• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉట్టికెగరలేనమ్మ: కేజ్రీవాల్‌కు ముందుంది ఇక..

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: ఏర్పాటైన ఆరు నెలల్లో దేశ రాజధాని 'హస్తిన'లో అధికార పీఠాన్ని అధిరోహించిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్). కానీ ఆవిర్భవించిన నాలుగేళ్లకే మనుగడ కోసం పోరాడుతోంది. పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికలు.. మధ్యలో రాజౌరి అసెంబ్లీ ఉప ఎన్నికలో పరాజయం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది.

తొలి నుంచి అంతర్గత సంక్షోభాలతో అతలాకుతలమౌతున్న ఆప్‌లో తొలినాటి సహచరులు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. తాజాగా కుమార్ విశ్వాస్ పై ఆరోపణలకు దిగినందుకు ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌పై సస్పెన్షన్ వేటు పడింది.

పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 'నియంతృత్వ శైలి'పైనే నేతలంతా విమర్శలు సాగించారు. ఉద్యమ పార్టీని వ్యక్తిస్వామ్య పార్టీగా చేశారని ధ్వజమెత్తారు. ఎంసీడీ ఎన్నికల పరాజయంతో తలెత్తిన సంక్షోభం తాత్కాలికంగా మళ్లీ సమస్యల్లో చిక్కుకోక తప్పదని ఆ పార్టీ నేతలే అంటున్నారు.

జాతీయ స్థాయిలో ఆప్ అంచనాలు ఇలా..

జాతీయ స్థాయిలో ఆప్ అంచనాలు ఇలా..

జాతీయ రాజకీయాల్లో సంచలనం రేపిన ఆమ్ఆద్మీ పార్టీ.. వెంటనే హస్తినలో అధికార పీఠాన్ని అధిరోహించినా అంతలోనే ప్రభుత్వాన్ని రద్దు చేసినా.. ఏడాది తిరగకుండానే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీతో తలపడి సునామీలా చుట్టేసింది. దీనికి కారణం అది సామాన్యుల కోసం పుట్టిన పార్టీ అని సామాన్య జనం నమ్మడంతోపాటు విభిన్నమైన రాజకీయ సంస్కృతితో వినూత్న కార్యాచరణతో తమ కష్టాలు తీరుస్తుందని విశ్వసించడమే. హస్తిననే కాదు.. దేశ రాజకీయాలనూ ఈ పార్టీ సమూలంగా మార్చివేస్తుందన్న అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. కానీ.. పుట్టిన నాలుగేళ్లకే దాని మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దేశ రాజకీయాలను మార్చడం కాదు కదా.. ఢిల్లీ రాజకీయాల్లోనైనా శక్తిమంతంగా కొనసాగుతుందా అన్న సందేహం బలపడుతున్నది.

ఎంసీడీ ఎన్నికల్లోనే అదే స్థాయిలో పతనం

ఎంసీడీ ఎన్నికల్లోనే అదే స్థాయిలో పతనం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటివరకూ ఎక్కడా తన ముద్రను బలంగా వేయలేకపోయిన పార్టీ.. అదే ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో పరాభవాన్ని ఎదుర్కోవడం.. ఆప్ వట్టి నీటి బుడగేనా? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. ఆది నుంచీ పలు సంక్షోభాలతో సతమతమవుతున్న పార్టీ తాజాగా మరో సంక్షోభంలో చిక్కుకున్నది. వ్యవస్థాపక పార్టీ సభ్యుల్లో ఒక్కరైన కుమార్ విశ్వాస్ డిమాండ్ మేరకు ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌పై నామమాత్రపు సస్సెన్షన్ విధించడంతో ప్రస్తుతానికి అది సమసిపోయినట్లు కనిపిస్తున్నా.. మున్ముందు పార్టీ చీలిపోతుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం.. ప్రజా ఉద్యమం పునాదిగా నిర్మితమైన పార్టీ.. వ్యక్తిస్వామ్య పార్టీగా మారిపోవడమేనని చాలా మంది నాయకులు విమర్శిస్తున్నారు. పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించి.. పార్టీకి పెద్ద శక్తిగా పేరొందిన నేత కేజ్రీవాల్.. పార్టీలో సూపర్ మాన్ గా మారేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన పరిణామాలతో ఆయనే పార్టీకి భారంగా మారారన్న అసంతృప్తి క్రమంగా బలపడుతోంది.

