వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దైవత్వాన్ని పొందేందుకు 18 మెట్లు..అవి ఏంటో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఈ సృష్టిలో ఎదుటివారు చెప్పినది విని దాంట్లోని మంచి, చెడులను, నిజానిజాలు పరిశీలించే శక్తి 'విజ్ఞత' మానవుడికి మాత్రమే ఉన్నది. కానీ దురదృష్టం ఏమనగా ఈ రోజులలో నేను నమ్మిందే కరెక్టు ( పిడివాదం ) , నా ఇష్టం వచ్చిందే నేను చేస్తాను " ( మూర్కత్వంతో కూడిన అజ్ఞానం ) అనడమే గొప్ప విషయంగా చలామణి అవుతోంది. మహాభారతంలో దుర్యోధనుని వెంట భీష్మ, ద్రోణ, కృపాచార్యులున్నా ఎందుచేత మట్టుపెట్టబడ్డాడనేదానికి ఒకటే కారణం చెబుతారు పెద్దలు. దుర్యోధనుడితో మహర్షులందరూ చెప్పారు.

''నీవు చేస్తున్నది తప్పు, నీ ఈ అనాలోచిత పని వలన పాడైపోతావు. మా మాట విను. ఇలా చెయ్యకు'' అన్నారు. అందుకాయన ''మీరు చెప్పేది మంచని తెలిసినా నేను పాటించను. మీరు చెప్పేది చెడని తెలిసినా నేను పాటించకుండా ఉండలేను'' అన్నాడు. ఆ తత్వం పశువు కన్నా హీనం, అత్యంత ప్రమాదకరం.

Here are the 18 steps for a man to attain divinity

మనిషి మనసులో దైవత్వం ఉంటే, మనిషి హృదయం ఒక పవిత్రమైన దేవాలయం అవుతుంది. ఈ 18 మెట్లను అధిరోహించి దైవత్వాన్ని పొందగలిగిన మనిషి ధన్యుడవుతాడు.

1 . సంస్కారబలం ఉండాలి:- సంస్కారమనే మాట గొప్పది. చదువు దేనికోసం? సంస్కారబలం కోసం. చదువుకు సంస్కారం తోడైతే మీరు లోకానికి ఏ హితకార్యమైనా చేయగలరు. యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది. సంస్కారబలంతో మీకు తెలియకుండానే గొప్ప వ్యక్తిత్వం ఏర్పడుతుంది.

2 . మోహాన్ని పోగొట్టుకోవాలి:- మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడేవాళ్లు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు. మీ క్షేమం కోరి, మీతో కఠినంగా మాట్లాడే వ్యక్తి దొరకడం కష్టం. దొరికినా అటువంటి మాట వినేవారు ఉండరు. ఒకవేళ అలా ఇద్దరూ దొరికితే జన్మ సార్థకమౌతుంది. మోహంలో పడిన అర్జునుడికి భగవద్గీతంతా చెప్పాడు కృష్ణ పరమాత్మ. చివరన 'నీకేం అర్థమయింది' అని అడిగాడు. ''నాకు మోహం పోయింది. స్మృతి కలిగింది. నేను యుద్ధానికి బయల్దేరుతున్నా'' అన్నాడు అర్జునుడు.

3 . తప్పొప్పుల కూడిక:- ఈ ప్రపంచంలో ఎవరూ ఒప్పులకుప్ప కాదు. నాలో దోషం తెలుసుకుంటే క్షమార్పణ అడుగుతా. మారీచుడు చెప్పాడు రావణుడికి ''నీకేంలోటు, ఇంత మంది భార్యలున్నారు. కాంచన లంక ఉంది, భటులున్నారు. రాముడి జోలికి వెళ్ళకు. వెళ్ళావా, అన్నీపోతాయి'' అన్నాడు. అన్నీ విన్న రావణుడు ''నువ్వు చెప్పేది అయిపోయిందా. అయితే విను. నువ్వు చచ్చిపోవడానికి ఎలాగూ సిద్ధం. నామాట వింటే రాముడిచేతిలో చచ్చిపోతావు. వినకపోతే నా చేతిలో చస్తావు. ఎలా చచ్చిపోతావో చెప్పు'' అన్నాడు. అంతేతప్ప నేను వింటానని అనలేదు. అలా అననందుకు అంత తప:శ్శక్తి ఉన్న రావణాసురుడు చివరకు ఏమయిపోయాడు?

