వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాంధ్రలో పట్టు సాధనే గంటా ధ్యేయం.. సహచర మంత్రులతో ఎగతెగని వైరం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ అమరావతి: ఏపీ పాలిటిక్స్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు స్పెషలే. రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న గంటా.. ఎక్కడైనా తనదే ఆధిపత్యం అన్న ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. డీఈఓల నియామకంపై గంటా జారీ చేసిన ఆరోపణలను శ్రీకాకుళం మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అడ్డుకున్నట్లే గతంలోనూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక నేతల్లో ఒక్కరైన చింతకాయల అయ్యన్నపాత్రుడు.. తర్వాత ఆ పార్టీలో ఉత్తరాంధ్రకే పెద్దదిక్కు వంటి కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజులతోనూనూ విభేదాలు కొని తెచ్చుకున్నారు. గతంలో అనకాపల్లి ఎంపీగా పని చేసిన గంటా శ్రీనివాసరావు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

2014లో రాష్ట్ర విభజన తర్వాత నాటి టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చించుకుని తనతోపాటు మరి కొందరిని పార్టీలోకి తీసుకెళ్లారు. అంతేకాదు. తొలి నుంచి టీడీపీకి అనుబంధంగా పని చేస్తున్న 'నారాయణ' విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ప్రస్తుత మంత్రి నారాయణకు గంటా వియ్యంకుడు కావడంతో అధినేత చంద్రబాబు వద్ద ఆయన చెప్పిందే వేదంగా నడుస్తూ వచ్చింది. దీన్ని అడ్డం పెట్టుకుని ఉత్తరాంధ్రలో రాజకీయాలకు తెర తీశారు. ఒక్కసారి వాటిని పరిశీలిద్దాం..

 విశాఖపట్నంపైన గంటాకు పూర్తి పట్టు

విశాఖపట్నంపైన గంటాకు పూర్తి పట్టు

మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య వివాదం ఈనాటిది కాదు. తొలి నుంచి ఉన్న విభేదాలు అనునిత్యం బయటపడుతున్నాయి. రాజకీయాల్లో రంగ ప్రవేశం చేసిన తర్వాత గంటా శ్రీనివాసరావు వెనుదిరిగి చూసుకోలేదు. గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన చోడవరం, అనకాపల్లి, విశాఖ నగరంపైనా ఆయన గట్టి పట్టు కలిగి ఉన్నారు. మరోవైపు అయ్యన్న ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన నాటి నుంచి జెండాను వదలిపెట్టకుండా పార్టీని నమ్ముకునే ఉన్నారు. దీంతో ఇద్దరు సీనియర్ నేతల మధ్య టీడీపీ శ్రేణులు నలిగిపోతున్నాయి.

బస్తీ మే సవాల్ అంటున్న గంటా

బస్తీ మే సవాల్ అంటున్న గంటా

విశాఖ రూరల్ ఏరియాలో అయ్యన్న పాత్రుడికి గ్రిప్ ఉంది. ఈ ఇద్దరి మధ్య గంటా తిరిగి టీడీపీలోకి చేరిన తర్వాత మరీ ఎక్కువ అయ్యాయి. వీరిద్దరూ ఎప్పటికీ కలవరన్నది విశాఖలో చర్చ సాగుతూనే ఉన్నది. ఇక 2004 తర్వాత దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇద్దరికి పదవులు ఇచ్చారు. దీంతో ఎవరికి వారు గ్రూపులు కొనసాగిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా పరస్పరం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. విశాఖ పరిధిలో భూ ఆక్రమణల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు పాత్రపై విమర్శలు గుప్పించిన మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు.. బస్తీ మే సవాల్ అనే దశకు చేరుకున్నారు. ఇది చిలికి చిలికి గాలివానగా మారింది.

 భూభాగోతంపై ఇలా ఏపీ సర్కార్ ‘సిట్' ఏర్పాటు

భూభాగోతంపై ఇలా ఏపీ సర్కార్ ‘సిట్' ఏర్పాటు

రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మధ్య వివాద పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబు ఎంటరయ్యారు. ఏకంగా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో దీనిపైనే చర్చించారు. సదరు మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులకు హెచ్చరికలు జారీ చేశారని సమాచారం. భూ కుంభకోణంపై సిట్‌ను ఏర్పాటు చేసి తాత్కాలికంగా తగాదాను సర్దుమణిగేలా చేశారు. ఇదే ‘సిట్'కు చింతకాయల అయ్యన్నపాత్రుడు తన సహచర మంత్రి గంటా శ్రీనివాసరావు ‘భూ' భాగోతం చిట్టా అందజేశారని విమర్శలు ఉన్నాయి. ఈ భూ భాగోతం వెనుక రాష్ట్ర మంత్రి, చినబాబుగా పేరున్న నారా లోకేశ్ కూడా ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. బయటకు కలిసిపోయినట్లు కనిపిస్తున్నా వీరిద్దరి మధ్య 2014 నుంచే పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 విజయనగరం జిల్లాపై పట్టు కోసం ఇలా ప్రయత్నాలు

విజయనగరం జిల్లాపై పట్టు కోసం ఇలా ప్రయత్నాలు

ఇంతకుముందు చోడవరం ఎమ్మెల్యేగా, అనకాపల్లి ఎంపీగా.. ప్రస్తుతం భీమిలీ ఎమ్మెల్యేగా పని చేసిన గంటా శ్రీనివాసరావు అనుసరిస్తున్న విధానాలతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నదన్న విమర్శలు ఉన్నాయి. ప్రత్యేకించి విశాఖపట్నం జిల్లాలో భూ ఆక్రమణలపై ప్రజలు భగ్గుమంటున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయ ప్రభావం ఉంటుందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పట్నుంచే ప్రత్యామ్నాయం కోసం మంత్రి గంటా శ్రీనివాసరావు ఎదురుచూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అందుకోసం పొరుగున ఉన్న విజయనగరం జిల్లాలో సురక్షిత స్థానం కోసం వేచి చూస్తున్నారు. అయితే అక్కడ పాగా వేయాలంటే కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు నుంచి ఎటువంటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి వరకు విజయనగరం జిల్లాలో అశోక్ గజపతి రాజు నిర్ణయాలను యధాతథంగా అమలు చేస్తూ వచ్చారు.

