• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శాంతి మంత్రములు

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఇవి మన ఉపనిషత్తులలో చెప్పబడినవి. వీటిని ప్రస్తుత కాలంలో పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు పూర్తి అయిన తరువాత చదువుతున్నారు. కానీ పూర్వ కాలంలో గురుకుల విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతిరోజూ గురు శిష్యులు కలిసి చదివేవారు. వేదవిదులైన పండితుల ద్వారా పఠించబడే ఈ శాంతి మంత్రములు సమాజంలో, దేశంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్నిపెంచడానికి దోహదం చేస్తాయి. వీటి అర్ధం తెలుసుకోవడం ద్వారా పూర్వం రోజుల్లో పండితులకు, గోవులకు భారతీయ సమాజంలో ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది.

=Contribute to peace and brotherhood

1. ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై

తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై

ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:-

సర్వ జీవులు రక్షింపబడుగాక... సర్వ జీవులు పోషింపబడుగాక... అందరూ కలిసి గొప్ప శక్తితో కూడి పని చేయాలి ( సమాజ ఉద్ధరణ కోసం )... మన మేధస్సు వృద్ది చెందుగాక... మన మధ్య విద్వేషాలు రాకుండు గాక... ఆత్మా ( వ్యక్తిగత ) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక...

2. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు..

ఓం సర్వేషాం శాంతిర్భవతు..

ఓం సర్వేషాం పూర్ణం భవతు..

ఓం సర్వేషాం మంగళం భవతు..

తాత్పర్యం:-

సర్వులకు సుఖము, సంతోషము కలుగుగాక..

సర్వులకు శాంతి కలుగు గాక..

సర్వులకు పూర్ణ స్థితి కలుగుగాక.. సర్వులకు శుభము కలుగుగాక..

3. ఓం సర్వేత్ర సుఖిన: సంతు, సర్వే సంతు నిరామయా,

సర్వే భద్రాణి పశ్యన్తు మాకశ్చి: దుఃఖ:మాప్నుయాత్...

తాత్పర్యం:-

సర్వులు సుఖ సంతోషాలతో వర్ధిల్లు గాక..

సర్వులు ఏ బాధలు లేక ఆరోగ్యంతో ఉండు గాక..

అందరికీ ఉన్నతి కలుగు గాక..

ఎవరికీ బాధలు లేకుండు గాక..

4. కాలే వర్షతు పర్జన్య: పృథివీ సస్య శాలినీ

దేశోయం క్షోభ రహితో బ్రహ్మణా సంతు నిర్భయ:

తాత్పర్యం:-

మేఘాలు సకాలములో కురియుగాక. భూమి సస్యశ్యామలమై పండుగాక. దేశములో ఏ బాధలు లేకుండు గాక. పురోహితులు ( పురం 'ఊరు' నకు హితం చేసేవారు ) వారి సంతతి నిర్భయులై సంచరించెదరు గాక.

5. ఓం అసతోమా సద్గమయ,

తమసోమా జ్యోతిర్గమయ,

మృత్యోర్మా అమృతంగమయ..

ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:-

సర్వవ్యాపి, నిరాకారుడైన భగవంతుడా, మమ్ములను అసత్యము ( మిధ్య ) నుంచి సత్యమునకు గొనిపొమ్ము. ( అజ్ఞానం అనే ) అంధకారము నుండి ( జ్ఞానస్వరూపమైన ) వెలుగునకు దారి చూపుము. మృత్యు భయము నుండి శాశ్వతమైన అమృతత్వము దిశగా మమ్ము నడిపించుము.

6. స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం, న్యాయేన మార్గేన మహీం మహీశా,

గో బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం, లోకా: సమస్తా సుఖినో భవంతు...

తాత్పర్యం:-

ప్రజలకు శుభము కలుగు గాక. ఈ భూమిని పాలించే ప్రభువులందరూ న్యాయ మార్గంలో పాలింతురు గాక. గోవులకు, బ్రహ్మజ్ఞానం కలిగిన వారలకు శుభము కలుగు గాక. జగతి లోని సర్వ జనులందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లెదరు గాక.

7. ఓం శం నో మిత్ర: శం నో వరుణ:

ఓం శం నో భవత్వర్యమా:

శం నో ఇంద్రో బృహస్పతి:

శం నో విష్ణు రురుక్రమ:

నమో బ్రాహ్మణో, నమో వాయు:

త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి

త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి

ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి

తన్మామవతు తద్వక్తారమవతు

అవతు మాం, అవతు మక్తారం

ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:-

సూర్యుడు, వరుణుడు, యముడు, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణువు వీరందరూ మన యెడల ప్రసన్నం అగుదురు గాక.. బ్రహ్మ జ్ఞానం కలిగిన పండితులకు వందనం. వాయుదేవునకు వందనం. నీవే ప్రత్యక్ష బ్రహ్మవు. నేను బ్రహ్మమునే పలికెదను. సత్యమునే పలికెదను. సత్యము, బ్రహ్మము నన్ను రక్షించు గాక, నా గురువును, సంరక్షకులను రక్షించు గాక.

8. ఓం ద్యౌ శాంతి: అంతరిక్షం శాంతి:

పృథివీ శాంతి: ఆపా శాంతి: ఔషదయ శాంతి:

వనస్పతయ: శాంతి: విశ్వే దేవా: శాంతి:

బ్రహ్మ శాంతి: సర్వం శాంతి: శాంతి రేవా: శాంతి:

సామా: శాంతిరేది : ఓం శాంతి: శాంతి: శాంతి:

తాత్పర్యం:-

స్వర్గము నందు, దేవలోకము నందు, ఆకాశము నందు, అంతరిక్షము నందు, భూమి పైన, జలము నందు, భూమిపై ఉన్న ఓషధులు, వనమూలికలు, అన్ని లోకము లందలి దేవతల యందు, బ్రహ్మ యందు, సర్వ జనుల యందు, శాంతి నెలకొను గాక. ( పంచభూతముల వలన కాని, బ్రహ్మ మొదలగు దేవతల వలన కాని, అపాయములు కలుగకుండును గాక ) శాంతి యందె శాంతి నెలకొను గాక. నాయందు శాంతి నెలకొను గాక.

పైన చెప్పిన శాంతి మంత్రములు చదివి అర్ధం చేసుకోండి. మన హిందూ సంస్కృతీ ఎంత గొప్పదో తెలుస్తుంది. మన కోసమే కాక, అందరి క్షేమం కోసం, సర్వ ప్రాణుల సుఖ సంతోషాల కోసం ప్రార్ధించడం మన భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పదనం. సర్వం శ్రీ పరమేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.

English summary
Contribute to peace and brotherhood
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X