వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభకు అహ్మద్ పటేల్ ఎన్నిక: రియల్ విన్నర్ ఈసీ

గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో సిసలైన విజేతగా ఎన్నికల కమిషనే (ఈసీ) నిలిచింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ గుజరాత్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే ప్రక్రియ.. ఎన్నో మలుపుల మధ్య అత్యంత ఉత్కంఠభరిత పోరు

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్/ న్యూఢిల్లీ: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో సిసలైన విజేతగా ఎన్నికల కమిషనే (ఈసీ) నిలిచింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ గుజరాత్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే ప్రక్రియ.. ఎన్నో మలుపుల మధ్య అత్యంత ఉత్కంఠభరిత పోరుగా మారుతుందని చాలామంది వూహించలేదు.

విజయం కోసం బీజేపీ అన్నిరకాల వ్యూహోపాయాల్నీ అమలు చేసినా.. కాంగ్రెస్‌లో క్రాస్‌ఓటింగ్‌, చీలికలు సంభవించినా.. చివరికి గెలుపునకు కనీసంగా అవసరమైన 44 ఓట్లతో అహ్మద్‌పటేల్‌ ఒడ్డున పడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ వ్యూహాలు, పలు ఉత్కంఠ పరిణామాల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి, సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ విజయం సాధించినా, ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం మొత్తం ఫలితాలను మలుపుతిప్పింది.

చాలాకాలంగా గెలుపు ముఖం చాటేసిన కాంగ్రెస్‌ పార్టీకిది అత్యుత్తమ వార్త అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, అహ్మద్‌పటేల్‌ను ఓడించేందుకు బీజేపీ తనకు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవడంతోపాటు శక్తియుక్తులన్నింటినీ ప్రదర్శించడమే ఆసక్తికరం.

Recommended Video

Rajya Sabha Elections : After Winning Ahmed Patel's next target is...

ఎమ్మెల్యేల బలాబలాల ప్రకారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభకు ఎన్నిక ముందే ఖరారైంది. సరిపడా సంఖ్యాబలం లేకపోయినా మూడో అభ్యర్థి గెలుపుకోసం బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. కాంగ్రెస్ నుంచి బల్వంత్‌సింహ్ రాజ్‌పుత్‌ను పార్టీలో చేర్చుకుని అతడినే కాంగ్రెస్‌పై పోటీకి దింపింది.

వాఘేలా నాయకత్వంలోని కాంగ్రెస్ తిరుగుబాటు వర్గాన్ని బయటకు లాగింది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ ఉన్న ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకుంటూ, గెలుపు దిశగా హోరాహోరీగా పోరాడింది. ఒక దశలో అహ్మద్ పటేల్ విజయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అలాంటి కీలక సందర్భంలో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం మొత్తం ఫలితాన్నే తిరుగరాసింది. కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే విజయాన్ని అందించింది.

సోనియా కార్యదర్శిగా ఎన్నికల వ్యూహకర్త

సోనియా కార్యదర్శిగా ఎన్నికల వ్యూహకర్త

గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభించేందుకు అనుమతించాలని కోరుతూ రిటర్నింగ్ అధికారి సాయంత్రం 5.19 గంటలకు ఈసీకి నివేదిక పంపారు. బీజేపీకి ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భోలాభాయ్ గోహిల్, రాఘవ్‌జీభాయ్ పటేల్ ఓట్లను తిరస్కరించాలని కోరుతూ కాంగ్రెస్ ఎన్నికల ఏజంట్ రెండు రాతపూర్వక దరఖాస్తులు సమర్పించారని ఆ నివేదికలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనానియమావళి 1961లోని 39 ఏఏ నిబంధన ప్రకారం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఏజంట్‌కు కాకుండా ఇతరులకు తమ ఓట్లను చూపి, నిబంధనలను ఉల్లంఘించారని తమకు ఫిర్యాదు చేశారని నివేదించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు పోటాపోటీగా రెండుసార్లు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి తమ వాదనలను బలంగా వినిపించారు.

