వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీకల్లోతు కష్టాల్లో లాలూ: సంక్షోభం అంచున నితీశ్ సర్కార్

నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని, అధికార బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ర్యాలీ చేయడంలో ముందు వరుసలో నిలుస్తున్న రాష్ట్రీయ జనతా పార్టీ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

పాట్నా: నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని, అధికార బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ర్యాలీ చేయడంలో ముందు వరుసలో నిలుస్తున్న రాష్ట్రీయ జనతా పార్టీ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. తొలి యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వేశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు.. కాంట్రాక్టుల అప్పగింతకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు లాలూను వెంటాడుతున్నది.

1999లో భారతీయ రైల్వేలు ఏర్పాటు చేసిన 'భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) పరిధిలోకి 2001లో రైల్వేశాఖ నిర్వహిస్తున్న హోటళ్లు తీసుకొచ్చారు. ప్రస్తుత జార్ఖండ్ రాజధాని రాంచీతోపాటు ఒడిశాలో పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన పూరీల్లోని రెండు హోటళ్లను ఐఆర్ సీటీసీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

నాటి మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో రైల్వేశాఖ మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్.. రాంచీ, పూరీల్లోని రెండు హోటళ్ల నిర్వహణ బాధ్యతను పాట్నా కేంద్రంగా పనిచేస్తున్న సుజాతా హోటల్స్ యాజమాన్యానికి కట్టబెట్టేందుకు భారీ అవకతవకలకు పాల్పడ్డారని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆరోపణ. నాటి టెండర్లు ఖరారుచేస్తూ భారతీయ రైల్వేలు, ఐఆర్సీటీసీలు కలిసి సుజాతా హోటల్స్ యాజమాన్యంతో అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోవడంలో 'క్విడ్ కో ప్రో' జరిగిందని పేర్కొంటూ సీబీఐ ఈ నెల ఐదో తేదీన కేసు నమోదు చేసింది.

కానీ 2004 మే 31న తాను రైల్వేశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినా.. అంతకుముందు అటల్ బీహారీ వాజ్ పేయి ప్రభుత్వమే.. రైల్వేశాఖ ఆస్తుల, క్యాటరింగ్ కార్యకలాపాలు, హోటళ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నదని నాటి వివరాలను మీడియాకు లాలూ వివరించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య మాత్రమేనన్నారు.

'ఐఆర్సీటీసీ పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ, దాని ఫైల్ ఒక్కటి కూడా రైల్వే మంత్రివద్దకు రాదు. అలా జరిగిందని ఏ ఒక్కరైనా రుజువు చేయగలరా?' అని సవాల్ చేశారు. 2006లో కొన్ని హోటళ్లకు అధిక బిడ్డింగ్ కే క్యాటరింగ్ సర్వీసుల నిర్వహణ బాధ్యత అప్పగించానన్నారు. ఇందులో తన తప్పిదమేమీ లేదని స్పష్టం చేశారు.

కానీ సీబీఐ చర్యను సమర్థిస్తూ కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు గతంలోనే నమోదైన కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టిందని సమర్థించారు. చేసిన తప్పులపై దర్యాప్తు చేయవద్దా? అని ఎదురు ప్రశ్నించారు.

తాజాగా లాలూ కుటుంబంపై సీబీఐ దాడుల ప్రభావం తన సంకీర్ణ ప్రభుత్వంపై పడుతుందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీహార్ రాష్ట్రంలో నితీశ్ సారథ్యంలోని జేడీయూ - ఆర్జేడీ - కాంగ్రెస్ సంకీర్ణ కూటమి భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

