అది చూడండి: ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు ధోనీ కౌంటర్
ముంబై: నీటి సమస్య కారణంగా ముంబైలో ఐపీఎల్ 9 మ్యాచులు వద్దన్న అంశంపై మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం నాడు స్పందించాడు. ఈ అంశంపై ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాలలో దానికి పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం యత్నించాలని హితవు పలికాడు.
నీటి సమస్య చాలా కాలంగా ఉందని, దానిని పరిష్కరించేందుకు మంచి పరిష్కారం చూడాలన్నారు. అంతేకాని మ్యాచులను షిఫ్ట్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ పైన ప్రజల్లో సందేహాలు ఉన్నాయని, వాటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నాడు.
కాగా, ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ... ఐపీఎల్ మ్యాచులు మహారాష్ట్ర నుంచి తరలించడం గురించి తాము పట్టించుకోమని, ప్రజలకు నీళ్లు తమ తొలి ప్రాధాన్యత అని చెప్పారు.

దానికి బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ... ఐపీఎల్ మ్యాచులను షిఫ్ట్ చేయడం వల్ల ప్రభుత్వమే కోట్లాది రూపాయలు నష్టపోతుందని, ఆ మొత్తాన్ని నీటి సరఫరాకు ఉపయోగించుకోవచ్చునని చెప్పారు. తాజాగా, ధోనీ నీటి సమస్య, ఐపీఎల్ మ్యాచుల పైన స్పందించాడు.
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించకుండా అడ్డుకోవాలని ఓ స్వచ్చంధ సంస్థ కోర్టుకెక్కింది. ఈ నేపథ్యంలో మ్యాచులను తరలిస్తే అభ్యంతరం లేదని, ఐపీఎల్‌కు తాగునీటిని సరఫరా చేయబోమని సీఎం చెప్పారు. హైకోర్టు కూడా ప్రజల కంటే ఐపీఎల్ మ్యాచులు ముఖ్యమా అని ప్రశ్నించింది.