వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెన్నమనేని ఎమ్మెల్యేగిరి ప్రశ్నార్థకం: నేపథ్యం ఇదీ.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వారు రాజకీయ ప్రత్యర్థులు. ఒకరు తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తరఫున వేములవాడ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్.. మరొకరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేత ఆది శ్రీనివాస్.

వీరిద్దరి మధ్య ఎనిమిదేళ్లుగా రాజకీయంగా 'పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత'గా వైరం కొనసాగుతున్నది. దానికి ప్రధాన కారణం కేంద్ర హోంశాఖ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో చెన్నమనేని రమేశ్ భారతీయ పౌరుడు కాదని, ఆయనకు పౌరసత్వం లేదని తేల్చి చెప్పింది.

2009లో తెలుగుదేశం పార్టీ తరఫున వేములవాడ నుంచి గెలుపొందిన చెన్నమనేని రమేశ్ తర్వాత 2010, 2014ల్లోనూ టీఆర్ఎస్ తరఫున విజయం సాధించారు. ఇది ఒక ప్రజామోదం పొందడమే. అయితే చెన్నమనేని రమేశ్ ఉమ్మడి పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ ఆది రమేశ్ హైకోర్టులో పిటిషన్ వేసినా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కిన చెన్నమనేని రమేశ్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. కేంద్రం వైఖరేమిటో తేల్చి చెప్పాలని ఆదేశించింది. పూర్వాపరాలు పరిశీలించిన హోంశాఖ సాంకేతిక కారణాల రీత్యా చెన్నమనేని రమేశ్‌కు భారత పౌరసత్వం లేదని, ఆయన భారతీయుడు కాదని జర్మనీ పౌరుడని తేల్చేసింది.

వేములవాడకు ఉప ఎన్నిక తప్పదా?

వేములవాడకు ఉప ఎన్నిక తప్పదా?

దీంతో వేములవాడ ఎమ్మెల్యేగా రమేశ్ బాబు పౌరసత్వం రద్దయితే ఆయన ఎమ్మెల్యే పదవి కూడా రద్దు కావడం ఖాయంగా కనిపిస్తున్నది. కాకపోతే హోంశాఖ ఆదేశాలపై రివ్యూ పిటిషన్ వేస్తామని చెన్నమనేని రమేశ్ వాదిస్తున్నారు. చెన్నమైనని రమేశ్ పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ 2009 ఎన్నికల్లో ఓటమి పాలైన అప్పటి కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ 2009 జూన్ 15వ తేదీన కేంద్ర హోంశాఖలో పిటిషన్ దాఖలు చేశారు. తదనుగుణంగా హోంశాఖ జారీ చేసిన ఆదేశాలపై అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నివేదిక పంపింది. తర్వాత దీనిపై విచారించేందుకు 2012లో ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర హోంశాఖ కమిటీ విచారణ జరిపింది. ఈ కమిటీ నివేదిక పెండింగ్‌లో ఉన్నది.

చెన్నమనేనికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు

చెన్నమనేనికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు

ఇదిలా ఉండగా తెలంగాణ ఏర్పాటులో జాప్యాన్ని నిరసిస్తూ 2010లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోపాటు వేములవాడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన చెన్నమనేని రమేశ్ రాజీనామా చేశారు. టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. 2010 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున విజయం సాధించిన చెన్నమనేని రమేశ్‌నకు వ్యతిరేకంగా ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు కూడా చెన్నమనేని రమేశ్ అక్రమ పద్దతుల్లో పౌరసత్వం పొందినందున ఆయన పౌరసత్వం చెల్లదని 2013 ఆగస్టులో తీర్పు చెప్పింది. పౌరసత్వంతోపాటు ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తూ.. ఓటరు జాబితా నుంచి ఆయన పేరును కూడా తొలగించాలని తన తీర్పులో హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

2014 ఎన్నికల్లో తిరిగి విజయం

2014 ఎన్నికల్లో తిరిగి విజయం

హైకోర్టుకు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో చెన్నమనేని రమేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్టే కూడా ఎత్తివేయాలని ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఇదిలా కొనసాగుతుండగానే ‘స్టే' ఉండగానే 2014 ఎన్నికల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తిరిగి విజయం సాధించారు. మరోసారి ఆది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు.