4. మాట వినడమన్నది తెలుసుకోవాలి:- మహాభారతం సమస్త సారాంశం ఇదే. దుర్యోధనుడి దగ్గరకెళ్ళి మహర్షులందరూ చెప్పారు, కొన్ని గంటలపాటూ చెప్పారు, అన్నీ విన్నాడు. అన్నీ విని వెటకారమైన మాటొకటన్నాడు. అహంకారబలం అది ''నాకు ధర్మం తెలియదా! తెలుసు. కానీ అలా చెయ్యాలనిపించడం లేదు. అయినా నేను తప్పులు చెయ్యడమేమిటి! నాకు చెబుతారెందుకు'' అన్నాడు. మహర్షులు మాట్లాడుతుంటే సరిగా వినకుండా తొడలుకొట్టాడు, చివరకు తొడలు విరిగి పడి పోయాడు.

5 . పెద్దలమాట శిరోధార్యంగా స్వీకరించు:- తల్లి, తండ్రి, గురువులు, అనుభవజ్ఞులు, సమాజంలోని పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినాలి. అయితే వారెప్పుడూ మన దగ్గరే ఉండి ఇలా చెప్పడం సాధ్యపడుతుందా ? పడదు కాబట్టి సత్పురుషుల చరిత్రలు చదువుతూ, సన్మార్గంలో ఉండే వారితో సహవాసం చేయాలి.

6 . బాగుపడినా, పాడయిపోయినా కారణం - జడత్వమే:- జడమనే మాట ఒకటుంది. జడం - అంటే చైతన్యముంటుంది, కానీ ప్రతిస్పందన ఉండదు. ఒక రాతిలో చైతన్యం లేదని చెప్పలేం. కానీ దానిలో ప్రతిస్పందన ఉండదు. మీరు వెళ్ళి ఒక చెట్టును కొట్టారనుకోండి. మీకు వినబడకపోవచ్చు కానీ, దానిలో ప్రతిస్పందన ఉంటుంది. ఈ ప్రతి స్పందించగల శక్తి జడత్వానికి విరోధి. జడత్వం - అంటే చైతన్యం ఉండి కూడా ప్రతిస్పందించలేని బతుకు. ఒక మాటంటే ప్రతిస్పందన ఉండదు. అలాంటి ప్రతిస్పందనలేని లక్షణంలో నుంచి జడత్వం ఆవహిస్తుంది. అసలు లోకంలో ఒక వ్యక్తి వృద్ధిలోకి వచ్చినా, ఒక వ్యక్తి పాడయిపోయినా కారణమేమిటని అడిగింది శాస్త్రం. అందుకు జడత్వమే కారణం.

7. ఆదర్శాలు చెప్పడమే కాదు ఆదర్శంగా మారాలి:- ఎప్పుడు ఏం చేస్తున్నా శ్రీరామాయణంలో చెప్పిన విషయాలను ఆదర్శంగా తీసుకుని ఆచరణలోకి తీసుకు వచ్చే ఒక కార్యశీలిని 'నడిచే రామాయణం' అంటారు. తాను చెప్పడం వేరు, తానే ఆ వస్తువుగా మారడం వేరు. చెప్పడం అందరూ చెప్తారు. ''సర్వోపదేవ ఉపదేశాయ సర్వే వ్యాసపరాశరః:''. ఇంకొకడికి చెప్పమంటే ప్రతివాడూ వ్యాసుడే, ప్రతివాడూ పరాశరుడే. కానీ నీవు చెప్పినదాంట్లో నీవెంత ఆచరిస్తావన్నదాన్నిబట్టి నీవు ఆదర్శంగా మారడమనే వస్తువు సిద్ధిస్తుంది.

8. ఎవరిలోపాన్ని వారే దిద్దుకోవాలి:- నాకు ఇలా ఉండటం తప్ప ఇంకోలా రాదనుకోవడం చాలా భయంకరమైన స్థితి. అది దిద్దుకోవలసిన స్థితి. మనిషి తాను తనలో ఉండకూడని లోపాన్ని దిద్దుకుంటే పదిమందికీ అతను పనికొస్తాడు. పదిమంది మీతో మాట్లాడటానికి అవకాశం ఇస్తే, మీరేమీ చేయాలో మీరు నిర్ణయం చేసుకోగలరు. మీ అభిప్రాయానికి ఒక స్పష్టత వస్తుంది. అసలు అందరూ మీ దగ్గరికి రావడానికి భయపడిపోయే స్థితిని కలిగిస్తే, ''మీరు ఎక్కడ ఎలా ఉండి ఏం ప్రయోజనం'' చెప్పండి.

