హోంపేజి
పదహారణాల తెలుగు హీరోయిన్ లయ ఒక ఎన్నారైని పెళ్ళి చేసుకోబోతున్నట్టు టాలీవుడ్ తాజా సమాచారం. అందచందాలు, నటనా సామర్ధ్యం ఉన్నప్పటికీ పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్టు లయకు తెలుగులో వచ్చిన అవకాశాలు తక్కువే. మలయాళ సినిమాల్లో ఆమెకు చక్కటి అవకాశాలు వచ్చాయి. మంచి పేరు తెచ్చి పెట్టాయి. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో విసిగిపోయి విజయవాడలో మంచి రెస్టారెంట్ పెట్టాలని కూడా ఈ బెజవాడ భామ ఆలోచించింది. తమిళంలో కూడా ఆమెకు అంత మంచి అవకాశాలు రాలేదు. తెలుగులో ఆమె ప్రస్తుతం టాటా బిర్లా మధ్యలో లైలా అనే సినిమా చేస్తోంది. అనేక కారణాల వల్ల ఆగిపోయిన ఈ సినిమా మళ్ళీ మొదలయ్యే అవకాశాలు తక్కువని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో విసిగిపోయిన లయ ఎన్నారైని పెళ్ళి చేసుకుని కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా బతుకుదామనుకుంటోందట.
వళ్ళు దాచుకోకుండా నటిస్తున్న ముగ్గురు హీరోయిన్లు బరువు తగ్గించుకోడానికి నానా తంటాలు పడుతున్నారు. కేవలం ఇరవై ఒక్క ఏళ్ళకే నడుము చుట్టుకొలత పెరిగిపోయిన నయనతార ప్రియుడు శింబు సీరియస్ సలహాతో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తోంది. సమీరారెడ్డి, అనుష్క కూడా ఈమధ్య విపరీతంగా బరువుపెరిగారు. ఈ ముగ్గురిలో కొన్ని తేడాలు ఉన్నాయి. నయనతారకు జిహ్వ చాపల్యం ఎక్కువ. పీతలు రొయ్యలు, చేపలు ఆమెకు చాలా ఇష్టం. చంద్రముఖి షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు ఆమె సీఫుడ్ ఇష్టమొచ్చినట్టు తినేసి పదిహేను రోజుల్లోనే ఐదారు కిలోల బరువు పెరిగింది. బరువు కారణంగా ఒకనాటి మేటి హీరోయిన్ సిమ్రాన్ ఇటీవల రాజశేఖర్ సరసన అవకాశాన్ని చేతులారా కోల్పోయింది.
సోనియా గాంధీ కటాక్ష వీక్షణాల కోసం ఎదురుచూస్తున్న కె.చంద్రశేఖరరావులో ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందని టిఆర్ఎస్ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి నిరాకరిస్తే బజారు కీడుస్తాం అని చంద్రశేఖరరావు కొన్ని రోజుల క్రితం చేసిన వ్యాఖ్య ఆయనను ప్రమాదంలో పడేసిందని, గతంలో ఇటువంటి వ్యాఖ్యలను లైట్‌గా తీసుకున్న సోనియాగాంధీ ఈసారి సీరియస్‌గా తీసుకున్నారని వెంకటస్వామి వంటి సీనియర్ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా ఉండగా చంద్రశేఖరరావు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో సోనియాగాంధీ పాదాల వద్ద తాకట్టు పెట్టారన్న విమర్శలు బయలుదేరాయి. మేలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని చంద్రశేఖరరావు నమ్మకంగా చెప్పడంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ధరలు పతనమయ్యాయి. కానీ ప్రస్తుతం చంద్రశేఖరరావు బిక్కమొహం వేసుకుని కూర్చోవడంతో మళ్ళీ ప్లాట్ల ధరలు పెరుగుతున్నాయి. చంద్రశేఖరరావు సామాన్యుడు కాదని, ఆయన మరో మాస్టర్ ప్లాన్ వేసి అందరినీ ఖంగుతినిపిస్తారని నమ్మేవారు కూడా లేకపోలేదు.