వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొందూ దొందే.. బాబు ప్లస్ జగన్.. తెలంగాణ అంటే కళ్లమంట

మూడున్నరేళ్ల క్రితం వరకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ల వంటివన్నారు. ఎట్టకేలకు తెలంగాణ విడిపోయింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ / అమరావతి: మూడున్నరేళ్ల క్రితం వరకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ల వంటివన్నారు. ఎట్టకేలకు తెలంగాణ విడిపోయింది. కానీ ఇప్పటివరకు రెండు కళ్ల సిద్ధాంతం పదేపదే ప్రకటించిన చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలు మాత్రమే కీలకమై పోయాయి. నైరుతి రుతు పవనాలు మొదలైన మూడు నెలల తర్వాత కర్ణాటకలోని నారాయణపూర్, ఆల్మట్టి రిజర్వాయర్లు పూర్తిగా నిండిన తర్వాత గానీ దిగువకు నీరు వదలడం లేదు. ఆఖరుకు శ్రీశైలం ప్రాజెక్టుకు ముందు జూరాలకు చేరిన నీరు వచ్చింది వచ్చినట్లు తెలంగాణ రోజుకు 1.5 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేసినా.. లెక్కల్లో కనిపించలేదు.

అంతకుముందు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీరు కావాలంటే ఇటీవల కొత్తగా ప్రారంభించిన మచ్చుముర్రి ఎత్తిపోతల పథకానికి నీటి సరఫరా తర్వాతే వదులుతామని మొండి వాదనకు దిగిన ఘనత ఏపీ సర్కార్‌ది. చివరకు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యానికి చేరుకోగానే 'వరద జలాల'పై ఆధారపడి నిర్మించిన 'పోతిరెడ్డిపాడు' హెడ్ రెగ్యులేటర్‌కు నీటిని విడుదల చేసిన వైనంపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేశాక తగ్గిన నేపథ్యం ఏపీ సర్కార్‌ది.

ఏపీ సీఎం నుంచి మంత్రుల వరకు అంతా ఎదురుదాడి

ఏపీ సీఎం నుంచి మంత్రుల వరకు అంతా ఎదురుదాడి

ఈ విషయమై తెలుగుదేశం పార్టీకి, ఏపీ ప్రభుత్వానికి అనుబంధం అని చెప్పుకునే దిన పత్రికలతోపాటు అన్ని దిన పత్రికలు ‘ఏపీ జలచౌర్యం' అని వార్తా కథనాలు ప్రచురించాయి. వాటితోపాటు వివిధ కారణాల రీత్యా ‘సాక్షి' దిన పత్రిక కూడా ఏపీ జల చౌర్యం అనే వార్తాకథనం ప్రచురించడం ఏపీ సీఎం చంద్రబాబుకు, ఆయన క్యాబినెట్ సహచరులకు నచ్చలేదు. అలవోకగా రాజకీయం చేయడానికి ఒక అస్త్రం దొరికింది కాబట్టి సీఎం నుంచి మంత్రులు మొదలు టీడీపీ నాయకుల వరకు ప్రతి ఒక్కరూ ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డిపై ఎదురు దాడికి దిగారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఒక దిన పత్రిక ‘సిగ్గు సిగ్గు' అని యథాతథంగా ప్రచురించి తన ప్రభుభక్తిని ప్రదర్శించుకున్నది.