9. కోపాన్ని తగ్గించుకోవాలి:- మీ కోపాన్ని మీకు మీరుగా పరిశీలించి దిద్దుకోవాలి తప్ప. నాకు కోపం వచ్చేసిందండీ. నేను కోపిష్టివాడినండీ అన్న తరువాత మీ ఆ కోపాన్ని తగ్గించగలిగే వాడు ఉండడు. దానికన్నా శత్రువు లేడు. నేను ఇలా ఉండవచ్చా? ఇంతటి కోపమేమిటి నాకు. ఈ కోపం వల్ల నేను సాధించేదేమిటి? అని కోపం వచ్చినప్పుడు మీరు కాసేపు ఏకాంతంలో కూర్చుని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీకు వచ్చిన కోపాన్ని మీరు పరిశీలనం చేసుకొని కోపాన్ని విడిచిపెట్టగలిగిన వాడెవరో వాడు దేశానికి, సమాజానికి పనికొచ్చి తీరుతాడు.

10. జీవితం ప్రణాళికా బద్ధంగా ఉండాలి:- అధికారులు కింది వారిని సంప్రదించాలి. పని చేయడంలోని సాధకబాధకాలను తెలుసుకోవాలి. అధికారి చేతిలో వేలకోట్ల రూపాయల నిధులు విడుదల చేసే అధికారం ఉంటుంది. అవి సక్రమంగా ఖర్చుకావాలి. ప్రజలకు ఉపయోగపడాలి. అందుకు సరైన ప్రణాళిక ఉండాలి. రేపు మీరే ఆ అధికారి అయితే? అందుకే కత్తికి రెండు వైపులనూ అర్థం చేసుకుని ప్రణాళిక రచన చేయడానికి తగిన నైపుణ్యాన్ని అలవరుచుకోవాలి.

11. వినండి, వినడం నేర్చుకోండి:- ఒక సమస్యను బాగా పరిశీలించి, అవసరం అయితే కిందికి వచ్చి విని దానిని విశ్లేషణం చేసే నైపుణ్యం ఉండాలి. ఎవరైనా మాట్లాడటం మొదలు పెట్టేటప్పటికి రంధ్రాన్వేషణ చేయడం అన్నది జీవితంలో అలవాటు అయిపోయిందనుకోండి. అంతకన్నా ప్రమాదకరమైన అలవాటు ఇంకోటి లేదు. మీ జీవితంలో పైకి రావాల్సిన మార్గాలన్నీ మూసేసుకున్నట్టే. ఎవరు మాట్లాడుతున్నారన్నది కాదు. ఆ మాటలలో మనకు ఏమైనా సారాంశం అందుతుందా? అని ఎదురు చూసి, అందులో ఒక్క మంచి మాటను పట్టుకుని జీవితాన్ని మార్చుకోగలిగితే వారి జీవితం చక్కబడుతుంది.

12. మీరు ఏది ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన అభిప్రాయంతో ఉండండి:- నేను ఒక మాట చెబుతాను. మహాపురుషుడు వేరు, ఆ మహాపురుషుడు రాసిన పుస్తకం వేరు కాదు. వాల్మీకి వేరు, వాల్మీకి రామాయణం వేరు కాదు. ఇవి కలిసే ఉంటాయి.

13. రబ్బరు బంతిలా ఉండాలి:- పది మందికి ఉపయోగపడకుండా ఎప్పుడు పోతారో తెలుసా? మీలో తట్టుకునే శక్తి లేనప్పుడు. మట్టి ముద్దను మీరు ఇలా పట్టుకుంటే పొరపాటున మీ చేతిలోంచి జారికిందపడిపోయిందనుకోండి. ఇహ అది పైకి లేవదు. అదే రబ్బరు బంతి అయితే ఎంత కిందపడిందో అంతపైకి లేస్తుంది. చిన్న పొరపాటు కూడా జరగకుండా మీ జీవితం ముందుకు సాగదు. మీరు ఎంత గొప్పవాళ్లయినా మీకు వంక పెట్టకుండా ఉండలేరు. ఎవరో ఒకరు వంకపెట్టారని మీరు మృత్పిండమై పాడైపోకండి. మీవల్ల ఏదో ఒకనాడు పొరపాటు జరగవచ్చు. జరిగిననాడు మట్టి ముద్దలా కిందపడిపోకండి.

