• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అనితరసాధ్యం - తెలంగాణ రాష్ట్రం

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

కోటి రతనాల వీణ తెలంగాణ. ఇక్కడి సాంప్రదాయాలు, భాష, యాస ప్రతి ఒక్కటీ ప్రత్యేకమే. మరి హైదరాబాద్ రాష్ట్రంగా దేశంలో కలిసిన రోజు నుంచి ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించే వరకు 'తెలంగాణ' ఎన్ని మజిలీలు దాటిందో పరిశీలిద్దాం.

తెలంగాణ చరిత్ర:- భారతదేశ చరిత్రలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన రోజు జూన్‌ 2 - 2014 నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు ఇది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అకుంటిత దీక్షతో ఎన్నో సమస్యల వలయాలను చేదించుకుని సాధించే వరకు పట్టువదలని ఘటికుడు కెసిఆర్, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వాన జరిగిన ఉద్యమానికి ఫలితం అందిన రోజు ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మన పండగ రోజు.

మలిదశ ఉద్యమం:- 1969-70లలో వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కొన్ని చట్టపర రాజకీయ చర్యల ద్వారా నిరోధించగలిగినప్ప టికీ.. తమకు జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజలలో అసంతృప్తి రగులుతూనే ఉంది.1985 నుంచి తెలంగాణలో అనేక సంస్థలు, వేదికలు, వ్యక్తులు తెలంగాణ వెనుకబాటు అభివృద్ధిపై చర్చలు జరుపుతూనే ఉన్నారు. 1985లో తెలంగాణ సమస్యలపై అధ్యయనం చేసేందుకు కరీంనగర్‌లో విద్యావంతుల సదస్సు ఏర్పాటైంది. 1986లో తెలంగాణ ఇన్‌ఫర్మేషన్‌ ట్రస్టు ఏర్పడింది. ఇదే సంవత్సరంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్ర అసెంబ్లీలో పెద్ద స్థాయిలో చర్చ జరిగింది.1989 లో తెలంగాణ అభివృద్ధి ఫోరం వివిధ కార్యక్రమాలు చేపట్టింది.

Indispensable history of Telangana State

1991లో తెలంగాణ స్టూడెంట్స్‌ ఫ్రంట్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనేక ఆందోళనలు చేపట్టింది. 1992లో కె.వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలంగాణ ఇంజనీర్ల సంఘం తెలంగాణ సమస్యలపై అప్పటి ప్రధాని పి.వి నరసింహారావు ప్రభుత్వానికి నివేదికలు సమర్పిం చింది. 1990లో తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలోని వరంగల్‌ సదస్సులో తెలంగాణ మహాసభ, తెలంగాణ ప్రజాపార్టీ ఆవిర్భవించాయి. అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, కవి కాళోజీ నారాయణరావు నేతృత్వంలో ప్రజాస్వామిక తెలంగాణ సదస్సు 1997 డిసెంబర్‌లో జరిగింది. 1998లో ప్రొఫెసర్ జయశంకర్‌ సర్ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్థల విలీనంతో తెలంగాణ ఐక్యవేదిక ఏర్పడింది.

అదేవిధంగా మాజీ మంత్రి పి.ఇంద్రారెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఉద్యమ కమిటి ఆవిర్భవించింది. ఉద్యమం కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా దేశవిదేశాల్లోని తెలంగాణ ప్రజల్లోకి విస్తరించింది.1999లో అమెరికాలోని న్యూయార్క్‌లో తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌ ఏర్పడింది. అమెరికాలోని తెలంగాణ వారితో ప్రొఫెసర్‌ జయశంకర్‌, ప్రొఫెసర్‌ జనార్థన్‌రావు వంటి మేధావులు సభలు సమావేశాలు నిర్వహించారు. 1990 అనంతరం వచ్చిన సాంకేతిక విప్లవంతో ఉద్యోగావకాశాలు పెరగడంతో విద్యార్థుల ధోరణిలో కొంత మార్పు వచ్చింది. తెలంగాణ ప్రాంత వనరుల్ని కొల్లగొడ్తూ అభివృద్ధిలో మాత్రం తెలంగాణను దూరం పెడుతున్నారన్న అభిప్రాయం ప్రబలింది.