రాజకీయాలపై అన్నా హజారే ఇలా

రాజకీయాలపై అన్నా హజారే ఇలా

దేశంలో అవినీతిని అరికట్టేందుకు జన్‌లోక్‌పాల్ చట్టం చేయాలని సామాజిక కార్యకర్త అన్నా హజారే నాయకత్వంలో జరిగిన ఉద్యమం నుంచి ఆమ్ఆద్మీ పార్టీ పుట్టింది. ఆ ఉద్యమంలో క్రియాశీల కార్యకర్తలుగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ తదితరులు 2012 నవంబర్‌లో ఆమ్ఆద్మీ పార్టీని స్థాపించారు. యోగేంద్రయాదవ్, ప్రశాంత్ భూషణ్, కుమార్ విశ్వాస్, మనీశ్ సిసోడియా, గోపాల్ రాయ్, సంజయ్ సింగ్ వంటి ప్రముఖ సామాజిక ఉద్యమకారులతో కలిసి పార్టీ పురుడుపోసుకున్నది. నిజానికి ఆ ఉద్యమం ఉద్యమంగానే ఉండాలని, రాజకీయ అనుబంధాలు సరికాదని హజారే బలంగా వారించారు. కానీ.. ఉద్యమం విఫలమైనందున, ప్రత్యక్ష రాజకీయ ప్రమేయం అవసరమని కేజ్రీవాల్ వాదించారు.

హస్తిన తర్వాత ఏ ఎన్నికల్లోనూ ప్రభావం చూపని ఆప్

హస్తిన తర్వాత ఏ ఎన్నికల్లోనూ ప్రభావం చూపని ఆప్

ఏడాది తిరగకుండానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయ విజయం సాధించింది. కాంగ్రె‌స్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ తన కృషికి అడ్డుపడుతోందంటూ కేజ్రీవాల్ 50 రోజులు నిండకుండానే ప్రభుత్వాన్ని రద్దు చేశారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు 67 సీట్లు గెలుచుకుని ఆప్ సంచలన విజయం సాధించింది. సామాన్యుడి కోసం సమరాంగణంలోకి దిగిన పార్టీగా.. విభిన్న వినూత్న రాజకీయ సంస్కృతికి ప్రతిబింబంగా ఆప్‌ను హస్తిన వాసులు ఆదరించారు. కానీ.. ఆప్ విజయగాధ అంతటితోనే నిలిచిపోయింది. ఆ తర్వాత అంతా అపజయాల పరంపరగానే మిగిలింది. ఢిల్లీ ఎన్నికల తర్వాత జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపకపోయింది. ఇటీవల గోవాలో చరిత్ర తిరగరాస్తుందనుకుంటే ఖాతానే తెరవలేదు. పంజాబ్‌లో పాగా వేస్తారనుకుంటే పాతిక సీట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడు.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 52 శాతం ఓట్లు దక్కించుకున్న ఢిల్లీలోనే తాజా మునిసిపల్ ఎన్నికల్లో పాతిక శాతం ఓట్లు కూడా పొందలేకపోయింది.

