వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనాల మోత్కుపల్లి.. తొలి నుంచి అగ్రవర్ణాలపై ఫైర్

తెలుగుదేశం పార్టీలో ప్రత్యేకంగా నల్లగొండ జిల్లాలో తొలి నుంచి మోత్కుపల్లి నర్సింహులు కీలక పాత్ర పోషించారు. 1999కి ముందు మాజీ హోంమంత్రి మాధవ రెడ్డితో విభేదించినా తర్వాత పరిస్థితుల్లో తిరిగి టీడీపీలో చేర

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వ్యాపారాల్లో 'ఓడలు బండ్లవుతాయ.. బండ్లు ఓడలవుతాయి' అని సామెత. ఇక రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని నానుడి. అదే నిజం కూడా. 2014కు ముందు అప్పటి టీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఒంటికాలిపై లేచి నిప్పులు చెరిగిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు ప్రస్తుతం టీఆర్ఎస్ మిత్రపక్షంగా కనిపిస్తున్నది. అలా కనిపించేలా చేశారు టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు. వచ్చే ఏడాది ప్రారంభంలో రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుతో 'పార్లమెంట్ ఎగువసభ'కు ఎన్నికవ్వాలని మోత్కుపల్లి నర్సిహులు, ఆయన అధినేత చంద్రబాబు వ్యూహం.
ఆ లెక్కలు సమీకరణాల సంగతెలా ఉన్నా.. 2014 ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా తుంగతుర్తి నుంచి పోటీ చేసే అవకాశం లేక ఖమ్మం జిల్లా మధిర స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన నేపథ్యం మోత్కుపల్లి నర్సింహులుది.

2014 వరకు కేసీఆర్, కోదండరాంలపై విమర్శల జడి ఇలా

2014 వరకు కేసీఆర్, కోదండరాంలపై విమర్శల జడి ఇలా

2009లో తుంగతుర్తి (అంతకుముందు 1983 నుంచి 1999 వరకు ఆలేరు నుంచి పలు దఫాలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు) ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున గెలుపొందిన మోత్కుపల్లి.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడుతున్న టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మొదలు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ఎం కోదండరాం వరకు తెలంగాణ అనుకూల వాదులపై అనుచిత విమర్శలతో నోరు పారేసుకున్న మోత్కుపల్లి తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గ పరిధిలో ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారన్న విమర్శలు వినిపించాయి. తాజాగా 2014 ఎన్నికల తర్వాత కేంద్రంలోని నరేంద్రమోదీ హయాంలోని ఎన్డీయే సర్కార్‌లో మిత్రపక్షంగా మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి లభిస్తుందని వార్తలొచ్చాయి. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కూడా దాదాపుగా మోత్కుపల్లికి మంచి శుభవార్త లభిస్తుందని పేర్కొన్నా.. ఆచరణలో జరిగింది అందుకు విరుద్ధం. ఇక గవర్నర్ పదవిపై దాదాపు ఆశలు వదులుకున్న మోత్కుపల్లి.. రాజ్యసభలో చోటు కల్పించడంపై ఆశలు పెట్టుకున్నారు.

రేవంత్ రెడ్డిపై ఇలా మోత్కుపల్లి వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డిపై ఇలా మోత్కుపల్లి వ్యాఖ్యలు

త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో చోటు కోసమే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని ప్రకటించి మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ టీడీపీలో తుఫానుకు దారి తీశారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి వర్గం టీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు వ్యతిరేకం కావడంతో ఆయన్ను లక్ష్యంగా చేసుకుని వాగ్భాణాలు సంధించారు రేవంత్ రెడ్డి ఒక చీడ పురుగు అని మోత్కుపల్లి అభివర్ణించారు. అంతా తానై వ్యవహరిస్తున్నారని ఎదురుదాడికి దిగారు. రెండు కళ్ల సిద్ధాంతానికి తోడు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు టీడీపీ అధినేత చంద్రబాబే పురమాయించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఈ సంగతి తెలియదన్నట్లు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు కూడా మోత్కుపల్లి వెనుకాడలేదని రాజకీయ విమర్శకులు అంటున్నారు. ఆయన ప్రతిసారి ఇలాగే వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆయన ఎలా స్పందించారో ఒకసారి పరిశీలిద్దాం..