హైదరాబాద్‌కు భారీగా పెరిగిన తెలంగాణేతరుల వలసలు, రాష్ట్రంలో రాజకీయ, వ్యాపార రంగాల్లో ఆంధ్రనేతల ఆధిపత్యం పెరగడం తెలంగాణ ప్రజల్లో అభద్రతను పెంచాయి. మరోవైపు వ్యవసాయ రంగంపై ప్రభుత్వాలు చూపిన చిన్న చూపు, వరుసగా తరుముకొచ్చిన కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు, విద్యుత్‌ సంక్షోభం తెలంగాణ రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. చేతివృత్తులు దెబ్బతిన్నాయి.

మొత్తం మీద సమస్త తెలంగాణ గ్రామీణ వ్యవస్థ అతలాకుతలమైంది. చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీలు వలస బాట పట్టి పట్టణాల్లో, కార్మికులుగా మారారు. ఆ దుస్థితిని తట్టుకోలేక వందల సంఖ్యలో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.1956, 1990 మధ్య వ్యవసాయ కూలీల సంఖ్య ఆంధ్రప్రాంతంలో కేవలం ఒకశాతం పెరగ్గా, తెలంగాణ ప్రాంతంలో 30 శాతం నుంచి 47 శాతానికి పెరగడం తెలంగాణ ప్రాంత వ్యవసాయరంగ దుస్థితికి అద్దం పడుతోంది.

తెలంగాణ ప్రాంతంలో కళాశాల విద్యకు కేటాయించింది 93 కోట్లు కాగా, ఆంధ్రకు 224 కోట్లు కేటాయించారు. తెలంగాణ నాయకులకు తెలంగాణ చరిత్రకు పాఠ్యపుస్త కాల్లో పెద్దగా స్థానం కల్పించకపోవడాన్ని గుర్తించారు. మీడియాలో సినీరంగంలో సాంస్కృతిక రంగంలో ఆంధ్రప్రాంత ఆధిపత్యాన్ని శ్రీకృష్ణ కమిటీ కూడా ప్రస్తావించడం గమనార్హం.1996 లోనే కొంత మంది తెలంగాణ మేధావులు వరంగల్‌లో 'తెలంగాణకు విద్రోహం' అనే అంశంపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 1997లో జరిగిన తెలంగాణ జనసభ తెలంగాణ మహాసభ మొదలైన వాటి వల్ల ఇతర ప్రజాసంఘాలు కూడా తమ లక్ష్యంతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయడం ప్రారంభించాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై సాహిత్యం విరివిగా వెలువడటం ప్రారంభమైంది.

2000 సంవత్సరంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ లెజిస్లేటివ్‌ ఫోరం ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వినతి పత్రం సమర్పించారు. 2001 ఏప్రిల్‌లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి ప్రత్యేక తెలంగాణ కోసం రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేసే విషయం ఆలోచించాలని తీర్మానం చేసి ఎన్డీఏ ప్రభుత్వానికి పంపింది. అయితే చిన్న రాష్ట్రాలు దేశ సమగ్రతకు ఏవిధంగానూ దోహదం చేయవంటూ హోం మంత్రి అద్వానీ కాంగ్రెస్‌ తీర్మానాన్ని తిరస్కరించారు. 2002 ఏప్రిల్‌లో ఎం పీ నరేంద్రకు అద్వానీ లేఖ రాస్తూ ప్రాంతీయ ఆర్థిక అసమానతలను అభివృద్ధి ద్వారా ప్రాంతీయ వనరుల సక్రమ వినియోగం ద్వారా పరిష్కరించుకోవచ్చని కాబట్టి ప్రత్యేక తెలంగాణ ప్రతిపాదనను ఎన్డీయే ప్రభుత్వం తిరస్కరిస్తున్నదని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) ఆవిర్భావం:- తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారు ఏప్రిల్‌ 27, 2001న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌)ని స్థాపించారు. తెలంగాణ సాధన కోసం ఆవిర్భవించిన పార్టీ కావడంతో టిఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని రెండో ఎస్‌ఆర్‌సి (State Re Organisation Commission) ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్‌ చేసిన తీర్మానాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం తిరస్కరించింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర సాధనకు మైలురాయిగా మారింది. సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రజలని జాగృతం చేయడం మొదలయ్యింది.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాకినాడ తీర్మానం ద్వారా కోరింది. 2008 అక్టోబర్‌లో తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర విభజనకు మద్దతు ప్రకటించింది. సిపిఐ, న్యూడెమోక్రసి వంటి వామపక్ష పార్టీలు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర వాదనను బలపర్చాయి. మావోయిస్టు పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది ప్రజల ఆకాంక్ష అని, దాన్ని తమ పార్టీ సమర్థిస్తుందని పేర్కొంది. 2004లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీలో టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కేంద్ర రాష్ట్రాల్లో టిఆర్‌ఎస్‌ అధికారంలో భాగస్వామిగా మారింది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఏర్పాటు విషయంలో తమ మాట నిలబెట్టుకోకపోవడంతో 2006 డిసెంబర్‌లో టిఆర్‌ఎస్‌ కేంద్ర రాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వాల నుంచి వైదొలగి తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, టిఆర్‌ఎస్‌, వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. సమిష్టిగా పోటీ చేసినప్పటికి కాంగ్రెస్‌ను ఎదుర్కోలేక ఓటమి చెందాయి. కేంద్రంలో కూడా మళ్ళీ యూపీఏ అధికారంలోకి వచ్చింది.

