చెక్!: బాబు ఒత్తిడితో టీ, ఏపీల్లోను కొత్తగా..!
హైదరాబాద్: రెండు మూడేళ్లుగా కొత్త వంటగ్యాస్ డీలర్‌షిప్‌లు ఇవ్వకుండా డీలర్లు అడ్డుకున్నప్పటికీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం వారి ప్రయత్నాలకు చెక్ చెప్పారట! ఆంధ్రప్రదేశ్‌లో దీపం పథకం కింద 20 లక్షల కనెక్షన్లను ఇవ్వనున్నామని ఇందుకు అనుగుణంగా కొత్త డీలర్ షిప్‌లను ఇచ్చి, వినియోగదారులకు సమస్యలు లేకుండా చూడాలని చంద్రబాబు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి చెప్పారు.
ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో కొత్తగా వంటగ్యాస్ డీలర్ షిప్‌లను ఇవ్వాలని కేంద్రమంత్రి ఆదేశించడంతో పది రోజుల క్రితం ఈ ప్రక్రియ మొదలైంది. కసరత్తు పూర్తయితే లక్షలమంది వినియోగదారులు దగ్గరలోని డీలర్ నుండే సిలిండర్ తెచ్చుకోవడానికి వీలుపడుతుందని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు కోటి వరకు వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా, తెలంగాణలో 75 లక్షల వరకు ఉన్నాయి. ఏపీలో 632 మంది, తెలంగాణలో 470 మంది డీలర్లు ఉన్నారు. హైదరాబాద్ నగరంలో లక్షల సంఖ్యలో కనెక్షన్లు ఉంటే కేవలం 110 డీలర్షిప్లే ఉన్నాయి.

సకాలంలో సిలిండర్లు అందటం లేదని ఆందోళనలు వ్యక్తం కావడంతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో డీలర్ షిప్‌లు ఇవ్వాలని మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రకటన కూడా జారీ చశారు. అయితే, డీలర్ల సంఘం ప్రతినిధులు కొత్త డీలర్ షిప్‌ల ప్రకటనలో రిజర్వేషన్లను సరిగా పాటించలేదంటూ కోర్టును ఆశ్రయించారు. నిబంధనలు పాటించమని కోర్టు ఆదేశించింది. దీంతో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త డీలర్ షిప్‌ల సంఖ్యను తగ్గించి మళ్లీ ప్రకటన ఇచ్చారు.
డీలర్ల సంఘం మళ్లీ కోర్టుకెక్కింది. అయితే, డీలర్ల నియామక ప్రక్రియ కొనసాగించవచ్చునని చెబుతూ, నియామకాలు తుది తీర్పుకు లోబడి ఉంటాయని పేర్కొందని డీలర్ల సంఘం చెబుతోందట. ఇదిలా ఉండగా.. నియామకాలు చేపట్టవద్దని ఇటీల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని కలిసి డీలర్ల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
అయితే, చంద్రబాబు స్పందించి కొత్త డీలర్ షిప్‌లు పూర్తి చేయాల్సిందేనని లేఖ రాశారు. అనంతరం మంత్రితోను మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాబు ఒత్తిడితో దేశవ్యాప్తంగా కొత్త డీలర్ల ఎంపిక ప్రక్రియ మొదలవుతోందని అంటున్నారు. ఏపీలో కొత్తగా 273, తెలంగాణలో 183 డీలర్ షిప్‌లు రాబోతున్నాయి. హైదరాబాదులో 35 రానున్నాయి.