వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో ‘మాయ’: కమలనాథుల పొలిటికల్ గేమ్

ఇప్పటి వరకు ‘కమండల్’ రాజకీయాల వ్యూహం మాత్రమే అమలు చేస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) క్రమంగా మండల్ రాజకీయాల వైపు మళ్లడం వెనుక భారీ వ్యూహమే దాగి ఉన్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు 'కమండల్' రాజకీయాల వ్యూహం మాత్రమే అమలు చేస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) క్రమంగా మండల్ రాజకీయాల వైపు మళ్లడం వెనుక భారీ వ్యూహమే దాగి ఉన్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామం నుంచి ఒక అట్టడుగు తరగతి వ్యక్తిగా రామ్‌నాథ్‌కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసి, గెలిపించుకోవడమే ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

దేశంలోని అత్యున్నత పదవికి ఆరెస్సెస్ భావజాలానికి అంకితమైన ఒక దళితుడి ఎంపిక ద్వారా భవిష్యత్ రాజకీయ వ్యూహాలు అమలు చేయబోతున్నామన్న సంకేతాలిచ్చారు కమలనాథులు. మున్ముందు దూకుడుగా 'మండల్' రాజకీయాలు అమలుజేయబోతున్నామని ప్రత్యర్థులకు హెచ్చరిక పంపారు.

2014 లోక్ సభ ఎన్నికల్లో ఓబీసీ నాయకుడు నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే, 2017లో దేశ ప్రథమ పౌరుడిగా ఒక దళితుడు పదవిని అలంకరించబోతున్నారు. దీని వెనుక దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లోని దళితుల జనాభాలో జాతవ్‌లు, పాసీల తర్వాత అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న 'కోరి'కి చెందిన రామ్ నాథ్ కోవింద్ ఎంపికతో దళితుల ఓట్లు కొల్లగొట్టి యూపీ మాజీ సీఎం - బీఎస్పీ అధినేత మాయావతిని రాజకీయంగా దెబ్బతీయాలన్నదే బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నది.

ఆచరణలో బీజేపీ మండల్ రాజకీయం

ఆచరణలో బీజేపీ మండల్ రాజకీయం

2012 ఎన్నికల నుంచి క్రమంగా యూపీ రాజకీయాల నుంచి కనుమరుగైన బీఎస్పీని మరింత దెబ్బ తీయడానికి... సమీప భవిష్యత్‌లో దళిత, బహుజన రాజకీయాలు చేయకుండా కాంగ్రెస్, ఇతర విపక్షాలను కట్టడి చేసేందుకు దూకుడైన బీజేపీ వ్యూహం పని చేయనున్నది. రాష్ట్రపతి ఎన్నికలు సమీపించగానే ఎన్డీయే అభ్యర్థిగా పలువురి మంది ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయి. అందులో చాలామంది ప్రజలందరికీ సుపరిచితం కూడా. కానీ ప్రధాన మంత్రి మోదీ వారందరినీ తోసిరాజని.. ఎవరికీ పెద్దగా పరిచయం లేని రామ్‌నాథ్ కోవింద్‌ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆయనను ఎంపిక చేయడం మొదలు గెలిపించుకోవడం వరకు మోదీ వేసిన ప్రతి అడుగు రాజకీయంగా సంచలనం సృష్టించాయి.

ప్రతిపక్ష జేడీయూ సైతం కోవింద్‌కు మద్దతు పలుకడం, పలువురు ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడటమే ఇందుకు నిదర్శనం. రామ్‌నాథ్ కోవింద్ గెలుపుతో దేశంలోని అధికార వ్యవస్థలో ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రధాని పదవిలో ఓబీసీ... రెండోసారి రాష్ట్రపతిగా ఎస్సీ, ఆసీనులవుతున్నారు. రామ్‌నాథ్ దళిత వర్గానికి చెందినవారు కాగా, మోదీ ఓబీసీకి చెందినవారు. ఫలితంగా కాంగ్రెస్ దశాబ్దాలుగా వల్లెవేస్తున్న బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం (మండల్ పాలిటిక్స్) నినాదాన్ని తొలిసారి బీజేపీ ఆచరణలో చేసి చూపినట్లైంది. దీంతో ఆయా వర్గాల ప్రజలు బీజేపీవైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Recommended Video

