వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు హెచ్చరికలు గాలికే: తెలుగు తమ్ముళ్ల తెగింపు

‘గ్రూపులు, గొడవలను సహించం. క్రమశిక్షణ పాటించండి. లక్ష్మణ రేఖ దాటితే ఎంత సీనియర్ నాయకుడినైనా వదులుకునేందుకు రెడీ’ ఇదీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలుగు తమ్ముళ్లకు జారీచేసిన హెచ్చరిక.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి: 'గ్రూపులు, గొడవలను సహించం. క్రమశిక్షణ పాటించండి. లక్ష్మణ రేఖ దాటితే ఎంత సీనియర్ నాయకుడినైనా వదులుకునేందుకు రెడీ' ఇదీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలుగు తమ్ముళ్లకు జారీచేసిన హెచ్చరిక. కానీ క్షేత్రస్థాయిలో తమ్ముళ్లు గీత దాటి బహిరంగంగా పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు.

అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు అంత తెగింపు వారికెలా వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా తమకు లభించాల్సిన గుర్తింపేదని నిలదీసే స్థాయికి పశ్చిమ గోదావరి జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు వచ్చారు. చింతలపూడి, తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాల పరిధిలో నేతల పరస్పర నిందారోపణలు, తెలుగుదేశం పార్టీ సీనియర్లనే నివ్వెర పరిచింది.

చివరకు ఎంపీ, ఎమ్మెల్యేల మధ్యే సయోధ్య కుదరడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రస్థాయికి చేరుకున్నదో అవగతమవుతూనే ఉన్నది. సీనియర్ నేతలను వదిలిపెట్టి కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు కట్టబెడతారా? అని తెలుగు తమ్ముళ్లు నిలదీస్తున్నారు. వివాదాల పరిష్కారానికి జిల్లా ఇన్ చార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు చర్చలు జరిపినా నిష్ప్రయోజనమైంది. ఏపీలో అధికారంలోకి రావాలంటే ఉభయగోదావరి జిల్లాలే ఏ పార్టీకైనా కీలకం. అందుకే జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేమని పదేపదే అధినేత చంద్రబాబు నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం వరకు చెబుతుంటారు. కానీ ఎమ్మెల్యేలు, ఎంపీ పనితీరు మరోలా ఉన్నది.

మాగంటి వర్సెస్ పీతల సుజాత

మాగంటి వర్సెస్ పీతల సుజాత

ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ వారికి లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాడేపల్లి గూడెంలో మంత్రి పైడికొండల మాణిక్యాల రావు, జిల్లా పరిషత్ చైర్మన్ బాపిరాజు మధ్య విభేదాలతో ఇరు పార్టీల నేతలు ఢీ కొడుతూ వచ్చారు. తాడేపల్లిగూడెంలో తెలుగుతమ్ముళ్లు కుస్తీపడుతున్నారు. ఇటీవల తాడేపల్లి గూడెంలో ఎంపీ మాగంటి బాబు, చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు తదితరుల మధ్య విభేదాల పరిష్కారానికి విఫలయత్నం జరిగింది. ఇన్ చార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లా మంత్రులు జవహర్, పితాని సత్యనారాయణ చేస్తున్న రాజీ ప్రయత్నాలు కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఒకరి నియోజకవర్గంలో మరొక నేత పెత్తనమేమిటని ప్రశ్నిస్తున్నారు.

Recommended Video

Chandrababu Fires On TDP Leaders Over YS Jagan Matter | Oneindia Telugu
అధిష్ఠానం ఫోన్‌తో తగ్గిన నేతలు

అధిష్ఠానం ఫోన్‌తో తగ్గిన నేతలు

టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి కూడా ఈ విషయమై తన వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నారు. నాలుగురోజుల క్రితం గోపాలపురం నియోజకవర్గంలో మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైతే మొన్న తాడేపల్లిగూడెంలో నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. నిన్న చింతలపూడిలో ఎంపీ వర్గం నేతలు అసమ్మతి సమావేశం ఏర్పాటు చేశారు. అధిష్టానం నుంచి ఫోన్‌ రావడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. శనివారం భీమడోలులో జిల్లా సమన్వయ కమిటీలో ఈ విబేధాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి అసమ్మతి నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం.

