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయినా, తెలంగాణ సుదూర స్వప్నమే

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Map
న్యూఢిల్లీ: ఎవరేమైనా చేయనీ, తాము మాత్రం తెలంగాణ అంశాన్ని ఇప్పట్లో తేల్చబోమని కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు అధిష్టానం పట్టుబట్టి కూర్చున్నట్లే కనిపిస్తోంది. హైదరాబాదులో లక్షలాది మంది కదం తొక్కారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చర్చలతో కాంగ్రెసు పెద్దల మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినా తెలంగాణ రాష్ట్ర సాధన స్వప్నం తెలంగాణవాదులకు సుదూర స్వప్నంగానే కనిపిస్తోంది. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మాటలను బట్టి ఆ విషయం స్పష్టమవుతోంది.

తెలంగాణ అంశంపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సున్నిత సమస్య పరిష్కారానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏ మిటని విలేకరులు ప్రశ్నించగా, "తెలంగాణపై ముందడుగు ఏమీ లేదు'' అని షిండే తేల్చి చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి వామపక్ష తీవ్రవాదుల మద్దతు ఉందని నగర పోలీసు కమిషనర్ వ్యాఖ్యానించారు కదా అని ప్రశ్నించగా.. అది ఆయన సమాచారమని, దానిపై ఇక్కడ ఉండి తానేమీ చెప్పలేనన్నారు. శాంతియుతంగా మార్చ్ జరిపినందుకు తెలంగాణవాదులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇక, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు అధిష్ఠానం వద్దకు తమ ప్రతినిధిగా ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డిని ఆదివారం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన పార్టీ అధినేత్రి సోనియాను కలిశారు. హైదరాబాద్‌లో జరిగిన పరిణామాలపై పార్టీ ఎంపీలు, మంత్రుల తరఫున అధినేత్రి సోనియాకు ఆయన ఓ నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా "నాకు అన్ని విషయాలూ తెలుసు'' అని సోనియా పొంగులేటికి స్పష్టం చేశారు. సమస్య తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోందని, దీనిపై నిర్ణయం తీసుకోకుండా ఇంకా వాయిదా వేయడం వల్ల పరిస్థితి జఠిలమవుతుందని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారని సుధాకర్‌రెడ్డి ఆమెకు విన్నవించారు. ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని ఆమోదించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, జీవ వైవిధ్య సదస్సు ముగిసిన తర్వాత తెలంగాణపై తేల్చే క్రమాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు సుధాకర్‌రెడ్డికి సోనియా స్పష్టం చేసినట్లు తెలిసింది.

కాగా, తెలంగాణ అంశంపై వ్యక్తమవుతున్న ఉత్సుకతను, భావోద్వేగాలను తాను అర్థం చేసుకోగలనని, అయితే, తెలంగాణ ఒక వివాదాస్పద సమస్య అని ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ వ్యాఖ్యానించారు. ప్రజలు, పార్టీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని, సహనంతో, ఏకాగ్రతతో వ్యవహరించాలని పునరుద్ఘాటించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటుపై ఇరు ప్రాంతాల ప్రజల మధ్య ఒక అవగాహన ఏర్పర్చడం, తెలంగాణ ఏర్పాటుతో ఇతర రాష్ట్రాలపై ప్రభావం పడకుండా చూడడం అనేవి అత్యంత ముఖ్యమైనవని, ఒక సమస్యను పరిష్కరించే క్రమంలో మరిన్ని సమస్యలు రాకుం డా చూసేందుకే ప్రయత్నిస్తున్నామని ఏఐసీసీ ప్రతినిధి ఒకరు మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడుతూ అన్నారు.

ఒకరకంగా తెలంగాణ ఏర్పాటు క్లిష్టమేనన్న భావనను ఆయన వ్యక్తం చేశారు. అప్పటి పరిస్థితులను బట్టి డిసెంబర్ 9 ప్రకటన చేశామని, తర్వాత పరిస్థితుల్లో మార్పు రావడం, రెండోవైపు నుంచి బలమైన వాదనలు వినిపించడంతో పునరాలోచించుకున్నామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. "ప్రతి మనిషి జీవితంలోనూ ఇది జరుగుతుంది. మనం ఒక నిర్ణయం తీసుకుందామనుకుంటాం. అప్పుడున్న పరిస్థితులను బట్టి అదే సరైనదని భావిస్తాం. వెంటనే పరిస్థితు లు మారితే ఏం చేస్తాం? నిర్ణయాన్ని సమీక్షించుకుంటామా? లేదా? ఇది కూడా అంతే! ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ సమస్యను పరిష్కరించలేం. రాష్ట్ర విభజన సాధ్యం కాదు'' అని ఏఐసీసీ నాయకుడొకరు స్పష్టం చేశారు.