Venkaiah Naidu To Be First Vice President If Elected
ఫక్తు ఓటు బ్యాంకు రాజకీయాలిలా

ఫక్తు ఓటు బ్యాంకు రాజకీయాలిలా

ప్రజల్లో బీజేపీ అగ్రవర్ణ పార్టీ అనే భావన ఉన్నది. పార్టీకి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకు, ఆరెస్సెస్‌లో, పార్టీలో ఉన్నత పదవుల్లో ఉన్నవారంతా అగ్రవర్ణాల వారే అంటే అతిశేయోక్తి కాదు. దానికి తగ్గట్టే గతంలో బీజేపీ గద్దెనెక్కినప్పుడు ఉన్నత పదవుల్లో అగ్రవర్ణాలవారే అధికారం చేపట్టారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ భావన క్రమంగా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్‌కు ఉన్న ఎస్సీ, ఓబీసీ ఓటుబ్యాంకు చీలి బీజేపీవైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నది. మరోవైపు ఆరెస్సెస్ సైతం దీర్ఘకాలిక వ్యూహంతోనే పనిచేస్తున్నదని తెలుస్తున్నది. 2014 ఎన్నికలలో మోదీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసి ఓబీసీని బరిలో నిలిపింది.

తాజాగా రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్‌ను ఎంపిక చేయడంలోనూ కీలకంగా వ్యవహరించింది. ఇదే రామ్ నాథ్ కోవింద్ 1991 లోక్ సభ మధ్యంతర ఎన్నికల్లో యూపీలోని గౌతంపూర్ లోక్ సభా స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2007లో భోగ్నిపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఓడిపోయారు. కానీ బీజేపీ అగ్ర నాయకత్వం మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చింది.

1998 - 2004 మధ్య బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా, అఖిల భారత కోలి సమాజ్ అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. 1994 - 2006 మధ్య యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన రామ్ నాథ్ కోవింద్.. బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 2015 ఆగస్టు ఎనిమిదో తేదీన బీహార్ గవర్నర్ గా నియమితులయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యే వరకు ప్రచారానికి దూరంగా ఉంటూ వచ్చిన రామ్ నాథ్ కోవింద్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైనా.. దేశ ప్రథమ పౌరుడిగా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు.

ఇలా కాంగ్రెస్ పార్టీపై బీజేపీ పై చేయి

ఇలా కాంగ్రెస్ పార్టీపై బీజేపీ పై చేయి

గతంలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పాటైనప్పటికీ.. అవి సంకీర్ణ ప్రభుత్వాలు కావడంతో ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేది. ఫలితంగా ఆరెస్సెస్, బీజేపీ తమ వ్యూహాలను పక్కాగా అమలు చేసే అవకాశం ఉండేదికాదు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ, ఆరెస్సెస్ తమ దూకుడు పెంచాయి. జాతీయస్థాయిలో తమ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీంట్లోభాగంగానే కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ మోదీ నినాదం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత తక్కువ సీట్లను గెల్చుకున్నది. అనంతర జరిగిన పలు రాష్ర్టాల అసెంబ్లీల ఎన్నికల్లోనూ ఆ పార్టీకి పరాజయాలే ఎదురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దూకుడుతో ఉన్న బీజేపీ... కాంగ్రెస్ నినాదమైన ‘బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం' నినాదాన్ని కూడా స్వీకరించినట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి.