ఉద్యమ వీరుడు కేసీఆర్‌ ఆమరణ నిరాహారదీక్ష:- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దాటవేత ధోరణిని నిరసిస్తూ తక్షణమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ 'తెలంగాణ వచ్చుడో కేసీఆర్‌ చచ్చుడో'' అంటూ టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు గారు 2009 నవంబర్‌ 29న మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాలని సంకల్పించారు. కె.సి.ఆర్‌ ను అరెస్టు చేసి మొదట ఖమ్మం తర్వాత హైదరాబాద్‌లోని నిజాం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనూ కేసీఆర్‌ నిరాహారదీక్ష కొనసాగించారు. కేసీఆర్‌కు మద్దతుగా తెలంగాణ సమాజం అంతా కదిలింది. కేసీఆర్‌ ఆరోగ్యం క్షీణించింది.

విద్యార్ధులతో ఉపందుకున్న ఉద్యమం :- ఉవ్వెత్తున ఎగిసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉద్యమంలోకి విద్యార్థిలోకం ఉప్పెనలా కదిలింది. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలతో పాటు తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు అట్టుడికాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులు బయటకు రాకుండా ఉద్యమంలో పాల్గొనకుండా పోలీసులు అణచివేతను ప్రారంభించారు. డిసెంబర్‌ 10న అసెంబ్లీ ముట్టడికి విద్యార్థి కార్యాచరణ సమితి పిలుపునిచ్చింది. వేలాదిగా విద్యార్థులు తెలంగాణ నలుమూలల నుంచి రెండు రోజుల ముందే హైదరాబాద్‌కు తరలి వచ్చారు. కేసీఆర్‌ దీక్ష వల్ల తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ముఖ్యమంత్రి రోశయ్య, గవర్నర్‌ నరసింహన్‌ కేంద్రానికి నివేదించారు. దాంతో '2009 డిసెంబర్‌ 9'న కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామంటూ ఒక కీలక ప్రకటన చేశారు. దీంతో కేసీఆర్‌ ఆమరణ నిరాహారదీక్ష విరమించారు.

శ్రీ శ్రీకృష్ణ కమిటి :- రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం వెనకడుగు వేయడంతో తెలంగాణ భగ్గుమంది. తట్టుకోలేని యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కేంద్రం తమను మోసం చేసిందనే భావన తెలంగాణ ప్రజల్లో ప్రబలింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన సాధ్యాసాధ్యాలను పరిశీలించి సిఫారసులు చేసేందుకు జస్టిస్‌ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ''శ్రీ కృష్ణ కమిటి'ని ఏర్పాటు చేసింది.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక:- ఫిబ్రవరి 3, 2010 తెలంగాణ అంశం పరిశీలించడానికి కేంద్రప్రభుత్వం జస్టిస్‌ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోను విస్తృతంగా పర్యటించి ప్రత్యేక రాష్ట్రంపై అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి దాదాపు 1 లక్ష దరఖాస్తులను స్వీకరించింది. 2011 జనవరి 6న కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు శ్రీ కృష్ణ కమిటి 505 పేజీల నివేదికను సమర్పించింది. ఈ కమిటీ ఆరు పరిష్కారాలను సూచించింది.