14 . నిరాశను దరిచేరనివ్వకండి:- అబ్దుల్‌ కలాంగారి కెరీర్‌ ఎక్కడ నుండి ప్రారంభం. ఆయన కోరుకున్న ఉద్యోగం ఒకటి. ఆయనకు వచ్చిన ఉద్యోగం ఒకటి ఆయన నిరాశతో ఋషికేశ్‌లోని ఒక స్వామిజీ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. స్వామిజీ అలా వెళుతూ నీరసంగా కూర్చున్న కలాంగారిని పిలిచి అడిగారు. ఏం ఎందుకలా కూర్చున్నావని. ఈయనన్నారు. ''నేను ఫలానా ఉద్యోగానికి ఇంటర్వకు వెళ్లాను, అది పొందడం నాకిష్టం. కాని నేను సెలెక్ట్‌ అవ్వలేదు. ఏదో ఈ ఇంటర్వు అని మరో దానికి వెళ్లాను, సెలెక్ట్‌ అయ్యాను. ఇప్పుడు నాకీ ఉద్యోగం చేయాలని లేదు. నాకిష్టంలేదు'' ఆ స్వామీజీ ఒక చిరునవ్వు నవ్వి అన్నారు. ''నీవు కోరుకుంటున్నదే దొరకాలని ఎందుకనుకుంటున్నావు. ఏమో ఈశ్వరుడు నీ ద్వారా ఈ జాతికి యేం చేయించాలనుకుంటున్నాడో'' ఆ మాట ఆయన మీద పనిచేసింది. అంతే ఈ దేశానికి ఉపగ్రహాలు తయారు చేసుకోవడానికి సత్తానిచ్చిన మహాపురుషుడయ్యాడు.

15. మంచి మంచి పుస్తకాలు చదవండి:- ఏ పుస్తకం పడితే అది చదవకండి. వివేకానందుని ఉపన్యాసాలు చదవండి. మీకెంతో ధైర్యం వస్తుంది. పేడలో పురుగుపుట్టి పెరిగినట్లు బ్రతకకూడదు. మంచిగా బ్రతకడానికి కలేజా కావాలి. రామకృష్ణ పరమహంస కథలు చదవండి. సాహితీ సభలకు వెళితే చక్కగా తెలుగులో మాట్లాడండి. పోతన గారి నాలుగు పద్యాలు చెబుతూ ప్రసంగం చేయండి. గురువుల పట్ల, పెద్దల పట్ల మర్యాదను సంతరించుకోండి.

16. ఆరాధించడం కాదు ఆదర్శంగా తీసుకోవాలి:- ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌కు ఉత్థాన పతనాలున్నాయి. ఎంత కిందకి పడిపోయాడో అంతపైకి లేచాడు. టెండూల్కర్‌ క్రికెట్‌ చూడటం కాదు. టెండూల్కర్‌ వెనుక ఆ స్థాయికి ఎదగడానికి ఉన్న కారణం చూడండి. ఒక బాల్‌ వస్తున్నప్పుడు గ్రద్ద ఆకాశంలో ఉండి కోడిపిల్లను చూస్తున్నట్టు చూస్తూ ఉంటాను. బంతి ఎక్కడ పడుతుంది. దీన్ని ఏ డైరెక్షన్లో కొట్టాలి? అని... అంతే! స్ట్రోక్‌ అప్లై చేస్తాను అన్నాడు. అలా మీరు కూడా మీ గురువుల గురించి చెప్పేటటువంటి శీలాన్ని అలవాటు చేసుకోండి.

17. విజయాన్నీ, వైఫల్యాన్నీ సమానంగా తీసుకోవాలి:- మనం చేసే ప్రతి ప్రయత్నంలో విజయం, వైఫల్యం అంటూ ఉంటుంటాయి. ఒక చోట విజయం వరిస్తే ఇక నా అంతటి వాడు లేడని రొమ్ము విరుచుకుని తిరగకూడదు, అక్కరలేని భేషజాలకు పోయి పాడయి పోకూడదు. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయత్నం ఫెయిల్‌ అయినట్లు కనబడుతుంటుంది. అలా ఫెయిలవడం నీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం కావాలి. కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా వైఫల్యం సంభవిస్తే బెంగపెట్టుకుని స్తంభించి పోకూడదు. మళ్ళీ ఉత్సాహంగా పట్టుదలతో వృద్ధిలోకి రావాలి.

18. పొగడ్తకు పొంగిపోకండి:- ఎప్పుడైనా సరే పొగడ్తకు మించిన మత్తు ఉండదు. పొగడ్తకు మించి లోకంలో పాడవడానికి మరొక కారణం కూడా కనిపించదు. జీవితంలో పొగడ్త అన్నది ఎంత మోతాదులో పుచ్చుకోవాలో అంతే మోతాదులో పుచ్చుకోవాలి. మందులే కదా అని మోతాదుకు మించి తీసుకుంటే విషమై చచ్చిపోతారు. అలాగే నీవు వృద్ధిలోకి రావడానికి పొగడ్త కూడా ఎంతవాడాలో అంతే వాడాలి.

English summary
If man has divinity in his mind, man’s heart becomes a sacred temple. Blessed is the man who can climb these 18 steps and attain divinity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X