నాలుగేళ్లలో నితీశ్‌కుమార్ ఘర్‌వాపసీ ఇలా

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: గతంలో ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా కొనసాగిన జేడీయూ అధ్యక్షుడు - బీహార్ సీఎం నితీశ్‌కుమార్ 2013లో ప్రధాని అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం నరేంద్రమోదీని ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చేశారు. రెండేండ్ల క్రితం బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో మహాఘట్‌బంధన్ (మహాకూటమి)గా ఏర్పడి విజయం సాధించారు.

కానీ గత నవంబర్ నుంచి నితీశ్ వైఖరిలో స్పష్టమైన మార్పు మొదలైనట్లు పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఆయన వ్యూహాత్మకంగానే ఎన్డీయేవైపు అడుగులు వేసినట్టు తెలుస్తున్నది. గత నవంబర్‌ 8న ప్రధాని మోదీ పాత పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ప్రతిపక్షమంతా వ్యతిరేకించినా, నితీశ్ మాత్రం సమర్థించారు.

2013 తరువాత తొలిసారి ఈ ఏడాది సంక్రాంతి పండుగకు బీజేపీ నేతలను ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. గత మార్చిలో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పోటీ చేయలేదు. కేవలం బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతోనే జేడీయూ ఆ ఎన్నికలకు దూరంగా ఉన్నదన్న వ్యాఖ్యలు వినిపించాయి. అలాగే ఏప్రిల్‌లో ఎన్సీపీ గుజరాత్ శాఖతో జేడీయూ కూటమి కట్టింది. వచ్చే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే ఈ కూటమి ప్రయత్నిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.

రామ్ నాథ్‌కే ఓటేసి రూటు మార్పు

రామ్ నాథ్‌కే ఓటేసి రూటు మార్పు

కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేను ఎదుర్కొనేందుకు ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన బాధ్యత, విపక్షాలను కలపాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని వ్యాఖ్యానించడంతోపాటు ఈ విషయమై తొలుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చర్చించిన నితీశ్ తర్వాత రూట్ మార్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు మే నెలలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్వహించిన మధ్యాహ్న భోజన సమావేశానికి గైర్హాజరైన నితీశ్ అదే రోజు ప్రధాని మోదీ మారిషస్ ప్రధాని జగ్‌నాథ్ గౌరవార్ధం ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఇటీవల ఆయన బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ప్రకటించి ప్రతిపక్షాల ఐక్యతకు గండికొట్టారు. జీఎస్టీ ఆవిష్కరణ సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ బహిష్కరించగా, నితీశ్ మాత్రం తన ప్రతినిధిని పంపారు. వచ్చేనెలలో ‘బీజేపీ హఠావో, దేశ్ బచావో' పేరిట పాట్నా నగరంలో ఆర్జేడీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీలో పాల్గొనరాదని నితీశ్ నిర్ణయించారు.

Bihar Grand Alliance status precarious; BJP accused of destabilising it | Oneindia News
ఐదు సార్లు సీఎంగా నితీశ్

ఐదు సార్లు సీఎంగా నితీశ్

బీహార్‌లో 2015 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏళ్ల నాటి శత్రుత్వాన్ని పక్కనబెట్టి అనూహ్యంగా లాలూ ప్రసాద్‌తో చేతులు కలిపిన నితీశ్‌...అంతే అనూహ్యంగా తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. బీహర్‌ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుగాంచిన నితీశ్‌ పట్నాలోని ఎన్‌ఐటీలో ఎలక్ట్రికల్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ చదివారు. మృదు స్వభావిగా, కార్యదక్షుడిగా పేరు తెచ్చుకున్న ఆయన చదువుకునే రోజుల నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు.1985లో తొలిసారి బీహార్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1989, 91, 96, 98, 99ల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా, రైల్వే మంత్రిగా సేవలందించారు. 1999లో ఆయన రైల్వే మంత్రిగా ఉండగా పశ్చిమబెంగాల్‌లోని గైసల్‌ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 300 మంది మరణించగా, నైతిక బాధ్యత వహిస్తూ నితీశ్‌ రాజీనామా చేశారు. మళ్లీ 2001లో రైల్వే మంత్రి అయ్యారు. 2002లో గోద్రా అల్లర్లకు కారణమైన రైలు దహన ఘటన సమయంలోనూ ఆయనే రైల్వే మంత్రి. ఇప్పటికి ఐదుసార్లు బీహార్‌ సీఎంగా నితీశ్‌ పనిచేశారు.

క్లీన్ ఇమేజ్‌ను నితీశ్ కాపాడుకుంటారా?

క్లీన్ ఇమేజ్‌ను నితీశ్ కాపాడుకుంటారా?