1. రాష్ట్రాన్ని యథాతధంగా ఉంచడం.

2. రాష్ట్రాన్ని విభజించి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం, రెండు రాష్ట్రాలకు రెండు కొత్త విధానాలు ఏర్పాటు చేయడం.

3. రాయలసీమ, తెలంగాణను కలిపి 'రాయల తెలంగాణ'గా ఏర్పాటు చేయడం, కోస్తాను ఒక రాష్ట్రంగా చేయడం, హైదరాబాద్‌ను రాయల తెలంగాణలో భాగంగా చేయడం.

4. రాష్ట్రాన్ని, సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించి హైదరాబాద్‌ను తెలంగాణ రాజధానిగా చేయడం, సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేయడం.

5. రాష్ట్రాన్ని, సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించి హైదరాబాద్‌ పరిధిని పెంచి దాన్ని కేంద్ర పాలితప్రాంతంగా చేయడం.

6. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి, రాజకీయ సాధికారతకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం, చట్టబద్ధ అధికారాలతో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం. తెలంగాణ ప్రజలు ఇది మరో మోసంగా భావించారు.

ప్రత్యేక తెలంగాణ ఇవ్వరాదని నచ్చజెప్పడానికి శ్రీకృష్ణ కమిటీ తమ పరిధులు దాటి వ్యవహరించిందని రహస్యంగా ఉంచిన 8వ అధ్యాయంపై దాఖలైన దానిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇది కూడా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయింది.

తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి :- తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న అన్ని వర్గాలు, సంఘాలు ఒకే వేదిక కింద ఉద్యమాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటి-TJAC ఏర్పడింది. దానికి ప్రొఫెసర్‌ కోదండరాంను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. తెలంగాణలోని మెజారిటీ రాజకీయ పార్టీలు ఈ జేఏసి శాఖలు ఏర్పడ్డాయి. అయితే ఇంత పెద్ద ఉద్యమం కూడా 1969 ఉద్యమం మాదిరిగా హింసాత్మక రూపు తీసుకోకుండా నాయకులు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఉద్యమానికి కవులు, కళాకారుల కృషి :- సాంస్కృతిక దండు 'ధూంధాం' అంటూ తెలంగాణ ఆటపాటలతో ఊరూరా తెలంగాణ ఆకాంక్షను ప్రజ్వలింపజేశారు. గద్దర్‌, అందెశ్రీ, గోరెటి వెంకన్న, గూడ అంజయ్య, రసమయి బాలకిషన్‌, జయరాజ్‌, దేశపతి శ్రీనివాస్‌ ప్రసిద్ధ తెలంగాణ కళాకారులు తమ పాటల ద్వారా ఇతర కళల ద్వారా ప్రజలలో ముఖ్యంగా యువతలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను పెంపొదించడానికి కృషి చేశారు. వారు పాల్గొన్న 'ధూంధాం'ల ద్వారా ప్రజలు ఏకమై ఉద్యమించారు. విమలక్క కూడా తమ పాటల ద్వారా ఉపన్యాసాల ద్వారా ప్రజలను ఉత్తేజితులను చేశారు. పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు సకల జనులు రహదారిపైనే వంటలు చేసుకొని భోజనం చేసే 'వంటావార్పు' వంటి వినూత్న కార్యక్రమాలను ఉద్యమకారులు నిర్వహించారు.

ప్రధానంగా జేఏసి నేతృత్వంలో సహాయనిరాకరణ ఉద్యమం, మిలియన్‌ మార్చ్‌, సకలజనుల సమ్మె చరిత్రలో నిలిచిపోయేలా జరిగాయి. తెలంగాణ విద్యావంతుల వేదిక, మహిళా సంస్థలు, తెలంగాణ జాగృతి, తెలంగాణ రీసెర్చ్‌ సెంటర్‌, అమ్మల సంఘం వంటి సంస్థలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ, చైతన్యపరుస్తూ కీలకపాత్ర పోషించాయి.