అనునిత్యం కేసీఆర్‪పై ఇలా వాగ్భాణాలు

అనునిత్యం కేసీఆర్‪పై ఇలా వాగ్భాణాలు

కేసీఆర్ వల్లే తెలంగాణకు నష్టమని, తెలంగాణ కోసం ఉరేసుకుందాం రమ్మని 2011లో పదేపదే గడువులు విధిస్తూ నానా యాగీ చేసి అభాసు పాలయ్యారు మోత్కుపల్లి. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి నేతలు ‘మోత్కుపల్లి' శ్రుతి మించిన వ్యాఖ్యలతో విభేదించిన పరిస్థితి నెలకొన్నది. 2014కు ముందు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో పలు దఫాలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైనప్పుడల్లా మోత్కుపల్లి అనుచిత సవాళ్లు తెలంగాణలో టీడీపీ అభాసు పాలవ్వడానికి దోహద పడ్డాయి. అంతకుముందే తెలంగాణ, ఆంధ్ర తనకు రెండు కళ్లవంటివని సిద్ధాంతాలు ప్రవచించి ఆంధ్ర ప్రాంత అనుకూల రాజకీయం నడిపించడంతో తెలంగాణలో చంద్రబాబు ఉనికికి ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవం. ఇదిలా ఉంటే తెలంగాణలో తమకు శత్రువుగా పరిగణించిన టీఆర్ఎస్, దాని అధి నాయకత్వంపై టీటీడీపీ నేతలతో విమర్శలు చేయించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముందు ఉన్నారని విమర్శలు ఉన్నాయి.

1995లో లక్ష్మీ పార్వతి పక్షం.. 1999లో కాంగ్రెస్ నుంచి ఎన్నిక

1995లో లక్ష్మీ పార్వతి పక్షం.. 1999లో కాంగ్రెస్ నుంచి ఎన్నిక

తెలంగాణ టీడీపీ నాయకులు పరిస్థితులను బట్టి స్పందిస్తే మోత్కుపల్లి వంటి వారు రాజకీయ జీవితం మొదటి నుంచి వివాదాలమయం అన్న రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆలేరు రిజర్వుడ్ స్థానం నుంచి గెలుపొందడమే కాదు ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా చోటు దక్కించుకున్న మోత్కుపల్లి నర్సింహులు.. భువనగిరి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎలిమినేటి మాధవరెడ్డితో వైరం తెచ్చుకున్నారు. అది 1989 ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించే వరకు వెళ్లింది. చివరకు స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన తర్వాత ‘అన్నగారిని (ఎన్టీఆర్)' ప్రసన్నం చేసుకున్న నేపథ్యం మోత్కుపల్లిది. 1994 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత తెలుగుదేశం పార్టీ అంతర్గత తగాదాల్లో లక్ష్మీ పార్వతి పక్షాన నిలిచిన మోత్కుపల్లి.. సీఎం చంద్రబాబు, అప్పటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరించారు. ఇక 1999 ఎన్నికల్లో రాజకీయ మనుగడ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీ స్నేహ ‘హస్తం' అందుకుని విజయం సాధించారు.

2009లో మహా కూటమి తరఫున ఎమ్మెల్యేగా విజయం

2009లో మహా కూటమి తరఫున ఎమ్మెల్యేగా విజయం

కానీ 2000లో మావోయిస్టుల చేతిలో మంత్రి మాధవరెడ్డి మరణం తర్వాత మళ్లీ టీడీపీకి దగ్గరైన మోత్కుపల్లి ఇప్పటివరకు అదే పార్టీలో కొనసాగారు. అయితే 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ చేతిలోనే పరాజయం పాలైన మోత్కుపల్లి నర్సింహులు.. 2009 ఎన్నికల నాటికి మహా కూటమి తరఫున ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో తుంగతుర్తి రిజర్వుడ్ స్థానం నుంచి గెలుపొందిన మళ్లీ స్వరం పెంచారు మోత్కుపల్లి. అప్పటికే తెలంగాణ ఉద్యమ వేడి పరాకాష్టకు చేరుకున్నది. దాదాపు తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాలకు వేడి తాకినా నివురుగప్పిన నిప్పులా పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో 2009 డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్రం తెలంగాణ అనుకూల ప్రకటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా టీఆర్ఎస్ నాయకత్వంపై అనునిత్యం దాడి చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు మోత్కుపల్లి. తన అధినేత మెప్పు కోసం అనుచిత వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచనయ్యారు. తెలంగాణ వ్యతిరేకి అన్న ముద్ర సంపాదించుకున్నారు మోత్కుపల్లి.