చెన్నమనేని పౌరసత్వంపై హోంశాఖలోనూ, సుప్రీంకోర్టు, హైకోర్టుల్లోనూ పిటిషన్ల విచారణ పెండింగ్‌లో కొనసాగుతుండగా... ‘స్టే' ఎత్తేయాలని ఆది శ్రీనివాస్ 2016 ఆగస్టు 11వ తేదీన విచారించిన జస్టిస్ రంజన్ గొగోయ్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకుని హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ నిర్ణయం కేంద్ర హోంశాఖ మరింత గడువు కోరింది. దాదాపు ఏడాది కావస్తున్నా.. హోంశాఖ నిర్ణయంలో జాప్యంపై మరోసారి ఆది శ్రీనివాస్ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. గత నెల 28న విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మానం కేంద్ర హోంశాఖకు ఆరు వారాల గడువు ఇస్తూ చెన్నమనేని పౌరసత్వ వివాదం తేల్చాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం చెల్లదని కేంద్ర హోంశాఖ తేల్చేసింది.

హోంశాఖ ఆదేశాలు వెల్లడయ్యాక స్పందిస్తానని ఆది వ్యాఖ్య

హోంశాఖ ఆదేశాలు వెల్లడయ్యాక స్పందిస్తానని ఆది వ్యాఖ్య

తన కేసులో న్యాయమే గెలుస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు. చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై కేంద్ర హోంశాఖ నిర్ణయంపై ఆయన స్పందిస్తూ తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి పౌరసత్వం పొంది ప్రజలను, కోర్టును రమేశ్ బాబు తప్పుదోవ పట్టించారని అన్నారు. హోంశాఖ నిర్ణయానికి సంబంధించిన పత్రాలు తనకు అందిన తర్వాతే తాను స్పందిస్తానని చెప్పారు. చెన్నమనేని పౌరసత్వంపై కేంద్ర హోంశాఖ ప్రకటించిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఆది శ్రీనివాస్ ఇంటికి చేరుకుని అభినందించారు. 2009 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన చెన్నమనేని రమేశ్ బాబు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో ఏడాది కాలంగానే భారతదేశంలోనే ఉన్నట్లు పేర్కొన్నారు. దీన్ని సవాల్ చేస్తూ ఆది శ్రీనివాస్ హైకోర్టు మెట్లెక్కారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏడాది కాలం స్వదేశంలో ఉన్నట్లు రుజువు చేసుకోవాలని చెన్నమనేనిని హైకోర్టు ఆదేశించింది. ఆయన భారతదేశంలో కేవలం 96 రోజులు మాత్రమే ఉన్నారని తేల్చేసింది. ఎట్టకేలకు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

చెన్నమనేని ఎమ్మెల్యే పదవిపై ఈసీదే తుది నిర్ణయం?

చెన్నమనేని ఎమ్మెల్యే పదవిపై ఈసీదే తుది నిర్ణయం?