అద్వానీ ఇలా అయోధ్య రథయాత్ర

అద్వానీ ఇలా అయోధ్య రథయాత్ర

ఈనాడు రాజకీయంగా ఎదుగుదల కోసం ‘మండల్' రాజకీయ జపం పాటిస్తున్న కమలనాథులు.. 1990లో నాటి ప్రధాని విశ్వనాథ ప్రతాప్ సింగ్.. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలుజేయాలని చేసిన బీపీ మండల్ కమిషన్ సిఫారసులను అమలుజేస్తామని ప్రకటించడంతో గంగవెర్రెలెత్తారు. దేశవ్యాప్తంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం (ఏబీవీపీ) ముందు వరుసలో నిలిచి పోరాడింది. రాజకీయంగా జనతాదళ్ పార్టీని, వీపీసింగ్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ.. అయోధ్యకు రథయాత్ర చేపట్టారు. బీహార్ రాష్ట్రంలో ప్రవేశించిన అద్వానీ రథయాత్రను అప్పటి ఆ రాష్ట్ర సీఎం.. ప్రస్తుత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అడ్డుకోవడంతో జాతీయ ద్రుష్టిని ఆకర్షించారు. ఫలితంగా వీపీ సింగ్ సర్కార్ పతనమైన సంగతి అందరికీ తెలిసిన సంగతే. వాస్తవాలిలా ఉంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీని ‘ఓటు బ్యాంకు' రాజకీయాలు చేస్తున్నదని విమర్శలు గుప్పిస్తున్న బీజేపీకి కూడా అదే యావ పట్టుకున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

కేఆర్ ప్రస్తావన, మీరా కుమార్ అభ్యర్థిత్వంతో ఇలా వెనుకడుగు

కేఆర్ ప్రస్తావన, మీరా కుమార్ అభ్యర్థిత్వంతో ఇలా వెనుకడుగు

రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్ పేరును ప్రతిపాదించినప్పుడు తొలిసారి దళితుడిని పోటీకి పెట్టామని ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నించారు కమలనాథులు. కానీ కేఆర్ నారాయణన్ దళితుడన్న విషయం బయటకు రావడంతోపాటు లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో దళితుల మధ్య పోటీగా భావించొద్దన్న ప్రచారం ముందుకు తెచ్చారు.

కానీ ఎన్నికలు పూర్తయి మరో మూడు రోజుల్లో రామ్ నాథ్ కోవింద్ దేశ ప్రథమ పౌరుడిగా బాద్యతలు స్వీకరిస్తున్న వేళ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ట్వీట్ గమనార్హం. తొలిసారి బీజేపీ సొంత బలంతో దళిత నేతను రాష్ట్రపతిగా నామినేట్ చేయగలిగినందుకు గర్వకారణంగా ఉన్నదని ట్వీట్ చేశారు. రామ్ నాథ్ కోవింద్ సామాజిక నేపథ్యాన్ని ప్రశ్నించడం సబబు కాదు కానీ.. ఆయన స్వయంగా తానేమిటో చెప్తూనే వారందరి ప్రతినిధిగా రాష్ట్రపతి భవన్‌లో అడుగు పెడుతున్నానన్నారు.

కేవలం ఆయన రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెడితేనే అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి ఎలా సాధ్యమన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఇక్కడొక్క మాట గతంలో రాష్ట్రపతిగా పనిచేసిన కేఆర్ నారాయణన్.. తనను దళితుడిగా చూడొద్దని.. అందుకు అవకాశం ఇవ్వొద్దని చెప్పడంతోపాటు పదవిలో ఉన్నప్పుడు సత్సంప్రదాయాలు, కొత్త ఒరవడి నెలకొల్పారు.. మరి రామ్ నాథ్ కోవింద్.. ఆయన బాటలో పయనిస్తారా? లేదా? అన్నది మున్ముందు వేచి చూడాల్సిందే మరి.

English summary
President-elect Ram Nath Kovind’s journey from a nondescript village in eastern Uttar Pradesh to the Rashtrapati Bhavan is reflective of the triumph of the proletarian against the entitled, as it is of the stunning symbolism of him being a Dalit from the Hindi heartland.That this is the first time a devoted activist of the RSS has come to occupy the country’s highest office is almost a postscript in the host of other political signals in Kovind’s election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X