వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్తీక మాసంలో పూజలు.. జన్మ జన్మల పాపాల ప్రక్షాళన ఇలా..

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ఫోన్: 9440611151

"కార్తీకమాసం" అనగా చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి "కార్తీకమాసం" అని పేరు వచ్చింది.కార్తీక మాసం అంటేనే స్నాన, దాన, జపాలు, పూజలు, దీక్షలు ,ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వలన జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం ఈ కార్తీకమాసం.

"న కార్తీక నమో మాసః
న దేవం కేశవాత్పరం!
నచవేద సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్థమమ్"

అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే "కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు." అని అర్ధం.కార్తీకమాసం శివ,కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీకమాసంలో ప్రతీరోజూ తెల్లవారు ఝూముననే స్నానమాచరించవలెను.అప్పుడే అది కార్తీక స్నానమవుతుంది.

నిత్యం దీపాన్ని వెలిగించినా, ఆరాధించినా, దీపమును కార్తీకమాసంలో వెలిగించడం, నదిలో దీపాలను వదలడం , ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలను పాటించవలెను. కార్తీకమాసమంతా ఇంటి ముందు గుమ్మానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించాలి. అలాగే సాయంత్ర సమయంలో శివాలయాల్లో గానీ వైష్ణవాలయాల్లోగానీ గోపుర ద్వారం వద్దగానీ దేవుని సన్నిదానంలోగానీ ఆలయ ప్రాంగణంలో గానీ దీపాలు వెలిగించిన వారికి సర్వ పాపములు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం.

 Karthika Masam Vratam and Rituals

ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోకుండా చూడడం కూడ పుణ్య ప్రదమే.కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి నాడు గాని లేక ఇతర దినాల్లో అయినా సాయం సమయాలలో శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను వేసి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వుల నూనెతో గానీ, కొబ్బరి నూనెతో గానీ, నెయ్యితోగాని, అవిశ నూనెతో గానీ, ఇప్ప నూనెతో గానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపమును వెలిగించవలెను.

అంతే కాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీకమాసంలొ ముప్పై రోజులలో దీపం పెట్టలేనివారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్ర వచనం.ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం , దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళూ, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.

కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు:-

కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను.నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది.వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమి రోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను.

శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను.
ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించవలెను.
ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ , జిల్లేడు పువ్వులతోనూ పూజించవలెను.
ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.

కార్తీకంలో దీపారాధనలకి ఈ క్రింది రకాల వత్తులను ఉపయోగించుట ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చును

ఆదివారం - పారాణిలో తడిపి ఆరబెట్టిన వత్తులు

సోమవారం - అరటి దూటతో నేసిన వత్తులు (నూనెలో బాగా నానపెడితే చక్కగా వెలుగుతాయి)

మంగళవారం - కుంకుమ నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు

బుధవారం - పసుపు, గంధం, పన్నీరు కలిపిన నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు

గురువారం - కొబ్బరి నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు

శుక్రవారం - పసుపు నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు

శనివారం - తామర తూడుతో నేసిన వత్తులు (నూనెలో బాగా నానపెడితే చక్కగా వెలుగుతాయి)

అవకాశం ఉన్నవారు పై విధంగా దీపారాధన ప్రక్రియను ప్రయత్నించగలరు.

కార్తీకమాసంలో చేయకూడనిపనులు:-
ఇంగువ,ఉల్లిపాయ,వెల్లుల్లి,ముల్లంగి,గుమ్మడికాయ,శనగపప్పు,పెసరపప్పు,నువ్వులు కార్తీకమాసంలో తినటం నిషేధం
ఆదివారం రోజు కోబ్బరికాయ,ఉసిరికాయ తినరాదు.భోజన సమయంలో మౌనంగా వుండాలి .

కార్తీక స్నాన మంత్రము :-

కార్తీకేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్దన!
ప్రీత్యర్ధం తన దేవేశ దామోదర మయా సహ!!

కార్తీక మాసంలో వచ్చే పండుగలు:-

శుక్లపక్ష విదియ : భాతృ ద్వితీయ దీనికే యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం అని పేర్లు, ఈ దినం పురుషులు సొంత ఇంటిలో భోజనం చేయరాదు. ఈ దినం సోదరి ఇంటిలోగాని, లేదంటే సోదరితో సమానమైనవారి ఇంట భోజనం చేయవలెను. ఈ విధంగా చేస్తే అపమృత్యుభయం, నరకలోక భయం తొలగిపోతాయి. అంతే కాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్యస్త్రీగా ఉంటూందని శాస్త్రవచనం.

శుక్లపక్ష చవితి " నాగుల చవితి" :-కార్తీక శుక్లపక్ష చవితి నాడు మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నాగులచవితి పర్వదినం జరుపుకుంటారు.

