• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఖతార్‌పై నిషేధం: అమెరికా దన్నుతో అరబ్ దేశాల ఎటాక్

By Swetha Basvababu
|

దోహా/రియాద్: అంతర్జాతీయంగా శక్తిమంతమైన బలీయమైన ఆర్థిక శక్తుల్లో ఒక్కటైన ఖతార్‌తో సౌదీ అరేబియా, బహ్రెయిన్‌, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఈజిప్టు, లిబియా, యెమెన్‌.. తదితర దేశాలు దౌత్యసంబంధాలు తెంచుకోవడం సంచలనం సృష్టించింది. అల్‌ఖైదా.. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థలకు ఖతార్ చేయూతనిస్తోందని ఆరోపిస్తూ ఆ దేశాలు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. తాజా నిర్ణయం నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందన్నది ఆసక్తికరంగా మారింది.

మధ్య ప్రాచ్యంలో ఇరాన్, సౌదీ అరేబియా మధ్య సుదీర్ఘకాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. ఖతార్‌ చిన్న దేశమైనా 20 ఏళ్లుగా చమురు ఉత్పత్తులతో ఆర్థిక ప్రగతిని సాధించింది. ఇటీవల ఇరాన్‌కు ఖతార్‌ దగ్గర కావడం రుచించకే ఖతార్‌పై సౌదీ అరేబియా కఠినచర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది.

ఖతార్‌లో తమ సెంట్రల్‌ కమాండ్‌ కార్యాలయం ఉండటంతో అమెరికా కూడా ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. ఖతార్‌లోని ఎయిర్‌బేస్‌లో ఏకంగా 11 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. మరోవైపు సమస్య పరిష్కారం కోసం కువైట్ రాజు రంగంలోకి దిగారని తెలుస్తున్నదని వార్తలొచ్చాయి. టర్కీతో భద్రతా ఒప్పందం కుదుర్చుకుంటే ఒకింత ఖతార్ బలమైన శక్తిగా నిలిచినందున ఖతార్‌పై పట్టు సాధించాలన్న సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్టు తదితర దేశాల కలలు సాకారం కావడం అంత తేలిక్కాదని విశ్లేషకులు తెలిపారు.

Saudi Arabia, UAE, others cut ties with Qatar

ఆహార ఉత్పత్తులకు ఇక్కట్లేనా?

ఈ సమస్యకు పరిష్కారాన్ని చర్చల ద్వారా కనుగొంటామని ఖతార్‌ విదేశాంగమంత్రి షేక్‌ మహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ అల్‌థనీ తెలిపారు. సంక్షోభానికి నిజమైన కారణం తెలియలేదని స్పష్టం చేశారు. సౌదీతో చర్చల కోసం మధ్యవర్తిత్వం వహించేందుకు కువైట్‌ ముందుకు వచ్చిందన్నారు. కువైట్ రాజు బుధవారం సౌదీ అరేబియాకు వెళ్లి చర్చించనున్నారు. ఖతార్‌కు యూఏఈతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యూఏఈ నుంచే చక్కెర తదితర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఆంక్షలు విధించిన దేశాల్లో అబుదాబీ ఉండటంతో ఖతార్ వాసులకు ఆహార ఉత్పత్తుల కొరత ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఖతార్‌పై ఇతర దేశాలు ఆంక్షలు విధించడంతో ఖతార్‌ సూపర్‌మార్కెట్లలో సరకుల కోసం జనం బారులు దీరారు. వేలమంది ముందు జాగ్రత్తగా నిత్యావసర వస్తువులను భారీ ఎత్తున కొనుగోలు చేయడంతో మార్కెట్లు కొన్ని గంటల్లోనే ఖాళీ అయ్యాయి. భూమార్గం నుంచి ఖతార్‌ చేరుకోవటానికి సౌదీ అరేబియా నుంచి మాత్రమే మార్గం ఉన్నది. ఈ రహదారిని మూసివేయడంతో భవిష్యత్‌లో ఖతార్‌లో సరకుల ధరలు నింగికెగిసే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే సరిహద్దుల్లో వందలాది ట్రక్కులు వేచివున్నాయి. ఖతార్‌ దిగుమతి చేసుకునే ఆహారంలో 40 శాతం సౌదీ నుంచే వస్తుంది. ఒక వైపు నుంచి భూ మార్గం ఉండటడంతో ఖతార్ వాసులు ఆహార వస్తువుల కోసం అల్లాడి పోవాల్సిందేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అమెరికాకు ఇబ్బందే..!