రెండోసారి ఈసీతో సమావేశమైన కాంగ్రెస్ బృందం.. కుల్దీప్‌నయ్యర్ కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును ఉటంకించింది. దీంతో గుజరాత్ రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను చిత్రీకరించిన వీడియోను ప్రధాన ఎన్నికల కమిషనర్ అచల్‌కుమార్ జ్యోతి సారథ్యంలోని పూర్తిస్థాయి కమిషన్ వీక్షించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలిద్దరూ తమ ఎన్నికల ఏజంట్ కు కాకుండా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు బ్యాలెట్ పత్రాలు చూపుతున్నట్లు స్పష్టంగా కనిపించడంతో రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని పక్కనబెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ రెండు ఓట్లు చెల్లవని తీర్పు చెప్పింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజకీయ కార్యదర్శిగా ఉన్న అహ్మద్‌.. ఆ పదవి ద్వారా పార్టీకి ప్రధాన వ్యూహకర్తగా ఉంటూ వస్తున్నారు.

ఆయన్ని ఓడించేందుకు శాయశక్తులా యత్నించడం ద్వారా.. కాంగ్రెస్‌ విముక్త భారత్‌ లక్ష్యం నుంచి ఆ పార్టీ అత్యున్నత స్థాయి నేతలకూ మినహాయింపు లేదని రుజువు చేయాలని బీజేపీ భావించినట్లు తెలుస్తోంది. సోనియాగాంధీకి అత్యంత విశ్వసనీయ నేతలను ఓడించడం ద్వారా ఆమె చుట్టూ ఉన్న ఛట్రాన్ని విచ్ఛిన్నం చేయవచ్చనే సందేశాన్ని ఇవ్వాలని తమ పార్టీ కోరుకుందని బీజేపీ నేత ఒకరు పేర్కొన్నారు. ఈ క్రమంలో తమ అభ్యర్థి ఓడిపోయినా పార్టీ కొంతమేర ప్రయోజనాల్ని సాధించిందని అన్నారు. తాజా ఉదంతం కాంగ్రెస్‌ నేతల్ని తప్పకుండా భయపెట్టే ఉంటుందనీ, ముఖ్యంగా సుదీర్ఘ కెరీర్‌ను ఆశించే వారికి ఆందోళన మిగిల్చి ఉంటుందని వ్యాఖ్యానించారు.

చెమటోడ్చి విజయం సాధించిన అహ్మద్ పటేల్

చెమటోడ్చి విజయం సాధించిన అహ్మద్ పటేల్

గుజరాత్‌ నుంచి మూడోస్థానాన్ని గెలిచేందుకు బీజేపీ చేసిన యత్నాలు రాజ్యసభలో వారి స్థానాన్ని మెరుగుదలకు చేస్తున్న తీవ్రకృషికి తార్కాణంగా నిలుస్తున్నాయి. ఇటీవల 58 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచినా మెజారిటీ స్థానాలైన 123కు చాలా దూరంలోనే ఉంది. పలు బిల్లుల్ని విపక్షాలు నిలువరిస్తుండటంతో రాజ్యసభలో ఎన్డీఏ పరిస్థితిపై బీజేపీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మూడోది.. గుజరాత్‌లో 2017 చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో మూడోస్థానాన్ని గెలవడం ద్వారా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ కార్యకర్తల్ని డీలా పడేలా చేయాలనేది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తం కావడంతోపాటు ప్రతివ్యూహాన్ని అమలు చేయడంతో కమలనాథుల వ్యూహాలు దెబ్బ తిన్నాయి.

