వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏరువాక పూర్ణిమ: రైతులకు ప్రత్యేకమైన రోజు..పురాణాలు ఏం చెబుతున్నాయి

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమను ఏరువాక పూర్ణిమ అని కూడా వ్యవహరిస్తారు. నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమనాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు.

ఏరువాక అంటే :- ఏరు అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం చేయడం అని అర్థం. ఈ రోజు రైతులు కాడెద్దులను కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గజ్జెలు, గంటలతో అలంకరిస్తారు. ఎడ్లకు కట్టేకాడిని దూపదీప నైవేద్యాలతో పూజించి, ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూ తల్లికి పూజలు నిర్వహిస్తారు. వర్షఋతువులో జ్యేష్ఠశుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలుపెడతారు.

సాంప్రదాయికంగా రైతులు ఏరువాక పున్నమిని పండుగలా జరుపుకుంటారు. సామూహికంగా ఎద్దులను తోలుకుని పొలాలకు వెళ్లి దుక్కి దున్నుతారు. ఈ రోజున ఆడపడుచులు పుట్టింటికి వస్తారు. ఈ పండుగనాడు చేసే మరో ముఖ్యమైన వేడుక ఎడ్ల పందేలు. ఎద్దులను బాగా అలంకరించి పరిగెత్తిస్తారు. వాటి వెనుక యువకులు పరుగులు తీస్తారు. ఎద్దులకు బండలు (బరువైన రాళ్ళూ) కట్టి పరుగులు తీయిస్తారు. దీన్ని బండలాగుడు పోటీ అంటారు. ఏరువాక పౌర్ణమి రోజునే ఇళ్ళలో పనిచేసే జీతగాళ్ళ సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం మొదలవుతుంది.

Eruvaka Purnima:Why this day is so special to farmers, Know its importance

వేదకాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారు. ప్రాచీనకాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తున్నారు. అధర్వవేదం ఏరువాకను 'అనడుత్సవం'గా చెప్పింది. క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది. తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు.

విష్ణుపురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది. సీత అంటే నాగలి అని అర్థం. 'వప్ప మంగళ దివసం'.. 'బీజవాపన మంగళ దివసం'...'వాహణ పుణ్ణాహ మంగళమ్‌'...'కర్షణ పుణ్యాహ మంగళమ్‌..' అనే పేర్లతో ఈ పండుగను వైభవంగా జరుపుకునేవారు. శుద్ధోదనమహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఓ ఐతిహాస్యం. హాలుడు రాసిన గాథాసప్తశతిలో ఏరువాక గురించి గాథలున్నాయి. తెలుగు పండుగల్లో సాహిత్యధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాదరించినట్టు తెలుస్తుంది.

English summary
Today is an auspicious day called as Eruvaka purnima in telugu states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X