చెన్నమనేని రమేశ్ బాబు పౌరసత్వంపై విచారించిన కేంద్ర హోం శాఖ ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ రమేశ్‌బాబుకు లేఖ పంపింది.. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఈ అంశం ఒక్కసారిగా కలకలం రేపింది. చట్ట సభలకు పోటీ చేసే వారు భారతీయ పౌరులై ఉండాలి. పౌరసత్వం లేనప్పుడు ఆయన ఎన్నిక చెల్లదు. రమేశ్‌బాబు పౌరసత్వం రద్దుతో అధికార టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఈ సంగతి తెలుసుకున్న ఎమ్మెల్యే రమేశ్ బాబు తన అనుచరులకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. భయపడాల్సిన పని లేదన్నారు. సీఎం కేసీఆర్‌, ఎంపీ వినోద్‌ ఢీల్లీలో ఉన్నందున హోం శాఖ సంయుక్త కార్యదర్శిని కలుస్తారని.. హోం శాఖ సంయుక్త కార్యదర్శిని కలిసి మరోసారి దీనిపై విచారించేందుకు అవకాశం కోరతామని పేర్కొన్నట్లు తెలిసింది. మరోవైపు ఈ ఘటనతో రమేశ్‌బాబు ఎన్నిక రద్దు అవుతుందా? ఉప ఎన్నికలు అనివార్యమా? ఎన్నికల కమిషన్‌ ఎలా వ్యవహరిస్తుంది? అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చలు ప్రారంభం అయ్యాయి.

మాజీ సీపీఐ నేత చెన్నమనేని తనయుడు రమేశ్ బాబు

మాజీ సీపీఐ నేత చెన్నమనేని తనయుడు రమేశ్ బాబు

చెన్నమనేని రమేశ్ బాబు రాజకీయ కుటుంబ వారసత్వం కలవారే. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నఆయన బాబాయి చెన్నమనేని విద్యాసాగర్ రావు బీజేపీ సీనియర్ నేత. సిరిసిల్ల నుంచి అత్యధిక కాలం ఎమ్మెల్యేగా పనిచేసిన చెన్నమనేని రాజేశ్వర రావు తనయుడే చెన్నమనేని రమేశ్ బాబు. చెన్నమనేని రాజేశ్వర్ రావు తొలి నుంచి సీపీఐ నుంచి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించడంతోపాటు 1999 వరకు ఉత్తమ సంప్రదాయాలు నెలకొల్పారు. కానీ 1999 ఎన్నికల్లో సీపీఐకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా రాజకీయంగా సంచలనం స్రుష్టించారు. అందరినీ ఆశ్చర్య పరిచారు. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున సిరిసిల్ల స్థానానికి ప్రాతినిధ్యం వహించినా తర్వాత తనయుడి కోసం 2009 ఎన్నికల్లో పక్కకు తప్పుకున్నారు.

భారత పౌరసత్వం రద్దుచేస్తే తానెక్కడ ఉండాలని ప్రశ్న

భారత పౌరసత్వం రద్దుచేస్తే తానెక్కడ ఉండాలని ప్రశ్న

భారత పౌరసత్వం కోసం తన జర్మనీ పౌరసత్వాన్ని రద్దు చేసుకున్నానని చెన్నమనేని రమేశ్ బాబు చెప్పారు. ఇటు భారత్‌లోగానీ, అటు జర్మనీలోగానీ ద్వంద్వ పౌరసత్వ విధానం అమలులో లేదన్నారు. ఒకవేళ భారత ప్రభుత్వం తన పౌరసత్వాన్ని రద్దు చేస్తే తానెక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. హోంశాఖ నిర్ణయంపై ప్రతిస్పందించేందుకు సమీక్షా పిటిషన్ దాఖలు చేసేందుకు 30 రోజుల సమయం ఉన్నదని చెప్పారు. ఒకవేళ చెన్నమనేని రమేశ్ బాబు సమీక్షా పిటిషన్‌ను హోంశాఖ పక్కన బెట్టాలని నిర్ణయం తీసుకుంటే ఆయన శాసనసభ్యత్వాన్ని కోల్పోతారు. దీనిపై తుది నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘానిదేనని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

English summary
The Union home ministry on Tuesday issued orders cancelling the Indian citizenship of Telangana Rashtra Samithi MLA Chennamaneni Ramesh on the grounds that he had held citizenship of Germany and had not fulfilled the stipulated norms while obtaining the Indian citizenship in 2009.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X