ఈ ప్రక్రియ యావత్ దేశం వీక్షించింది. కనుక మున్ముందు రాజకీయ పరిణామాలను మార్చేస్తుందనడంలో సందేహం లేదని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. 15 రోజులక్రితం వరకు 57 మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్‌కు అహ్మద్‌పటేల్‌ విజయం నల్లేరుపై నడకే కావాల్సి ఉన్నా.. చావుతప్పి కన్ను లొట్టపోయిన స్థితిలో నెగ్గడం గమనార్హం. అమిత్‌షా చాణక్యంతో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మొగ్గు చూపగా, ఏడుగురు తిరుగుబాటు చేశారు. దీంతో కాంగ్రెస్‌ బలం 44 మంది ఎమ్మెల్యేలకు పరిమితమైంది.

ఈ 44 మందిలోనూ ఒకరు అహ్మద్‌కు వ్యతిరేకంగా ఓటేయగా, జేడీయూ ఎమ్మెల్యే ఓటుతో ఆయనకు 44 ఓట్లొచ్చాయి. ఈ క్రమంలో సునాయాసంగా సాధించాల్సిన విజయానికి చెమటోడ్చాల్సి వచ్చింది. కొంతకాలంగా నానా రకాలుగా సతమతమవుతున్న కాంగ్రెస్‌కు భారీ వ్యతిరేక పరిస్థితుల మధ్య అహ్మద్‌పటేల్‌ సాధించిన నాటకీయ విజయం వూపిరిపోసినట్లయింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 150కి పైగా స్థానాలు సంపాదించాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పెట్టుకున్న లక్ష్యానికి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అహ్మద్ విజయంలో శక్తిసింగ్ గోహెల్ కీలకం

అహ్మద్ విజయంలో శక్తిసింగ్ గోహెల్ కీలకం

జేడీయూ ఏకైక ఎమ్మెల్యే చోటు వాసవ, బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యే నళిన్ కొటాదియా, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఒకరు జయంత్ పటేల్ బోస్కీ ఓటేయడంతో అహ్మద్ పటేల్ విజయ తీరాలకు చేరుకోగలిగారు. భోలాభాయి గోహిల్, రాఘవ్ జీ భాయి పటేల్ అనే కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ బ్యాలెట్ పత్రాలను.. పార్టీ ఎన్నికల ఏజంట్ శైలేశ్ భాయి పార్మార్‌కు కాకుండా అమిత్ షాకు చూపడం ఫలితాన్ని మార్చేసింది. కాంగ్రెస్ పోలింగ్ ఏజంట్ శక్తిసింగ్ గోహిల్ నిబంధనలు ఉల్లంఘించడం చూసి అప్రమత్తమయ్యారు.

ఎన్నికల ఏజంట్‌తో కలిసి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడమే అహ్మద్ పటేల్‌కు కలిసి వచ్చింది. 1997లో 28వ ఏట తన సొంత జిల్లా కేంద్రం భారుచ్ లోక్ సభ స్థానం నుంచి తొలిసారి విజయం సాధించిన అహ్మద్ పటేల్ తర్వాత రెండు దఫాలు (1980, 1984) గెలుపొందారు. తర్వాత గుజరాత్ రాష్ట్రంలో క్రమేపీ హిందుత్వ రాజకీయం బలం పుంజుకుంటుండటంతో లోక్ సభకు ఎన్నికవ్వడం కష్టతరంగా మారింది. దీంతో 1993లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన అహ్మద్ పటేల్ తాజా ఎన్నికతో ఐదోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి ప్రధానులు తమ క్యాబినెట్ లో చేరాలని చేసిన సూచనలను ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి పనిచేస్తూ రావడమే కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు అత్యంత నమ్మకస్తుడిగా చేసింది.

English summary
New Delhi: The Election Commission headquarters in New Delhi received a report from the Gujarat Returning Officer (RO) at 5:19 pm on Tuesday, seeking permission to go ahead with counting for the all-important Gujarat Rajya Sabha poll. The report stated that during the polling, the election agent of Congress Party submitted two written applications for rejection of votes tendered by Bhola Bhai Gohil and Raghavji Bhai Patel, for violation of the procedure under Rule 39AA of the Conduct of Elections Rules, 1961, as they showed their marked ballot papers to people other than the authorized representative of the Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X