 యోగేంద్ర, ప్రశాంత్ భూషణ్‌లపై వేటు ఇలా

యోగేంద్ర, ప్రశాంత్ భూషణ్‌లపై వేటు ఇలా

ఇక పార్టీలో సైతం ఎన్నో సంక్షోభాలతో సతమతమవుతున్నది. 2015లో ఢిల్లీ ఎన్నికల్లో గెలవగానే వెంటనే అంతర్గత సంక్షోభం రాజుకున్నది. కేజ్రీవాల్ నియంతలా వ్యవహరిస్తున్నారని వ్యవస్థాపక సహచరులు ప్రశాంత్‌ భూషణ్, యోగేంద్ర యాదవ్‌ల తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వారు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని ఆప్ నాయకత్వం వారిని హిష్కరించింది. వారితో పాటు మరికొందరు నాయకులపైనా వేటు వేసింది. ఆతర్వాత షాజియా ఇల్మీ, మయాంకా గాంధీ వంటి అగ్ర స్థాయి నాయకులు కూడా కేజ్రీవాల్ వ్యవహార శైలిని తప్పుపడుతూ పార్టీ నుంచి తప్పుకున్నారు. ఇక ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది తొలి ఏడాదే వివిధ అవినీతి, అక్రమాలు, క్రిమినల్‌ కేసుల్లో అరెస్టయ్యారు. పంజాబ్లో సగానికి పైగా ఎంపీలు పార్టీని వీడిపోయారు. సచ్చా సింగ్ చోటేపూర్, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ వంటి వారితో ఆప్ బలపడుతోందని భావించేలోగానే వారూ దూరమైపోయారు. ఇక మిగిలి ఉన్న బృందంలోనూ.. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలతో లుకలుకలు తీవ్రమయ్యాయి.

కేజ్రీవాల్‌కు మయాంక్ గాంధీ లేఖ ఇలా

కేజ్రీవాల్‌కు మయాంక్ గాంధీ లేఖ ఇలా

పార్టీ విజయం సాధించినపుడు ఆ విజయ ఫలాలను పంచుకునే విషయంలో నాయకుల మధ్య విభేదాలు తలెత్తితే.. ఇప్పుడు పార్టీ వరుస పరాజయాల బాధ్యతను పంచుకునే విషయంలో సమస్యలు ముదిరిపోయాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మయాంక్ గాంధీ ఇటీవల బహిరంగ లేఖలో విమర్శించినట్లు.. పార్టీ లోపలా వెలుపలా సంక్షుభిత పరిస్థితులకు ప్రధాన కారణం కేజ్రీవాలేనని విశ్లేషిస్తున్నారు. ‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి పూర్తి ఘనత మీదేనని.. ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తికి మద్దతిచ్చారని మీరు భావించారు. కానీ.. వాస్తవానికి ప్రజలను ఆకర్షించింది సరికొత్త రాజకీయ సంస్కృతి అన్న విషయాన్ని విస్మరించారు' అని మయాంక్ ఆ లేఖలో ఎత్తిచూపారు.

కోటరీ మధ్య ఇరుక్కుపోయిన కేజ్రీ

కోటరీ మధ్య ఇరుక్కుపోయిన కేజ్రీ

కేజ్రీవాల్ ఆ కొత్త రాజకీయ సంస్కృతిని, తన సహచరులను, స్వచ్ఛంద కార్యకర్తలను బలోపేతానికి బదులు.. తన వ్యక్తిగత అధికారం మీద, ఆకాంక్షల మీద దృష్టి కేంద్రీకరించారని.. పార్టీలో సూపర్ హీరో సంస్కృతి ప్రబలిందని విమర్శకుల వాదన. బాహుబలిలో బల్లాలదేవ లాగా.. కేజ్రీవాల్ తనను తాను గొప్పవాడిగా ప్రతిష్టించుకునే ప్రయత్నంలో తనకు పోటీ కాగల వారందరినీ తెరమరుగు చేసేందుకు, అసమ్మతి గళాన్ని నొక్కివేసేందుకు ప్రయత్నించారని పార్టీని తనను అనుయాయుల కోటరీగా మార్చారని ఆయన వ్యతిరేకులు తప్పుపడుతున్నారు.

కేజ్రీని తప్పుబట్టిన విశ్వాస్

కేజ్రీని తప్పుబట్టిన విశ్వాస్

ఇటీవల పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భంగ పడటంతోపాటు ఎంసీడీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాలని ఆప్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్ పేర్కొన్నారు. ఈ ఓటములకు కారణం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇవిఎం) దుర్వినియోగమేనని కేజ్రీవాల్ చేసిన ఆరోపణలతో విభేదించారు. అవసరమైతే పార్టీ నాయకత్వం మార్పు విషయంలో నిర్ణయం తీసుకోవడానికీ ఆప్ సంకోచించదని ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు విశ్వాస్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు కూడా.