మహాకూటమిలో 80 స్థానాలతో ఆర్జేడీయే అతిపెద్ద పార్టీగా ఉంది. నితీశ్‌కు సీఎం పదవి ఇచ్చినా కూటమిలో పెద్ద పార్టీగా తమ మాట చెల్లుబాటు కావాలనే పంతంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యవహరిస్తుండటంతో నితీశ్‌ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. మళ్లీ ఎన్డీయేలో చేరితే.. నితీశ్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదు. మరోవైపు, అవినీతి ఊబిలో ఉన్న లాలూ కుటుంబంతో అంటకాగితే ‘సచ్చీలుడు' అన్న నితీశ్‌ క్లీన్‌ ఇమేజ్‌కు ఇబ్బందులు తప్పవు. ఇది కూడా ఈయన కూటమి నుంచి తప్పుకునేందుకు ఓ కారణం. బీహార్‌ అభివృద్ధికి కేంద్రంతో సఖ్యతగా ఉండటమే మంచిది. యూపీలో బీజేపీ ఘన విజయం తర్వాత మోదీకి గట్టి ప్రత్యామ్నాయం కనుచూపు మేరల్లో కనపడని పరిస్థితి. అలాంటపుడు ఎన్డీయేకు దూరంగా ఉండటంలో అర్థం ఉండదని జేడీయూ భావిస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ పై అవినీతి ఆరోపణలు ఈనాటివి కావు. 1996లో పశుగ్రాసం కుంభకోణం నుంచి కొనసాగుతున్నవే. ఈ సంగతి 2015లో మహా కూటమి ఏర్పాటు చేసినప్పుడు నితీశ్ కుమార్‌కు తెలియని అంశం కాదు. ఎన్డీయేతో విడగొట్టుకున్నప్పుడు మోదీ పట్ల వ్యతిరేకతే కాంగ్రెస్ పార్టీకి, లాలూ ప్రసాద్ యాదవ్‌కు దగ్గర చేసింది. కానీ క్లీన్ ఇమేజ్ పేరుతో మళ్లీ ఎన్డీయే చంకన జేరడానికి లాలూ కుటుంబంపై వచ్చిన అవినీతి ఆరోపణలను నితీశ్ ఒక సాకుగా చేసుకున్నారే తప్ప మరొకటి కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

బీజేపీకి లాభించే అంశాలివి..

బీజేపీకి లాభించే అంశాలివి..

బీజేపికి ప్రత్యామ్నాయంగా 2019 కల్లా విపక్షాలతో కలిపి మహాకూటమిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. దీని అవసరాన్ని కాంగ్రెస్‌కు చెప్పిందే జేడీయూ నాయకుడు నితీశ్‌. అలాంటి నితీశ్‌ను తమవైపు తిప్పుకుంటే మహాకూటమి ప్రయత్నాలకు ఆదిలోనే బీజేపీ గండికొట్టినట్లవుతుంది. రాజ్యసభలో ఎన్డీయే బలపడుతోంది. ప్రస్తుత 74 మంది ఎన్డీయే ఎంపీలకు తోడు.. పది మంది జేడీయూ ఎంపీలు తోడైతే పెద్దలసభలో బీజేపీకి కొంత ఊరట. నితీశ్‌తో తెగదెంపులతో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే.. నితీశ్‌‌ను కలుపుకుపోవడం బీజేపీకి అత్యంత అవసరం. తమకు ప్రత్యర్థిగా నితీశ్ ఉండకుండా చూసుకుంటే మేలన్న భావన కమలనాథుల్లో ఉన్నట్లు కనిపిస్తున్నది.

మహా కూటమికి ఇచ్చిన తీర్పును నితీశ్ ఇలా వమ్ము చేశారు

మహా కూటమికి ఇచ్చిన తీర్పును నితీశ్ ఇలా వమ్ము చేశారు

నితీశ్‌ రాజీనామా తమను నిరుత్సాహానికి గురిచేసిందని కాంగ్రెస్‌ పేర్కొన్నది. మహాకూటమి లోని విభేదాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామంది. కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా మాట్లాడుతూ ‘మహాకూటమి ఐదేళ్లు కొనసాగాలని ప్రజలు ఓటేశారు. బీహార్‌ గౌరవాన్ని తాకట్టు పెట్టిన బీజేపీని, ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పు అది. దానిని గౌరవించేందుకు మేం పనిచేస్తాం' అని అన్నారు. ‘కాంగ్రెస్‌ పార్టీకి, మరీ ప్రత్యేకంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలకు నితీశ్‌పై ఎంతో అభిమానం, గౌరవం ఉన్నాయి. ఆయన రాజీనామా చేయడం మమ్మల్ని అందరినీ ఎంతో నిరాశకు గురిచేసింది' అని రణదీప్‌ చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The ‘Grand Alliance’ in Bihar ended on Wednesday when Chief Minister Nitish Kumar first dumped the Rashtriya Janata Dal (RJD) and then, by late evening, looked set to lead a government with the Bharatiya Janata Party (BJP) as the alliance partner of the Janata Dal (United) that he leads.
Please Wait while comments are loading...