వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Guru Purnima అంటే ఏంటి.. ఈరోజున ఏంచేయలి, పురాణాలు ఏం చెబుతున్నాయి..?

|
Google Oneindia TeluguNews

గురుపూర్ణిమ

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః

మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతిక్షణంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే వుంటాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలగలసిన రూపం గురువు. అందుకే మాతృదేవోభవ:, పితృదేవోభవ:, ఆచార్యదేవోభవ: అన్నారు. అంటే తల్లితండ్రుల తర్వాత అంతటిస్థానాన్ని పొందేది గురువే.

గుకారశ్చంధకారస్తు రుకారస్తన్ని రోధక:
అజ్జాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ:

గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కతి మనది. 'గు' అంటే అంధకారం/ చీకటి అని అర్థం. 'రు' అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞానమనే చీకటిని తొలగించి గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు. అద్వితీయమైన గురు పరంపరలకు అలవాలం మన భారతదేశం. గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డలకన్నా మిన్నగా ప్రేమించే వారు. నేటి కాలంలో అంతటి గొప్ప గురు శిష్య సంబంధాలు చాలా అరుదు. గురు పూర్ణిమను పురస్కరించుకుని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది.

గురిపూర్ణిమ ఎందుకు జరుపుకుంటాము? ఆది యోగి, ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణిమినాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేసాడని శివపురాణం చెబుతున్నది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞాన బోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతీ శంతనులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను బుక్, యజుస్, సామ, అధర్వణ వేదాలుగా విభజించాడనీ ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకుని ఆషాడ పౌర్ణమి రోజు గురుపూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము.

Guru Purnima 2021:What is the history and why is it celebrated

ఆషాఢ శుద్ధ పౌర్ణమిని 'గురుపౌర్ణమి' లేదా 'వ్యాసపౌర్ణమి' అని అంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు.

ఈ ఆషాఢ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత :- దీనికి ఒక చక్కని ప్రాచీన గాధకలదు. పూర్వం వారణాశిలో ఒక పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు 'వేదనిధి'. ఆయన సతీమణి పేరు 'వేదవతి'. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. ఇంకా సంతాన భాగ్యము కోసం ఎన్ని నోములు నోచినా.. ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. ఒకనాడు వేదనిధికి ప్రతిరోజూ మధ్యాహ్న సమయంలో వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు.

ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి గమనిస్తాడు. వెంటనే వేదనిధి వారి పాదాలను పట్టుకుంటాడు. ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడువకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు. కరుణించి వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి ఏమి కావాలో కోరుకోమంటారు.

రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు. అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారి గృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాధరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు. వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు.

వారి ఆతిథ్యానికి ఎంతో సంతోషపడి ఆ ముని శ్రేష్ఠుడు.. ఓ పుణ్య దంపతులారా.. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు. ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు. అని బదులు పలుకుతారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖసంతోషాలు అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు.

వేదవ్యాసుడు మానవజాతికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించి వెళ్ళాడు కాబట్టి ఆయనను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు సమర్పించి, వారిని సత్కరించి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. దీంతో పాటు శక్తి కొద్దీ నైవేద్యాలను సిద్ధం చేసుకుని శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేద్ర స్వాములవారిని, దత్తాత్రేయస్వామిని, మేధాదక్షిణమూర్తి, రాఘవేంద్రస్వామిని, సాయిబాబా పటాలకు లేదా ప్రతిమలను పూజిస్తే మేలు కలుగుతుంది. పూజ చేసేటప్పుడు ఉత్తరం వైపు తిరిగి ఐదు దూది వత్తులతో పంచహారతులు ఇవ్వాలని, దానికన్నా ముందు స్తోత్రాలు పఠించాలని పెద్దలు అంటారు.

దేవాలయాల్లో పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయించే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుంది. అరటిపండ్లు, ఉడకబెట్టిన శెనగలను నివేదన చేసి ప్రసాద వితరణ చేస్తే ఈతిబాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి.

English summary
From birth to death, man is constantly learning something new. There is a teacher lurking behind every subject he learns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X