ఈనాడు పత్రిక మనుగడ
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్టు సామెత. సుబ్బి చావు ఎంకి పెళ్ళికొచ్చినట్టు కొత్త సామెత. మార్గదర్శి ఫైనాన్సియర్స్ వివాదం ఈనాడు పత్రిక మనుగడ మీద పడుతుందని రామోజీరావు మీడియా రైవల్స్ ఆలోచనగా ఉంది. ఎప్పుడైతే వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రామోజీరావు గ్రూపు సంస్ధల మీద ముప్పేట దాడి ప్రారంభించిందో, రెండో స్ధానంలో ఉన్న ఒక తెలుగు దినపత్రిక, ఒక న్యూస్ ఛానల్ కూడా మార్గదర్శి ఫైనాన్సియర్స్ మీద దాడి మొదలు పెట్టాయి. ప్రభుత్వ వర్గాలు కూడా ఈనాడు ప్రత్యర్ధి మీడియాలపై తాత్కాలిక ప్రేమను కురిపిస్తోంది. ఈనాడు దినపత్రిక సర్క్యులేషన్ 11 లక్షలు కాగా, రెండో స్ధానంలో ఉన్న ఒక పత్రిక సర్క్యులేషన్ నాలుగు లక్షలు మాత్రమే. ఈనాడు దినపత్రికను అధిగమించాలన్నది వారి వ్యాపార ప్రణాళిక. కానీ ఈనాడుకు ఉన్న బ్రాండ్ ఇమేజి కారణంగా ఒక ఇంచ్ కూడా ఎగదలేకపోతున్న ఆ ద్వితీయ శ్రేణి దినపత్రికకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ వివాదం ఒక ఆశారేఖగా కన్పిస్తోంది. ఒకే కులానికి చెందిన ఈ రెండు దినపత్రికల మీద ఉమ్మడిగా దాడి చేసిన రాజశేఖరరెడ్డి ఇప్పుడు ఈ సెకండ్ దినపత్రికను తనకు అనుకూలంగా మార్చుకుని ఈనాడు మీద దాడిని తీవ్రతరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ రెండో దినపత్రికకు ప్రభుత్వ ప్రకటనలను బిగబట్టిన రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటనల వరం కురిపించింది. టిఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ఈనాడుకు అనుకూలంగా చేసిన ప్రకటన ఈనాడు గ్రూపునకు పెద్ద రిలీఫ్‌గా ఉంది. ఇంత పెద్ద వయసులో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రామోజీరావు, ఈ ఆపద నుంచి బయటపడితే రాష్ట్ర ప్రభుత్వానికే కాక మీడియా ప్రత్యర్ధులకు కూడా పెద్ద థ్రెట్ అవుతారని పరిశీలకుల అంచనా.