వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో ప్రచార వేడి: ఎస్పీ - కాంగ్రెస్ కూటమి జోరు

యూపీలో అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోదశ పోలింగ్ జరిగే 12 జిల్లాల పరిధిలోని 53 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడనున్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

లక్నో: యూపీలో అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోదశ పోలింగ్ జరిగే 12 జిల్లాల పరిధిలోని 53 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడనున్నది. ఇంతకుముందు మూడు దశల పోలింగ్‌లో సగానికి పైగా స్థానాల్లో అభ్యర్థులు, ఆయా పార్టీల భవితవ్యం ఖరారై పోవడంతో ప్రచారం పూర్తిగా వేడెక్కింది.

'స్కామ్ (అవినీతి)' అంశం మొదలు నేతల వ్యక్తిగత అంశాలు ప్రచారంలో అనాలోచితంగానే దొర్లిపోతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ మొదలు బరిలో నిలిచిన సమాజ్ వాదీ పార్టీ - కాంగ్రెస్, బీఎస్పీ నేతలు నువ్వా? నేనా? అన్నట్లు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. పరస్పరం సమాధానాలు చెప్తూనే ప్రతి సవాళ్లు విసురుతున్నారు. ప్రధాని మోడీ అనూహ్యం మతపరమైన అంశాలను జోడిస్తూ ఆరోపణలకు దిగడం పరిస్థితుల్లో నైరాశ్యానికి సంకేతమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు మూడుదశల పోలింగ్ సరళి ఆధారంగా ఫలితాలపై అంచనాలు వెలువడుతున్నాయి. ఎస్పీ - కాంగ్రెస్ కూటమి పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజాయితీకి మారుపేరుగా, ఆర్థికవేత్తగా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన మోడీ.. బీఎస్పీ అధినేత మాయావతి ఒక మహిళ అని కూడా చూడకుండా వ్యక్తిగత విమర్శలకు దిగారు.

బీఎస్పీకి మోదీ సరికొత్త నిర్వచనం

బీఎస్పీకి మోదీ సరికొత్త నిర్వచనం

బీఎస్పీ అంటే బెహన్జీ సంపత్తి పార్టీ అని ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దానికి ప్రతిగా మాయావతి ధీటుగానే స్పందించారు. నరేంద్ర దామోదర్ మోడీ అంటే మిస్టర్ నెగెటివ్ దళిత్ మ్యాన్ అని ఎదురుదాడి చేస్తూనే తాను బ్రహ్మచారినని, కానీ ప్రధాని మోదీ పెండ్లి చేసుకుని, భార్యను వదిలేశారని.. అయినా అది వేరే విషయమని వ్యాఖ్యానించి దాటేశారు. తొలుత ‘స్కామ్' అంటే సమాజ్ వాదీ, కాంగ్రెస్, అఖిలేశ్, మాయావతి అని సరికొత్త నిర్వచనం ఇచ్చిన మోదీకి కాంగ్రెస్ - ఎస్పీ కూటమి యువనేతలు అఖిలేశ్, రాహుల్ గాంధీ ప్రతిగా స్పందించి.. స్కామ్‌లో ఎ అంటే అమిత్ షా, ఎం అంటే మోడీ అని రిప్లయి ఇచ్చారు. తాను యూపీ దత్తపుత్రుడినన్న మోడీ అభ్యర్థనను రాహుల్ ఆయన సోదరి ప్రియాంక కొట్టి పారేశారు. యూపీకి దత్త పుత్రుడు అవసరం లేదని ప్రియాంక వ్యాఖ్యానిస్తే.. సంబంధాలు పెంచుకుంటే వస్తాయని, ప్రకటనలు చేస్తే కాదని రాహుల్ ఎద్దేవాచేశారు.

 మోడీ రుణాల మాఫీకి వెనుకంజ వేస్తున్నారన్న రాహుల్

మోడీ రుణాల మాఫీకి వెనుకంజ వేస్తున్నారన్న రాహుల్

అప్పుల ఊబిలో కూరుకున్న రైతులను ఆదుకునేందుకు పంట రుణాలు మాఫీ చేయాలన్న తమ అభ్యర్థనపై మీన మీసాలు లెక్కిస్తున్న ప్రధాని మోదీ.. బీజేపీని గెలిపిస్తే పంట రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పిస్తున్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే కేంద్ర క్యాబినెట్ సమావేశం ఏర్పాటుచేసి ఐదు నిమిషాల్లో రుణాల మాఫీకి చర్యలు తీసుకోవచ్చునని, కానీ ఆయన ఉద్దేశాలు వేరేగా ఉన్నాయని అసలు సంగతి బయట పెట్టారు. 2008లో తమ ప్రభుత్వం రూ.7000 కోట్ల రుణాలు రద్దుచేసిందని గుర్తుచేశారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ప్రధాని మోదీ ముఖంలో చిరునవ్వు మాయమైందని వ్యాఖ్యానించారు.

