వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారసులకు లిట్మస్ టెస్ట్: భవితవ్యంపై కాంగ్రెస్ యువ నేతల ‘సందడి’

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, ముఖ్యనేతల వారసులు, కుటుంబీకులు రాజకీయాల్లోకి రావడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వారి కార్యకలాపాలు వేగం పుంజుకుంటున్నాయి. జాతీయ స్థాయిలో పార్టీ నియమాలు, పోటీ చేయడానికి మార్గదర్శకాలు ఎలా ఉంటాయోనని పలు కుటుంబాలు ఆసక్తితో ఉన్నాయి. ఒక కుటుంబం నుంచి ఒక్కరే పోటీ చేయాలని ఏఐసీసీ గతంలో స్పష్టమైన నిబంధన విధించింది. అయినా ఆ నిబంధనను అధిగమించి గత ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో కుటుంబ సభ్యులు టికెట్లు సాధించారు. సోనియాగాంధీ (రాయ్‌బరేలీ), ఆమె తనయుడు రాహుల్‌ గాంధీ (అమేథీ) ఇద్దరూ పోటీ చేశారు.

దీని ఆసరాగా జాతీయస్థాయిలోని పలువురు సీనియర్లు, అధిష్టానం వద్ద పలుకుబడి కల నాయకులు తమతోపాటు తమ వారసులను గత ఎన్నికల్లో బరిలోకి దించారు. రాష్ట్రం లోనూ కొందరు ముఖ్యులు ఒకే కుటుంబం నుంచి ఇద్దరేసి చొప్పున పోటీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో టికెట్లపై మార్గదర్శకాలు ఎలా ఉంటాయోనని పార్టీలోని సీనియర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 కోదాడలో ఉత్తమ్ సతీమణి పద్మావతి

కోదాడలో ఉత్తమ్ సతీమణి పద్మావతి

రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి దాదాపు ఏడుగురు ముఖ్య నేతలు కాంగ్రెస్‌ టికెట్లను సాధించారు. అప్పుడు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన సతీమణి పద్మావతికి కోదాడ టికెట్‌ను సాధించుకోగలిగారు. అదే జిల్లా నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ అసెంబ్లీ టిక్కెట్ పొందగా, భువనగిరి లోక్ సభ స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టికెట్‌ సాధించారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే విజయం సాధించారు. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అది వేరే సంగతి.

భవిష్యత్ లో పోటీకి దామోదర్ రెడ్డి తనయుడు నరోత్తమ్ రెడ్డి

భవిష్యత్ లో పోటీకి దామోదర్ రెడ్డి తనయుడు నరోత్తమ్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు, మాజీ మంత్రులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లాకు చెందిన వారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి తొలి నుంచి నల్లగొండ జిల్లా నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించగా, వెంకటరెడ్డి ఖమ్మంలో సీనియర్ గా ఉండేవారు. 2014 ఎన్నికల్లో వెంకటరెడ్డి గెలుపొందినా.. తర్వాత అనారోగ్యంతో మరణించారు. పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వెంకట్ రెడ్డి సతీమణిని ప్రస్తుత మంత్రి తుమ్మలనాగేశ్వర్ రావు ఓడించారు. తాజాగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు నరోత్తమ్ రెడ్డి రంగ ప్రవేశం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

 టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క కీలకం

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క కీలకం

పాలమూరు జిల్లా నుంచి టీపీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన మల్లు అనంతరాములు సోదరులు మల్లు రవి, మల్లు భట్టివిక్రమార్క ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషిస్తున్నారు. మల్లురవి గతంలో నాగర్ కర్నూల్ స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క తొలిసారి అసెంబ్లీకి 2009లో ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించారు.

2004లో వినోద్.. 2009లో వివేకానంద విజయం

2004లో వినోద్.. 2009లో వివేకానంద విజయం

కాకాగా పేరొందిన మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి తనయులు మాజీమంత్రి జి వినోద్, జి వివేక్‌ తొలిసారి 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. అంతకుముందు 2004లో వెంకటస్వామితోపాటు వినోద్ కూడా గెలుపొందారు. అయితే 2009లో ఎంపీ స్థానానికి వివేకానంద విజయం సాధించినా.. అసెంబ్లీకి పోటీ చేసిన వినోద్.. టీడీపీ నేత బోడ జనార్దన్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2010 తర్వాత మారిన పరిస్థితుల్లో టీఆర్ఎస్ లో చేరిన వినోద్, వివేకానంద.. తెలంగాణ ఏర్పాటు ఖరారు కావడంతో మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వెంకటస్వామి మరణం తర్వాత తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరుకున్న వీరు.. వచ్చే ఏడాది ఎన్నికల్లో మరోసారి తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు.

 మానుకోటలో కవిత ఓటమి ఇలా

మానుకోటలో కవిత ఓటమి ఇలా

ప్రస్తుత డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే, ఆయన కుమార్తె మాళోత్ కవిత టికెట్లు గత ఎన్నికల్లో సాధించారు. 1989 నుంచి డోర్నకల్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన రెడ్యానాయక్.. మధ్యలో 2009లో మాత్రమే ఓటమి పాలయ్యారు. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన రెడ్యానాయక్ తర్వాత తన కూతురి భవితవ్యం కోసం ‘గులాబీ' కండువా వేసుకున్నారు.