డిసెంబర్ 9న అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి తెలంగాణను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చామని, అయితే, సీమాంధ్ర నాయకుల రాజీనామాలు, సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభం కావటంతో తాము తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. "అప్పటి నుంచి రెండు ప్రాంతాల నుంచి బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. వాటిని ఎలా సమన్వయం (బ్యాలెన్స్) చేయాలి? ఇది చాలా కష్టం'' అని స్పష్టం చేశారు. మరి తెలంగాణ సమస్యకు పరిష్కారం ఏమిటని ప్రశ్నించగా.. ఈ సమస్యను ఇప్పటికిప్పుడు పరిష్కరించేందుకు ఎలాంటి తరుణోపాయమూ (క్విక్ ఫిక్స్) లేదని వ్యాఖ్యానించారు.

"సమస్యను పరిష్కరించే స్థానంలో, నిర్ణయాలు తీసుకునే స్థానం లో ఉంటే అప్పుడు తెలుస్తుంది ఇదెంత కష్టమైనదో. మీరు రెండు వైపులా ఉన్న అభిప్రాయాలు, మనోభావాలు, వైఖరులు.. ఇలా అన్నింటినీ సమన్వయం చేయాలి. అన్ని వైపుల నుంచీ ఆలోచించాలి'' అని చెప్పారు. తెలంగాణను ఏర్పాటు చేస్తే మరిన్ని సమస్యలు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. ఇందుకు పంజాబ్ విభజనను ఆయన గుర్తు చేశారు. పంజాబ్‌ను విభజించి హర్యానా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగా, చండీగఢ్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు.

"ఇప్పటికీ చండీగఢ్ పంజాబ్‌లోనే ఉండాలని వాదించేవారు ఉన్నత స్థాయిల్లో కూడా ఉన్నారు. కాదు.. అది హర్యానాలో భాగమని వాదించేవారూ ఉన్నారు. అసలు చండీగఢ్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడమే తప్పని చెప్పేవారున్నారు. 1971లో తలెత్తిన సమస్య ఇది. ఇప్పటికీ మనోభావాలు అలాగే ఉన్నాయి'' అని చెప్పుకొచ్చారు. కాగా, తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసినా తమకు ఎలాంటి పరిష్కారం లభించలేదని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. హోటల్స్‌లో ఆహార పదార్థాల పట్టిక (మెనూ) ఇచ్చినట్లు శ్రీకృష్ణ కమిటీ ఆరు పరిష్కార మార్గాలను సూచించిందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

"కమిటీ ఇది చేయండి.. అది చేయండి అంటూ మార్గాలిచ్చింది. వాటిలో ఏ మార్గాన్ని ఎంచుకుంటే ఏం జరుగుతుందో, ఏయే పరిణామాలు సంభవిస్తాయో చెప్పలేదు'' అని ఓ నాయకుడు అన్నారు. ఆ మార్గాలు, వాటిని ఎంచుకోవటం వల్ల తలెత్తే పరిణామాల గురించి త మ పార్టీ ఆలోచించుకోవాల్సి ఉందని, వాటి తదనంతర పరిణామాలను పట్టించుకోకుండా ఏదో ఒక పరిష్కార మార్గాన్ని ఎంచుకోవటం సబబు కాదని చెప్పారు. మొత్తం మీద,త ఏదో కారణం చెబుతూ తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు అధిష్టానం వాయిదా వేస్తూ వస్తోంది. మంత్రి టిజి వెంకటేష్ చెప్పినట్లు వచ్చే ఎన్నికలకు ఆరు నెలల ముందే ఏదో ఒక ప్రకటన చేస్తుందని భావించాలేమో...

English summary
Telangana JAC has succeeded in organising Telangana march with lakhs of people in Hyderabad. Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao is trying to change Congress high command mood, still, statehood for Telangana is remaingin as a sistant dream.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X