గల్ఫ్‌లో తాజా పరిణామాలు అమెరికాకు కూడా ఇబ్బందులు సృష్టించనున్నాయి. పలు ఖతార్‌ సంస్థలు అమెరికాలో భారీ పెట్టుబడులకు రంగం సిద్ధం చేసుకున్న సమయంలో ఆంక్షలు విధించడంతో పెట్టుబడులపై ఏం నిర్ణయం తీసుకుంటారన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. మధ్యప్రాచ్యంపై తమ పట్టు సడలకుండా తీసుకోవాల్సిన చర్యలపై అమెరికా దృష్టి సారించింది. ఇదిలా ఉంటే ఖతర్‌తో అరబ్‌ దేశాలు దౌత్య సంబంధాలు తెంచుకోవడం ఉగ్రవాద అంతానికి ఆరంభమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఇటీవల తను జరిపిన పర్యటన మంచి ఫలితాలిస్తోందని ట్వీట్‌ చేశారు. 'సౌదీ అరేబియా రాజుతోపాటు 50 దేశాల నేతల భేటీతో సాగిన నా సౌదీ పర్యటన ఇప్పటికే ఫలితాలిస్తోంది. ఉగ్రవాద సిద్ధాంతానికి ఇంకెంతమాత్రం నిధులు అందకూడదని వారికి చెప్పాను.. నేతలు ఇప్పుడు ఖతర్‌ను వేలెత్తి చూపుతున్నారు.. ఉగ్రవాదానికి నిధుల ప్రవాహంపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.. ఉగ్రవాద బీభత్సం అంతానికి బహుశా ఇది ఆరంభం కావొచ్చు' అని పేర్కొన్నారు.

Saudi Arabia, UAE, others cut ties with Qatar

ట్రంప్ చెప్పిందొకటి.. సౌదీ అమలు చేసిందొకటి..!

గత నెలలో సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లినప్పుడు తీవ్రవాదులకు, వేర్పాటువాదులకు సాయం చేస్తున్న ఇరాన్‌ను ఏకాకిని చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పిలుపు ఇచ్చారు. ఐఎస్‌కు, ఇతర ఉగ్రమూకలకు ఇరాన్‌ నిధులు అందజేస్తోందన్నారు. అమెరికా అండ కోసం చూడకుండా తమ దేశాల, భావితరాల శ్రేయస్సు దృష్ట్యా పశ్చిమాసియా దేశాలు తమ కార్యాచరణ ప్రణాళికను రూపొదించుకోవాలన్నారు. సౌదీ అరేబియా దీన్ని మరోలా అర్థం చేసుకున్నది. ఇరాన్‌ను కట్టడి చేయడం అంత సులువైన పనికాదు కాబట్టి... తమ పొరుగున పంటికింద రాయిలా మారిన 'ఖతార్‌'పై కత్తిదూసింది. ట్రంప్‌ మాటలను సానుకూల సంకేతంగా తీసుకొని.. యూఏఈ, యెమెన్, బహ్రయిన్‌లతో కలిపి సంబంధాలను తెంపేసుకున్నది. ఇరాన్‌తో అంటకాగుతూ తీవ్రవాదానికి ఊతమిస్తోందని ఆరోపించింది. సౌదీలో ట్రంప్‌ మాట్లాడినపుడు పర్యవసానాలను ఊహించని అమెరికా ఇప్పుడు అరబ్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి తంటాలు పడుతోంది.