 టీఆర్ఎస్ గూటికి చిట్టిం నర్సిరెడ్డి తనయుడు రామ్మోహన్ రెడ్డి

టీఆర్ఎస్ గూటికి చిట్టిం నర్సిరెడ్డి తనయుడు రామ్మోహన్ రెడ్డి

పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణ, ఆమె సోదరుడు రామ్మోహన్‌రెడ్డి టికెట్లు పొంది 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. మాజీమంత్రి డి.కె.అరుణ కాంగ్రెస్‌లోనే ఉండగా ఆమె సోదరుడు రామ్మోహన్‌రెడ్డి మాత్రం టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే అరుణ కూతురు స్నిగ్ధ వచ్చే ఎన్నికల్లో తన భవితవ్యాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. స్నిగ్ధతోపాటు పలువురు నేతల వారసులు ఇలా బరిలో నిలవాలని ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌లో వారసుల టికెట్ల కోసం పోరాడే వారి జాబితా మారనున్నది.

 రాయబరేలీలో పోటీ చేసెదెవరు?

రాయబరేలీలో పోటీ చేసెదెవరు?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. దాదాపు 20 మందికి పైగా కాంగ్రెస్‌ ముఖ్య నేతల వారసులు రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. పార్టీ బాధ్యతలు రాహుల్‌కు అప్పగించిన సోనియా రాజకీయాల నుంచి కూడా వైదొలుగుతున్నట్టు ఇటీవలే ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఎంపీగానైనా పోటీ చేస్తారా? రాయ్‌బరేలిలో ఆమె కూతురు ప్రియాంక పోటీలో ఉంటారా అన్న దానిపై నేతలు ఆసక్తిగా ఉన్నారు. సోనియా లేదా ప్రియాంక ఎవరైనా పోటీ చేస్తే వారసులకు టికెట్లు ఇప్పించడం సులువు అవుతుందని సీనియర్లు భావిస్తున్నారు. అలా కాకుండా రాహుల్‌ ఒక్కరే పోటీలో ఉండి, ఆ కుటుంబం నుంచి ఎవరూ బరిలో లేకుంటే టికెట్లు ఇప్పించుకోవడం పెద్ద సమస్య అవుతుందని అంచనా వేస్తున్నారు.

 2014 నుంచే పొన్నాల లక్ష్మయ్య కోడలు వైశాలి కీలకం

2014 నుంచే పొన్నాల లక్ష్మయ్య కోడలు వైశాలి కీలకం

ప్రస్తుతం అసెంబ్లీలో విపక్ష నేత కుందూరు జానారెడ్డి వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ స్థానం నుంచి తన కుమారుడు రఘువీర్‌రెడ్డికి టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు మంత్రిగా ఉన్నప్పుడే పొన్నాల లక్ష్మయ్య తన కోడలు వైశాలిని జిల్లా రాజకీయాల్లో భాగస్వామిని చేశారు. 2014 ఎన్నికల్లో భువనగిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించినా.. సిట్టింగ్ ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ఉండటంతో వారి ఆశలు అడియాసలయ్యాయి.

 1985 నుంచి ఇంద్రారెడ్డి.. 2000 నుంచి సబిత ముఖ్య పాత్ర

1985 నుంచి ఇంద్రారెడ్డి.. 2000 నుంచి సబిత ముఖ్య పాత్ర

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పటోళ్ల ఇంద్రారెడ్డి, ఆయన భార్య సబితా సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌ రెడ్డి గత ఎన్నికల్లోనే చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. చేవెళ్ల నుంచి 1985 నుంచి ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. 1995లో టీడీపీ అంతర్గత సంక్షోభంలో ఎన్టీఆర్ పక్షాన నిలిచిన ఇంద్రారెడ్డి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినా తర్వాత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. 2000లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి తర్వాత రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. మాజీ సీఎం వైఎస్ హయాంలో చేవెళ్ల చెల్లెమ్మగా పేరొందారు.

జహీరాబాద్ నుంచి కూతురు మేఘన పోటీకి గీతారెడ్డి ట్రయల్

జహీరాబాద్ నుంచి కూతురు మేఘన పోటీకి గీతారెడ్డి ట్రయల్

సిద్ధిపేట ఎస్సీ రిజర్వుడ్ తర్వాత మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి పలుసార్లు ఎంపీగా ఎన్నికైన సర్వే సత్యనారాయణ అల్లుడు క్రిశాంక్‌, జహీరాబాద్ ఎమ్మెల్యే జె.గీతారెడ్డి కూతురు మేఘనారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి మనుమడు, మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు మర్రి ఆదిత్యా రెడ్డితోపాటు మాజీ ఎంపీ ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌ కుమారుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

English summary
Telangana Congress leaders sons and daughters, son in laws trying check their luck in politics. They ready to contest in next assembly and loksabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X