ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీకి మళ్లీ ప్రిలిమ్స్- తొలిగింపు యోచన విరమణ దిశగా..!!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమీషన్ గతంలో తీసుకున్న నిర్ణయం పైన పునరాలోచనలో పడింది. గతంలో గ్రూపు -1 మినహా ఇతర ఉద్యోగాల భర్తీకి ప్రిలిమ్స్ ను రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే, ఇప్పుడు తిరిగి పరీక్ష కొనసాగించే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం రెవిన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్..కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆ నోటిఫికేషన్ లో స్క్రీనింగ్, మెయిన్స్ ఉంటుందని పేర్కొనటం ద్వారా ఏపీపీఎస్సీ తన ఆలోచన మార్చుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

ఒక్క పరీక్ష నిర్వహించాలని నాడు నిర్ణయం
ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం మేరకు 2016 వరకు గ్రూపు -1 మినహా అన్ని రకాల ఉద్యోగాల భర్తీకి ఒకే పరీక్ష ఏపీపీఎస్సీ నిర్వహించేది. అయితే, పోటీ ఎక్కువగా ఉండటం.. సమర్ధతను గుర్తించే ప్రక్రియలో భాగంగా రెండు పరీక్షల విధానం అమల్లోకి తెచ్చారు. దీంతో ప్రిలిమ్స్ తో పాటుగా మెయిన్స్ కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే సమయంల గ్రూపు -2 గ్రూపు -3 కేటగిరీ ఉద్యోగాల నోటిఫికేషన్లకు భారీ సంఖ్యల దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో.. ఆఫ్లైన్లో ప్రిలిమ్స్ నిర్వహిస్తున్నారు. అందులో సాధించిన వారిని 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు అనుమతిస్తున్నారు.

పెరుగుతున్న పోటీ.. అభ్యర్ధనలు
ఇవన్నీ పూర్తి చేయటానికి నోటిఫికేషన్ నుంచి భర్తీ వరకు దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంటోంది. దీంతో.. ప్రభుత్వంలోని ముఖ్యుల పైన దీని పైన చర్చలు జరిగాయి. అనంతరం ప్రిలిమ్స్ ను రద్దు చేస్తూ కేవలం ఒక పరీక్ష ద్వారా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చారు. దీని పైన అధికారికంగా మాత్రం ఉత్తర్వులు జారీ చేయలేదు. ప్రిలిమ్స్ లేకుండా ఒకే పరీక్ష నిర్వహిస్తే మెరిట్ అభ్యర్ధులు నష్టపోతారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. పలువురు ఇదే విషయాన్ని ఏపీపీఎస్సీకి నివేదించారు. దీని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

తిరిగి ప్రిలిమ్స్ నిర్వహణకే మొగ్గు
ఒకే పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని.. దీనివల్ల సమయం, ఖర్చు ఆదా అవుతాయని మరికొందరు కమీషన్ దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటి పైన తర్జన భర్జన పడిన కమీషన్ వర్గాలు తాజాగా రెవెన్యూశాఖలో 670 ఉద్యోగాలను ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా భర్తీ చేస్తామని కమిషన్ ప్రకటించింది. ఈ ఉద్యోగాల కోసం దాదాపు నాలుగు లక్షల మంది వరకు ముందుకు వస్తారని కమిషన్ అంచనా వేస్తోంది. 2019లో ఏపీ ప్రభుత్వం ఒక్కో పోస్టు భర్తీకి 200 అప్లికేషన్ల కంటే ఎక్కువ వస్తే ప్రిలిమ్స్ నిర్వహించాలని కమీషన్ కు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ప్రస్తుత పరిస్థితుల్లో అన్నింటినీ పరిగణలోకి తీసుకొని గత ఆదేశాలను సవరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని పైన ఏపీపీఎస్సీ అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.