సౌదీని కాదంటే కష్టాలే మరి

ఖతార్‌ 26 లక్షల మంది జనాభా, 11,586 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన పశ్చిమాసియాలోని చిన్నదేశం. ప్రపంచంలోనే చమురు, సహజవాయువు నిక్షేపాలు అధికంగా ఉన్న దేశాల జాబితాలో నాలుగోస్థానం ఈ దేశానిదే. లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ) అతిపెద్ద ఎగుమతిదారు. ప్రపంచ ఎల్‌ఎన్‌జీ ఎగుమతుల్లో ఖతర్‌ వాటా 31.8 శాతం. ఇదే వీరి బలం కూడా. తలసరి ఆదాయపరంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. తలసరి ఆదాయం రూ. 83 లక్షలు. ముస్లిం దేశాల్లో అత్యంత ఆదరణ కలిగిన 'అల్‌ జజీరా' టీవీ ఛానల్‌ ఖతర్‌ ప్రభుత్వానిదే. పశ్చిమాసియా ప్రాంతంలో సౌదీ అరేబియా పెద్దన్న పాత్రను పోషిస్తోంది. అరబ్‌ దేశాల్లో సున్నీల పాలనలో ఉన్న దేశాలకు సౌదీ మార్గనిర్దేశం చేస్తోంది. భౌగోళికంగా సువిశాల దేశం కావడం, చమురు నిక్షేపాలు పుష్కలంగా ఉండటం, పైగా దీర్ఘకాలంగా అగ్రరాజ్యం అమెరికాతో బలమైన మైత్రి ఉండటంతో ఈ ప్రాంతంలో సౌదీ ఆధిపత్యం చెలాయిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఖతర్‌ సున్నీ రాజ్యాల బాటలో వెళ్లకుండా విదేశాంగ విధానంలో స్వతంత్ర వైఖరిని అవలంభిస్తోంది. సంపన్న దేశం కావడం, మీడియా అండ ఉండటంతో పశ్చిమాసియాలో ఖతార్‌కు స్థాయికి మించిన ప్రాధాన్యం దక్కడాన్నిసౌదీ సహించలేకపోతోంది.

వివాదాల పరిష్కారంలో ఖతార్ ఇలా

ఈజిప్టులో ముస్లిం బ్రదర్‌హుడ్‌కు సాయపడ్డ ఖతార్‌... ఇజ్రాయిల్‌లో హమస్‌కు అన్నిరకాలుగా అండదండగా నిలుస్తోంది. హమస్‌ అగ్రనేతలు దోహాలో తలదాచుకోవడానికి అనుమతించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రాంతీయంగా బలీయమైన శక్తులు, బద్ధవిరోధులైన సౌదీ అరేబియా, ఇరాన్‌లలో ఏదో పక్షం పక్కన చేరకుండా... రెండుదేశాలతోనూ సంబంధాలు నెరుపుతూ స్వతంత్రంగా ఉంటోంది.
అమెరికా సైనిక స్థావరానికి అనుమతిచ్చినట్లుగానే... పలు తీవ్రవాద సంస్థల రాజకీయ కార్యాకలాపాలను తమ గడ్డ మీద అనుమతించింది. ఈ సానుభూతితోనే తీవ్రవాద సంస్థలేవీ ఖతర్‌లో కార్యాచరణకు దిగవు. మరోవైపు అరబ్‌ దేశాల మధ్య తలెత్తే విబేధాల్లో ఖతర్‌ మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటుంది. దౌత్యవ్యవహారాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. మరోవైపు తమకున్న సంబంధాల దృష్ట్యా తీవ్రవాద సంస్థలతోనూ బేరసారాలు నెరపగలదు. బందీలను తీవ్రవాద చెర నుంచి విడిపించింది కూడా. అరబ్‌ విప్లవాన్ని సమర్థించింది.

