AP Anganwadi Recruitment 2020: 10వ తరగతితో రూ.11వేలు జీతం: అప్లయ్ చేయండి
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ సర్కార్ పలు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి, భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఇందులో భాగంగానే గ్రామ వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి అందుకు కావాల్సిన సిబ్బందిని నియమించుకుంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 5,905 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మహిళాభివృద్ధి మరిచు శిశు సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. అంగన్‌వాడీ హెల్పర్లు ,మరియు వర్కర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో...
ఏపీ ప్రభుత్వం అంగన్‌వాడీ పోస్టులు ఆయా జిల్లాల్లో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా కలెక్టర్లచే ఏర్పాటు చేసిన కమిటీలు భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తాయి. ఇప్పటికే అభ్యర్థుల సౌకర్యార్థం రెవిన్యూ డివిజినల్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలను అధికారులు నిర్వహిస్తున్నారు. అంగన్‌వాడీలకు నిధులు విడుదల కావడంతో ముందుగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని జగన్ సర్కార్ భావించింది. ఇప్పటికే ఖాళీగా ఉండి పూర్తి చేయాల్సి ఉన్న కొన్ని పోస్టులను ఏపీ ప్రభుత్వం భర్తీ చేసింది.

మినీ అంగన్‌వాడీల్లో సైతం..
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాల్లో 48,770 వర్కర్ పోస్టులు మరో 48,770 హెల్పర్ పోస్టులు ఉండగా... ప్రస్తుతం 47,302 వర్కర్లు, 44,763 హెల్పర్లు ఉన్నారు. దీంతో ఖాళీగా ఉన్న 1,468 వర్కర్లు, 4007 హెల్పర్ల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక రాష్ట్రంలో మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో 6,837 పోస్టులు ఉండగా ఇందులో 430 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. 2019లో విడుదలైన ఖాళీ పోస్టుల ప్రకారం అనంతపురంలో 654 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ 354 పోస్టులకు 3వేలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం.

అర్హతలు ఇవే...
ఇక అంగన్‌వాడీ పోస్టులకు అర్హత 10వ తరగతి పాసై ఉండాలని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇక ప్రధాన అంగన్‌వాడీ కార్యాలయంలో పనిచేసేందుకు షార్ట్‌లిస్టు అయిన వారికి రూ.11,500 వేతనం ఇస్తుండగా.. మినీ అంగన్‌వాడీలో పనిచేసేవారికి రూ.7వేలు వేతనంగా చెల్లిస్తారు. ఇక హెల్పర్లకు కూడా రూ. 7000 వేతనం చెల్లించనున్నారు.