రాజీనామాకు ఇలా హెచ్చరికలు

రాజీనామాకు ఇలా హెచ్చరికలు

గోపాలపురంలో గ్రూపు రాజకీయాలు నడుపుతున్న ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, తమ ప్రత్యర్థి వర్గం వారికి మరోసారి పదవిని కట్టబెట్టి, తమకు మొండిచెయ్యి చూపారని ద్వారకాతిరుమల ఎంపీపీ వడ్లపూడి ఈశ్వర భానువరప్రసాద్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. అధిష్టానం తమకు పదిరోజుల్లోగా న్యాయం చేయకుంటే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని ఎంపీపీ గ్రూపు ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. మండల అధ్యక్ష పదవి విషయంలో ఇరు వర్గాల మధ్య విబేధాలు తలెత్తాయి. మండల అధ్యక్ష పదవిని సుంకవల్లి బ్రహ్మయ్యకే ఎమ్మెల్యే ముప్పిడి కట్టబెట్టడంతో లంకా సత్తిపండు వర్గం తిరుగుబాటు చేసింది. ఎంపీపీతో పాటు 12 మంది ఎంపీటీసీ సభ్యులు, 10 మంది సర్పంచ్‌లు, 15 మంది పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు, 13 మంది నీటిసంఘం అధ్యక్షులు, 14 మంది పాల కేంద్రాల అధ్యక్షులు, ఇద్దరు సొసైటీ అధ్యక్షులు, ఒక ఏఎంసీ వైస్‌ చైర్మన్, నలుగురు డైరెక్టర్లు రాజీనామా చేస్తామని అల్టిమేటం ఇచ్చారు.

మంత్రి పత్తిపాటితో సమన్వయకర్త ఈలి నాని ఇలా

మంత్రి పత్తిపాటితో సమన్వయకర్త ఈలి నాని ఇలా

తాడేపల్లిగూడెంలోనూ రెండురోజుల క్రితం జరిగిన సమావేశంలో శ్రేణులు ఎవరూ తనతో కలిసి రావడంలేదని, మునిసిపల్‌ కౌన్సిలర్లను కులాలవారీగా విడగొట్టే కుట్రలు జరుగుతున్నాయని, పార్టీలోని వ్యక్తులు కలిసి రాకపోవడంతో ఇంక పార్టీ కార్యక్రమాలకు హాజరు కాబోనని, ఇదే చివరి సమావేశమని మునిసిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ సమావేశం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆరుగొలను చెరువు పనులను భాగాలుగా చేసి , మట్టి పనులు చేసుకున్న నాయకులు కూడా మట్టిమాఫియా అంటూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందంటూ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు వ్యాఖ్యలు చేయడంతో దీనికి ప్రతిగా మునిసిపల్‌ కాంట్రాక్టర్, టీడీపీ నాయకుడు మేడపాటి చెల్లారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. నియోజకవర్గ సమన్వయకర్త ఈలి నాని తనకు సమావేశాలలో ప్రాధాన్యం ఇవ్వడంలేదంటూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్లారనే విషయం సమావేశంలో దుమారం రేపింది. ఈ విషయంలో మునిసిపల్‌ చైర్మన్‌ , ఈలినానికి మధ్య మాటల యుద్ధం సాగింది. ఇలా అందరూ వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు.

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి జోక్యం ఇలా

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి జోక్యం ఇలా

తాజాగా చింతలపూడి మండలంలో ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రగడవరం సమీపంలో శుక్రవారం బహిరంగ సమావేశం ఏర్పాటుచేశారు. సమావేశంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ జగ్గవరపు ముత్తారెడ్డి మాట్లాడుతూ ‘నేను చెప్పిందే వేదం, మీరంతా నేను చెప్పినట్టు వినాలన్న చందంగా ప్రవర్తించే నాయకులకు పార్టీలో మనుగడ ఉండదు' అని పరోక్షంగా ఎమ్మెల్యే సుజాతను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. సమావేశం ప్రారంభం కావడానికి ముందే జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ముఖ్య నాయకులకు ఫోన్‌ చేసి పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించే వరకు ఆగాలని కోరడంతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. ప్రతి నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్లు రోడ్డుకెక్కడం పార్టీకి తలనొప్పిగా మారింది. శనివారం జరిగే జిల్లా సమావేశం వాడిగావేడిగా జరిగే అవకాశం కనపడుతోంది.

English summary
Telugu Desham Party West Godavari leaders expressed dessent on their leaders. There is no co-ordination with in MP Maganti Babu and district MLAs Peethala Sujatha, M Srinivas Rao, M Venkateswar Rao and others. District Incharge Minister Prathipati Pullarao compromise formula didn't worked out. Finally District Party president Sita Ramalaxmi requested postphone the meet upto district co ordination meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X