ఆంధ్రుల్లో సెంటిమెంట్ రగల్చడమే బాబు కుఠిలనీతి

ఆంధ్రుల్లో సెంటిమెంట్ రగల్చడమే బాబు కుఠిలనీతి

అసలు 1996లో కృష్ణా నదిపై కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మిస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ.. బయటకు వచ్చిన తర్వాత రాజకీయ హడావుడి చేసిన నేపథ్యం ఏపీ సీఎం చంద్రబాబుది. ఒకవేళ కర్ణాటక ప్రాజెక్టులు కట్టుకున్నా రాయలసీమ, డెల్టా ప్రాంతాలకు సాగునీటికి ఇబ్బంది లేదని భావించినందునే పట్టనట్లు వ్యవహరించారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు తెలంగాణ ఉద్యమం సాగుతుండగానే, ఆర్డీఎస్‌ను బద్దలు కొట్టి సాగునీరు తరలించుకుపోయిన నేపథ్యం రాయలసీమ నేతలది. ఇటీవల కూడా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పోతిరెడ్డిపాడుకు నీరు తరలించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కారణాలేమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఊపు లభించింది వైఎస్ హయాంలోనే అన్నది నిష్ఠూర సత్యమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 2014కు ముందు రెండు కళ్ల సిద్ధాంతం ప్రతిపాదించిన చంద్రబాబు తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశం లభించిన ప్రతీసారీ ఆంధ్రుల్లో సెంటిమెంట్ రగిల్చేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారనడానికి సాక్షి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై విమర్శలు చేయడమే తార్కాణం అని చెప్పక తప్పదని విమర్శకులు అంటున్నారు.

తెలంగాణ అక్రమంగా నీరు తరలిస్తుందని ‘సాక్షి'లో కథనాలు

తెలంగాణ అక్రమంగా నీరు తరలిస్తుందని ‘సాక్షి'లో కథనాలు

ఇక ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి సారథ్యంలోని సాక్షి దిన పత్రిక.. చంద్రబాబుపై దాడి చేసే క్రమంలో తెలంగాణ పట్ల తన అక్కసును ప్రదర్శించింది. ‘కృష్ణా వరద జలాలు జూరాల ప్రాజెక్టుకు చేరిన వెంటనే తెలంగాణ సర్కార్‌ కోయిల్‌సాగర్, బీమా, నెట్టెంపాడు ఎత్తపోతల, జూరాల ప్రాజెక్టు కాలువల ద్వారా మళ్లిస్తున్నా చంద్రబాబు పల్లెత్తు మాట మాట్లాడే సాహసం చేసిన దాఖలాలు లేవు. కనీసం తెలంగాణ ప్రభుత్వంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన పాపాన కూడా పోలేదు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద జలాలు చేరాక పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా అరకొరగా నీటిని విడుదల చేయడం.. ఆ వెంటనే తెలంగాణ సర్కార్‌ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం.. దాన్ని సాకుగా చూపి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి నీటి విడుదలను ఆంధ్రప్రదేశ్‌ సర్కారు ఆపడం చకచకా జరిగిపోయింది' అని సాక్షి వార్తాకథనం సారాంశం.

బోర్డుకు ఫిర్యాదు చేశాకే ఇలా నీటి తరలింపు నిలిపివేత

బోర్డుకు ఫిర్యాదు చేశాకే ఇలా నీటి తరలింపు నిలిపివేత

శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జలాలను తరలిస్తోందని తెలంగాణ సర్కార్‌ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన అంశాన్ని ఒక్క ‘సాక్షి' మాత్రమే కాదు తెలంగాణలోని అన్ని పత్రికలూ ప్రచురించాయి. బోర్డుకు ఫిర్యాదు చేశాక కూడా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి జలాలను ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ మళ్లిస్తోందంటూ తెలంగాణ నీటి పారుదల శాఖ చేసిన ఆరోపణలను తెలంగాణ ఎడిషన్‌లో పత్రికలు ప్రచురించాయి. తెలంగాణతో ముడిపడిన అంశాలను ఆయా పత్రికలు అక్కడి ఎడిషన్లలో ప్రచురించడం సాధారణం. అయితే చంద్రబాబు ఈ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని భావించారని సాక్షి ఆరోపించింది. వాస్తవమేమిటంటే క్షేత్రస్థాయిలో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నిఘా ఉంచిన తెలంగాణ ఇంజినీర్లు ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితులను రాష్ట్ర సచివాలయానికి తెలియజేయడంతో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌కు నీటి సరఫరాపై క్రుష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసిన తర్వాత ఏపీ వెనక్కు తగ్గింది. చేసిందే అక్రమంగా నీటి సరఫరా.. పైగా తప్పుబడితే ఎదురు దాడి చేయడమే గొప్పగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ లబ్ధే పరమావధిగా ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య చిచ్చుపెట్టిన తన నైజాన్ని అధికారంలోకి వచ్చాక కూడా ఆయన మరోసారి చాటుకున్నారు. తాను రాష్ట్రానికి నీటిని విడుదల చేస్తుంటే ప్రతిపక్షం అడ్డుపడుతోందని.. ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దిన పత్రిక ‘సాక్షి'.. ఆంధ్రప్రదేశ్‌ జలచౌర్యం చేస్తోందంటూ తెలంగాణ ఎడిషన్‌లలో ప్రచురిస్తోందంటూ పనికిమాలిన రాజకీయానికి తెరతీశారని ‘సాక్షి' ఎదురు దాడికి దిగింది.