2006లో ఇలా

2006లో ఇలా

2006లో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు పూరీ, రాంచీ నగరాల్లో భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు హోటళ్ల నిర్వహణను పాట్నా కేంద్రంగా పనిచేస్తున్న సుజనా హోటల్స్‌కు అప్పగించడంలో కుట్ర దాగి ఉన్నదని సీబీఐ అదనపు డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా చెప్పారు. ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో సుజాతా హోటల్స్ మాత్రమే పాల్గొన్నాయని వివరించారు. దీనికి ప్రతిగా రాంచీ, పూరీలతోపాటు బీహార్ రాజధాని పాట్నాల్లోని విలువైన భూములను డిలైట్ మార్కెటింగ్ సంస్థ డైరెక్టర్ సరళాగుప్తాకు సుజాతా హోటల్స్ యాజమానులు వినయ్ కొచ్చర్, విజయ్ కొచ్చర్ చౌకధరకు విక్రయించారు. సరళా గుప్తా తర్వాత 2010 - 15 మధ్య ఆ భూమిని రబ్రీదేవి, తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలోని లారా ప్రాజెక్ట్స్‌కు అప్పగించినట్లు వివరించారు. రూ.32.5 కోట్ల విలువైన ఈ భూమిని లాలూ కుటుంబ యాజమాన్యంలోని లారా ప్రాజెక్ట్స్ అనే సంస్థకు కేవలం రూ.65 లక్షలకే బదిలీ చేశారని సీబీఐ అభియోగం. లాలూ సన్నిహితుడు, ఆర్జేడీ ఎంపీ ప్రేమ్‌చంద్‌గుప్తా భార్య సరళాగుప్తా, సుజాతా హోటల్స్ డైరెక్టర్లు విజయ్ కొచ్చర్, వినయ్ కొచ్చర్, లారా ప్రాజెక్ట్సుగా పేరొందిన డిలైట్ మార్కెటింగ్ కంపెనీ నిర్వాహకుడు, నాటి ఐఆర్సీటీసీ ఎండీ పీకే గోయల్ ఇండ్లపైనా సీబీఐ దాడులు చేసింది.

బీజేపీని పెకలించేస్తానన్న లాలూ

బీజేపీని పెకలించేస్తానన్న లాలూ

తాను అవినీతికి పాల్పడినట్లు పేర్కొంటూ సీబీఐ కేసు నమోదు చేయడాన్ని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ కొట్టిపారేశారు. నేను, నా పార్టీ భయపడదు. ఇదంతా నాకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని అభివర్ణించారు. పశుగ్రాసం కేసులో కోర్టు విచారణకు హాజరయ్యేందుకు రాంచీకి వచ్చిన లాలూ మీడియాతో మాట్లాడారు. టెండర్లలో తప్పులేమీ జరుగలేదు. ఇది బీజేపీ కుట్ర. వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాడులు చేయిస్తున్నది అని అన్నారు. బీజేపీ ముందు తలవంచబోనని లాలూ స్పష్టంచేశారు. మోదీ, అమిత్‌షా వినండి. నన్ను ఉరితీయొచ్చు. కానీ అంతకంటే ముందు నేను మిమ్ముల్నీ, మీ అహంకారాన్ని తుదముట్టిస్తా. దేశం నుంచి బీజేపీని కూకటివేళ్లతో పెకలించి వేస్తా. మీరు మహా కూటమిలో విభేదాలు సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నాలను బీహారీలు అర్థం చేసుకున్నారు అని మండిపడ్డారు.

అనారోగ్యం పేరిట రాజ్ గిరికి సీఎం నితీశ్

అనారోగ్యం పేరిట రాజ్ గిరికి సీఎం నితీశ్

మరోవైపు అనారోగ్యం పేరిట రాజ్ గిరికి వెళ్లారు బీహార్ సీఎం నితీశ్ కుమార్. లాలూ కుటుంబ నివాసాలపై దాడులు జరిగిన వెనువెంటనే ఆయన అధికారులకు ఫోన్‌ చేసి, వెనువెంటనే రాజ్‌గిరిలోని తనతో భేటీ అవ్వాలని ఆదేశించారు. లాలూ ప్రసాద్‌ వ్యవహారం తన మెడకు చుట్టుకునేటట్టు కనిపించడంతో డీజీపీ, హోమ్‌ సెక్రటరీ, చీఫ్‌ సెక్రటరీలతో ఆయన ఈ అత్యవసర సమావేశం ఏర్పాటుచేసినట్టు తెలిసింది. మహాకూటమితో బిహార్‌లో ఆయన అక్కడ ప్రభుత్వం ఏర్పాటుచేశారు. దీంతో నితీష్‌ కుమార్‌, లాలూతో తెగదెంపులు చేసుకుంటారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్ కార్యచరణపై ఆయన ఈ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. అయితే లాలూపై దాడుల నేపథ్యంలో సీఎం ఈ సమావేశం ఏర్పాటుచేయడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాక ప్రస్తుతం కేసు నమోదైన వారిలో ఒకరైన లాలూ కుమారుడు తేజస్వి యాదవ్‌, నితీష్‌ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. తేజస్వియాదవ్‌​ విషయంలో మంత్రులతో నితీష్‌ సమాలోచనలు చేయనున్నట్టు తెలుస్తోంది.