2013లో గీతారెడ్డి, కోదండరాంలపై ఇలా విమర్శల వాగ్భాణాలు

2013లో గీతారెడ్డి, కోదండరాంలపై ఇలా విమర్శల వాగ్భాణాలు

ఇలా 2012 నవంబర్ 10వ తేదీన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు మోత్కుపల్లి. కేసీఆర్ తెలంగాణ వాసి కాదని ఆయన తాతలు విజయనగరం జిల్లా నుంచి వచ్చారని, ఆయన రెచ్చగొట్టే ప్రకటనలతోనే విద్యార్థులు బలిదానాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన రాజకీయ లబ్ది కోసం 100 అసెంబ్లీ సీట్లు, 17 లోక్‌సభ స్థానాలు అనే కొత్త నాటకం తెరపైకి తెచ్చారని ఎదురు దాడి చేశారు. కేసీఆర్ నరసింహావతారం కాదు ఎన్ని అవతారాలు ఎత్తినా తెలంగాణ ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. తర్వాత కేంద్రం మరో రెండు, మూడు నెలల్లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టడానికి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు పూలమాల వేసి నివాళులర్పించిన మోత్కుపల్లి.. అప్పటి రాష్ట్ర మంత్రి జే గీతారెడ్డి, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోదండరాం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దళితులను అవమానపరిచారన్నారు. దళితవర్గానికి చెందిన మంత్రి జె.గీతారెడ్డికి కర్రుకాల్చి వాతలు పెట్టాలంటూ వ్యాఖ్యానించారు. వీరిద్దరికి అంబేద్కర్‌కు నివాళి అర్పించే అర్హత లేదన్నారు. కోదండరాంకు దళితులే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ‘ఉస్మానియా వర్శిటీ ప్రొఫెసర్‌గా ఉంటూ లక్ష రూపాయల జీతం తీసుకుంటూ, ఏనాడైనా విద్యార్థులకు పాఠం చెప్పావా అంటూ కోదండరాంను' మోత్కుపల్లి ప్రశ్నించారు. తెలంగాణ వాదాన్ని అడ్డంపెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నారని మోత్కుపల్లి ధ్వజమెత్తారు.

గరికపాటికి చోటుపై అసహనం.. అలక ఇలా

గరికపాటికి చోటుపై అసహనం.. అలక ఇలా

తీరా 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికల్లో భారీగా పెట్టుకున్న ఆశలు కాలరాసి గరికపాటి రామ్మోహన రావు, తోట రామలక్ష్మి నామినేషన్ పత్రాలు సమర్పించే కార్యక్రమానికి మోత్కుపల్లి నర్సింహులు గైర్హాజరయ్యారు. అసంత్రుప్తితో ఉన్న మోత్కుపల్లి నర్సింహులును బుజ్జగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో పార్టీ నేతలు నామా నాగేశ్వర్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సుజరా చౌదరిలతో రాయబారం పంపినా మెత్తబడలేదు. భవిష్యల్ మంచి అవకాశం కల్పిస్తామని ఆశలు కల్పించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఒంటరిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శల దాడి చేసినందుకు సరైన మూల్యం చెల్లించారని అప్పట్లోనే తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానించారు. రాజ్యసభ టిక్కెట్ లభించకపోవడంతో కినుక వహించిన మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ భవితవ్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. వరంగల్‌లో రేయాన్స్ ఫ్యాక్టరీ వద్ద స్థిర పడిన సీమాంధ్ర నేత గరికపాటి రామ్మోహన రావుకు టిక్కెట్ ఇస్తే మీరంతా ఏం చేశారని తన వద్దకొచ్చిన టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు.