1996 నుంచి 2003 వరకు సీమకు నీటి సరఫరా నిల్

1996 నుంచి 2003 వరకు సీమకు నీటి సరఫరా నిల్

శ్రీశైలం జలాశయం సమగ్ర ప్రాజెక్టు నివేదికలోనే ఆ జలాశయం కనీస నీటిమట్టం 854 అడుగులుగా నిర్ణయించారు. కనీస మట్టం మేరకు జలాశయంలో నీరు నిల్వ ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లందుతాయి. కానీ 1996లో కనీస నీటి మట్టాన్ని 834 అడుగులకు తగ్గిస్తూ అప్పట్లో అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. 1996 నుంచి 2003 వరకూ ఏ ఒక్క ఏడాది కూడా 834 అడుగుల మేర కూడా నీటిని నిల్వ చేయలేదు. 790 అడుగుల దిగువ వరకు కూడా నీటిని తోడేసి.. రాయలసీమ నోట్లో మట్టి కొట్టారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టాన్ని 854 అడుగులకు పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని సాక్షి దిన పత్రిక మరో వార్తా కథనం ప్రచురించింది. వైఎస్ హయాంలో రాయలసీమకు ప్రాధాన్యం కల్పిస్తూ ‘పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్' సామర్థ్యం పెంచడానికి జారీ చేసిన జీవో అది. వాస్తవం ఇది. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 874 అడుగులకు చేరిన తర్వాత కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేయవచ్చు. మూడేళ్లుగా 854 అడుగుల నుంచే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ చంద్రబాబు రాయలసీమ నోట్లో మట్టి కొడుతున్నారు. ఈ ఏడాది శ్రీశైలం జలాశయంలో 848 అడుగుల నీటి మట్టం వద్దే విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించడం గమనార్హమని సాక్షి వార్తాకథనం ప్రచురించింది.

వైఎస్ హయాంలోనే ఇలా సామర్థ్యం పెంపు

వైఎస్ హయాంలోనే ఇలా సామర్థ్యం పెంపు

తెలంగాణ ప్రభుత్వానికి భయపడి, కుమ్మక్కయ్యి సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలను కాలరాస్తున్న తీరుతో జనం విస్తూ పోతున్నారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ సర్కార్‌ చేతిలో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఆ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా తాకట్టు పెట్టారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రతిపక్ష నేతకు ముడిపెడుతూ విమర్శలు చేయడం సబబు కాదని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. 2004లో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టడాన్ని అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు తదితరులు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపును నిరసిస్తూ అప్పట్లో పాదయాత్రలు చేశారని సాక్షి దిన పత్రిక గుర్తు చేసింది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ పనుల్లో మిగిలిపోయిన రూ.45 కోట్ల విలువైన పనులు పూర్తి కాకుండా ఇప్పటికీ మోకాలడ్డుతూ దుర్భిక్ష రాయలసీమపై కక్ష సాధిస్తున్నదని పేర్కొన్నది.

English summary
AP CM Chandrababu politicalise the Sakshi News Article on 'AP Jala Choryam'. This news article is weapon for AP TDP, CM Chandrababu. But one thing that is AP Government assosiate news papers also published this news. However it's not come into Chandrababu. His concentration only YS Jagan and his Sakhi Telugu daily because it exposes AP CM failures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X