Saudi Arabia, UAE, others cut ties with Qatar

ఖతార్ పై సౌదీ రాజు భయం

స్వతంత్ర వైఖరితో పాటు షియా- సున్నీ విబేధాలు కూడా సౌదీ, యెమెన్, యూఏఈ, ఈజిప్టులు ఖతార్‌తో సంబంధాలను తెంచుకోవడానికి ఒక కారణం. సౌదీ, ఖతార్‌తో సహా చాలా అరబ్‌ దేశాల్లో సున్నీ పాలకులే ఉన్నారు. రాజరిక పాలన ఉన్న ఈ దేశాల్లో సున్నీ రాజవంశాలు అధికారంలో ఉన్నాయి. ఖతార్‌కు చేరువ కావడం ద్వారా షియా ఆధిక్య ఇరాన్‌, సున్నీ రాజ్యాలను అస్థిర పరిచేందుకు ప్రయత్నిస్తోందనేది సౌదీ అరేబియా అనుమానం. తమను అధికారంలో నుంచి కూలదోసే కుట్ర జరుగుతోందనేది సున్నీ రాజుల భయం. అల్‌ జజీరా చానెల్‌ ద్వారా తీవ్రవాద అనుకూల ప్రచారాన్ని నిర్వహిస్తోందని, తిరుగుబాటుదారులను రెచ్చగొడుతోందని ఖతార్‌పై సౌదీ ఆరోపణ. తమ దేశంలోని తూర్పు ప్రాంతమైన ఖాతిఫ్‌లో (షియాల ఆధిక్య ప్రాంతం) ఇరాన్‌ దన్నుతో దాడులకు దిగుతున్న మిలిటెంట్లకు ఖతార్‌ మద్దతిస్తోందని కూడా సౌదీ ఆరోపించింది.

ఖతార్‌పై సౌదీ కూటమి ఇలా దాడి
ఇరాన్‌పై ట్రంప్, సౌదీల వైఖరిని తప్పుపడుతూ ఖతార్‌ రాజు షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ వ్యాఖ్యలు చేసినట్లు దేశ అధికారిక వార్తాసంస్థలో వచ్చింది. తమ సైట్‌ను ఎవరో హ్యాక్‌ చేసి ఈ పని చేశారని ఖతార్‌ వివరణ ఇచ్చింది. దీనిని సౌదీ కూటమి తీవ్రంగా ఖండించింది. అల్‌ జజీరాతో పాటు ఖతార్‌కు చెందిన ఇతర మీడియా సంస్థలను నిషేధించాయి సౌదీ, మిత్రదేశాలు. ఈ నేపథ్యంలో ఇరాన్‌ అధ్యక్షుడిగా హసన్‌ రౌహానీ మే నెలలో మరోసారి ఎన్నికయ్యారు. ఖతార్‌ రాజు షేక్‌ తమీమ్‌... రౌహానికి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. దీన్ని సౌదీ కవ్వింపు చర్యగా పరిగణించింది. ఫలితంగా కొద్దిరోజులగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అదును కోసం చూసిన సౌదీ ట్రంప్‌ వ్యాఖ్యలను సానుకూలంగా తీసుకొని ఖతార్‌తో కటీఫ్‌ అంది.

మధ్యవర్తిత్వ చర్చల్లోనూ ఇరాన్ కీలకమే

సౌదీ కీలక మిత్రదేశమైనా ఖతార్‌తోనూ అమెరికాకు అవసరం ఉంది. సైనిక స్థావరమే కాకుండా అమెరికా సంస్థల్లో భారీ పెట్టుబడులకు ఖతర్‌ హామీ ఇచ్చింది. వీటిని దృష్టిలో పెట్టుకునే అమెరికా ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవేళ చర్చలు జరిగితే తీవ్రవాదులకు నిధులు నిలిపివేయడం లాంటి వాటికి ఖతార్‌ అంగీకరించొచ్చు. అయితే ఇరాన్‌తో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని సౌదీ, దాని మిత్రదేశాలు డిమాండ్‌ చేస్తే మాత్రం... ఖతార్‌ ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే భారీ గ్యాస్‌ నిక్షేపాలున్న 'నార్త్‌ ఫీల్డ్‌'పై ఖతార్, ఇరాన్‌లకు ఉమ్మడి యాజమాన్య హక్కులున్నాయి. ఖతార్‌ ఆర్థిక పటిష్టతకు నార్త్‌ఫీల్డ్‌ చాలా కీలకం. ఈ నేపథ్యంలో పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.

English summary
The Arab states of the Persian Gulf are in the grips of an unprecedented regional crisis. In Monday's early hours, Saudi Arabia, the United Arab Emirates, Bahrain and Egypt released coordinated statements, announcing a diplomatic break with the tiny-yet-wealthy peninsular nation of Qatar. They cut air, sea and land links and ordered Qatari officials and nationals stationed in their countries to return home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X