ఖమ్మం జిల్లా మధిర నుంచి టీడీపీ టిక్కెట్

ఖమ్మం జిల్లా మధిర నుంచి టీడీపీ టిక్కెట్

2014 రాజ్యసభ ఎన్నికల సమయంలో అసంత్రుప్తి నేపథ్యంలో మోత్కుపల్లి నర్సింహులును తమ వైపునకు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు సాగించారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో విపక్ష నేత కే జానారెడ్డి, ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి వంటి వారు టిక్కెట్ ఇప్పిస్తామని హామీలు ఇప్పించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ పరిస్థితి గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు జాగ్రత్తగా మోత్కుపల్లిని బుజ్జగించడంలో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా మధిర స్థానం నుంచి మోత్కుపల్లి నర్సింహులుకు టిక్కెట్ ఇచ్చారు. కానీ ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క చేతిలో ఓటమి పాలైన మోత్కుపల్లి క్రమంగా రాజకీయంగా తెరమరుగయ్యారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఇలా రేవంత్ విమర్శలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఇలా రేవంత్ విమర్శలు

అయితే అప్పట్లోనే గవర్నర్ పదవి వచ్చేలా చేస్తానని మోత్కుపల్లికి చంద్రబాబు హామీ ఇచ్చారు. మధ్యలో తెలుగుదేశం మహానాడులో ఈ సంగతే అడిగితే తెలంగాణలో అధికార పక్షం ‘టీఆర్ఎస్'తో ఘర్షణ పడేదెవరని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు. ఒకసారి విజయవాడలోని సీఎం చంద్రబాబు క్యాంప్ ఆఫీసులోనూ కలుసుకుని తన సంగతి తేల్చమని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. అప్పటికే తెలంగాణలో ఎమ్మెల్యేగా అనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై విమర్శలు సాగిస్తూ వచ్చారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్బావ సమయంలో పార్టీలో చేరిన అనుముల రేవంత్ రెడ్డి తర్వాత మారిన పరిస్థితుల్లో స్వతంత్రంగాఎమ్మెల్సీగా ఎన్నికై తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇదీ టీఆర్ఎస్‌తో పొత్తుకు వ్యతిరేకత

ఇదీ టీఆర్ఎస్‌తో పొత్తుకు వ్యతిరేకత

2014 తర్వాత లైమ్ లైట్‌లోకి వచ్చిన రేవంత్ రెడ్డి క్రమంగా తెలంగాణలోని విపక్ష నేతల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో వెలమ ప్లస్ కమ్మ సామాజిక వర్గాల మధ్య ఐక్యత కోసం ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు టీఆర్ఎస్, టీడీపీ సన్నద్ధమయ్యాయి. తమ వ్యతిరేకులపై ఆధిపత్యం సాధించేందుకు ఇరువురు నేతలకు రాజకీయ పొత్తులు అనివార్యం అయ్యాయి. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు తొలి నుంచి ఆ పార్టీపై పోరాడుతున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి వంటి వారికి అంత తేలిగ్గా జీర్ణమయ్యే అంశమే కాదు. రాజకీయ కారణాలు, ఆధారాల మాటెలా ఉన్నా ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన నేత రేవంత్ రెడ్డి. అదీ తన కన్నకూతురు వివాహ నిశ్చితార్థ వేడుకలకు రంగం సిద్ధం చేసుకుంటున్న వేళ జరిగిన పరిణామం కావడం మరో కారణం. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు అంశం సహజంగానే రేవంత్ రెడ్డి వ్యతిరేకతకు కారణమైంది. 3.5 ఏళ్లుగా రాజకీయంగా ‘లైమ్ లైట్'లో ఉన్న రేవంత్ రెడ్డి కూడా టీఆర్ఎస్‌తో కలిసి ముందుకు సాగడం ఇష్టం లేక కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారన్న వార్తలు వచ్చాయి. అలా లైమ్‌లైట్‌లో ఉన్న రేవంత్ రెడ్డిపై విరుచుకు పడటం ద్వారా మోత్కుపల్లి మరోసారి మీడియాలో పతాక శీర్షికల్లోకి వచ్చారని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

English summary
Mothkupalli Narsimhulu is Senior leader in Telangana state politics as well as in United AP politics. But he has creates sensations. From the 2009 till today he has fire brand in Telangana politics. Mothkupalli openly questioned Revant Reddy who is T-TDP working president present activities
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X