 విజయనగరంలో ‘అశోక్'డిదే పెత్తనం అంతా..

విజయనగరంలో ‘అశోక్'డిదే పెత్తనం అంతా..

కానీ విజయనగరం ఇన్‌చార్జీ మంత్రి గంటా శ్రీనివాసరావు రంగ ప్రవేశం చేసిన తర్వాత సీన్ మారింది. పార్టీ సంస్థాగత నిర్ణయాల్లో తన మాటే చెల్లుబాటు కావాలని కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పట్టుబట్టారు. కానీ అందరి అభిప్రాయం వ్యక్తిగతంగా తెలుసుకుంటానని ఇంచార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పడంతో పాటు, జిల్లా నాయకుల నుంచి విడివిడిగా అభిప్రాయ సేకరణ జరిపారు. అప్పట్లో జిల్లా అధ్యక్ష పదవికి జగదీష్‌తో పాటు, ఎమ్మెల్యేలు మీసాల గీత, కెఎ నాయుడు తదితరులు పోటీపడ్డారు. ఎంపికపై ఇటీవల ఐవీఆర్‌ఎస్‌ ద్వారా అభిప్రాయసేకరణ జరిపారు. ఈసారి కెఎనాయుడు, ఆయన సోదరుడు కొండబాబు, మహంతి చిన్నంనాయుడిపై అభిప్రాయ సేకరణ జరిపారు. అభిప్రాయసేకరణ చేసినవారి జాబితాలో జగదీష్‌ పేరు లేకుండా అశోక్ గజపతి రాజుకు షాకిచ్చారు. దీనికితోడు సహచర మంత్రి సుజయకృష్ణ రంగారావుకు ప్రాధాన్యం ఇచ్చేలా చూస్తున్నారని విమర్శలు వినిపించాయి.

సిక్కోలులో మంత్రిదే అచ్చెన్నాయుడుదే పట్టు

సిక్కోలులో మంత్రిదే అచ్చెన్నాయుడుదే పట్టు

తాజాగా ఏపీలో 11 జిల్లాలకు పూర్తి కాలం జిల్లా విద్యాశాఖ అధికారుల (డీఈఓ) నియామకం విషయంలో శ్రీకాకుళం జిల్లా మంత్రి కింజారప్పు అచ్చెన్నాయుడుతో వివాదం తలెత్తింది. తన విధాన నిర్ణయాలే అమలు కావాలని గంటా వాదించినట్లే అచ్చెన్నాయుడు కూడా పట్టుబడుతుంటారు. శ్రీకాకుళం జిల్లా విషయమై ఏ మంత్రి ఏ జీవో జారీ చేసినా కింజారపు అచ్చెన్నాయుడికి నచ్చాల్సిందే. లేదంటే ఆ ఆదేశాలు అమలుకు నోచుకోవంటే అతిశయోక్తి కాదు. శ్రీకాకుళం జిల్లా డీఈఓగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎం సాయిరాంను శ్రీకాకుళం జిల్లా విద్యాధికారిగా నియమించారు.

సిక్కోలులో నేనే సర్వస్వం అని తేల్చేసిన అచ్చెన్న

సిక్కోలులో నేనే సర్వస్వం అని తేల్చేసిన అచ్చెన్న

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ సూచనల మేరకు డీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమైన సాయిరాంకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన్ను జిల్లా డీఈఓగా జాయిన్‌ కావద్దని చెబుతున్నారని, మంత్రి అచ్చెన్నాయుడును కలవాలని సమాచారం అందింది. తాను జిల్లాలో డిప్యూటీ డీఈఓగా రెండు డివిజన్లలో పనిచేశానని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చానని, మీరు చెప్పినట్లే నడుచుకుంటానని అచ్చెన్నకు విన్నవించినా ఫలితం దక్కలేదు. డీఈఓల నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని అక్కడ ఉన్న కొందరు ఆయన దృష్టికి తేగా ‘ఈ జిల్లాలో ప్రభుత్వం అంటే నేనే. ఏ శాఖ అయినా నామాట ప్రకారం నడవాల్సిందే. నా మాటే జీఓ' అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దీనిపై గంటా శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో రెగ్యులర్‌ డీఈఓలు ఉండాల్సిందేనని, ఇన్‌ఛార్జి డీఈఓలను కొనసాగించే ప్రసక్తే లేదని చెప్పారు. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఇన్‌ఛార్జి డీఈఓగా కొనసాగుతున్న అధికారిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

English summary
AP Minister Ganta Srinivasa Rao trying to high handness in North Andhra Politics. But ground realities different. Another Vishaka Minister Chintakayala Aayyanna Patrudu, Union Minister Ashok Gajapati Raju and Srikakulam Minister Achchennaidu facing Ganta group politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X