ఖాన్‌పై విశ్వాస్ ఆగ్రహం

ఖాన్‌పై విశ్వాస్ ఆగ్రహం

దీంతో.. విశ్వాస్ పార్టీ నాయకత్వం చేపట్టాలని తహతహలాడుతున్నారని, పార్టీని చీల్చడానికి బీజేపీ ఏజెంటుగా పనిచేస్తున్నారని ఆప్ ఎమ్మెల్యే అమానుతల్లాఖాన్ ఆరోపణలకు దిగడంతో వివాదం ముదిరింది. ఈ ఆరోపణలపై తీవ్రంగా కలత చెందిన విశ్వాస్.. తనకు వ్యతిరేకంగా పార్టీలో కుట్ర జరుగుతోందని, ఖాన్ కేవలం ఆ కుట్రకు ముసుగు మాత్రమేనని బాహాటంగా ఆరోపిస్తూ త్వరలో కీలకమైన నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.

ఇలా కేజ్రీవాల్ నష్ట నివారణ చర్యలు

ఇలా కేజ్రీవాల్ నష్ట నివారణ చర్యలు

దీంతో కేజ్రీవాల్ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తదితరులతో కలిసి మంగళవారం రాత్రి స్వయంగా విశ్వాస్ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. విశ్వాస్, కేజ్రీవాల్ మధ్య రాజీ కుదిరిందని, సంక్షోభం సమసిపోయిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బుధవారం అమానుతుల్లాఖాన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

క్రమంగా ఆప్‌లో పెరుగుతున్న అసంతృప్తి

క్రమంగా ఆప్‌లో పెరుగుతున్న అసంతృప్తి

రాజకీయంగా అరవింద్ కేజ్రీవాల్ ఎంత అనూహ్యంగా ఎదుగుదల సాధించారో అంతే వేగంగా పతనం అవుతోందని.. పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి, నాయకుల్లో అసమ్మతి పెరిగిపోతోందని.. అది త్వరలోనే కేజ్రీవాల్‌ను చుట్టుముట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆప్ ఉద్యమ స్ఫూర్తిని కేజ్రీవాల్ దగా చేశారని చాలా మందిలో ముఖ్యంగా పార్టీ ఎమ్యెల్యేలు కొందరిలో తీవ్ర అసంతృప్తి ఉందని చెప్తున్నారు. కేజ్రీవాల్, ఆయన కోటరీ కార్యకర్తలకు దూరమైపోయారని.. కేంద్రీకృత నిర్ణయాధికారం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. తాజా సంక్షోభంలో చాలా మంది ఎమ్మెల్యేలు విశ్వాస్‌కు మద్దతుగా నిలిచారు.

బెస్ట్ కేజ్రీవాల్ భవితవ్యం ఇలా..

బెస్ట్ కేజ్రీవాల్ భవితవ్యం ఇలా..

ఢిల్లీ సీఎంగా, పార్టీ జాతీయ కన్వీనర్‌గా రెండు అత్యున్నత పదవుల్లోనూ కేజ్రీవాలే ఉన్నారని.. ఆయన ఏదో ఒక పదవి నుంచి తప్పుకుంటే ఉత్తమమని పార్టీలో మరికొందరు నాయకులు భావిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు సీఎం పదవి అప్పగించి.. కేజ్రీవాల్ పార్టీ పునర్నిర్మాణంపై దృష్టిసారిస్తే బాగుంటుందని కొందరు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. సిసోడియా కూడా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఇది కార్యకర్తల పార్టీ అని, పార్టీని పరిరక్షించుకోవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఆప్ రాబోయే రోజుల్లో చీలడం తధ్యమని, కేజ్రీవాల్ సీఎం పదవిని కూడా కోల్పోవాల్సి రావచ్చునని ఢిల్లీ రాజకీయ వర్గాల్లోనే కాదు.. ఆప్ నాయకుల్లోనూ చాలా మంది బలంగా విశ్వసిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Delhi’s ruling AAP today desperately sought to avert a major internal crisis after it punished the party’s popular Muslim face Amanatullah Khan for speaking against senior colleague, Kumar Vishwas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more