సహాయనిరాకరణ ఉద్యమం:- 2011 ఫిబ్రవరి 17న సహాయనిరాకరణలో దాదాపు 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు 16 రోజుల పాటు జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. అందువల్ల రోజుకు 8 బిలియన్ల మేరకు రెవెన్యూలోటు వచ్చింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో వారాల తరబడి అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించారు. తెలంగాణ ప్రతినిధులు పార్లమెంట్‌ సమావేశాలకు కూడా అవరోధాలు కల్పించారు.

2011 జులైలో 119 మంది తెలంగాణ ఎమ్మెల్యేలలో 81 మంది, 15 మంది తెలంగాణ మంత్రుల్లో 12 మంది, లోక్‌సభలోని 17 మంది తెలంగాణ ఎంపీల్లో 13 మంది, రాజ్యసభలో ఒక కాంగ్రెస్‌ ఎంపీ, 20 మంది ఎమ్మెల్సీలు తెలంగాణ ఏర్పాటులో జాప్యంపట్ల నిరసనగా రాజీనామాలు చేశారు.

సకల జనుల సమ్మె :- 13 సెప్టెంబర్‌ 2011 తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకఘట్టం 'సకల జనుల సమ్మె' తెలంగాణ ప్రాంతంలోని సబ్బండ వర్గాలు, కుల సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఏకమై 2011 సెప్టెంబర్‌ 13న టిజేఏసి నేతృత్వంలో సకలజనుల సమ్మెకు శ్రీకారం చుట్టారు. విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు రోడ్డుపైకి రాలేదు. ప్రభుత్వ కార్యాలయాలలో పనులు స్తంభించిపో యాయి. న్యాయవాదులు కోర్టులలో విధులను బహిష్కరిం చారు. రైల్‌రోకోలతో రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలిగింది. 2011 అక్టోబర్‌ 15న రైల్‌రోకోల కారణంగా 110 రైళ్ళను రద్దు చేశారు. పలు కార్యాలయాల్లో ఉద్యోగులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి వివిధ రూపాల్లో నిరసనలు ప్రదర్శించారు. సింగరేణి బొగ్గు కార్మికులు సమ్మెలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

రహదారులు, కూడళ్ళు, పల్లెలు, పట్టణాలు అన్నీ 'ధూంధాం'లతో హోరెత్తిపోయాయి. ఈవిధంగా 42 రోజులపాటు సకలజనుల సమ్మెకొనసాగింది. సమ్మెకాలం లో ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టిజేఏసి సమ్మె విరమిం చింది. సమ్మెను నిలిపివేసినప్పటికీ ఇతర రూపాలలో నిరసనలు, ఉద్యమాలు కొనసాగుతాయని 2011 అక్టోబర్‌ 24న జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ప్రకటించారు. ఉద్యమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు ఉద్యోగులు అనే తేడా లేకుండా పోలీసులు అందరిపై వందలాది కేసులు పెట్టారు. అనంతరం తెలంగాణ సాధన దిశగా బీజేపీ నేత కిషన్‌రెడ్డి 2012 జనవరిలో పోరుయాత్ర ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 22 రోజుల పాటు ఆయన యాత్ర కొనసాగింది. స్వాతంత్య్ర సమరయోధుడు కొండాలక్ష్మణ్‌ బాపూజీ 97 ఏళ్ళ వయసులో కూడా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద వారం రోజుల పాటు సత్యాగ్రహం చేశారు.

మిలియన్‌ మార్చ్‌ :- 10, మార్చి 2011 తెలంగాణ ఏర్పాటుపై సానుకూల ప్రకటన చేయాలని డెడ్‌లైన్‌ పెట్టిన టిజేఏసి కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రాకపోవడంతో 2011 మార్చి 10న హైదరాబాద్‌లో కైరో (ఈజిప్టు)లోని తెహరిన్‌ స్క్వేర్‌ ఉద్యమం మాదిరిగా 'మిలియన్‌ మార్చ్‌' నిర్వహించింది. మిలియన్‌ మార్చ్‌లో పాల్గొనేందుకు తెలంగాణ వాదులు హైదరాబాద్‌ రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. శాంతియుతంగా మార్చ్‌ని నిర్వహిస్తామని జేఏసీ హామీ ఇవ్వడంతో హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఉన్న ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మార్చ్‌ నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

ఇతర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చేటువంటి రైళ్ళను, లోకల్‌ రైళ్ళను రద్దుచేశారు.