కక్ష సాధింపు చర్యే: కాంగ్రెస్

కక్ష సాధింపు చర్యే: కాంగ్రెస్

లాలూ కుటుంబ సభ్యుల ఇళ్లపై సీబీఐ దాడులను కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా ఖండించారు. చట్టం తన పని తాను నిష్పక్షపాతంగా చేసుకోవాలన్నారు. కానీ సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ జేబు సంస్థలుగా మారాయని న్యూఢిల్లీలో మీడియాతో అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడానికే డర్టీ ట్రిక్స్ పని చేస్తున్నదని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

2019లో ఓటమి ఖాయమన్న మమత

2019లో ఓటమి ఖాయమన్న మమత

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యుల ఇండ్లపై సీబీఐ దాడులు జరిపిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికే సీబీఐని ఉపయోగిస్తుందని ఆమె ఆరోపించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కావడం కల్ల అని స్పష్టం చేశారు. తొలుత రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తుందని, తర్వాత బయటి వ్యక్తులను తీసుకొచ్చి దాడులు చేయిస్తుందని మండిపడ్డారు.

సీబీఐపై మా పెత్తనం లేదన్న కేంద్రం

సీబీఐపై మా పెత్తనం లేదన్న కేంద్రం

లాలూ, ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లపై సీబీఐ దాడులతో కేంద్రానికి, బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు. సీబీఐ చట్టప్రకారం నడుచుకుంటూ విధులు నిర్వహిస్తున్నదన్నారు. ఇంతకుముందు అదికారంలో ఉన్న ప్రభుత్వం.. సీబీఐ స్వతంత్రంగా పని చేయకుండా అడ్డుకున్నదని వ్యాఖ్యానించారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులపై యూపీఏ ప్రభుత్వ హయాంలోనే కేసులు నమోదు అయ్యాయన్నారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీబీఐ పనితీరులో జోక్యం చేసుకోరాదని నిర్ణయించిందని మీడియాకు చెప్పారు. అసలు అవకతవకలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయవద్దంటారా? అని వెంకయ్య ప్రశ్నించారు.

నితీశ్ మౌనమేల?: సుశీల్ కుమార్ మోదీ

నితీశ్ మౌనమేల?: సుశీల్ కుమార్ మోదీ

లాలూ కుటుంబ సభ్యుల ఇండ్లపై సీబీఐ అధికారుల దాడుల విషయమై బీహార్ రాష్ట్రంలోని అధికార జేడీయూ నేతలెవ్వరూ నోరు మెదిపేందుకు ముందుకు రావడం లేదు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ మౌనం వహించడంతోపాటు వేచిచూసే ధోరణి అవలంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. లాలూ ప్రసాద్ యాదవ్ బలహీన పడినా కొద్దీ తమ అధినేత నితీశ్ కుమార్ బలోపేతం అవుతారని జేడీయూ నాయకుడొకరు చెప్పారు. కాగా, లాలూ కుటుంబ సభ్యుల నివాసాలపై సీబీఐ దాడులు జరుపుతున్నా.. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎందుకు మౌనం వహిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ ప్రశ్నించారు.

English summary
New Delhi/Patna: RJD supremo Lalu Prasad today sank into deeper trouble with the CBI conducting raids across four cities in a corruption case in which his wife Rabri Devi and son Tejashwi are among the accused. The case relates to alleged manipulation in award of contract for maintenance of two hotels run by a subsidiary of the Indian Railways--IRCTC-- when the RJD chief was railway minister in the UPA government. The searches, which started at 7 am and included Rabri Devi's Circular Road residence in Patna, were spread across 12 locations in Patna, Ranchi, Gurgaon and Bhubaneswar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X