వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోగ్య సిరి ఉసిరి.. కార్తీక మాసంలో ఎలాంటి మేలు చేస్తుందంటే?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఉసిరిని సంస్కృతంలో ఆమ్లకి లేదా ధాత్రీఫలం అనీ కూడా పిలుస్తారు. ఏదో ఆపిల్ మాదిరిగానో అరటి పండులాగానో ఉసిరి గబగబా కొరికి తినేసేదేం కాదు. ఎందుకంటే వగరు దాని ఇంటిపేరు. కానీ ఆ వగరే ఈ పండుకున్న బలం. కమలా రసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్-సి 20 రెట్లు ఎక్కువ. అలాగని ప్రొటీన్లు లేవనుకునేరు... ఆపిల్‌లోకన్నా మూడురెట్లు ఎక్కువే ఉన్నాయి. ఇతర పండ్లలో కన్నా యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే. అనేకానేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి. అందుకే దీన్ని సర్వదోషహర అనీ పిలుస్తారు. కార్తీకమాసంలో మనకు ఎన్నేన్నో ఆరోగ్య సిరులను పంచే "ఉసిరి " గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మనం ఆయుర్వేద శాస్త్రాన్ని పరిశీలిస్తే "ఉసిరి చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఒకవేళ ఉసిరి వేర్లు పెరుగుతూ నీటి బావిలోకి పాకితే అందులోని ఉప్పునీరు కూడా తియ్యగా మారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఉసిరి విత్తనాలను నీటి బావిలో వేస్తే ఆ నీరు శుద్ధి అవుతాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా ఆరోగ్యకరమైనది.

శీతకాలం నుంచి వేసవి వరకూ వచ్చే ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వచేసుకుని ఏడాది పొడవునా వాడతారు. కొందరు పంచదార పాకంలో మురబ్బా రూపంలో నిల్వచేసుకుని తింటారు. నిల్వపచ్చడి రూపంలో వాడుకున్నా ఉసిరి ఒక అద్భుత ఔషధమే. అయితే ఉసిరిలో మనకు తెలిసి రెండు రకాలున్నాయి. ఒకటి పుల్లని రాచ ఉసిరి, మరొకటి చేదూ తీపీ వగరూ ఘాటూ పులుపూ కలగలిసినట్లుండే మరొక ఉసిరి. రాచ ఉసిరిని కేవలం తినడానికో పులిహోరకో మాత్రమే వాడతాం. ఈ ఉసిరి పొడిని దుస్తుల అద్దకాల్లోనూ ఎక్కువగా వాడతారు. కానీ ఉసిరిలో కాయే కాదు, వేరు నుంచి చిగురు వరకూ ప్రతీదీ ఔషధమే.

Amla fruit will give immense impact on health in Karthika Masam

ఉసిరితో తయారు చేసిన మాత్రలు వాత, పిత్త, కఫ రోగాలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఉసిరిని నిత్యం వంటల్లో లేదా ఉదయాన్నే తిన్నా మనకు మంచి శక్తి, ఆరోగ్యం వస్తుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఉప్పులో ఎండ బెట్టిన ఉసిరిని నిల్వచేసుకుని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్ప రిస్తూవుంటే, జీర్ణశక్తి పెరుగుతుంది.

అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది, ఎసిడిటీ, అల్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. ప్రతి ఇంటిలో ఉసిరిని పెంచితే ఆగాలికే ఆరోగ్యం లభిస్తుందని శాస్త్రజ్ఞులమాట. భార తీయ వాస్తుశాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇంటి పెరటిలో గనుక ఉసిరి చెట్టు ఉంటే, ఆ ఇంటి వాస్తుదోషాలు ఏవైనా ఉంటే హరిస్తుందని జ్యోతిషశాస్త్రం, వాస్తుశాస్త్రం చెప్తున్నాయి.

ఉసిరి కంటి చూపును మెరుగుపరచడంలో చాలా సహాయ పడుతుంది. జ్వరం వచ్చి పచ్చెం పెట్టే సమయం లోనూ, బాలింతకూ పత్తెం పెట్టేప్పుడూ పాత చింతకాయ పచ్చడితో పాటుగా ఉసిరిని కూడా ఎండు మిర్చితో, ఇంగువ వేసి కలిపి పెడతారు. రక్త శుధ్ధికి ఇది మంచి మందుగా పని చేస్తుంది.

కార్తీక మాసంలో చలి పెరుగుతుంది. అప్పుడు కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకూ తగ్గుతాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండితులను పిలిచి సత్కరించి అందరూ భోజనం చేస్తారు. ఈ విధంగా పూర్వం స్నేహితులు బంధువులు కలిసి వేద పండితులను సర్కరించడం, పూజాదికాలు చేయడం వల్ల పరస్పర స్నేహ భావన, బంధుభావన, రోజువారీ పనినుండీ కాస్తంత సేదతీరడం జరిగేవి.

కార్తీకమాసం వచ్చిందంటే చాలు.. వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడుందా అని అన్వేషిస్తుంటారంతా. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరిచెట్టు కింద ఒక్కపూటయినా భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మయినా వెంట తీసుకెళ్లి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తికంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఉసిరిచెట్టులో కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని భూమాతగానూ కొలుస్తారు.

దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరబాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. ఇది సకల మానవాళినీ రక్షిస్తుందనీ విశ్వసిస్తారు. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటి అని చెబుతుంది చరకసంహిత. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు. అంతటి మహత్తరమైనదిగా భావించే ఆ చెట్టు ఫలం మరెంతటి ఉత్తమోత్తమమైనదో వేరే చెప్పాలా? అందుకే ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం.

ఆదిశంకరులవారు ఆశువుగా చెప్పిన కనక ధారా స్తవం మనకు ప్రతిరోజూ చదవ దగ్గ స్తోత్రరాజం. శంకరులు బాల బ్రహ్మచారిగా ఏడెనిమిదేళ్ళ వయస్సులో భిక్షకోసం ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిల్చి ' మాతా బిక్షం దేహి ' అని కేకవేయగా ఆపేద బ్రాహ్మణి రెండో వస్త్రం సైతం లేక చీర ఆరేవరకూ తాను ధరించిన చిన్న వస్త్రంతో బయటకు రాలేక తన ఇంట ఉన్న ఒకేఒక ఎండిన ఉసిరికాయను తన లేమికి చింతిస్తూ ఆబ్రహ్మచారి జోలెలో తన పూరి పాక తలుపు చాటు నుంచీ విసిరివేస్తుంది. శంకరులు ఆమె దారిద్యాన్ని గ్రహించి, అంత లేమిలోనూ తనకున్న ఒకే ఒక ఉసిరికాయను త్యాగ భావంతో తనకు దానం చేసినందుకు సంతసించి ' కనక ధారాస్తవం ' ఆశువుగా చదువుతారు.

వెంటనే లక్ష్మి కరుణీంచి ఆమె ఇంట బంగారు ఉసిరి కాయల వాన కురిపిస్తుంది.ఇల్లు నిండిపోతుంది. త్యాగానికి ఋజువు, ఆ భావనను గ్రహించి కరుణించిన శంకరుల వారి మనస్సు ఈ కధ ద్వారా మనకు తెలుస్తాయి. అదే కనక ధారా స్తవం ' గా భక్తులు ప్రతిరోజూ చదివి సంపదలు పొందుతారు.

English summary
Karthika masam: How Amla will give positive for health. People find many medicinal factors in Amla.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X