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు 'మార్చ్‌'కు హాజరుకాకుండా నిలువరించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను వమ్ము చేసి విద్యార్థులు భారీగా నెక్లెస్‌ రోడ్డుకు తరలివచ్చారు. సాయంత్రం వరకు 2 లక్షలకు పైగా ఉద్యమకారులు హుస్సేన్‌సాగర్‌ ప్రాంతానికి చేరుకున్నారు. వేలాదిగా ప్రజలు కాలినడకనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. హైదరాబాద్‌ జనసంద్రమైంది. తెలంగాణ నినాదాలు, ఆటలు, పాటలు, బోనాలు, బతుకమ్మలు, జనజీవన సాంస్కృతిక ప్రదర్శనలతో హైదరాబాద్‌ నగరం జాతరను తలపించింది. సాయంత్రం తరువాత కూడా వేదికను వీడేందుకు జేఏసీ నేతలు అంగీకరించలేదు. కేంద్రం నుంచి ప్రకటన వెలువడే వరకు నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు. దాంతో పోలీసులు వాటర్‌కెనాన్లు, బాష్పవాయుగోళాలతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను వ్యక్తపరుస్తూ తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి సెప్టెంబర్‌ 30, 2012న 'సాగర హారం' నిర్వహించింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు:- తెలంగాణ ఉద్యమ తీవ్రతను గుర్తించిన కేంద్రం 2012 డిసెంబర్‌ 28న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్రానికి చెందిన 8 ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు భేటీకి హాజరయ్యారు. ఎంఐఎం, సిపిఎం పార్టీ ప్రతినిధులు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారు. 2008లో తెలంగాణ ఏర్పాటు కోసం ఆమోదం తెలుపుతూ ప్రణబ్‌ముఖర్జీకి ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం పార్టీ తెలిపింది. అనంతరం కాంగ్రెస్‌ కోర్‌ కమిటి యునైటెడ్‌ ప్రొగ్రెసివ్‌ అలయెన్స్‌ చైర్మన్‌ శ్రీమతి సోనియాగాంధీ అధ్యక్షతన చర్చించి రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుంది. తరువాత హైదరాబాద్‌ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉండే విధంగా బిల్లును రూపొందించి పార్లమెంట్‌ ఆమోదం పొందారు.

యూపీఏతో పాటు ప్రతిపక్షంలోని బిజెపి, బిఎస్పీ, సిపిఐ, ఇతర పార్టీలు కూడా బిల్లుకు మద్దతునిచ్చాయి. ఫిబ్రవరి 18, 2014న లోక్‌సభలో ఫిబ్రవరి 20, 2014న రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లును మార్చి 1, 2014న రాష్ట్రపతి ఆమోదించారు.

ఇన్నేళ్ళ తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం, ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉద్యమకారుల ఎడతెగని ఉద్యమస్ఫూర్తికి నిదర్శనంగా 2014 జూన్‌ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది.

తెలంగాణ బిల్లుకు ఆమోదం:- తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2013 అక్టోబర్‌లో తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2014 డిసెంబర్‌ 18న లోక్‌సభ, 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. మరో వైపు 2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు జరుగగా మే 16న ఫలితాలు వచ్చాయి. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ 63, 11లోక్‌సభ స్థానాలను గెలుపొందింది. దీంతో తెలంగాణలో జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావంతో పాటు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ గారు ప్రమాణ స్వీకారం చేశారు. 2018 డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 88 స్థానాల్లో గెలుపొంది రెండో సారి అధికారంలోకి రావడంతో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమ సారథి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారు 'నవ తెలంగాణ' రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 'బంగారు తెలంగాణ'కై నిర్విరామంగా శ్రమిస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం అపర భగీరదుడై భీడువడ్డ భూములను సాగు భూములు చేసేందుకు మిషన్ భగీరధ...కాళేశ్వరం ప్రాజెక్టులను సాధించి రైతుల జీవితాలకు వెలుగై నిలిచాడు. అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతూ... అమోఘమైన తన రాజకీయ చతురత, మేధాశక్తితో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా స్థానంలో నిలబెడుతున్నారు.

English summary
Indispensable history of Telangana State
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more