ఎస్పీ - కాంగ్రెస్ పొత్తుపై ప్రధాని మోడీ ఇలా..

ఎస్పీ - కాంగ్రెస్ పొత్తుపై ప్రధాని మోడీ ఇలా..

ములాయం హంతకులతో చేతులు కలిపారని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు అఖిలేశ్‌ను నిందించడం ద్వారా రెండు పార్టీల కార్యకర్తల మధ్య విభేదాలు కల్పించేందుకు ప్రయత్నించిన మోడీ.. తాజాగా మతం రంగు పులిమి రాజకీయ పునరేకీకరణకు ప్రయత్నించారు. దానికి విద్యుత్ సరఫరా అంశాన్ని అస్త్రంగా వాడుకున్నారు. గ్రామంలో సమాధులు ఉంటే శ్మశానం ఉండాలని, రంజాన్ వంటి పండుగలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఎస్పీ సర్కార్... దీపావళి తదితర పండుగలకు విద్యుత్ సరఫరాలో వివక్ష చూపుతున్నారని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్య అత్యంత వివాదాస్పదమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

నరేంద్ర మోడీకి అఖిలేష్ సవాల్

నరేంద్ర మోడీకి అఖిలేష్ సవాల్

దీనిపై సోమవారం రాయబరేలీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో అఖిలేశ్ మాట్లాడుతూ ఎవరి పేరెత్తకుండానే మోదీపై, గుజరాత్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గుజరాత్ పర్యాటక సంస్థ ప్రచారకర్తగా వైదొలగాలని బాలీవుడ్ బీగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను అభ్యర్థించారు. ‘గుజరాతీలు గాడిదలకు ప్రచారం కల్పిస్తారు. వారే నన్ను శ్మశానాల కోసం పనిచేస్తున్నారని విమర్శిస్తారు' అని ప్రధాని మోదీపై పరోక్ష విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నదని చెప్పారు. మోడీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో 24 గంటల పాటు తమ ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేస్తున్నదా? లేదా? ప్రధాని తన దైవంగా భావించే పవిత్ర గంగానదీ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ చేశారు. విద్యుత్ సరఫరాలో వివక్ష చూపుతున్నారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. ఆయనపై చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసింది.

అఖిలేశ్ సర్కార్‌పై మిశ్రమ స్పందన

అఖిలేశ్ సర్కార్‌పై మిశ్రమ స్పందన

కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌కు సారథ్యం వహించిన బీజేపీ రికార్డు స్థాయిలో విజయాలు సాధించి దాదాపు మూడేళ్లు అవుతుండగా, యూపీలో అఖిలేశ్ పాలనపై ప్రజల్లో మిశ్రమ స్పందన, నవంబర్ ఎనిమిదో తేదీన నోట్ల రద్దు నిర్ణయాలపై సగటు పౌరుడి స్పందన బయటపడే అవకాశం ఉన్నది. ఇప్పటికి ఎన్నికలు పూర్తయిన ప్రాంతంలో ప్రజల తీర్పును అంచనా వేయడం తేలికైన విషయమేమీ కాదు. గత అక్టోబర్‌లో మొదలై జనవరి మొదటివారంలో ముగిసిన ఎస్పీ యాదవ పరివారంలోని అంతర్గత పోరు మీడియా దృష్టిని దాని ప్రాధాన్యాన్ని మించి ఆకర్షించింది.