శుక్లపక్ష ఏకాదశి : ప్రభోదన ఏకాదశి :- ఆషాడ శుక్ల పక్ష ఏకాదశి నాడు పాలకడలిలో శేషశయ్యపై శయనించి యోగనిద్రలో గడిపిన శ్రీ మహావిష్ణువు ఈ దినం నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి దీనికి 'ఉత్థాన ఏకాదశీ లేదా 'ప్రబోధన ఏకాదశి ' అని పేర్లు. ఈ దినం ఉపవాస వ్రతం పాటించి శ్రీమహావిష్ణువును పూజించవలెను. అంతేకాకుండా తొలి ఏకాదశినాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతానికి ఈ ఏకాదశి చివరి రోజు అవుతుంది .

శుక్లపక్ష ద్వాదశి: క్షీరాబ్ది ద్వాదశి :- పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేసింది ఈ రోజే అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి ,చిలుకు ద్వాదశి అని పేర్లు. శ్రీమహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే ఈ రోజు ఇంటి యందున్న తులసికోట వద్ద శ్రీ మహావిష్ణువును లక్ష్మీ సమానురాలైన తులసిని పూజించవలెను.

శుక్లపక్ష చతుర్దశి :- వైకుంఠ చతుర్ధశి వైకుంఠ వాసుడైన శ్రీమహావిష్ణువు ఈ రోజు వైకుంఠంను వదిలి వారణాసికి వెళ్ళి పరమశివుడిని పూజించినట్లు కథనం. ఈ రోజు శైవాలయాలకు వెళ్ళి దీపం వెలిగించవలెను.

శుక్లపక్ష పూర్ణిమ :- ఈ రోజు శివాలయాల్లో నిర్వహించే 'జ్వాలాతోరణం ' ను దర్శించడం మంచిది. సాయంత్రం సమయంలో శివాలయంలోగానీ,వైష్ణ్వాలయంలోగానీ దీపాలను వెలిగించవలెను. ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం, మార్కండేయ పురాణం దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది.

కృష్ణపక్ష చవితి :- కరక చతుర్ధి ఇది వినాయకుడుకి సంబంధించినది. ఈ వ్రతం మహిళలు చేయడం మంచిది.

ధాత్రీపూజ :- ధాత్రి అంటే ఉసిరిక.ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది.కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది.ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీ దేవిని,విష్ణువును పూజించి ఫలాలను నివేదించాలి.

వృశ్చిక సంక్రమణం :- ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్య భగవానుడు ఈ రోజు తులారాశి నుండి ఎనిమిదవ రాశి అయిన వృశ్చికరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా సంక్రమణ స్నానాలు, పూజలు, జపాలు, దానాలు , దేవాలయ సందర్శనలు చేయడం వల్ల సర్వ విధాలా శుభ ఫలితాలను ఇస్తుంది.

కార్తీకమాసంలో దీపారాధన చేయడం మహామహిమోపేతమైనది. శివాలయంలోగాని, ఇంట్లోనైనా సరే ప్రాతఃకాలం, సాయంకాలం దీపారాధన చేయడం దైవానుగ్రహం లభ్యమయ్యే విధానం. ఎవరైనా సరే, తెలిసిగాని, తెలియకగాని, ఎక్కడైనా సరే కార్తీకమాసంలో దీపం పెడితే చాలు వారి సర్వవిధ పాపాలు హరింపవేస్తుంది. జ్ఞానం, మోక్షం, ఇహమున శ్రేయస్సు, శుభఫలితాలు కలుగుతాయి.

కార్తీకదీప దానంవల్ల నరకప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసములో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము.
దీపం దానమిచ్చుట, బంగారము, నవధాన్యములు గాని, అన్నదానముగాని, శయ్య (మంచం) దానమిచ్చుట వలన స్త్రీలకు ఐదోతనము వృద్ధియగుటేగాక, మంగళప్రదము సౌభాగ్యకరముగా చెప్పబడినది.
సూర్యాస్తమయం అయిన వేంటనే సంధ్యాదీపం వెలిగించుట ముగ్గుపెట్టి ఇంటిముందు దీపం పెట్టుట, తులసి కోటలో దీపము పెట్టుట, తులసి పూజ, గౌరీపూజ చేయుట వలన ఆర్థిక బాధలు తొలగును.
కార్తీకమాసములో కొన్ని వస్తువులు నిషేధించడమైనది,అవి వాడరాదు.

ఇంగువ, పెద్ద ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి దుంప, గుమ్మడి కాయ, తీయగుమ్మడి, నువ్వులు నిషిద్ధముగా చెప్పబడినవి. ఈ మాసమున మాంసాహారం భుజించుట నిషిద్ధము. పగటి పూట ఆవుపేడతో అలికి, పద్మములతో ముగ్గులు పెట్టి, రంగు రంగుల రంగవల్లిపై కార్తీక దీపం పెట్టి కార్తీక పురాణము చదివిన వారికి, వినిన వారికి ఏడు జన్మల వరకూ వైధవ్యం కలగదని కార్తీక పురాణము చెపుతున్నది.

English summary
Karthika Masam is very special for Telugu people. Karthika Masam Vratalu and Rituals are performs by devotees in this season heavily.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X