వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేదురుమల్లి: ఇందిరా గాంధీకి సన్నిహితుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనారోగ్యంతో మరణించిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఓ సామాన్య ఉపాధ్యాయుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టే దాకా ఎదిగారు. బిఇడి చదివిన నేదురుమల్లి క్రిష్టియన్ మిషనరీ సంస్థల ఆర్థిక సహకారంతో తన చిన్నాన్న బాలకృష్ణారెడ్డి నిర్వహించిన విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఆ సమయంలో 1970లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 1972లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆనాటి నుంచి ఇందిర గాంధీకి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మారారు.

నెల్లూరు జిల్లా రాజకీయాలను కొన్నేళ్లపాటు నల్లపరెడ్లు, ఆనం కుటుంబాలు శాసిస్తూ వచ్చాయి. ఇందిరా గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా నేదురుమల్లి రాకతో జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు మారిపోయాయి. ఇందిర నుంచి సోనియా వరకూ ఆయన మాటే చెల్లుబాటు అయ్యేది. నాలుగు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపి ఎందరో నేతలకు రాజకీయ ఓనమాలు దిద్దించారు. అందుకే జిల్లా రాజకీయాల్లో నేదురుమల్లిని పెద్దాయనగా పిలుస్తుంటారు.

Nedurumalli: a teacher to Andhra Pradesh CM

1978లో మండలిలో అడుగు పెట్టిన జనార్దన్ రెడ్డి 1978-83 వరకు రెవెన్యూ మంత్రిగా పని చేశారు. అప్పట్లోనే ఆయన పట్టాదారు పాసు పుస్తకాలను ప్రవేశపెట్టారు. 1989లో జరిగిన ఎన్నికల్లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989-90 మధ్య కాలంలో విద్యుత్తు, అటవీ, వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరించారు. 1990లో మర్రి చెన్నారెడ్డి రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన 1992లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల కేపిటేషన్ ఫీజు వసూళ్లకు అనుమతి ఇవ్వడంపై ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదం కావడం హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది.

ముఖ్యమంత్రి హోదాలో 1992లో విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో మావోయిస్టులపై నిషేధం విధిస్తున్నట్లు జనార్దన రెడ్డి సంచలన ప్రకటన చేశారు. దీంతో, మావోయిస్టుల హిట్ లిస్టులో ఆయన పేరు చేరింది. అనంతరం రెండుసార్లు మావోయిస్టులు ఆయనపై దాడులు చేశారు. రెండుసార్లూ ఆయన తప్పించుకున్నారు. తొలిసారి జరిగిన దాడిలో నేదురుమల్లి తప్పించుకోగా, 2007 సెప్టెంబరులో వాకాడు నుంచి తిరుపతికి వెళుతుండగా మరోసారి దాడి చేశారు. నేదురుమల్లి దంపతులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ముగ్గురు కార్యకర్తలు మృతి చెందారు.

నేదురుమల్లి అంచెలంచెలుగా ఎదిగి ఇటు పార్టీ, అటు చట్ట సభల్లో ఎన్నో పదవులను అలంకరించారు. పిసిసి అధ్యక్షుడిగా, సిడబ్ల్యుసి సభ్యుడిగా పని చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన పూర్తిగా కేంద్ర రాజకీయాలపైనే దృష్టి సారించారు. 1998లో బాపట్ల నుంచి, 1999లో నరసరావుపేట నుంచి, 2004 ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించారు. రాజ్యసభకు కూడా రెండు సార్లు ఎంపికయ్యారు. కానీ కేంద్ర మంత్రిగా పనిచేయాలనే ఆయన కోరిక మాత్రం నెరవేరలేదు.

English summary
Former CM Nedurumalli Janardhan Reddy reached to height in politics to work as CM of Andhra Pradesh from a teacher.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X