తొలి రెండు దశల్లో కూటమివైపే ముస్లింలు

తొలి రెండు దశల్లో కూటమివైపే ముస్లింలు

ఎస్పీ ఇంటి పోరు ముగియగానే కాంగ్రెస్‌తో తొలిసారి కుదిరిన ఎన్నికల పొత్తు కుదిరిన తొలి రోజుల్లో ప్రియాంక ‘క్రియాశీలం'పై, తర్వాత ఎస్పీ కొత్త జాతీయ అధ్యక్షుడు, సీఎం అఖిలేశ్‌, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ జోడీ ప్రచారంపై కూడా అనుకూల అంచనాలు వెలువడ్డాయి. మొదటి రెండు దశల పోలింగ్‌ జరిగిన పశ్చిమ యూపీలో ‘ఓటింగ్‌ సరళి' ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి వైపు మొగ్గు చూపుతోందని ఎన్నికల పండితులు జోస్యం చెప్తున్నారు. ముస్లింలతో పాటు యాదవ్‌లు ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న అవధ్ రీజియన్ ప్రాంతంతోపాటు లక్నో తదితర ప్రాంతాల్లో మూడో దశ పోలింగ్‌లో కూడా అఖిలేశ్‌కు ఉన్నఇమేజ్ అధికార కూటమికి లబ్ది చేకూరుస్తుందని భావిస్తున్నారు. లక్నో నగరంలో చేపట్టిన అభివ్రుద్ది కార్యక్రమాలు, ప్రత్యేకించి ఆగ్రా - లక్నో ఎక్స్ ప్రెస్ వే, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, మెట్రో రైలు తదితర ప్రాజెక్టులు రికార్డు సమయంలో పూర్తి కావడం అధికార ఎస్పీకి అనుకూలమేనని చెప్తున్నారు.

ఎస్పీ - కాంగ్రెస్ పొత్తు ప్రభావం ఇలా..

ఎస్పీ - కాంగ్రెస్ పొత్తు ప్రభావం ఇలా..

తండ్రి ములాయంతో పోల్చితే క్లీన్‌ ఇమేజ్‌తోపాటు అందరినీ ఆకట్టుకుంటున్న భార్య డింపుల్‌ ప్రచారం, రాహుల్‌తో కలిసి చేస్తున్న ప్రచారం ఫలితంగా అఖిలేశ్‌ ‘జనాకర్షణ శక్తి' ఉన్న నేతగా ఆవిర్భవించారని కూడా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వ్యక్తిగతంగా చూస్తే ప్రధాని నరేంద్ర మోదీతోనూ సమానంగా అఖిలేశ్ ప్రజాదరణ సాధించారని చెప్తున్నారు. గత ఎన్నికల్లో నెహ్రూ - గాంధీ కుటుంబ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు (సోనియా, రాహుల్‌) మాత్రమే గెలిచిన కాంగ్రెస్‌ బలం యూపీలో బాగా కుంచించుకుపోయింది. కానీ ముస్లింలతోపాటు అగ్రవర్ణాలు, దళితులు ఇతర సామాజిక వర్గాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8% ఓటింగ్ గల కాంగ్రెస్ పార్టీతో ఎస్పీ పొత్తు పెట్టుకోవడం ఇరు పార్టీలకు లబ్ది చేకూర్చే అంశంగా భావిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన బీజేపీ హవా

లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన బీజేపీ హవా

గత లోక్‌సభ ఎన్నికల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకూల పవనాలేమీ వీయడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముస్లింలు మినహా అందరి దృష్టినీ ఆకట్టుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. పూర్తిగా అభివృద్ధి అజెండాను నమ్ముకోకుండా, ప్రజలను మత ప్రాతిపదికన పునరేకీకరణ దిశగా ఆయన ప్రసంగాలు రెండు మూడు రోజులుగా సాగుతున్నాయి. యూపీ గెలుపుపై నమ్మకం లేకనే ముస్లింల కబరస్థాన్‌-హిందువుల స్మశానం గురించి ఎన్నికల సభల్లో మోదీ మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల జనం ముఖ్యంగా పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఈ మేరకు ఎన్నికల్లో దాని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఇక దళితులు, ముస్లింల కాంబినేషన్‌తోపాటు ఇతర సామాజిక వర్గాల సమ్మేళనం ద్వారా 2007లో మాదిరిగా అధికారంలోకి రావాలని భావిస్తున్న బీఎస్పీ అధినేత మాయావతి కలలు ఏ మేరకు విజయవంతం అవుతాయో తెలియాలంటే మార్చి 11 వరకు వేచి చూడాల్సిందే.

English summary
Campaign in Uttar Pradesh assembly elections is in peak stage. Congress and SP are in coalition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X